molecular biology
-
ఐదోసారీ పెళ్లికి సిద్ధమైన మర్డోక్
కాలిఫోర్నియా: మీడియా రంగ దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కు 92 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి కుదిరింది. రష్యాకు చెందిన మాజీ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా ఝకోవా(67)ను త్వరలో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. జూన్‌లో వీరిద్దరు ఒక్కటవుతారని, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆస్ట్రేలియాలో జన్మించిన మర్డోక్‌కు గతేడాది అన్ లెస్లీతో ఎంగేజ్మెంట్ అయింది. అనంతరం ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మర్డోక్ ఎలెనాతో డేటింగ్ చేస్తున్నారు. మర్డోక్‌కు ఇది ఆరో ఎంగేజ్మెంట్ కాగా, అయిదో పెళ్లి. -
మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్
న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అర్టిమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి! -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి
సాక్షి, హైదరాబాద్: క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కు జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్, మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్‌కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురిం చింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆదివారం సీసీఎంబీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించారు. అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని మా పరిశోధనలో తేలింది. దక్షిణ భారతదేశంలో క్లోమ గ్రంధి వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్‌ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నయం చేయకపోతే క్లోమగ్రంధికి కేన్సర్ వస్తుంది’’ అని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వివరించారు. క్లోమగ్రంధి పనిచేయకపోవడానికి కారణాలపై ఏఐజీ నిపుణులు నాగేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరావు, సీసీఎంబీకి చెందిన జీఆర్ చంద్రక్ తదితరులు 13 ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల బృందంతో కలిసి వీరు చేసిన పరిశోధన ఫలితాలను ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ ప్రచురించిందని తెలిపారు. పది శాతం మందికి కేన్సర్ ప్రమాదం... ప్రతి వంద మంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో పది మందికి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘దక్షిణ భారతదేశంలో కర్రపెండలం తినడం, ఆల్కహాల్ తాగడం వల్లే ప్యాంక్రియాటైటిస్ వస్తుందని గతంలో భావిస్తూ వచ్చాం. జన్యుపరమైన మార్పులు, వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఇది వస్తుందని మా తాజా పరిశోధనల్లో తేలింది. ఆదిలోనే వ్యాధిని నిర్ధారిస్తే మందులతోనే నయం చేయడం సులువవుతుంది. గత పదమూడేళ్లుగా సీసీఎంబీ, అంతర్జాతీయ నిపుణులతో కలిసి అధ్యయనం చేశాం. మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. ఆ తరువాతే తగిన మందులు తయారు చేయాల్సి ఉంటుంది. 3 వేల మంది రోగులపై పరిశోధనలు చేశాం. రక్తపరీక్షతో ప్యాంక్రియాటైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష కోసం ప్రస్తుతం రూ. 5 వేలు ఖర్చవుతోంది. హోల్బాడీ జీనోమ్ సీక్వెన్స్ స్క్రీనింగ్‌కు రూ. 70 వేలు వ్యయమవుతోంది. భవిష్యత్తులో ఈ ఖర్చు రూ. 30 వేలకు తగ్గుతుంది. ప్యాంక్రియాటైటిస్ రావడానికి కారణాలు స్పష్టంగా తేలితే వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించొచ్చు. ఆదిలోనే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, మందులతో 95 శాతం నయం చేయవచ్చు. ఈ దిశగానే మా పరిశోధనలు సాగిస్తున్నాం. ఒకవేళ వ్యాధి ముదిరిన తరువాత గుర్తిస్తే శస్త్రచికిత్స చేయాలి. అయితే ఇందులో సక్సెస్ రేట్ 30 శాతం మాత్రమే’’ అని ఆయన వివరించారు.