అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్! | critical care medicine day today | Sakshi
Sakshi News home page

అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్!

Published Tue, Oct 8 2013 11:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్!

అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్!

 కండిషన్ ఎలా ఉంది...? క్రిటికల్ అట. ఈ మాటల్ని పెద్దగా చదువుకోని వారు కూడా ఉపయోగిస్తూనే ఉంటారు. చాలా సంక్లిష్టంగా అనే అర్థం వచ్చే ‘క్రిటికల్’ అనే మాటకు పూర్తి న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు ఆ ‘కేర్’ ఇచ్చేవారు. రోగి అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నప్పుడు అతడిని ఆ స్థితి నుంచి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ఎంత ‘సంక్లిష్ట’మైనదో తెలియనిదేమీ కాదు. తీరా ఇంతా చేసి... మళ్లీ తమ గొప్పదనాన్ని దాచేసి నిశ్శబ్దంగా ఉండిపోయే ఆ విభాగమే... ‘క్రిటికల్ కేర్’. ఈ రోజు (అక్బోరు 9) ‘క్రిటికల్ కేర్ మెడిసిన్ డే’ సందర్భంగా ఆ విభాగం సేవలు, ప్రత్యేకతలపై అవగాహన కోసం ఈ కథనం.
 
 కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనా సరే... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండే, ఉండాల్సిన విభాగమది. దీనికోసమే అక్కడి డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు.
 
 క్రిటికల్ కేర్ యూనిట్‌కు ఎలాంటి రోగులు...?
 చికిత్స అందించకుండా వదిలేస్తే కొద్ది క్షణాల్లోనే ప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న రోగులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా ప్రమాదానికి గురైనవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌కు గురైన వారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు.
 
 అన్నింటా నిష్ణాతులు... ఈ ఇంటెన్సివిస్టులు...
 రోగిలో ఏ ప్రత్యేకమైన అవయవానికి లేదా వ్యవస్థకు వైద్యచికిత్స అవసరమో... ప్రధానంగా ఆ డాక్టర్‌తోపాటు మిగతా అనుబంధ సమస్యలు ఉన్న డాక్టర్ల బృందం వెంటనే రోగిని పర్యవేక్షించడం మొదలుపెడుతుంది. తొలుత అతడిజీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయించేలా చూస్తారు. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. ఇలాంటి ఇంటెన్సివిస్ట్‌లకు కేవలం ఒక నిర్ణీతమైన వ్యవస్థ లేదా అవయవం మీదగాక... అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలన్నింటిపైనా పూర్తి పట్టు, చికిత్సలో మంచి నైపుణ్యం ఉంటుందన్నమాట.
 
 గతం కంటే ఇప్పుడు మరింత ప్రత్యేకం...
 గతంలో అక్కడ కేవలం కృత్రిమశ్వాస కల్పించడం లేదా వెంటిలేటర్‌పై ఉంచడం వంటి సేవలు లభ్యమయ్యేవి. యూరోప్ లాంటి దేశాల్లో పోలియో వ్యాధి ఒక మహమ్మారిలా వ్యాప్తిచెందుతున్నప్పుడు అత్యవసర వైద్యసేవలకోసం ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పనిచేసేవి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. వాటికి కేటాయించే స్థలం, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, రోగికి సంబంధించిన అన్ని కీలకమైన రీడింగ్స్‌ను తీసుకునే పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ అమర్చుతున్నారు.
 
 అన్నింటా పురోగతితో పాటు అత్యవసర సేవల్లోనూ...
 గతంలో వైద్యం అంటే కాస్త నింపాదిగా జరిగే ప్రక్రియ. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్‌ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో రోగులు మరణించే ఉదంతాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యచికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడం, పెను ప్రమాదాల్లాంటివి సంభవించిన సందర్భాల్లోనూ అది జరిగిన మొదటి అరగంటలోగా తీసుకువస్తే దాన్ని ప్లాటినమ్ మూమెంట్స్ అని, ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మూమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మూమెంట్స్... అంటూ అభివర్ణించడం మొదలుపెట్టారు. అంటే గోల్డెన్ మూమెంట్స్‌లో ప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని మన వైద్యులు నిరూపించసాగారు. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్‌స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్‌స్పెషాలిటీలు రావడం ప్రారంభించాయి. వీటికి తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు తమ తమ ప్రత్యేకతలను సంతరించుకోవడం ప్రారంభించాయి. ప్రాణాలను కాపాడేందుకు అత్యాధునిక వైద్యసేవలు అందివస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.)  తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎం) అనే ప్రత్యేక విద్యార్హత/శిక్షణ పొందాల్సి ఉంటుంది.
 
