Germany scientists
-
జన్యులోపాల వల్లే కాఫీ చేదు
కాఫీ చుక్క గొంతులోకి దిగనిదే రోజు గడవని వారెందరో! కొందరేమో కాఫీ అంటేనే ముఖం చిట్లిస్తారు. అలాంటి వారికి కాఫీ నచ్చకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్చిన అరబికా కాఫీ చేదును నిర్ణయించడంలో ఆయా వ్యక్తుల జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు. కాఫీ గింజలను కాల్చడం వల్ల రుచి ప్రభావితం అవుతుందా, లేదా అన్న అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కాల్చి పొడి చేస్తారు. కెఫీన్ సాధారణంగానే చేదుగా ఉన్నప్పటికీ కెఫీన్ తీసేసిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. అరబికా బీన్స్‌లో ఉండే ‘మొజాంబియోసైడ్’ అనే పదార్థమే దీనికి కారణం. ఇది కెఫీన్ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ చేదుంటుంది! కాఫీ తాగినప్పుడు మనుషుల్లో ఉన్న 25 చేదు రుచి గ్రాహకాల్లో రెండింటిని అది యాక్టివేట్ చేస్తుంది. గింజలను కాల్చిన ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఒక్కో దశలో ఒక్కో రుచి కలిగి ఉంటాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ కూడా రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఇలా కాల్చిన కాఫీ పొడి పదకొండు మందిలో ఎనిమిది మందికి చేదుగా అనిపించింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్త లాంగ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలివి
బెర్లిన్: కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో గుర్తించారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు. ఈఎంబీవో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ పరిశోధన .. కోవిడ్‌కు సమర్థమైన చికిత్సను అభివృద్ధి చేసేందుకు సాయపడుతుందని అంచనా. శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్ కణాలపై కరోనా వైరస్‌లోని రిసెప్టర్ దాడి చేస్తున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొజెనిటర్ కణాల పైభాగంలో ఉండే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతోపాటు కఫం ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేందుకు దోహదపడతాయి. హైడల్‌బర్గ్ లంగ్ బయో బ్యాంక్ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగుల నమూనాలతో తాము పరిశోధనలు చేశామని, అంతేకాకుండా ఆరోగ్యవంతుల శ్వాసకోశంలో ఉండే కణాలను కూడా పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే కరోనా లేని వ్యక్తుల నుంచి కీలకమై సమాచారం లభిస్తోందని రోలాండ్ ఇలిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైరస్‌పై ఉండే కొమ్ము కణ ఉపరితలంపైని ఏస్ రిసెప్టర్లకు అతుక్కుంటున్నట్లు ఇప్పటికే తెలిసినా.. కణాల్లోకి చొరపడేందుకు ఇదొక్కటే సరిపోదని చెప్పారు. సుమారు 60 వేల కణాల జన్యుక్రమాలను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్ కణాలు కరోనా వైరస్ అతుక్కోగల రిసెప్టర్ల తయారీకి కీలకమని గుర్తించామని వివరించారు. -
‘కృత్రిమ సూర్యుడి’ని పరీక్షించిన శాస్త్రజ్ఞులు
బెర్లిన్: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేషన్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి దానిని విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు. -
దుష్ప్రభావాల్లేని ‘నొప్పి’ మాత్రలు
బెర్లిన్: నొప్పినివారణ మాత్రల తయారీలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఎటువంటి ప్రమాదకర దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసే నొప్పి నివారణ మాత్రల తయారీకి కొత్త పద్ధతిని జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించారు. బెర్లిన్ లోని చారెట్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ నూతన పద్ధతిలో జంతువులకు మార్ఫిన్ లాంటి మత్తుమందును ఇచ్చినప్పుడు వాటిలోని దెబ్బతిన్న కణాలపై ఇది సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. అదే సమయంలో ఇతర ఆరోగ్యకర కణజాలంపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వెల్లడించారు. ఓపియోడ్ నొప్పి నివారణ మాత్రలను సర్జరీలు, నరాలు దెబ్బతిన్నప్పుడు, కీళ్లనొప్పులు, కేన్సర్ వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారని, దీని వల్ల నిద్రమత్తు, వికారం, మలబద్ధకం, శ్వాస నిలిచిపోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి.