General Medicine
-
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
జనరల్ మెడిసిన్‌కు డిమాండ్!
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఈ ఏడాది జనరల్ మెడిసిన్ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జనరల్ మెడిసిన్ చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేసేందుకు అవకాశాలుంటాయి. జనరల్ మెడిసిన్(ఎండీ) పూర్తయ్యాక గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, మెడికల్ అంకాలజీ, కార్డియాలజీ, వంటి సూపర్ స్పెషాలిటీ(డీఎం) కోర్సులు చేసేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో తొలి కౌన్సెలింగ్‌లోనే జనరల్ మెడిసిన్ సీట్లు భర్తీ అవుతున్నాయి. వైద్య విద్యార్థుల రెండో ప్రాధాన్యంలో రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి, గైనకాలజీ(ఓబీజీ), పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ కోర్సులుంటున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి నీట్ పీజీ–2022లో 8,636 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 13 ప్రైవేట్, ఒక మైనారిటీ వైద్య కళాశాలలున్నాయి. వీటిలో 2,207 పీజీ ఎండీ/ఎంఎస్ సీట్లున్నాయి. వీటిలో ఆలిండియా కోటా కింద 475 సీట్లు భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 1,138 సీట్లు కన్వీనర్ కోటాలో, 594 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్య కళాశాల, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీపడతారు. మరో వైపు రాష్ట్రం నుంచి నీట్ ఎండీఎస్–2022లో 896 మంది అర్హత సాధించారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలలో రెండు డెంటల్ కళాశాలలున్నాయి. ఈ రెండు కళాశాలలు, ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో 400 వరకూ ఎండీఎస్ సీట్లున్నాయి. ఇన్ సర్వీస్ సీట్ల భర్తీ ఇలా.. రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఇన్–సర్వీస్ అభ్యర్థులకు కేటాయించారు. మరో వైపు ఇన్–సర్వీస్ కోటా నిబంధనల్లో ప్రభుత్వం ఈ ఏడాది మార్పులు చేసింది. గిరిజన ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన వైద్యులకు ఇన్ సర్వీస్ కోటా కింద ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, ఏపీ వైద్య, ఆరోగ్య సేవలు, ఏపీవీవీపీ, ఏపీ ఇన్‌స్రూ?న్స్ మెడికల్ సర్వీసెస్, యూనివర్సిటీల్లో నిరంతరాయంగా ఆరేళ్లు సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాలో ప్రవేశాలు కల్పించనున్నారు. స్పెషలైజేషన్ పూర్తయ్యాక ఇన్‌సర్వీస్ కోటా కోసం పని చేసినట్టు చూపిన ప్రాంతంలోనే ఆరేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. -
జనరల్ మెడిసిన్ వైపు చూపు
సాక్షి, అమరావతి: మెడికల్ విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఎంబీబీఎస్ తర్వాత పీజీలో ఆర్థోపెడిక్స్, రేడియాలజీ సీట్ల పట్ల అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు చాలా మంది జనరల్ మెడిసిన్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కోర్సు చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేయొచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. జనరల్ మెడిసిన్ (ఎండీ) చేశాక, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ (డీఎం) కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఇవి లీడింగ్ కోర్సులుగా పేరుంది. అందుకే అన్ని కాలేజీల్లో జనరల్ మెడిసిన్ సీట్లు హాట్ కేకుల్లా తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అవుతున్నాయి. ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్ వంటి కోర్సులు రెండవ ప్రాధాన్యత కోర్సులుగా అభ్యర్థులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లుగా ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ కోర్సులకూ గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో 1,226 సీట్లు రాష్ట్రంలో 18 ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ, 14 కాలేజీల్లో మాత్రమే 1,226 పీజీ వైద్య సీట్లున్నాయి. ఇందులో అత్యధికంగా నారాయణ మెడికల్ కాలేజీలో 150 సీట్లున్నాయి. కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది తొలిసారి 25 సీట్లు వచ్చాయి. ప్రైవేటు కాలేజీల్లో మంచి ఇన్స్టిట్యూట్లో సీటు కంటే ప్రభుత్వ పరిధిలోని సాధారణ కాలేజీలో సీటు మంచిదని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ ఏడాది 7 వేల మంది వరకు పీజీ వైద్య పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండీఎస్ (ఎండీ దంత వైద్య సీట్లకు) పోటీ తక్కువేమీ కాదు. ప్రభుత్వ పరిధిలో 20, ప్రైవేటు పరిధిలో 379 సీట్లు ఉన్నాయి. సుమారు మూడు వేల మందికి పైగా బీడీఎస్ అభ్యర్థులు ఈ ఏడాది ఎండీఎస్ సీట్లకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలో మాత్రమే డెంటల్ సీట్లున్నాయి. మిగతా 379 సీట్లు ప్రైవేటు పరిధిలోని 13 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు కొద్ది రోజుల్లో పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ వైద్య విద్య సీట్లు ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు, 14 ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఈ ఏడాది పీజీ సీట్లకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే నీట్ జాతీయ ర్యాంకులు వెలువడ్డాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు వెలువడనున్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కాలేజీలో 212 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పీజీ, పీజీ డిప్లొమా కలిపి 943 సీట్లున్నాయి. -
సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి ఉస్మానియా యూనిట్లు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో నాలుగు వైద్య విభాగాలు, రోగుల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్గ్యాస్ట్రో విభాగాలను సుమారు 400 పడకలున్న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో ఉన్న 18 యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి, ప్రసూతి యూనిట్‌ను పేట్లబురుజుకు తరలించనున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజీడీఏ నాయకులు డాక్టర్ రమేశ్, వీరేశం, పుట్ల శ్రీనివాస్ ఇతర అధికారులతో కలసి మంత్రి సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చే యూనిట్లకు వార్డులు అనువుగా ఉన్నాయా, లేవా అనే విషయాలను డీఎంఈ డాక్టర్ రమణి, ఆసుపత్రి సూపరిండెంటెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల సలహాల మేరకు 105 సంవత్సరాల ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు చెప్పారు. ఉస్మానియా నుంచి వచ్చే యూనిట్లు ఇవే.. ఉస్మానియా ఆసుపత్రి నుండి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి రానున్న యూనిట్లు జనరల్ మెడిసన్-8, జనరల్ సర్జరీ-8, మెడిక ల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ , సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్లను తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 740 పడకలు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగుతాయని చెప్పారు. ఇవి కేవలం ఏడాదే అక్కడ కొనసాగుతాయని తెలిపారు. ఇతర 5 ఆసుపత్రులలో.. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్(ఓపీ)తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. నాంపల్లి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్కేర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రికి ఆర్థోపెడిక్ రోగులను వైద్యుల పర్యవేక్షణలో తరలించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అందించేందుకు పటిష్టమైన రవాణా ఏర్పాటు సైతం చేస్తున్నట్లు చెప్పారు. మార్చురీ ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతుందని తెలిపారు.