 ఎలాంటి వైద్యులీ ప్రత్యేక నిపుణులు...?
 మనకు ఏదైనా ఒక అవయవానికి వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమై ఉంటుంది. ఒకవేళ అది తీవ్రమైందనుకోండి. అప్పుడు పొరుగునే ఉన్న అవయవాలకు లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, వాటికి సంబంధించిన వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలవుతుందనుకోండి. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాదు. మెదడు కూడా స్తబ్ధతకు గురవుతుంది. దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోతుంటాయి. అలాగే మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడిందనుకోండి. అప్పుడు సమస్య మెదడు లేదా మెదడులోని రక్తనాళాలకు మాత్రమే పరిమితం కాదు... గుండెనూ ప్రభావితం చేస్తుంది.
 
  అందుకే క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దానివల్ల ప్రభావితమైన మిగతా అవయవాలూ పనిచేయకుండా పోతున్నప్పుడు ఆ కండిషన్‌ను ‘మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్’ అంటుంటారు. పరిస్థితి విషమించి ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని మళ్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా అభివర్ణిస్తారు. ఈ పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌లోని డాక్టర్లు నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే ఆ విభాగంలో పనిచేసే వైద్యులు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... సంయుక్తంగా శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే ఇప్పుడు రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే ప్రాణాపాయాన్ని నివారించే విధులను నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.
 
 ఏయే రోగులకు క్రిటికల్ కేర్ అవసరం...?
 సాధారణంగా అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక రోగి పరిస్థితి నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్‌లో ఉంచుతారు. వాళ్లే కాకుండా, పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చిన రోగులు, పక్షవాతం వచ్చిన వారు, అవయవాల మార్పిడి చికిత్స చేయించుకున్నవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కీమోథెరపీ తీసుకున్న తర్వాత, నీళ్లలో ముగినిపోయినవారు, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలో ప్రాణాంతకంగా మారినప్పుడు  క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించినప్పుడు సైతం నగరంలోని చాలా కీలకమైన ఆసుపత్రుల క్రిటికల్ కేర్ యూనిట్లు అవిశ్రాంతంగా శ్రమించాయి.
 
 అనుపమాన సేవలు...
 అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సుల బృందం, సిబ్బంది పనిచేస్తుంటాయి. అయితే ఇంటెన్సివిస్టులు అనే ప్రత్యేక నిపుణులు మాత్రం వేళాపాళా అని చూసుకోకుండా తమ పనుల్లోకి ఉరుకుతుంటారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తారు. ఇంత శ్రమపడేవారు సైతం రోగి కోలుకున్న తర్వాత మళ్లీ నిశ్శబ్దంగా మరొకరి ప్రాణాలు రక్షించే పనుల్లో నిమగ్నమవుతుంటారు.
 
 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సాఫీగా పనులు జరిగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా రోగికి మేలు చేసేందుకే. అక్కడి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే పరిస్థితులను గణనీయంగా తగ్గించడానికే. అలాగే అక్కడ ఆగిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) సిబ్బందీ ఉంటారు. ఈ సేవల పురోగతిలో ఇంకా మెరుగుదల వచ్చి ప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం కోసమే క్రిటికల్ కేర్ డే సందర్భంగా ఈ ఇంటెన్సివ్ కేర్ నిపుణుల నేటి ప్రతిజ్ఞ.
 - నిర్వహణ: యాసీన్
 
 ఇదొక బృందస్ఫూర్తితో కూడిన కార్యక్రమం...
 అత్యంత సంక్లిష్టమైన క్రిటికల్ కేర్‌లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాదు... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ తమ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్‌లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్‌గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు సాగుతుంటుంది. వీళ్లంతా టీమ్‌స్పిరిట్‌తో రోగిని సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి రక్షిస్తారు.
 
 ఉదాహరణ కోసం ఒక కేస్
 ఒక వ్యక్తికి ఉదాహరణకు నిమోనియా సోకిందనుకుందాం. నిమోనియా ఊపిరితిత్తుల (శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన) సమస్య. మామూలుగానైతే  నిమోనియా చికిత్స కోసం సాధారణ యాంటీబయాటిక్స్ చాలు. కానీ ఏదైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండాపోయిందనుకోండి. అప్పుడా పరిస్థితిని అధిగమించడానికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ కావాలి. ఒకవేళ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్‌గా మారితే (అంటే రక్తం అంతా విషపూరితంగా మారిపోవడం) అప్పుడు యాంటీబయాటిక్స్  మాత్రమే సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. కొన్ని మందులను నరాల్లోకి ఎక్కిస్తూ రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చేయాలి. ఒక్కోసారి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్‌లంగ్ బైపాస్ అనే చికిత్సను సైతం అందించాలి. దీన్నే ఎక్‌స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్ (ఈసీఎమ్‌ఓ) అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులనుంచి మూత్రపిండాలకు పాకిందనుకోండి. అప్పుడు రక్తంలోని మలినాలను కృత్రిమంగా శుభ్రం చేయడానికి ‘డయాలిసిస్’ నిర్వహించాలి. కొన్నిసార్లు రక్తం పూర్తిగా కలుషితమైతే... ఒకదారిన దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిసార్లు. దీన్ని ‘ఎక్‌స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో లభ్యమవుతున్న అత్యాధునిక వైద్యసేవలన్నమాట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement