కాఫీ చుక్క గొంతులోకి దిగనిదే రోజు గడవని వారెందరో! కొందరేమో కాఫీ అంటేనే ముఖం చిట్లిస్తారు. అలాంటి వారికి కాఫీ నచ్చకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్చిన అరబికా కాఫీ చేదును నిర్ణయించడంలో ఆయా వ్యక్తుల జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు. కాఫీ గింజలను కాల్చడం వల్ల రుచి ప్రభావితం అవుతుందా, లేదా అన్న అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.
‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కాల్చి పొడి చేస్తారు. కెఫీన్ సాధారణంగానే చేదుగా ఉన్నప్పటికీ కెఫీన్ తీసేసిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. అరబికా బీన్స్‌లో ఉండే ‘మొజాంబియోసైడ్’ అనే పదార్థమే దీనికి కారణం. ఇది కెఫీన్ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ చేదుంటుంది! కాఫీ తాగినప్పుడు మనుషుల్లో ఉన్న 25 చేదు రుచి గ్రాహకాల్లో రెండింటిని అది యాక్టివేట్ చేస్తుంది.
గింజలను కాల్చిన ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఒక్కో దశలో ఒక్కో రుచి కలిగి ఉంటాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ కూడా రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఇలా కాల్చిన కాఫీ పొడి పదకొండు మందిలో ఎనిమిది మందికి చేదుగా అనిపించింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్త లాంగ్ చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment