
జిమ్‌ల బాటపడుతున్న అనారోగ్య బాధితులు
దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాయామంతో చక్కటి చికిత్స
శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జిమ్ కీలకం
‘యూకే యాక్టివ్’ పరిశోధనలో వెల్లడి
సాక్షి, అమరావతి: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు వ్యాయామం చక్కటి చికిత్సగా మారుతోంది. శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలక భూమిక పోషిస్తోంది. అందుకే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వ్యాయామంపై ఆసక్తి పెరుగుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు జిమ్‌ల బాట పడుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఒక సంస్థ ‘యూకే యాక్టివ్’ పేరుతో చేసిన పరిశోధనలో ఈ విషయాలు గుర్తించారు.
ప్రమాదంలో గాయపడటం వల్ల వచ్చే సమస్యలు, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతల నుంచి కాపాడటంలో జిమ్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. ‘దాదాపు దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జిమ్‌లకు వెళుతున్నవారిలో 77శాతం మంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, నిద్ర సమస్యలను అధిగమించేందుకు, ఆరోగ్య సూత్రాలు పాటించాలనే ఆకాంక్షలతో జిమ్ సభ్యత్వాలు తీసుకుంటున్నారు’ అని ఆ సర్వేలో తేలింది. ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉందని ఆ సర్వే వెల్లడించింది.
మరికొన్ని సర్వేల్లో తేలిన ముఖ్యాంశాలు
⇒ వ్యాయామం వల్ల కలిగే ఉపయోగాల గురించి మరి కొన్ని సంస్థలు కూడా తమ పరిశోధనల్లో గుర్తించిన అంశా లను ఇటీవల వెల్లడించాయి.
⇒ క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ద్వారా టైప్–2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చని స్పోర్ట్ ఇంగ్లండ్ వెల్లడించింది. నిరాశ వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కేసులు కూడా వ్యాయామం వల్ల గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది.
⇒ఫిట్‌నెస్ సేవలను విస్తృతం చేయడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను అందరూ గుర్తించాలని స్పోర్ట్ ఇంగ్లాండ్ సూచించింది.
⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 31శాతం మంది వ యోజనులు... అంటే సుమారు 180కోట్ల మంది అవసరమైన శారీరక శ్రమ స్థాయి కన్నా దిగువన ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ఆ సంఖ్య 35శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
⇒ ఈ క్రమంలో వారానికి కనీసం 75–150 నిమిషాలకు పైగా తీవ్రమైన శారీరక శ్రమ లేదా దానికి సమానమైన పని చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
⇒ శారీరక నిష్క్రియాత్మకత వల్ల పెద్దలు గుండెపోటు, స్ట్రోకులు, టైప్–2 డయాబెటిస్, రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్లు వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
⇒ భారతీయుల్లో ఎక్కువ మంది ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి 60శాతం మంది పెద్దలు అనారోగ్యం బారినపడతారని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు తగినంత శారీరకంగా చురుగ్గా లేరని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment