మొక్కలు.. జన్యువులతోనూ మాట్లాడతాయ్!
మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. మొక్కలు ఒకదానితో ఒకటి రసాయనాలు వెదజల్లడం ద్వారా మాట్లాడతాయనీ పలువురు శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అయితే.. మొక్కలు జన్యువుల ద్వారా సైతం అణుస్థాయిలో సమాచార మార్పిడి చేసుకుంటాయని ఇప్పుడు వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్, వర్జీనియా టెక్ వర్సిటీల శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకులు, వేర్లు లేకుండా పచ్చని తీగల మాదిరిగా ఉండే ‘బదనికభేదము’ అనే పరాన్నజీవ మొక్కకు, ఆవ మొక్కలా ఉండే అరేబిడాప్సిస్, టమాటా మొక్కలకూ మధ్య గల సంబంధంపై వీరు అధ్యయనం జరపగా ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. ఈ మొక్కల మధ్య పరాన్నజీవ సంబంధం కొనసాగుతున్నప్పుడు రెండు మొక్కలూ పెద్ద మొత్తంలో ఎంఆర్‌ఎన్‌ఏ అణువులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయట.
అయితే పరాన్నజీవ మొక్క తనకు కావాల్సిన ఆహారం పొందేందుకు అతిథేయ మొక్కపై ఈ పద్ధతిలో జులుం ప్రదర్శించి, ఆ మొక్కను సులభంగా లొంగదీసుకుంటోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మొక్కల మధ్య ఎంఆర్‌ఎన్‌ఏ సమాచార వ్యవస్థ ఆధారంగానే... ప్రధాన పంటలను పీల్చేస్తున్న పరాన్నజీవ కలుపుమొక్కల నివారణకు తరుణోపాయాలు ఆలోచించవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా ఇలా అణుస్థాయి కమ్యూనికేషన్‌తోనే మొక్కలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయా? అన్న కోణంలోనూ పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ట