భారతీయుల 10 వేల జన్యువుల చరిత్ర రికార్డు
జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా క్రోడీకరణ
83 జనాభా సమూహాల జన్యువుల వివరాల సేకరణ
2.7 కోట్ల జన్యు వేరియెంట్లపై అధ్యయనం
భారతీయులకే సొంతమైన 70 లక్షల వేరియెంట్లు
దేశంలో మొత్తం 4,600 జనాభా సమూహాలు
డేటాబేస్‌తో కొత్త ఔషధాల తయారీ సులువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడీ కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులనూ శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు.
మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులేమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించటం ద్వారా మని షిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా ప్రాధా న్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి.
అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మనదేశంలోని జనాభా సమూహాల (పాపులేషన్ గ్రూప్స్) జన్యు క్రమాలను విశ్లేషించేందుకు ‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలు సేకరించి, ఆ డేటా ను హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్’లో భద్రపరిచారు. మనదేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలున్నాయి.
వీటిల్లో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచంలో ఏ పరిశోధకులైనా తమ పరిశోధన కోసం వాడుకొనేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.
భిన్నమైన జన్యు వేరియెంట్లు
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10 వేల మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియెంట్స్‌ను గుర్తించి వివరాలు రికార్డు చేశారు.
పైగా వాటిల్లోనూ 70 లక్షల వేరియెంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారుచేయవచ్చు.
‘ఈ జ్ఞానసంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా, ఇతరత్రా రంగాల్లో అత్యున్నత పరిశోధనలకూ, ప్రజలందరి ఆరోగ్య సంరక్షణకూ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు.
నంబరింగ్‌తో రికార్డు
మనదేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాల పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదజాలాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు.
విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికి ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకు వివరాలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాలకోసం ఓ ముందడుగు పడినట్లు అయ్యిందని నిపుణులు అంటున్నారు.
దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం రెండో దశలో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్‌లో భారతీయుల వివరాలు అరకొరగానే ఉండటంతోకొత్తగా సేకరించిన ఈ వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి.
అందరూ వాడుకోవచ్చు
జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ‘డేటాబేస్’ను అందరికీ అందుబాటులో ఉంచారు. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను తెలుపుతూ ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. ఆ దర ఖాస్తులను పరిశీలించేందు కు ఒక నిపుణుల పానెల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి డేటాను వాడుకొనేందుకు అనుమతి ఇస్తుంది.
ఇది మన బయోటెక్ సంపద..
జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే అనేక నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.
సుదీర్ఘ ప్రక్రియ..
‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2020లో ప్రారంభించారు. మొదటి దశ పూర్తి కావడంతో, ఇక ప్రాజెక్టు రెండో దశను మొదలుపెట్టాల్సి ఉంది. మొదటి దశలో పది వేల మంది వివరాలు సేకరించారు. రెండో దశలో పది లక్షల మంది జన్యువులను సేకరిస్తారు.
ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం వ్యాధులకు మెరుగైన ఔషధాలు తయారుచేయటమేనని అధికారులు తెలిపారు. రెండో దశ వివరాల సహాయంతో ప్రమాదకర క్యాన్సర్లకు చికిత్సలను కనిపెట్టడం, నాడీ సంబంధ వ్యాధులకు పరిష్కారాలు వెదకటం, అత్యంత అరుదుగా వచ్చే వ్యాధులకు చికిత్స వంటి అనేక అంశాలను చేపడుతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment