వైద్యుల నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది | Patient died due to lack of treatment in vijayawada | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది

Published Sun, Oct 27 2024 5:27 AM | Last Updated on Sun, Oct 27 2024 5:27 AM

Patient died due to lack of treatment in vijayawada

ప్రాణాపాయస్థితిలో ఉంటే సాధారణ వార్డులో ఎలా చేరుస్తారు

సత్వరం స్పందించక పోవడమే కారణం 

రోగి మృతిపై బంధువుల ఆరోపణ 

రెండుగంటలకు పైగా ఆందోళన

లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రాణాపాయస్థి­తిలో చికిత్స కోసం వస్తే సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. మృతుని మేనమామ కథనం మేరకు.. కృష్ణాజిల్లా, పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన గార్లపాటి ఆది పవన్‌కుమార్‌ (35) తాపీపని చేస్తుంటాడు. ఇటీవల కాలుకు దెబ్బతగలడం, మూడురోజులుగా జ్వరం ఉండటంలో స్థానికంగా చికిత్సపొందుతున్నాడు. 

ఈక్రమంలో శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి హార్ట్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్‌ చేశారు. లెటర్‌లో వైరల్‌ ఫీవర్, గ్యాస్ట్రయిటిస్‌ అని పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి, జనరల్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు పవన్‌కుమార్‌ మృతి చెందాడు. 

బంధువుల ఆందోళన 
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కనీసం ఐసీయూ­లో ఉంచకుండా, సాధారణ  వార్డులో చేర్చడం వల్లే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అదేమని అడి­గితే బెడ్‌లు ఖాళీలేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. వైద్యులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండు గంటల ఆందోళన తర్వాత ఆస్పత్రి అధికారులు వారి వద్దకు వచ్చి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.అంతర్గత రక్తస్రావంతోనే మృతి రోగి పవన్‌కుమార్‌ మూడురోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. 

మచిలీపట్నం నుంచి రిఫర్‌చేసిన లెటర్‌లో కూడా వైరల్‌ ఫీవర్, గ్యాస్రై్టటీస్‌ అని రాశారు. వైరల్‌ ఫీవర్‌లో ప్లేట్స్‌లెట్స్‌ తగ్గిన కారణంగా అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్‌ బ్లీడింగ్‌)తో ఒక్కసారిగా బీపీ తగ్గి మరణం సంభవించింది. రోగి బంధువుల ఆరోపణలపై కూడా విచారణ చేస్తాం. ఇందుకు ముగ్గురు సీనియర్‌ ప్రొఫెసర్‌లతో విచారణకు కమిటీ వేశాం.  
– డాక్టర్‌ ఎ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement