అది నా జీన్స్లోనే ఉంది: అమితాబ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనలో ఉన్న సంగీత పరిజ్ఞానం తండ్రి హరివంశరాయ్ బచ్చన్ నుండి వారసత్వంగా సంప్రాప్తించిందని తెలిపారు. అమితాబ్ తన బ్లాగ్ ద్వారా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల టెలివిజన్ కార్యక్రమం 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' కి అమితాబ్ సంగీతాన్ని సమకూర్చారు. హోలీ రఘువీరా, ఏక్ ల చెలో రే, పిడ్లీ వంటి గీతాలలో తన గాత్రాన్ని వినిపించిన ఆయన....తాను సంగీతంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోలేదని తెలిపారు. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్కు సంగీతంలో మంచి అవగాహన ఉండేదనీ, చిన్నతనం నుండి ఆయనను గమనిస్తూ సంగీతంపై అభిమానాన్ని పెంచుకున్నానని అమితాబ్ తెలిపారు.
సంగీతం తనలో అంతర్లీనంగా ఉండిపోయిందని తెలిపిన అమితాబ్... తన తల్లి గురించిన విశేషాలను షేర్ చేసుకున్నారు. తన తల్లికి సంగీతంలో ఉన్న ప్రావీణ్యత కూడా తనపై ప్రభావం చూపిందన్నారు. ఆమె తన చుట్టూ ఉన్న వారిలో.. తన సంగీతంతో ఆహ్లాదాన్ని నింపే వారనీ తెలిపిన అమితాబ్.. తన తల్లితో పాటు తెచ్చుకున్న గ్రామ్ ఫోన్ తాలూకు ఙ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నతనంలో తల్లితో పాటు పాటలు వినేవాడినని తెలిపిన అమితాబ్.. ఆమె గాత్రంలోని మాధుర్యం ఎంతగానో తనను ఆకట్టుకునేదని తెలిపారు. తనకు సంగీతంపై ఆసక్తి కలగడం అనేది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన సంపదగా అమితాబ్ తెలిపారు.