Jagdish Chandra Bose
-
ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు
మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ జగదీశ్ చంద్రబోస్ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది. కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
స్వాతంత్య్రం కోసం వ్యాయామం
గడిచిన శతాబ్దంలో తెలుగు ప్రముఖులలో ఉప్పల లక్ష్మణరావుగారొకరు (1898– 1985). ఆయనది విశిష్టమైన వ్యక్తిత్వం. ‘అతడు–ఆమె’ అనే నవలను ఆయన మూడు భాగాలుగా రచించారు. 1946 ప్రాంతంలో నీలంరాజు వెంకటశేషయ్య నిర్వహించిన పత్రికలో వెలువడ్డది. బరంపురంలో వీరిని 1972 ప్రాంతంలో నేను కలిశాను. ఆ రాత్రి వీరింటనే నా బస. అది బరంపురం కాబట్టి గురజాడ అప్పారావు గూర్చి, వి.వి. గిరి గూర్చి రాత్రి ఎంతో పొద్దుపోయినదాకా వారు చెప్పారు. లక్ష్మణరావు వామపక్ష భావజాలం పట్ల మొగ్గుచూపేవారు. మాస్కో ప్రగతి ప్రచురణాలయంలో పని చేశారు. తెలుగు–రష్యన్ నిఘంటువు ప్రచురించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మెర్లీ షోలింగర్‌ను పెళ్లి చేసుకున్నారు. విజయవాడ ఆంధ్ర సిమెంట్ కంపెనీలో పనిచేశారు. ఉప్పలవారు రచించిన ‘అతడు– ఆమె’ తెలుగులో వచ్చిన ఐతిహాసిక నవలల్లో ఎంతో చెప్పుకోదగినది. నాయికా–నాయకులు దినచర్య రాసుకున్న రీతిలో రచితమైన నవల ఇది. కొంతకాలం కలకత్తా బోస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు వీరు. అప్పట్లో జగదీశ్ చంద్రబోస్ ద్వారా కలకత్తాకు వైజ్ఞానిక పరంగా ఎంతో గొప్ప పేరుండేది. సాహిత్యపరంగా రవీంద్రనాథ్ టాగూర్ విశ్వకవిగా నోబెల్ ప్రైజ్ అప్పటికే పొందారు. బోస్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్న రోజులలో జగదీశ్ చంద్రబోస్‌ను ఆఫీసు పని అయిపోయిన తరువాత ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని లక్ష్మణరావు అర్థించాడు. సర్ జగదీశ్ చంద్రబోస్ ఇందుకు సమ్మతిం చారు. కానీ ఆయన చేసిన ఏర్పాటు వేరే విధంగా ఉంది. వంగదేశంలో అప్పుడు అత్యంత ప్రసిద్ధికెక్కిన మల్లుడొకరిని (కుస్తీ మొదలైన వ్యాయామ క్రీడా ప్రవీణుడిని) శిక్షణనిచ్చేందుకు నియోగించి, విశాలమైన బోస్ పరిశోధనా సంస్థ ఆవరణలో ఒక తాలింఖానా నెల కొల్పారు బోస్. తన పరిశోధనా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ సాముగరిడీలలో ఆరితేరాలని అభిలాషించారాయన. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం (ది ఇంపీరియల్ గవర్నమెంట్) తెలుసుకొని వెంటనే మూసివేయవలసిందిగా హెచ్చరించారు. అట్లా చేయని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే సాలుసరి లక్ష రూపాయల గ్రాంటును రద్దుపరుస్తున్నట్లు తాఖీదు పంపారు. అయినా సర్ జగదీశ్ చంద్రబోస్ ఏమాత్రం చలించలేదు. య«థావిధి తాలింఖానా పనిచేసింది. శరీర వ్యాయామం, కుస్తీలు, దండేలు, బస్కీలు సంస్థ ఉద్యోగులలో ఇష్టమున్న వారు సాగించారు. జగదీశ్ చంద్రబోస్ దేశభక్తి, స్వాతంత్య్రాశయ నిరతి ఇట్లా ఉండేవి. స్వామి వివేకానంద, జగదీశ్ చంద్రబోస్‌ను పారిస్‌లో ఒకసారి చూసినపుడు, మా వంగ దేశీయుడు, భారతీయుడు అని ఫ్రెంచి వారికి పరిచయం చేసి పరమానందం అనుభవించాడు. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
మొక్కలు.. జన్యువులతోనూ మాట్లాడతాయ్!
మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. మొక్కలు ఒకదానితో ఒకటి రసాయనాలు వెదజల్లడం ద్వారా మాట్లాడతాయనీ పలువురు శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అయితే.. మొక్కలు జన్యువుల ద్వారా సైతం అణుస్థాయిలో సమాచార మార్పిడి చేసుకుంటాయని ఇప్పుడు వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, వర్జీనియా టెక్ వర్సిటీల శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకులు, వేర్లు లేకుండా పచ్చని తీగల మాదిరిగా ఉండే ‘బదనికభేదము’ అనే పరాన్నజీవ మొక్కకు, ఆవ మొక్కలా ఉండే అరేబిడాప్సిస్, టమాటా మొక్కలకూ మధ్య గల సంబంధంపై వీరు అధ్యయనం జరపగా ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. ఈ మొక్కల మధ్య పరాన్నజీవ సంబంధం కొనసాగుతున్నప్పుడు రెండు మొక్కలూ పెద్ద మొత్తంలో ఎంఆర్ఎన్ఏ అణువులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయట. అయితే పరాన్నజీవ మొక్క తనకు కావాల్సిన ఆహారం పొందేందుకు అతిథేయ మొక్కపై ఈ పద్ధతిలో జులుం ప్రదర్శించి, ఆ మొక్కను సులభంగా లొంగదీసుకుంటోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మొక్కల మధ్య ఎంఆర్ఎన్ఏ సమాచార వ్యవస్థ ఆధారంగానే... ప్రధాన పంటలను పీల్చేస్తున్న పరాన్నజీవ కలుపుమొక్కల నివారణకు తరుణోపాయాలు ఆలోచించవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా ఇలా అణుస్థాయి కమ్యూనికేషన్‌తోనే మొక్కలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయా? అన్న కోణంలోనూ పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ట