అంజనాపురం కాలనీలో అదుపులోకి రాని వ్యాధి
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
ఒకరి పరిస్థితి ఆందోళనకరం
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది.
కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.
ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment