జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది.
మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్‌లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది.
అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది.
ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది.
‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్‌బ్రక్‌తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్‌ఎన్‌ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు.
తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్‌లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్.
ఆశాజనకమే కానీ..
జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు.
మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్‌ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు.
ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment