Genes
-
అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..!
14 'స్కిన్నీ జన్యువులు'(సన్నగా ఉండే జన్యువులు) బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి జన్యువులు లేని వారితో పోలిస్తే..ఈ 14 'స్కిన్నీ జన్యువులు వ్యాయమం చేసిన వాళ్లే వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నారు. వీళ్లు జస్ట్ ఎనిమిది వారాల పరుగుకే దాదాపు 11 పౌండ్లు కోల్పోతారట. ఈ పరిశోధన బరువుకి సంబంధించిన కీలక జన్యువుల గురించి వెల్లడించింది. ఈ జన్యవులు వ్యాయామం, జీవనశైలి మార్పులకు అనుగుణంగానే సక్రియం చేయబడి, బరువు తగ్గడం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్, రిహాబిలిటేషన్ ఉపాధ్యాయుడు హెన్నీ చుంగ్ అన్నారు. అయితే యూకేలోని కొన్ని పరిశోధనలు మాత్రం వ్యాయామం జోక్యం లేకుండా జన్యువులు తమ నిజమమైన సామర్ధ్యాన్ని చూపించవని చెబుతోంది. అంటే ఇక్కడ తగిన వ్యాయామం, సరైన జన్యువులతోనే మనిషిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయనేది చెప్పగలరు వైద్యులు. అందుకోసం 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల దాదాపు 38 మందిపై పరిశోధన చేశారు. వారిలో సగం మందికి సాధారణ ఆహారం, అలవాట్లను మార్చకుండా.. వారానికి మూడుసార్లు 20 నుంచి 30 నిమిషాలు పరుగెత్తమని సూచించారు. మిగిలిన సగం మంది నియమనిబంధనలతో కూడిన ఆహారం, జీవనశైలి ఫాలో అయ్యారు. అయితే పరిశోధనలో 62% బరువు తగ్గడంలో జన్యు శాస్త్రమే కీలకమని అధ్యయనం పేర్కొనగా.. 37% మాత్రం వ్యాయామం, జీవనశైలి కారకాలతో ముడిపడి ఉందని తేలింది. ఈ పరిశోధన జన్యు ప్రొఫెల్‌ని అర్థం చేసుకోవడంలో వ్యాయామం, చక్కటి డైట్ ఉపకరిస్తుందని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ జన్యుపరమైన వాటితో సంబంధం లేకుండా వ్యాయమంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం ముఖ్యమని చెప్పారు పరిశోధకులు. ఇది హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి తద్వారా బరువుని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వర్కౌట్లు చేయాలని సూచించారు. ఈ అధ్యయనం జర్నల్ రీసెర్చ్ క్వార్టర్లీ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్‌లో ప్రచురితమయ్యింది. (చదవండి: ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!) -
మాయమవుతున్న... మగ క్రోమోజోమ్
ఆడా మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాలే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతోంది! కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. ఓ కోటి సంవత్సరాల తర్వాత! అప్పటికల్లా మగవాళ్లలోని వై క్రోమోజోమ్ పూర్తిగా మటుమాయం కానుండటమే ఇందుకు కారణం! నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95 శాతానికి పైగా కృశించిపోయినట్టు సైంటిస్టులు తేల్చడం విశేషం!! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్‌ను మరో కోటి ఏళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు. 1,393 జన్యువులు ఇప్పటికే మాయం ఎక్స్, వై క్రోమోజోములు లింగ నిర్ధారణ కారకాలన్నది తెలిసిందే. అందుకే వాటిని సెక్స్ క్రోమోజోములుగా పిలుస్తారు. ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. వై క్రోమోజోమ్ వల్ల వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే దాన్ని మేల్ క్రోమోజోమ్‌గా, ఎక్స్‌ను ఫీమేల్ క్రోమోజోమ్‌గా పిలుస్తారు. ఫలదీకరణ వేళ రెండు ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్, వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు. ఎక్స్‌తో పోలిస్తే పరిమాణంలోనే గాక జన్యువుల సంఖ్యలో కూడా వై క్రోమోజోమే చిన్నది. అందులో ఒకప్పుడు 1,438 జన్యువులుండేవట. గత 30 కోట్ల ఏళ్లలో వాటిలో ఏకంగా 1,393 జీన్స్ లుప్తమైపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా మరో కోటి ఏళ్లలో పూర్తిగా లుప్తమవుతాయని జెనెటిక్స్ ప్రొఫెసర్, సైంటిస్టు జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వివరించారు. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించారు. ఆశ లేకపోలేదు...వై క్రోమోజోమ్ అంతరించినా మగ జాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దానిలోని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్టు జపాన్‌లోని హక్కైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చి0ది. ‘‘ఒక రకం చిట్టెలుకల్లో ఇలాగే జరిగింది. వై క్రోమోజోమ్ లుప్తమైపోయినా దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోముల్లోకి చేరాయి’’ అని వివరించింది. కనుక వై క్రోమోజోమ్ క్షీణించినా దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుందని తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Cancer Day Feb-4 : 'జీన్' సైలెన్సింగ్ ఎడిటింగ్!
'మనం ఏదైనా రాస్తుంటాం. లేదా సినిమా కోసం రీల్స్ తీస్తుంటాం. తీరా రాశాక లేదా తీశాక అది అంత సరిగా లేదని లేదా కోరుకున్నట్లుగా రాలేదనీ లేదా తీసిన సమాచారం అవసరం లేదనిపిస్తుంది. అప్పుడు మనం చేసే పని ‘ఎడిటింగ్’! అలాగే.. మన ప్రతి ఒక్కరి జీవితంలో.. మన అవయవ నిర్మాణం, వికాసం, ఆరోగ్యచరిత్ర.. వీటన్నింటికీ మూలం ఈ రాత లేదా రీల్స్ రూపంతో పోలిక గల జన్యువులు. ఎక్కడైనా పదాలు తప్పుగా వస్తే వాటిని సవరించినట్లుగా, సినిమాలో రీల్స్ తప్పుగా వస్తే వాటిని సరి చేసినట్టుగానే.. ఈ జన్యు పొరబాట్లనూ సరి చేసే ప్రక్రియే ‘జీన్ ఎడిటింగ్’. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలతో జన్యులోపాలతో వచ్చే క్యాన్సర్లనూ లేదా జబ్బులను పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ అత్యంత కొత్త చికిత్స విధానాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.' మన దేహం మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం మధ్యలోని న్యూక్లియస్‌లో క్రోమోజోములుంటాయి. ఈ క్రోమోజోములన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలతో కలగలసిన జన్యువులతో నిర్మితమై ఉంటాయి. మన దేహం తాలూకు అన్ని జీవక్రియలూ వాటి మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అంటే జీవకణంలో జరిగే మొత్తం ప్రాసెసింగ్‌కు ఈ ఆర్ఎన్ఏలు దోహదపడుతుంటాయి. అవి చేసే పనులను బట్టి ఎమ్ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీ ఆర్ఎన్ఏ అనే రకాలతో ప్రోటీన్ల రూపకల్పనకు సహాయపడుతుంటాయి. ఈ ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తేడాలు జరిగినప్పుడు అవి వ్యాధుల రూపంలో.. ప్రధానంగా క్యాన్సర్లుగా బయటపడతాయి. జన్యులోపాలతో వ్యాధులు ఎలాగంటే.. కొన్ని మన జన్యువుల మూలస్థానాల్లో పొరబాటు జరిగినప్పుడు.. అది ఓ జబ్బు రూపంలో అందునా క్యాన్సర్ల రూపంలో ఎలా బయటపడతాయో చూద్దాం. ఉదాహరణకు బీసీఆర్ ఏబీఎల్ అనే జన్యువులో లోపం వల్ల టైరోసిన్ కైనేజ్ అనే ఓ ఎంజైము నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది అత్యధికంగా తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయమంటూ దేహానికి ఆదేశాలు అందజేస్తుంది. దాంతో ఓ తెల్లరక్తకణం జీవితకాలం పూర్తి కాకుండానే అనేక తెల్లరక్తకణాలు పుట్టుకొస్తుంటాయి. పాలు విరిగినప్పుడు పనికిరాని విధంగానే.. రక్తంలో లోపభూయిష్టమైన తెల్లరక్తకణాలు గుంపులు గుంపులుగా గుమిగూడిపోయి, పూర్తిస్థాయి మెచ్యురిటీ రాకుండానే నశించిపోయి రక్తం విరిగినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వల్ల అది ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ అనే బ్లడ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఒక జన్యువు చెడిపోవడం వల్ల/ లోపం కలగడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా రకాలే ఉంటాయి. కొత్త చికిత్స ప్రక్రియలేమిటి? అవి ఎలా పనిచేస్తాయంటే... జన్యువులు, జెనెటిక్ కోడ్స్‌లో వచ్చే మ్యూటేషన్లు, వాటి కారణంగా ఉత్పన్నమయ్యే లోపాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించడానికి పరిశోధకులు సరికొత్త విధానాలను కనుగొంటున్నారు. వాటిల్లో జీన్ ఎడిటింగ్లూ, జీన్ సైలెన్సింగ్లన్నవి ఇటీవలే కనుగొన్న విధానాలు. అదెలాగంటే.. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కణంలోని జీవక్రియల్లో రకరకాల ఆర్ఎన్ఏలు.. (తాము ఏ రకానికి చెందినవన్న దాన్ని బట్టి).. జన్యు సమాచారాన్ని అందజేయడం, నిక్షిప్తపరచడం వంటి పనులు చేస్తాయి. ఇవన్నీ ఎమైనో యాసిడ్లూ, ప్రోటీన్లు ఏర్పడటం ద్వారా జరుగుతుంటాయి. ఇలాప్రోటీన్లు రూపొందే సమయంలో కొన్ని అదనంగా ఏర్పడవచ్చు. మరికొన్ని ఏర్పడాల్సిన విధంగా ఏర్పడకుండా మిస్ కావచ్చు. లేదా ఇంకొన్ని తప్పుడు సీక్వెన్స్‌లో ఏర్పడవచ్చు. వీటిల్లో ఏది జరిగినా.. అది వ్యాధిగా వ్యక్తమవుతుంది. చక్కదిద్దడానికి పరిశోధకులు చేస్తున్నదేమంటే.. ఇలా జన్యువుల్లోని లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లను చక్కదిద్దడానికి పరిశోధకులు కొన్ని ఎడిటింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మొత్తం ఆర్ఎన్ఏ కాకుండా... తమకు కావాల్సిన మేరకు చిన్న చిన్న ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ స్ట్రాండ్స్ రూపొందిస్తారు. ఇలా రూపొందించిన స్ట్రాండ్స్ను ‘యాంటీ సెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్’ (ఏఎస్ఓ)లని అంటారు. కణంలోని జన్యుసమాచారాన్ని అందించడం, ఉపయోగించడం వంటి కార్యకలాపాలు జరిగే సమయంలో.. బహిర్గతం కావాల్సినప్రోటీన్ భాగాలు బయటకు రాకపోయినా, లోపలే ఉండాల్సినవి బయటకు వచ్చినా లేదా ఆర్ఎన్ఏ రూపంలో తేడాలు వచ్చినా అది క్యాన్సర్‌గా బయటపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరిశోధకులు రూపొందించిన ఈ ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’, సంక్షిప్తంగా ఏఎస్ఓలనేవి చిన్న చిన్న స్ట్రాండ్స్గా ఏర్పడి.. ప్రధానంగా ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో వాటిని చక్కదిద్దుతాయి. అదెలాగంటే.. 1. ఆర్ఎన్ఏలో లోపభూయిష్టమైనప్రాంతం ఉంటే.. ఈ చిన్న స్ట్రాండ్స్ అక్కడికి వెళ్లి ప్రమాదకరమైన దాన్ని తొలగించడం లేదా పూర్తిగా కత్తిరించి మాయం చేయడం చేస్తాయి. (ఇది ఒకరకంగా ఎడిటింగ్ లాంటి ప్రక్రియ). 2. ఈ ఏఎస్ఓలు.. ఆర్ఎన్ఏ లోని లోపభూయిష్టమైనప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా జన్యులోపాలను చక్కదిద్దుతాయి. ఇక్కడ ఏఎస్ఓలు రెండు రకాలుగా పని చేస్తాయి. మొదటిది లోపభూయిష్టం కావడం వల్ల అవాంఛితమైన జన్యుపదార్థాలను అసలు పుట్టకుండా చేయడం లేదా ఆలస్యం చేయడం. 3. మరో ఇతర ఆరోగ్యకరమైన జన్యువు లోంచి.. తనకు కావాల్సిన విధమైన కార్యకలాపాలు నిర్వహించే ఆరోగ్యకరమైన జన్యువునే ఉద్భవింపజేసి, దాన్ని ఇక్కడ వాడుకునేలా చేస్తాయి ఈ ఏఎస్ఓలు. ఇలా చేయడం ద్వారా స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనే వెన్నుకు సంబంధించిన కండరాల వ్యాధి, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనే మతిమరపు వ్యాధులకు పరిశోధకులు ఇప్పటికే సమర్థమైన చికిత్సా విధానాలను, పూర్తిస్థాయి పరిష్కారాలను కనుగొన్నారు. ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’లను రూపొందింది ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే.. ప్రకృతి చాలా అద్భుతమైనదీ, సంక్లిషమైనది. మన దేహంలోని ఒక కణంలో పది పక్కన పదమూడు సున్నాలు పెట్టినన్ని జన్యువులు ఉంటాయి. అంతేకాదు.. రోజుకు మన దేహంలో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇన్నిన్ని కణాల్లో ఇంతగా విభజన జరిగే సమయంలో ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొరబాటు జరగకమానదు. వీటిని సరిచేయడం కోసమే మన దేహంలో ‘మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మెకానిజమ్’ అనే ప్రక్రియ ద్వారా పొరబాట్లను చక్కదిద్దడం జరుగుతుంది. ఏఎస్ఓ జీన్ మాడిఫికేషన్లూ, ఎడిటింగ్లూ, సైలెన్సింగ్లను జీన్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే నేర్చుకున్న పరిశోధకులు... ఇప్పుడు వీటినే లోకకళ్యాణం కోసం ఉపయోగిస్తూ కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొంటున్నారు. చివరగా.. ఇప్పుడు ఇదే ప్రక్రియనూ, ఇవే సిద్ధాంతాలను ఉపయోగించి.. కొన్ని జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా, అవ్యక్తంగా ఉండాల్సిన మరికొన్ని జన్యువులు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నిశ్శబ్దపరచడం (సైలెన్సింగ్) ద్వారా సీఎమ్‌ఎల్ మొదలుకొని చాలా రకాల క్యాన్సర్లకు చికిత్సలను కనుగొని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ఒకే జన్యువు లోపం వల్ల ఒకే వ్యాధి వచ్చే కేసుల్లోనే ఈ తరహా చికిత్స పనిచేస్తుందంటూ పరిశోధకులు దీని పరిమితులనూ చెబుతున్నారు. ఈ తరహా చికిత్సతో చాలా క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటం మనకు దగ్గర్లో కనిపిస్తున్న ఓ ఆశారేఖ. క్యాన్సర్ చికిత్స కోసం మరికొన్ని కొత్త పద్ధతులు.. జీన్ సైలెన్సింగ్, జీన్ ఎడిటింగ్ అన్నవి ప్రయోగాత్మకంగా విజయవంతమైన చికిత్స ప్రక్రియలు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిన మరికొన్ని ఆధునిక, ఆసక్తికరమైన చికిత్స, నిర్ధారణ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. క్యాన్సర్ చికిత్సలోనూ పరిశోధకులు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నారు. క్యాన్సర్ సెల్ కూడా ఒక కణమే కాబట్టి దాని జన్యుపటలాలను మనిషి ఒక్కడే అర్థం చేసుకోవాలంటే చాలా టైమూ, శ్రమ వృథా అయ్యే అవకాశముంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఏఐ’ సహాయంతో క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా తుదముట్టించవచ్చో తెలుసుకుని, ఆ మేరకు కొత్త చికిత్సలను రూపొందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ నోస్ (ఈ–నోస్)తో క్యాన్సర్ వాసన పసిగట్టే ప్రయత్నం.. క్యాన్సర్ వ్యాధి కణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజుకు దాదాపు నాలుగు వందల రెట్లు పెరిగాకే.. ఆ కణజాలాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో క్యాన్సర్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. అయితే ఒక చిన్న మూత్రపరీక్షతో చాలా చాలా తొలిదశలోనే క్యాన్సర్‌ను కనుగొనే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న ‘బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్’ కు చెందిన పరిశోధకులు. ఒక ఎలక్ట్రానిక్ ముక్కును వీరు రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళల్లో వాళ్ల మూత్రపు వాసన ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీన్ని ‘ఈ–నోస్’ అని పిలుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... చాలా చవగ్గా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్.. క్యాన్సర్ కణం తాలూకు జన్యుపటలం ఆరోగ్యకరమైన కణంలా కాకుండా విభిన్నంగా ఉండటమే కాదు.. విపరీతంగా కూడా ప్రవర్తిస్తుంటుంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణ జన్యుపటలంలోనిప్రోటీన్ల చైన్’లలో మార్పులేవైనా చేయడం ద్వారా అది తనంతట తాను నశించిపోయే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ఇది జరిగితే క్యాన్సర్ చికిత్సలో అది ఓ విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్.. కీమోథెరపీ ప్రయోగం మరింత విస్తృతంగా.. కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది దేహంలోని ఒక భాగంలో ఉన్న క్యాన్సర్‌పైనే కాకుండా దేహంలోని మొత్తం కణాలపైనా పనిచేస్తుంటుంది. దీనికి భిన్నంగా ప్రయోగించేదే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. ఇందులో పొట్ట తెరిచి కడుపు కుహరంలో మందును ఉంచుతారు. అక్కడది విపరీతమైన వేడిపుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను మాడ్చేస్తుంది. ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ భస్మమైనప్పటికీ అవి మళ్లీ పుడతాయి. కానీ క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయమైపోతాయిగానీ మళ్లీ పుట్టవు. ఈ థెరపీని కొన్ని కడుపు క్యాన్సర్లలో వాడుతున్నారు. డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది! -
వానర రహస్యం రట్టయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం... మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెరి్నంగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట! -
DNA నష్టాలను సరిచేసుకునే దిశగా తొలి అడుగు!
జన్యువులను మన అవసరానికి తగ్గట్టు కత్తిరించేందుకు, భాగాలను చేర్చేందుకు, తొలగించేందుకు క్రిస్పర్ టెక్నాలజీ ఉపయగపడుతుంది. కేన్సర్ సహా అనేక వ్యాధులకు క్రిస్పర్ టెక్నాలజీ చికిత్స కల్పించగలదని అంచనా. ఇలాంటి టెక్నాలజీని తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనూ విజయవంతంగా ఉపయోగించారు. ఈ కేంద్రంలో వ్యోమగాములకు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గమూ లేదు. రేడియో ధార్మికత, గుండెజబ్బులు, మతిమరుపు వ్యోమగాములకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించేందుకు క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జీన్స్ ఇన్ స్పేస్’ పేరుతో శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలుపెట్టారు. రేడియో ధార్మికత కారణంగా సంభవించే డీఎన్ఏ నష్టాన్ని క్రిస్పర్ సాయంతో అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్‌లో కలిగించారు. అప్పుడు వాటిల్లో కలిగే మార్పులను.. భూమ్మీద ఉంచిన ఈస్ట్‌లోని మార్పులతో పోల్చి చూశారు. డీఎన్ఏ నష్టం పూర్తిగా బాగైతే ఈస్ట్ సమూహం మొత్తం ఎర్రగా మారేలా క్రిస్పర్ కిట్‌లో ప్రత్యేక భాగాన్ని జత చేశారు. ప్రయోగం చేపట్టిన ఆరు రోజులకు అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్ సమూహాల్లో చాలా వరకు ఎర్రగా మారిపోయాయి. డీఎన్ఏ నష్టాలను సరిచేసుకునే దిశగా ఇది తొలి అడుగని శాస్త్రవేత్త సెబాస్టియన్ క్రేవ్స్ తెలిపారు. -
చందమామ మీద భద్రపర్చనున్న వీర్యం, అండాలు
భూమిపై పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత శాస్త్రవేత్తలను ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల భూమిపై జీవావరణం దెబ్బతింటుందని, జీవులు అంతరించిపోతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది జీవులు పలు కారణాల వల్ల అంతరించిపోయాయి. భూమిపై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇతర గ్రహాల్లో మనుగడ సాగించేందుకు ఉన్న అవకాశాలపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాగే సౌర కుటుంబంలో భూమికి సహజ ఉపగ్రహమైన జాబిలిపై ఇప్పటికే కాలు మోపి.. చాలా ఏళ్ల నుంచి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే ఇతర గ్రహాల వలే చంద్రుడు కూడా ప్రాణుల మనుగడకు అనుకూలం కాదని ఇప్పటి వరకూ నమ్ముతున్నారు. కానీ, మన విలువైన వనరులను భద్రపరచడానికి స్టోరేజీలా మూన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. చంద్రుడిపై జీన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సైంటిస్టులు ప్రతిపాదన చేశారు. మనుషులతో సహా సుమారు 67 లక్షల జీవులకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు, వీర్యం, అండాలు ఆ లూనార్ బ్యాంక్‌లో భద్రపరచాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య మతగ్రంథాలలో జీవుల రక్షణకు ఉపయోగించిన ‘ఆర్క్’లాంటి ఈ బ్యాంకును మోడరన్ గ్లోబల్ ఇన్సూ్యరెన్స్ పాలసీగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీర్ జెకన్ తంగ, అతని బృందం తయారు చేసిన ఓ రిపోర్టును ఇటీవల జరిగిన ఏరోస్పేస్ సదస్సులో సమర్పించారు. రక్షణ చర్యల్లో భాగంగా లక్షలాది జీవుల వీర్యం, అండాల శాంపిల్స్‌ను లూనార్ బ్యాంకుకు తరలించాలని ఆ రిపోర్టులో ప్రతిపాదించారు. చంద్రుడి ఉపరితలం సేఫ్ ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఐఈఈఈ) వార్షిక ఏరోస్పేస్ సదస్సులో తంగ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవుల నమూనాలను భద్రపరచడానికి భూమిపై భాండాగారం నిర్మాణం సరైంది కాదన్నారు. మరో గ్రహాన్ని లేదా చందమామపైనైనా జీవుల జన్యువులను భద్రపరిచే భాండాగారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నెలకొల్పాలని సూచించారు. ఒకవేళ భూగోళంపై ఎంతటి విధ్వంసం జరిగినా.. జీన్ బ్యాంక్‌లో భద్రపరిచిన జీవులను ఇప్పుడున్న శాస్త్రసాంకేతికత పురోగతితో పునరుత్పత్తి చేయవచ్చు అని ఆయన తన ప్రసంగంలో సూచించారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై కనుగొన్న లావా గోతుల్లో ఆ బ్యాంకును భద్రపరచవచ్చని తంగా అభిప్రాయపడ్డారు. ఆ గోతులు రెడీమేడ్ స్టోరేజీగా ఉపయోగించుకోవచ్చన్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతుతో ఉండే ఈ గోతులు జీన్ బ్యాంక్ రక్షణకు సరిగ్గా సరిపోతాయని, ఈ గోతుల్లో భద్రపరిస్తే ఉల్కాపాతాలు, స్పేస్ రేడియేషన్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అయితే తంగ జీన్ బ్యాంక్ ప్రతిపాదన కొత్త కాదు. ఆర్కిటిక్ సముద్రంలోని స్పిట్స్ బర్గెన్ ఐల్యాండ్పై స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌ని భూమిపై ఇప్పటికే నెలకొల్పారు. దీనిలో మొక్కల విత్తనాలు, ఇతర సీడ్స్‌లకు చెందిన 9,92,000 శాంపిల్స్ భద్రపరిచారు. -
30 ఏళ్లుగా ఆమె కాదు అతడే!
కోల్‌కతా : 30 ఏళ్లుగా మహిళగానే ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా సాధారణ జీవనం సాగిస్తున్న మనిషి మహిళ కాదు అచ్చంగా పురుషుడేనని వైద్యులు తేల్చి చెబితే సదరు వ్యక్తి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ విచిత్రం బయటపడింది. బీర్భమ్ పట్టణానికి చెందిన ఈ మహిళకు తొమ్మిదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇంకా సంతానం కలగలేదు. ఇటీవల పొత్తి కడుపు నొప్పి రావడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె అసలు రూపాన్ని గుర్తించారు. మహిళ కాదు పురుషుడని స్పష్టం చేశారు. పైకి స్త్రీ లక్షణాలే ఉన్నప్పటికీ వృషణాలు శరీరం లోపలే ఉండిపోయాయని, అవి పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఆమెకు నెలసరి రాలేదని చెప్పారు. ప్రతి 22 వేల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆమె(అతడు) టెస్టిక్యులర్ క్యాన్సర్(సెమినోమా)తో బాధపడుతున్నందున కీమోథెరపీ చేస్తున్నామన్నారు. ఆమెకు, అతడి భర్తకు కౌన్సేలింగ్ ఇచ్చామని, ఇష్టమైతే ఎప్పటిలాగే కలిసి జీవించాలని సూచించామని వివరించారు. పురుషుడిగా జన్మించినా భౌతికంగా మహిళ లక్షణాలు ఉండడాన్ని ఆండ్రోజెన్ ఇన్సెన్సివిటీ సిండ్రోమ్ అంటారని వైద్యులు తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. బాధిత మహిళ ఇద్దరు మేనత్తలు, ఆమె చెల్లెలు(28) కూడా చాలాకాలం తర్వాత పురుషులని స్పష్టంగా తేలింది. -
ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఇలా చేయండి!
చాలా పాతకాలపు నానుడి.. లంఖణం పరమౌషధం! ఆ తరువాతి కాలంలో తిండి కలిగితేనే కండ కలదోయ్ అన్నారు గానీ.. ఇటీవల కాలంలో మాత్రం మరోసారి సీన్ రివర్స్ అయింది. వయసు మీదపడ్డా ఆరోగ్య సమస్యలేవీ దరి చేరకూడదనుకున్నా.. ఎక్కువకాలం బతకాలని ఆశిస్తున్నా.. శరీరంలోని మంట/వాపులను తగ్గించుకోవాలని భావిస్తున్నా.. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడమంత ఉత్తమమైన మార్గం లేదని అంటున్నారు చైనా, అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు.. కేలరీల నియంత్రణ ద్వారానే దీర్ఘాయుష్షు సాధ్యమన్న భావన వెనుక ఉన్న అసలు ప్రక్రియ ఏమిటిన్నది కూడా వీరు అధ్యయనపూర్వకంగా తెలుసుకున్నారు. ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. (చదవండి: బరువు తగ్గాలంటే ఈ స్నాక్ తినాల్సిందే..) వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సహజం. కేన్సర్, మతిమరుపు, జీవక్రియలు మందగించడం.. ఇలా బోలెడన్ని సమస్యలు వృద్ధాప్యాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యంపై పెట్టాల్సిన ఖర్చులు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో సాల్క్స్ జీన్ ఎక్స్ప్రెషన్ లేబొరేటరీకి చెందిన జువాన్ కార్లోస్ బెహమోంటే, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ప్రొఫెసర్ గువాంగ్ హుయి ల్యూలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేశారు. ఆహారాన్ని నియం త్రించినప్పుడు ఎలుకల కణాల్లో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనల ఆధారంగా వృద్ధాప్య సమస్యలను అధిగమించేం దుకు మంచి మందులు తయారు చేయవచ్చునన్నది వీరి అంచనా. తమ పరిశోధనల్లో భాగంగా బెహమోంటే కొన్ని ఎలుకలను ఎంచుకుని 30 శాతం తక్కువ కేలరీలు అందేలా చేశారు. వీటిని సాధారణ స్థాయిలో ఆహారం తీసుకుంటున్న ఎలుకలతో పోల్చి చూశారు. మొత్తం 56 ఎలుకల్లోని కొవ్వు, కాలేయ, కిడ్నీ, చర్మ, ఎముక మజ్జ, మెదడు, కండరం వంటి 40 రకాల కణాల్లోంచి లక్షా అరవై ఎనిమిది వేల కణాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కో కణంలోని జన్యుపరమైన చర్యలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు.. వయసు ఎక్కువవుతున్నప్పటికీ కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుక కణాల్లో మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. అంతేకాదు.. వీటి కణజాలం, కణాలు కూడా యుక్తవయసులో ఉండే ఎలుకలను పోలి ఉన్నాయి. (చదవండి: బరువు తగ్గేందుకు 12 సూత్రాలు) కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా మంట/ వాపు, కొవ్వులు జీర్ణ ప్రక్రియలకు సంబంధించిన జన్యువులపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది. ఆహారం కారణంగా వైబీఎక్స్1 అనే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 23 రకాల మార్పులను నియంత్రించగలిగిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను కొత్త కొత్త మందులను తయారు చేసేందుకు వినియోగించనున్నట్లు బెహమోంటే తెలిపారు. -
ఎత్తు పెంచుతామనే ప్రకటనలన్నీ బోగసే
నా వయసు 21 ఏళ్లు. డిగ్రీ చదువుకుంటున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే అంతో ఇంతో ఎత్తుగా ఉన్నవారే. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. ఎలాగైనా పొడువు పెరగాలని ఉంది. టీవీల్లో ఎత్తు పెంచే అడ్వరై్టజమెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం ఎత్తు పెరుగుతానా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. మీ వయసులో ఇలా అందరితోనూ పోల్చుకుంటూ ఉంటారు. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు కాస్తంత రీజనబుల్ ఎత్తు ఉన్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మీకంటే కూడా పొట్టిగా ఉంటారు. పొడవునకు సంబంధించిన జన్యువులు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయమూ వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు మూడేళ్ల కిందటే ఆ వయసు దాటిపోయారు కాబట్టి దీని గురించి అస్సలు ఆలోచించకండి. మీ దృష్టినంతా చదువుపై కేంద్రీకరించండి. ఇక ఎత్తు పెంచుతామంటూ టీవీల్లో వచ్చే ప్రకటనల్లో కనిపించేవన్నీ ఏమాత్రం ప్రయోజనం ఇవ్వని వాణిజ్యపరమైన ఉత్పాదనలు మాత్రమే. వాటితో ఎత్తు పెరగడం అసాధ్యం. మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం మీరు మంచి హైటే. కాబట్టి ఇలాంటి బోగస్ వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి. -
‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ?
న్యూఢిల్లీ : సాధారణంగా మెజారిటీ మనుషులు కుడిచేతితోనే ఎక్కుమ పనులు చేస్తుంటారు. అందుకు కారణం వారిలో ఎడమ చేయి కొంత బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని మనం రైట్ హ్యాండర్స్ అని పిలుస్తుంటాం. కొంత మందికి ఏ పనికైనా మనం కుడిచేతిని వాడినట్లుగా వారు ఎడమ చేతిని వాడుతుంటారు. అందుకు కారణం వారిలో కుడి చేయి కాస్త బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని లñ ఫ్ట్ హ్యాండర్స్ (ఎడమ చేతి వాటంగల వాళ్లు) అని పిలుస్తారు. క్రికెట్ భాషలోనైతే ఇది చాలా పాపులర్. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అని, బ్యాట్స్‌మేన్ అని స్పష్టంగా పేర్కొంటారు. రైట్ హ్యాండ్ బాట్స్మేన్లు లెఫ్ట్‌హ్యాండ్ బౌలర్లను ఎదుర్కోవడం కొంత కష్టం కనుకనే అలా లెఫ్ట్ హ్యాండర్లకు ప్రాముఖ్యత వచ్చి ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో లెఫ్ట్ హ్యాండర్లను దురదృష్టవంతులుగా చిన్న చూపు చూస్తారు. ప్రపంచ భాషల్లోనూ రైట్కున్న మంచితనం లెఫ్ట్‌కు లేదు. ఇంగ్లీషు భాషలో రైట్ అంటే కరెక్ట్, సముచితమని అర్థం. అదే ఫ్రెంచ్‌లో లెఫ్ట్‌ను ‘గాచే’ అంటారు. అర్థం బాగోలేదు, గందరగోళంగా ఉందని అర్థం. లెఫ్ట్ హ్యాండర్లు వివిధ రంగాల్లో రాణించిన వారున్నారు. భాషా రంగంలో ఎడమ చేతి వాటంగల వాళ్లు రాణించినంతగా కుడిచేతి వాటంగాళ్లు రాణించలేరనే కొత్త విషయం కూడా ఈ తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. అసలు లెఫ్ట్ హ్యాండర్లు ఎందుకు అవుతారు? దానికి కారణాలేమిటి? పుట్టుకతోనే ఈ లక్షణాలు వస్తాయా? అలవాట్ల కారణంగా మధ్యలో వస్తాయా? లెఫ్ట్ వల్ల వచ్చే లాభ, నష్టాలేమిటి? అన్న అంశాలపై ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ఫెల్లోగా పనిచేస్తున్న డాక్టర్ అఖిర విబర్గ్ అధ్యయనం జరపగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రపంచంలో 90 శాతం మంది మనుషులు కుడిచేతి వాటంగల వాళ్లే ఉంటారు. కేవలం పది శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటంగాళ్లు పుడతారు. పుట్టుకతోనే వారికి ఎడమ చేతి వాటం వస్తుంది. వారి మెదడులో కొంత భాగం కొంత భిన్నంగా ఉంటుందట. ఎడమ చేయి వాటంగల వాళ్లకు తల్లి కడుపులో ఉండగానే మెదడు నిర్మాణంలో మార్పు వస్తుందట. భాషకు సంబంధించి వారి మెదడులో కుడి, ఎడమ భాగాలు మంచి అవగాహనతో పనిచేస్తాయట. అందుకనే వారికి భాషా ప్రావీణత ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాలను బ్రిటన్ బయోబ్యాంక్‌లో ఉన్న నాలుగు లక్షల మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో 38,332 మంది ఎడమ చేతి వాటంగల వాళ్లు ఉన్నారని తేలింది. ఎడమ చేతి వాటంగల వాళ్లలో మెదడులో నిర్మాణం ఒకే తీరుగా లేదని, కొందరిలోనే ఏక రీతి నిర్మాణం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఎడమ చేతి వాటం రావడానికి అసలు కారణం జన్యువులేనని, అధ్యయనంలో కచ్చితంగా ఆ జన్యువులను గుర్తించలేక పోయినప్పటికీ అవి ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామని వారు చెప్పారు. ఎడమ చేతి వాటంగల వాళ్లలో భాషా ప్రవీణత ఒకటే కాకుండా తర్కంలో కూడా వారిదే పైచేయి అవుతుందని వారు తెలిపారు. ఎడమ చేతి వాటంగల ప్రముఖులు : లియోనార్డో డావిన్సీ, పీలే, డియాగో మరడోనా, మట్ గ్రోనింగ్, కుర్త్ కొబేన్, టామ్ క్రూజ్, మార్లిన్ మాన్రో, నికొలే కిడ్మన్, జిమ్ కేరి, స్కార్లెట్ జొహాన్సన్, బ్రూస్ విల్లీస్, జెన్నిఫర్ లారెన్స్, సారా జెస్సికా పార్కర్ తదితరులు ఉన్నారు. -
గ్రాఫీన్‌తో సరికొత్త ఇంధనం!
ఏటికేడాదీ పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు స్వీడన్‌లోని లింక్‌పింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కాలుష్యకారక కార్బన్‌డైయాౖMð్సడ్‌ను నీటితో కలిపి ఎథనాల్, మీథేన్ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. రేపటితరం అద్భుత పదార్థంగా చెబుతున్న గ్రాఫీన్ సాయంతో తాము ఈ అద్భుతాన్ని సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జియాన్‌వూ సన్ తెలిపారు. సిలికాన్, కార్బన్లతో తయారైన క్యూబిక్ సిలికాన్ కార్బైడ్‌కు గ్రాఫీన్‌ను పూతగా పూసినప్పుడు అది సూపర్ కండక్టర్‌గా వ్యవహరిస్తుందని.. ఇది కార్బన్‌డైయాక్సైడ్‌తో కూడిన నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొడుతుందని, వీటి నుంచి మీథేన్, ఎథనాల్లను తయారు చేయవచ్చునని వివరించారు. ఇలాంటి సూపర్ కండక్టర్లతో ప్రసార సమయంలో జరిగే విద్యుత్తు నష్టాన్ని లేకుండా చేయవచ్చునని జియాన్‌వూ సన్ అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కండక్టర్లు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేస్తూండగా.. కొత్తవి మాత్రం సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తాయని తెలిపారు. జన్యువులకు.. దీర్ఘాయుష్షుకు సంబంధం లేదు! వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. జన్యువులకు, దీర్ఘాయుష్షుకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు కాలికో లైఫ్ అనే కంపెనీ శాస్త్రవేత్తలు. దాదాపు 40 కోట్ల మందితో కూడిన వంశవృక్షాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్రాహం రూబీ! జన్యువులతో చాలా విషయాలు తెలుస్తాయన్నది నిజమేనని.. కాకపోతే ఆయుష్షుకు మాత్రం ఇది వర్తించదని రూబీ అంటారు. జన్యుమార్పుల ఆధారంగా తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆయుష్షు 15 – 30 శాతం మాత్రమేనని గతంలోనే లెక్కకట్టారు. జీవనశైలి, సామాజిక, సాంస్కృతిక కారణాలు, ప్రమాదాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించడం ద్వారా ఈ అంచనా ఏర్పడింది. తాజా అధ్యయనంలో కాలికో రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఆన్సిస్ట్రీ వెబ్‌సైట్‌లోని అమెరికా, యూరప్‌లకు చెందిన 40 కోట్ల మంది వివరాలను విశ్లేషించారు. ఒకే కుటుంబం.. ఇంటిపేరున్న వారిలో ఎవరి ఆయుష్షు ఎంత? అన్నది లెక్కకట్టింది. ఇది ఏడు శాతం కూడా లేదని స్పష్టమైంది. మొత్తమ్మీద చూస్తే ఆయుష్షుకు.. మన జన్యువులకు అస్సలు సంబంధం లేదన్నది ఈ అధ్యయనం సారాంశం. సెల్‌ఫోన్‌తో హెచ్ఐవీని గుర్తించవచ్చు! మనిషిని నిలువునా నిర్వీర్యం చేసేసే హెచ్ఐవీని ఎంత వేగంగా గుర్తిస్తే అంతమేలన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఉన్న పద్ధతులతో ఇది అసాధ్యం. అందుకే బ్రైగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అందరి చేతుల్లో ఉండే మొబైల్‌ఫోన్ సాయంతో పనిచేసే ఈ సరికొత్త టెక్నాలజీ.. చుక్క రక్తంతోనే హెచ్ఐవీ వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టం చేసేస్తుంది. ప్రస్తుతం ఖరీదైన పాలిమరేస్ చెయిన్ రియాక్షన్ సాయంతో హెచ్ఐవీ వైరస్‌ను గుర్తిస్తున్నారు. బ్రైగమ్ శాస్త్రవేత్తలు నానోటెక్నాలజీ సాయంతో ఓ మైక్రోప్రాసెసర్, మొబైల్‌ఫోన్ ద్వారా వైరస్ తాలూకూ ఆర్ఎన్ఏ న్యూక్లియిక్ యసిడ్లను గుర్తించే ఓ వ్యవస్థను సిద్ధం చేశారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారైన ఓ యంత్రాన్ని మొబైల్‌ఫోన్‌కు అనుసంధానించుకుని చుక్క రక్తం వేస్తే సరి.. 99.1 శాతం కచ్చితత్వంతో హెచ్ఐవీ వైరస్‌ను గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర వైరస్, బ్యాక్టీరియా గుర్తింపునకూ ఉపయోగించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షఫీ తెలిపారు. -
ఈ స్కూటర్‌ను నడపాల్సిన అవసరం లేదు!
ముందుగా కార్లు అన్నారు.. ఆ తరువాత లారీలు వచ్చేశాయి... మేమేం తక్కువ తిన్నామా? అని విమానాలూ రంగంలోకి దిగాయి. తాజాగా డ్రైవర్ లేదా డ్రైవింగ్ అవసరం లేని స్కూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫొటోలో కనిపిస్తున్నది అదే. ఏబీ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసింది దీన్ని. బీఎండబ్ల్యూ సీ1 స్కూటర్‌కు కాస్తా మార్పులు చేసి డ్రైవర్ అవసరం లేనిదానిగా మార్చారు. రోడ్డును, ట్రాఫిక్‌ను గమనించేందుకుబోలెడన్ని సెన్సర్లు, చక్రాలు ఒరిగిపోకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఔట్ రిగ్గర్లు దీంట్లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. విషయం చాలా సింపుల్. ఈ బైక్ ప్రత్యేకంగా నడపాల్సిన అవసరం లేదు. సీట్లో కూర్చోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. గేర్లు మార్చడం మొదలుకొని యాక్సలరేటర్‌ను నియంత్రించడం వరకూ అన్ని పనులను కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేసుకుంటుంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఈ స్కూటర్ అన్ని రకాలుగా విజయవంతమమైనట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అతితక్కువ వేగంలోనూ తనను తాను సంభాళించుకుంటూ చక్కర్లు కొట్టడమే కాకుండా తనకంటే ముందు వెళుతున్న వాహనాలను అతి జాగ్రత్తగా ఓవర్ టేక్ చేసింది కూడా. కారులాంటి నిర్మాణం కారణంగా తాము అన్ని రకాల సెన్సర్లను అక్కడ ఏర్పాటు చేయగలిగామని కంపెనీ ప్రతినిధి రిచర్డ్ సింప్సన్ చెప్పారు. ఉమ్మనీటిలో తేడాలతో బిడ్డలో మానసిక సమస్యలు! గర్భంలో ఉండగా ఉమ్మనీటిపై పర్యావరణ లేదా ఇతర ఒత్తిళ్లు పడితే పుట్టబోయే బిడ్డకు పలు నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. స్క్రిజోఫ్రేనియా వంటి మానసిక సమస్యల మూలాలు తెలుసుకునేందుకు ‘లైబర్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్’ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాల్లో ఈ విషయం తెలిసింది. ఈ వ్యాధికి ఇప్పటికే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉన్నట్లు స్పష్టమైనప్పటికీ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఉమ్మనీరు కూడా ప్రభావం చూపుతుందని తెలియడం ఇదే తొలిసారి. గర్భధారణ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల ఉమ్మనీటిలో కొన్ని జన్యువులు చైతన్యవంతమై బిడ్డ మెదడు ఎదుగుదుల పనితీరుపై ప్రభావం చూపుతోందని ఫలితంగానే స్క్రిజోఫ్రేనియా వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెయిన్‌బర్గ్ తెలిపారు. ఈ జన్యుమార్పులు కూడా ఆడ పిండాల కంటే మగ పిండాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మగాళ్లలో ఈ సమస్య రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఎందుకు ఉంటోందనేందుకు ఇదే కారణం కావచ్చునని వివరించారు. గర్భం దాల్చినప్పుడు ఉమ్మనీటి పరిస్థితిపై మరింత జాగ్రత్త వహించేందుకు తద్వారా శిశువుల్లో నాడీ సంబంధిత సమస్యలు ఎదురు కాకుండా చూసుకునేందుకు తమ అధ్యయనం పనికొస్తుందని వెయిన్‌బర్గ్ అంచనా వేస్తున్నారు. సముద్రపు ప్లాస్టిక్ టీషర్ట్ అయింది! ప్లాస్టిక్ చెత్త సమస్యను అధిగమించేందుకు బోలెడంతమంది బోలెడన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్లాస్టిక్ చెత్తను ఇంధనంగా మార్చే ప్రయత్నం చేస్తూంటే ఇంకొందరు టీషర్ట్లు తయారు చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నది అదే. కాకపోతే దీన్ని అంతర్జాతీయ కంపెనీ అడిడాస్ తయారు చేసింది. మాంఛెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లు ఇకపై దీన్ని వాడనున్నారు. సముద్రాల్లోకి చేరిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి వీటిని తయారు చేస్తూండటం విశేషం. ప్రజల్లో ప్లాస్టిక్ సమస్యపై అవగాహన మరింత పెరిగేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని అడిడాస్ అంటోంది. ఈ ఏడాది అమెరికాలో జరిగే టోర్నీలో తొలిసారి క్రీడాకారులు ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ టీషర్ట్లను వాడతారని చెప్పారు. అడిడాస్ ఇలా ప్లాస్టిక్ చెత్తతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అందమైన కాలిజోళ్లను తయారు చేసిన విషయం తెలిసిందే. రీసైకిల్డ్ ప్లాస్టిక్ షూలు, వస్త్రాలు మీకూ కావాలా? అడిడాస్ వెబ్సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే కాస్తా ఖరీదు ఎక్కువగా ఉండే అవకాశముంది. -
కొలెస్ట్రాల్ తగ్గింపు సాధ్యమే!
జన్యువులలో మార్పులు చేర్పులు అత్యంత కచ్చితంగా చేసేందుకు పనికొచ్చే క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీకి కొత్త ఉపయోగాన్ని గుర్తించారు డ్యూక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వ్యాధికారకమైన జన్యువులలో మార్పులు చేయకుండానే వాటిని ఆఫ్ చేసేందుకూ దీన్ని వాడవచ్చునని వీరు నిరూపించారు. హెచ్‌ఐవీతోపాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని అంచనా. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించేందుకూ దీన్ని ఉపయోగించువచ్చునని తెలిసింది. జన్యువులను కత్తిరించడం.. కొత్త వాటిని చేర్చడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చినా, రాకున్నా కొన్ని దుష్ప్రభావాలు మాత్రం తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలిగితే మంచిదేనని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో డ్యూక్ శాస్త్రవేత్తలు క్రిస్పర్ క్యాస్–9కు పీఎస్కే9 ఎంజైమ్‌ను చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చునని గుర్తించారు. మరిన్ని ప్రయోగాల ద్వారా ఈ విధానాల పనితీరును అర్థం చేసుకోగలిగితే.. దుష్ప్రభావాలేవీ లేకుండా కొన్ని వ్యాధులకు చికిత్స కల్పించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
మేధ వెనుక 500లకు పైగా జన్యువులు!
మనిషి మేధకు.. మనలోని దాదాపు 500 జన్యువులు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది డీఎన్ఏలను అధ్యయనం చేయడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎడిన్‌బరో, సౌతాంప్టన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసింది. మానవ జన్యుక్రమంలోని దాదాపు 187 ప్రాంతాలు ఆలోచన నైపుణ్యానికి కారణమవుతున్నాయని, 538 జన్యువులు వేర్వేరు మార్గాల్లో మనిషి తెలివిని ప్రభావితం చేస్తున్నాయని వీరు చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మేధకు సంబంధించిన కొన్ని జన్యువులతో దీర్ఘాయుష్షుకూ సంబంధం ఉండటం! ఇంకేముంది... ఇంకొన్నేళ్లలో ఈ జన్యువులన్నింటినీ ప్రభావితం చేయడం ద్వారా అపరమేధావులను తయార చేసేద్దామని అనుకుంటున్నారా? అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కేవలం జన్యుక్రమం ద్వారానే మనిషికి మేధను సమకూర్చడం చాలా కష్టమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ హిల్ అంటున్నారు. జన్యువులతోపాటు వాతావరణ పరిస్థితులు కూడా మేధను ప్రభావితం చేస్తూండటం దీనికి కారణం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, బుర్రకు పదును పెట్టే పరిస్థితుల్లో పెరిగే వారితో పోలిస్తే, ఇవేవీ లేని పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తక్కువ మేధ కలిగి ఉంటారని ఆయన వివరించారు. -
జన్యువులను ఆన్.. ఆఫ్ చేయొచ్చు!
-
జన్యువులను ఆన్.. ఆఫ్ చేయొచ్చు!
జన్యులోపాలతో కొన్ని వ్యాధులొస్తాయి.. కొన్ని జన్యువులు సరిగా పనిచేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు! ఇవి మనకు తెలిసిన విషయాలే గానీ.. జన్యువులను కచ్చితంగా మనకు కావాల్సినట్లు ఆన్.. ఆఫ్ చేయగల పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఇప్పటికీ వ్యాధులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పరిస్థితి మారనుంది అంటున్నారు నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జూలియస్ లక్స్. తన బృందంతో కలసి ఇటీవలే జన్యువులను ప్రకృతి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కచ్చితంగా ఆన్.. ఆఫ్ చేయగల ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం పేరు స్మాల్ ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేటింగ్ ఆర్ఎన్ఏ (స్టార్). మన కణాల్లోని డీఎన్ఏ మాదిరిగా ప్రతి కణంలోనూ రైబోన్యూక్లియిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) ఉంటుంది. దాదాపు 60 రకాల ఆర్ఎన్ఏలు వేర్వేరు పనులు చేస్తుంటాయని అంచనా. మెసెంజర్ ఆర్ఎన్ఏ డీఎన్ఏలోని సమాచారాన్ని మోసుకెళ్తే.. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏకు మరో ప్రత్యేకమైన పని ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ పోగుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి జన్యువులను ఆన్.. ఆఫ్ చేసేలా చేయగలిగారు. జన్యువుల పనితీరులో సహజ సిద్ధంగా మార్పులు వచ్చేందుకు అవకాశమున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. జూలియస్ అభివృద్ధి చేసిన ఆర్ఎన్ఏ మాత్రం అలా కాదు. సహజసిద్ధ మార్పుల కంటే దాదాపు 8000 రెట్లు ఎక్కువ సమర్థమైంది. వ్యాధుల గురించి తెలుసుకునేందుకు, మెరుగైన చికిత్సలు అందించేందుకు ఈ స్టార్ ఆర్ఎన్ఏ ఎంతో ఉపయోగపడుతుందని జూలియస్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
జాతులే భారత సంతతికి మూలం!
లండన్: ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియాల నుంచి గత 50,000 ఏళ్లలో వచ్చిన వేర్వేరు వలసల కారణంగానే భారత సంతతి ప్రజలు ఏర్పడ్డారని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపఖండంలో వ్యక్తుల జన్యువుల్ని విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హడ్డర్స్‌ఫీల్డ్ పరిశోధకులు వెల్లడించారు. వేట ఆధారంగా జీవించే జాతి ఒకటి దాదాపు 50 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి ఉపఖండానికి వలస వచ్చిందని పరిశోధకులు చెప్పారు. అనంతరం దాదాపు 10–20 వేల ఏళ్ల క్రితం అంటే మంచు యుగం ముగిశాక ఇరాన్ ప్రాంతం నుంచి వలసలు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. ఇక మధ్య ఆసియా జాతులు గత 5,000 ఏళ్లలోనే ఉపఖండానికి వలస వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. -
ప్రాణం పోయాక జన్యువులు బతుకుతాయట!
వాషింగ్టన్: మనిషి చనిపోయాక ఏమవుతాడు! ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. మనిషి చనిపోయాక శరీరం చల్లబడుతుందని, ప్రతి జీవాణువు చలనరహితమై నశించి పోతుందని, అంతా శూన్యం ఏర్పడుతుందని విజ్ఞానపరులు చెబుతారు. జీవం ఎగిరిపోయాకే మనిషి చనిపోతాడని, జీవం ఆత్మరూపంలో సంచరిస్తుందని, మరో జన్మగా అవతారం ఎత్తుతుందని కొందరు విశ్వాసకుల అభిప్రాయం. చనిపోవడం అంటే ఏమిటీ? చనిపోయిన తర్వాత మనిషిని బతికించవచ్చా ? అన్న దిశగా విజ్ఞాన జిజ్ఞాస కలిగిన శోధకులు మాత్రం నిరంతరంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చనిపోయాక కూడా మనిషి శరీరంలోని కొన్ని జన్యువులు బతికే ఉంటాయని, చనిపోయిన తర్వాతనే అవి క్రియాశీలకంగా మారుతాయని నేటి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఎలుకలు, జీబ్రా చేప, మరికొన్ని జంతువులపై వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రెండు ల్యాబుల్లో ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైన అద్భుత విషయాలే కారణం. రకరకాల జంతువుల్లో 1063 జన్యువులు శరీరానికి ప్రాణం ఉన్నంతకాలం స్తబ్దుగా ఉంటాయని, చనిపోయిన తర్వాత అవి క్రియాశీలకంగా మారుతాయని వారి పరిశోధనల్లో తాజాగా తేలింది. ఇదే ప్రక్రియ మానవుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. దీనివల్ల చనిపోయిన మనిషిని బతికించలేకపోయినా, పాడై పోయిన అవయవాన్ని మార్పిడి చేసేందుకు కావాల్సినంత సమయం చిక్కుతుందన్నది వారి అభిప్రాయం. చనిపోయిన జంతువుల్లోని ఆర్ఎన్ఏను విశ్లేషించగా ప్రాణం పోయాక వాటిలో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న జన్యువులు 24 నుంచి 48 గంటల్లోగా క్రియాశీలకంకాగా, కొన్ని జంతువుల్లో రెండు, మూడు రోజుల తర్వాత కూడా క్రియాశీలకంగా మారాయని యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. ఇవి ప్రాణి శరీరంలోని వ్యవస్థలన్నింటినీ మూసివేయడంలో భాగంగా జరుగుతుందని భావించినప్పటికీ ప్రాణం పోయాక కూడా జన్యువులు బతికి ఉండడం, అవి క్రియాశీలకంగా మారుతున్నాయని తెలియడం విశేషమని, భవిష్యత్తులో మనిషికి ప్రాణంపోసే దిశగా ఉపయోగపడే ముందడుగని వారు అంటున్నారు. -
డీఎన్ఏలో మరో సమాచార వ్యవస్థ
మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది. జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్ -
గర్భంలోనే పసిగట్టొచ్చు..
వాషింగ్టన్: గర్భస్థ శిశువులోని జన్యువుల పరిస్థితి, బ్లడ్ గ్రూప్, లింగత్వం, డీఎన్ఏ వంటివి నిర్ధారించేందుకు కచ్చితమైన, తక్కువ ముప్పు ఉండే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘ప్లైమౌత్ యూనివర్సిటీ’కి చెందిన నీల్ అవెంట్ సారథ్యంలో ఈ పద్ధతిని కనుగొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పరీక్ష (ఆమ్నియోసెంటెసిస్) ద్వారా గర్భ స్రావం అయ్యే అవకాశం (ఒక్క శాతం)ఉండటంతో ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చు, తక్కువ హానికరమైన పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా తల్లి నుంచి సంక్రమించే జన్యు సంబంధ వ్యాధులను బిడ్డ పుట్టక ముందే గుర్తించవచ్చు. ఈ పరీక్ష కోసం రక్తాన్ని గర్భం దాల్చిన మొదట్లోనే తల్లి నుంచి సేకరిస్తారు. అంతే కాకుండా తల్లి నుంచి సేకరించిన రక్తం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు పుట్టబోయే బిడ్డ బ్లడ్ గ్రూప్, జన్యువుల పై అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా బిడ్డ డీఎన్ఏను కచ్చితంగా నిర్ధారించవచ్చు. -
అది నా జీన్స్‌లోనే ఉంది: అమితాబ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనలో ఉన్న సంగీత పరిజ్ఞానం తండ్రి హరివంశరాయ్ బచ్చన్ నుండి వారసత్వంగా సంప్రాప్తించిందని తెలిపారు. అమితాబ్ తన బ్లాగ్ ద్వారా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల టెలివిజన్ కార్యక్రమం 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' కి అమితాబ్ సంగీతాన్ని సమకూర్చారు. హోలీ రఘువీరా, ఏక్ ల చెలో రే, పిడ్లీ వంటి గీతాలలో తన గాత్రాన్ని వినిపించిన ఆయన....తాను సంగీతంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోలేదని తెలిపారు. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్‌కు సంగీతంలో మంచి అవగాహన ఉండేదనీ, చిన్నతనం నుండి ఆయనను గమనిస్తూ సంగీతంపై అభిమానాన్ని పెంచుకున్నానని అమితాబ్ తెలిపారు. సంగీతం తనలో అంతర్లీనంగా ఉండిపోయిందని తెలిపిన అమితాబ్... తన తల్లి గురించిన విశేషాలను షేర్ చేసుకున్నారు. తన తల్లికి సంగీతంలో ఉన్న ప్రావీణ్యత కూడా తనపై ప్రభావం చూపిందన్నారు. ఆమె తన చుట్టూ ఉన్న వారిలో.. తన సంగీతంతో ఆహ్లాదాన్ని నింపే వారనీ తెలిపిన అమితాబ్.. తన తల్లితో పాటు తెచ్చుకున్న గ్రామ్ ఫోన్ తాలూకు ఙ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నతనంలో తల్లితో పాటు పాటలు వినేవాడినని తెలిపిన అమితాబ్.. ఆమె గాత్రంలోని మాధుర్యం ఎంతగానో తనను ఆకట్టుకునేదని తెలిపారు. తనకు సంగీతంపై ఆసక్తి కలగడం అనేది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన సంపదగా అమితాబ్ తెలిపారు. -
మనమూ అవయవాలు పెంచుకోవచ్చు!
వాషింగ్టన్: బల్లితోక తెగిపోతే ఏమవుతుంది? రెండు నెలల్లో తిరిగి మునుపటి సైజుకు పెరుగుతుంది. మనకు కూడా అలా అవయవాలు తెగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి తిరిగి పెరిగితే అద్భుతంగా ఉండేది కదూ! అయితే అన్ని కాకపోయినా.. చెవులు, ముక్కు వంటివాటిలో ఉండే మృదులాస్థి, కండరాలు, వెన్నెముకలోని నాడీకణజాలం వంటివాటివి దెబ్బతిన్నా తిరిగి పెంచుకోవచ్చంటున్నారు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్రో కుసుమి. బల్లితోకలో పునరుత్పత్తికి అవసరమైన జన్యు ప్రక్రియను తాము పూర్తిగా ఆవిష్కరించామని ఆయన వెల్లడించారు. గ్రీన్ ఆనోల్ లిజార్డ్పై పరిశోధించిన కుసుమి బృందం.. ఆ బల్లి తోకలో కణాల పునరుత్పత్తికి ప్రేరేపించే 326 జన్యువులను కనుగొంది. తోక తెగినప్పుడు మిగిలిన బల్లితోకలో నిర్దిష్టమైన భాగాల్లో ఆయా జన్యువులు క్రియాశీలం అవుతున్నాయని, దాంతో తోక నిర్దిష్ట ఆకారంలో తిరిగి పెరుగుతోందని గుర్తించింది. జన్యుపరంగా బల్లికి, మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి కాబట్టి.. బల్లితోక పునరుత్పత్తికి తోడ్పడే జన్యువుల మాదిరిగా మనిషిలోనూ ఉండే జన్యువులను నియంత్రిస్తే పలు అవయవాలను తిరిగి ఉత్పత్తి చేయవచ్చని కుసుమి చెబుతున్నారు. తిరిగి పెంచుకోగలవు కాబట్టే.. తమను ఏవైనా పెద్దజంతువులు పట్టుకున్నప్పుడు బల్లులు తమ తోకలను తెంపేసుకుని పారిపోతాయట. బల్లుల్లా ఉండే సాలమాండర్లు, కప్ప టాడ్‌పోల్ డింభకాలు, చేపలు కూడా తమ తోకల చివర్లు తెగిపోతే పునరుత్పత్తి చేసుకుంటాయట. -
మొక్కలు.. జన్యువులతోనూ మాట్లాడతాయ్!
మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. మొక్కలు ఒకదానితో ఒకటి రసాయనాలు వెదజల్లడం ద్వారా మాట్లాడతాయనీ పలువురు శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అయితే.. మొక్కలు జన్యువుల ద్వారా సైతం అణుస్థాయిలో సమాచార మార్పిడి చేసుకుంటాయని ఇప్పుడు వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, వర్జీనియా టెక్ వర్సిటీల శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకులు, వేర్లు లేకుండా పచ్చని తీగల మాదిరిగా ఉండే ‘బదనికభేదము’ అనే పరాన్నజీవ మొక్కకు, ఆవ మొక్కలా ఉండే అరేబిడాప్సిస్, టమాటా మొక్కలకూ మధ్య గల సంబంధంపై వీరు అధ్యయనం జరపగా ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. ఈ మొక్కల మధ్య పరాన్నజీవ సంబంధం కొనసాగుతున్నప్పుడు రెండు మొక్కలూ పెద్ద మొత్తంలో ఎంఆర్ఎన్ఏ అణువులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయట. అయితే పరాన్నజీవ మొక్క తనకు కావాల్సిన ఆహారం పొందేందుకు అతిథేయ మొక్కపై ఈ పద్ధతిలో జులుం ప్రదర్శించి, ఆ మొక్కను సులభంగా లొంగదీసుకుంటోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మొక్కల మధ్య ఎంఆర్ఎన్ఏ సమాచార వ్యవస్థ ఆధారంగానే... ప్రధాన పంటలను పీల్చేస్తున్న పరాన్నజీవ కలుపుమొక్కల నివారణకు తరుణోపాయాలు ఆలోచించవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా ఇలా అణుస్థాయి కమ్యూనికేషన్‌తోనే మొక్కలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయా? అన్న కోణంలోనూ పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ట -
మన శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి జన్యువులు 19 వేలే!
లండన్: మన శరీరంలో కణాలకు, జీవక్రియలకు అత్యవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తికి ఆదేశాలిచ్చే జన్యువులు 19 వేలు మాత్రమే ఉన్నాయట. గతంలో ఇవి సుమారు లక్ష వరకూ ఉండొచ్చని భావించేవారు. కానీ మానవ జన్యుపటం(జీనోమ్)లో ప్రోటీన్ ఉత్పత్తి జన్యువులు 20,700 వరకూ మాత్ర మే ఉండొచ్చని రెండేళ్ల క్రితం తేలింది. అయితే వాటిలో మరో 1,700 జన్యువులకు కూడా ప్రోటీన్ల ఉత్పత్తితో సంబంధం లేదని తాజాగా స్పానిష్ నేషనల్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జన్యువులన్నీ కూడా సుమారు 5 కోట్ల ఏళ్లనాటి ప్రైమేట్ల నుంచే వారసత్వంగా వచ్చాయని, అప్పటి ప్రైమేట్లకు, ప్రస్తుత మానవులకు మధ్య జన్యుపరమైన తేడాలు చాలా స్వల్పమేనని కూడా వారు కనుగొన్నారు. కీలకమైన జన్యువుల సంఖ్య తగ్గేకొద్దీ వాటిపై మరింత విస్తృత పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీరి పరిశోధన వివరాలు ‘హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.