cardio
-
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
కార్డియోమయోపతి అంటే ఏమిటి...?
నా వయసు 42 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపించుకుంటే ఆయన కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. నా కండిషన్ ‘కార్డియోమయోపతి’ కావచ్చని కార్డియాలజిస్ట్ అంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? దీనికి చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరించండి. – ఎమ్. శ్రీకాంత్‌రావు,కరీంనగర్ కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీరు వివరిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే తొలి లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు.డాక్టర్ పంకజ్ జరీవాలా,సీనియర్ ఇంటర్వెన్షనల్కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడహైదరాబాద్ -
వెయిట్ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
హలో డాక్టర్..హార్ట్ మిస్సాయే..!
పాలమూరు: మారిన జీవన శైలితో ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలా జిల్లాలో ఎవరికైనా గుండెపోటు వచ్చిందా.. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తే చికిత్స అందే పరిస్థితులు లేవు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యి నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం లేకపోవడం దురదృష్టకరం. నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో అత్యంత ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన నిపుణులు లేకపోవడంతో అత్యవసర కేసులను హైదరాబాద్ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయలేక.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. సాధారణ వైద్యమే.. మూత్రపిండాల సమస్య ఉందా.. ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందా.. కేన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే హైదరాబాద్, లేదంటే ఇతర ఇతర నగరాలకు వెళ్లాల్సిందేనంటూ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రే కాదు.. ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఇచ్చే సలహా ఇది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులు తప్ప పెద్ద జబ్బులకు ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా భావించే మహబూబ్‌నగర్‌లోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఖాళీల కారణంగా పేద ప్రజలు వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడి పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తద్వారా అత్యవసర విభాగాల్లోనూ ఎంబీబీఎస్, శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులతోనే వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి చేజారాక అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాల్సి వస్తే మధ్యలో ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చి నాలుగేళ్లవుతున్నా నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉండాల్సిన విభాగాలు, వైద్యులు, వసతులు కల్పించకపోవడం గమనార్హం. ప్రైవేట్‌లోనూ లేరు మహబూబ్‌నగర్ పట్టణంలో గుండెకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ లేవు. ఇక గుండె సంబంధిత నిపుణులు లేకపోవడంతో పేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. ఇవీ పోస్టులు గుండె సంబంధిత నిపుణులే కాదు.. జనరల్ ఆస్పత్రిలో ఇతర విభాగాల్లోనూ వైద్యుల కొర త ఉంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 పోస్టులకు ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక జనరల్ సర్జరీలో 14 మందికి ఇద్దరు, ఆర్థోలో ఆరుగురికి ఒకరు, పీడియాట్రిక్‌లో 12 మందికి ముగ్గురు, గైనిక్‌లో 12 మందికి ముగ్గురు, ఈఎన్టీలో ముగ్గురికి ఒక్కరు, డెర్మటాలజీలో ముగ్గురికి ఒక్కరు, అనస్థీషియాలో 14 మంది కి నలుగురు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నా రు. దీంతో పేదలకు నిరాశే ఎదురవుతోంది. కార్డియాలజీ సేవలు అవసరం జనరల్ ఆస్పత్రిలో ఒక్కరైనా కార్డియాలజిస్ట్ ఉండాలి. ఈ విభాగం లేకపోవడం, వైద్యుల నియామకం జరకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైనా వస్తే జనరల్ మెడిసిన్ వైద్యులు చూస్తున్నారు అత్యవసరమైతే హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో నిపుణులను నియమించాల్సి ఉంది. – డాక్టర్ రామకిషన్, సూపరింటెండెంట్ -
అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్!
