
స్టార్ హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. బ్యాగ్రౌండ్ సపోర్ట్‌తో సినిమా చాన్స్‌లు ఈజీగానే వస్తాయి. కానీ టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. రికమెండేషన్‌తో ఒకటిరెండు సినిమా చాన్స్‌లు వచ్చినా.. నటనతో ఆకట్టుకోలేకపోతే ఎంతపెద్ద స్టార్ కిడ్ అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. అయితే కొంతమందికి నెపోటిజం అనేది వరంగా మారితే..మరికొంతమందికి మాత్రం అదే శాపంగా మారుతుంది.
ఎంత టాలెంట్ ఉన్నా.. అద్భుతంగా నటించినా..నెపోటిజం(బంధుప్రీతి) వల్లే చాన్స్‌లు వస్తున్నాయని విమర్శలు చేసే వాళ్లు ఉంటారు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నవారిలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan ) ఒకరు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి పెట్టిన అభిషేక్.. యువ, ధూమ్, గురు, ఢిల్లీ 6 లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించినా.. ఇప్పటికీ ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. నెపోటిజం(Nepotism) వల్లే ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారని ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా ఈ ట్రోలింగ్‌పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ తన కొడుకుకు మద్దతుగా నిలిచాడు. ‘ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ.. అభిషేక్ అనవసరంగా నెపో కిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా?’ అని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ..‘నిజం చెప్పాలంటే నాక్కుడా అదే ఫీలింగ్. కానీ నాన్నని కదా ఈ మాట చెప్పలేకపోతున్నాను’ అని రిప్లై ఇచ్చాడు.
కాగా, గతంలో అభిషేక్ నెపోటిజం విమర్శలపై స్పందిస్తూ..‘నా కెరీర్ విషయంలో నాన్న ఎప్పుడు సాయం చేయలేదు. నాతో సినిమాలను చేయమని ఎవరిని అడగలేదు. అందరి నటులలాగే నేను అవకాశాల కోసం తిరిగాను. నా టాలెంట్‌ని గుర్తించి దర్శకనిర్మాతలు చాన్స్‌లు ఇచ్చారు. అంతేకానీ నాన్న ఎప్పుడూ నాకు రికమెండేషన్ చేయలేదు. నా సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు. నేనే ఆయన నటించిన ‘పా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment