జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి
సాక్షి, హైదరాబాద్: క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కు జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్, మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్‌కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురిం చింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆదివారం సీసీఎంబీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించారు.
అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని మా పరిశోధనలో తేలింది. దక్షిణ భారతదేశంలో క్లోమ గ్రంధి వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్‌ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నయం చేయకపోతే క్లోమగ్రంధికి కేన్సర్ వస్తుంది’’ అని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వివరించారు. క్లోమగ్రంధి పనిచేయకపోవడానికి కారణాలపై ఏఐజీ నిపుణులు నాగేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరావు, సీసీఎంబీకి చెందిన జీఆర్ చంద్రక్ తదితరులు 13 ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల బృందంతో కలిసి వీరు చేసిన పరిశోధన ఫలితాలను ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ ప్రచురించిందని తెలిపారు.
పది శాతం మందికి కేన్సర్ ప్రమాదం...
ప్రతి వంద మంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో పది మందికి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘దక్షిణ భారతదేశంలో కర్రపెండలం తినడం, ఆల్కహాల్ తాగడం వల్లే ప్యాంక్రియాటైటిస్ వస్తుందని గతంలో భావిస్తూ వచ్చాం. జన్యుపరమైన మార్పులు, వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఇది వస్తుందని మా తాజా పరిశోధనల్లో తేలింది. ఆదిలోనే వ్యాధిని నిర్ధారిస్తే మందులతోనే నయం చేయడం సులువవుతుంది. గత పదమూడేళ్లుగా సీసీఎంబీ, అంతర్జాతీయ నిపుణులతో కలిసి అధ్యయనం చేశాం. మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. ఆ తరువాతే తగిన మందులు తయారు చేయాల్సి ఉంటుంది. 3 వేల మంది రోగులపై పరిశోధనలు చేశాం. రక్తపరీక్షతో ప్యాంక్రియాటైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష కోసం ప్రస్తుతం రూ. 5 వేలు ఖర్చవుతోంది. హోల్‌బాడీ జీనోమ్ సీక్వెన్స్ స్క్రీనింగ్‌కు రూ. 70 వేలు వ్యయమవుతోంది. భవిష్యత్తులో ఈ ఖర్చు రూ. 30 వేలకు తగ్గుతుంది. ప్యాంక్రియాటైటిస్ రావడానికి కారణాలు స్పష్టంగా తేలితే వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించొచ్చు. ఆదిలోనే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, మందులతో 95 శాతం నయం చేయవచ్చు. ఈ దిశగానే మా పరిశోధనలు సాగిస్తున్నాం. ఒకవేళ వ్యాధి ముదిరిన తరువాత గుర్తిస్తే శస్త్రచికిత్స చేయాలి. అయితే ఇందులో సక్సెస్ రేట్ 30 శాతం మాత్రమే’’ అని ఆయన వివరించారు.