World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు.
కాగా జర్మనీలోని బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది.
ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఇక బుధవారం నాటి ఈవెంట్‌లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.
మన అమ్మాయి బంగారం
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
HISTORIC win for India 🇮🇳🥇
— World Archery (@worldarchery) August 4, 2023
New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR
Comments
Please login to add a commentAdd a comment