కండిషన్ ఎలా ఉంది...? క్రిటికల్ అట. ఈ మాటల్ని పెద్దగా చదువుకోని వారు కూడా ఉపయోగిస్తూనే ఉంటారు. చాలా సంక్లిష్టంగా అనే అర్థం వచ్చే ‘క్రిటికల్’ అనే మాటకు పూర్తి న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు ఆ ‘కేర్’ ఇచ్చేవారు. రోగి అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నప్పుడు అతడిని ఆ స్థితి నుంచి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ఎంత ‘సంక్లిష్ట’మైనదో తెలియనిదేమీ కాదు. తీరా ఇంతా చేసి... మళ్లీ తమ గొప్పదనాన్ని దాచేసి నిశ్శబ్దంగా ఉండిపోయే ఆ విభాగమే... ‘క్రిటికల్ కేర్’. ఈ రోజు (అక్బోరు 9) ‘క్రిటికల్ కేర్ మెడిసిన్ డే’ సందర్భంగా ఆ విభాగం సేవలు, ప్రత్యేకతలపై అవగాహన కోసం ఈ కథనం. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనా సరే... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండే, ఉండాల్సిన విభాగమది. దీనికోసమే అక్కడి డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. క్రిటికల్ కేర్ యూనిట్‌కు ఎలాంటి రోగులు...? చికిత్స అందించకుండా వదిలేస్తే కొద్ది క్షణాల్లోనే ప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న రోగులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా ప్రమాదానికి గురైనవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురైన వారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. అన్నింటా నిష్ణాతులు... ఈ ఇంటెన్సివిస్టులు... రోగిలో ఏ ప్రత్యేకమైన అవయవానికి లేదా వ్యవస్థకు వైద్యచికిత్స అవసరమో... ప్రధానంగా ఆ డాక్టర్‌తోపాటు మిగతా అనుబంధ సమస్యలు ఉన్న డాక్టర్ల బృందం వెంటనే రోగిని పర్యవేక్షించడం మొదలుపెడుతుంది. తొలుత అతడిజీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయించేలా చూస్తారు. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. ఇలాంటి ఇంటెన్సివిస్ట్లకు కేవలం ఒక నిర్ణీతమైన వ్యవస్థ లేదా అవయవం మీదగాక... అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలన్నింటిపైనా పూర్తి పట్టు, చికిత్సలో మంచి నైపుణ్యం ఉంటుందన్నమాట. గతం కంటే ఇప్పుడు మరింత ప్రత్యేకం... గతంలో అక్కడ కేవలం కృత్రిమశ్వాస కల్పించడం లేదా వెంటిలేటర్‌పై ఉంచడం వంటి సేవలు లభ్యమయ్యేవి. యూరోప్ లాంటి దేశాల్లో పోలియో వ్యాధి ఒక మహమ్మారిలా వ్యాప్తిచెందుతున్నప్పుడు అత్యవసర వైద్యసేవలకోసం ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పనిచేసేవి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. వాటికి కేటాయించే స్థలం, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, రోగికి సంబంధించిన అన్ని కీలకమైన రీడింగ్స్‌ను తీసుకునే పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ అమర్చుతున్నారు. అన్నింటా పురోగతితో పాటు అత్యవసర సేవల్లోనూ... గతంలో వైద్యం అంటే కాస్త నింపాదిగా జరిగే ప్రక్రియ. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో రోగులు మరణించే ఉదంతాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యచికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడం, పెను ప్రమాదాల్లాంటివి సంభవించిన సందర్భాల్లోనూ అది జరిగిన మొదటి అరగంటలోగా తీసుకువస్తే దాన్ని ప్లాటినమ్ మూమెంట్స్ అని, ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మూమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మూమెంట్స్... అంటూ అభివర్ణించడం మొదలుపెట్టారు. అంటే గోల్డెన్ మూమెంట్స్‌లో ప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని మన వైద్యులు నిరూపించసాగారు. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్‌స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం ప్రారంభించాయి. వీటికి తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు తమ తమ ప్రత్యేకతలను సంతరించుకోవడం ప్రారంభించాయి. ప్రాణాలను కాపాడేందుకు అత్యాధునిక వైద్యసేవలు అందివస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎం) అనే ప్రత్యేక విద్యార్హత/శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఎలాంటి వైద్యులీ ప్రత్యేక నిపుణులు...? మనకు ఏదైనా ఒక అవయవానికి వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమై ఉంటుంది. ఒకవేళ అది తీవ్రమైందనుకోండి. అప్పుడు పొరుగునే ఉన్న అవయవాలకు లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, వాటికి సంబంధించిన వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలవుతుందనుకోండి. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాదు. మెదడు కూడా స్తబ్ధతకు గురవుతుంది. దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోతుంటాయి. అలాగే మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడిందనుకోండి. అప్పుడు సమస్య మెదడు లేదా మెదడులోని రక్తనాళాలకు మాత్రమే పరిమితం కాదు... గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దానివల్ల ప్రభావితమైన మిగతా అవయవాలూ పనిచేయకుండా పోతున్నప్పుడు ఆ కండిషన్‌ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటుంటారు. పరిస్థితి విషమించి ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని మళ్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా అభివర్ణిస్తారు. ఈ పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌లోని డాక్టర్లు నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే ఆ విభాగంలో పనిచేసే వైద్యులు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... సంయుక్తంగా శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే ఇప్పుడు రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే ప్రాణాపాయాన్ని నివారించే విధులను నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి. ఏయే రోగులకు క్రిటికల్ కేర్ అవసరం...? సాధారణంగా అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక రోగి పరిస్థితి నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్‌లో ఉంచుతారు. వాళ్లే కాకుండా, పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చిన రోగులు, పక్షవాతం వచ్చిన వారు, అవయవాల మార్పిడి చికిత్స చేయించుకున్నవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కీమోథెరపీ తీసుకున్న తర్వాత, నీళ్లలో ముగినిపోయినవారు, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలో ప్రాణాంతకంగా మారినప్పుడు క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించినప్పుడు సైతం నగరంలోని చాలా కీలకమైన ఆసుపత్రుల క్రిటికల్ కేర్ యూనిట్లు అవిశ్రాంతంగా శ్రమించాయి. అనుపమాన సేవలు... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సుల బృందం, సిబ్బంది పనిచేస్తుంటాయి. అయితే ఇంటెన్సివిస్టులు అనే ప్రత్యేక నిపుణులు మాత్రం వేళాపాళా అని చూసుకోకుండా తమ పనుల్లోకి ఉరుకుతుంటారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తారు. ఇంత శ్రమపడేవారు సైతం రోగి కోలుకున్న తర్వాత మళ్లీ నిశ్శబ్దంగా మరొకరి ప్రాణాలు రక్షించే పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సాఫీగా పనులు జరిగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా రోగికి మేలు చేసేందుకే. అక్కడి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే పరిస్థితులను గణనీయంగా తగ్గించడానికే. అలాగే అక్కడ ఆగిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) సిబ్బందీ ఉంటారు. ఈ సేవల పురోగతిలో ఇంకా మెరుగుదల వచ్చి ప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం కోసమే క్రిటికల్ కేర్ డే సందర్భంగా ఈ ఇంటెన్సివ్ కేర్ నిపుణుల నేటి ప్రతిజ్ఞ. - నిర్వహణ: యాసీన్ ఇదొక బృందస్ఫూర్తితో కూడిన కార్యక్రమం... అత్యంత సంక్లిష్టమైన క్రిటికల్ కేర్‌లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాదు... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ తమ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్‌లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్‌గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు సాగుతుంటుంది. వీళ్లంతా టీమ్‌స్పిరిట్‌తో రోగిని సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి రక్షిస్తారు. ఉదాహరణ కోసం ఒక కేస్ ఒక వ్యక్తికి ఉదాహరణకు నిమోనియా సోకిందనుకుందాం. నిమోనియా ఊపిరితిత్తుల (శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన) సమస్య. మామూలుగానైతే నిమోనియా చికిత్స కోసం సాధారణ యాంటీబయాటిక్స్ చాలు. కానీ ఏదైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండాపోయిందనుకోండి. అప్పుడా పరిస్థితిని అధిగమించడానికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ కావాలి. ఒకవేళ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్‌గా మారితే (అంటే రక్తం అంతా విషపూరితంగా మారిపోవడం) అప్పుడు యాంటీబయాటిక్స్ మాత్రమే సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. కొన్ని మందులను నరాల్లోకి ఎక్కిస్తూ రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చేయాలి. ఒక్కోసారి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్‌లంగ్ బైపాస్ అనే చికిత్సను సైతం అందించాలి. దీన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్ (ఈసీఎమ్ఓ) అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులనుంచి మూత్రపిండాలకు పాకిందనుకోండి. అప్పుడు రక్తంలోని మలినాలను కృత్రిమంగా శుభ్రం చేయడానికి ‘డయాలిసిస్’ నిర్వహించాలి. కొన్నిసార్లు రక్తం పూర్తిగా కలుషితమైతే... ఒకదారిన దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిసార్లు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో లభ్యమవుతున్న అత్యాధునిక వైద్యసేవలన్నమాట.