సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
పీహెచ్‌సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం..
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది.
ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు
ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి.
క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్‌టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్‌ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత)
Comments
Please login to add a commentAdd a comment