జనరల్‌ మెడిసిన్‌ వైపు చూపు  | Changes are coming in the thinking of medical students General Medicine | Sakshi
Sakshi News home page

జనరల్‌ మెడిసిన్‌ వైపు చూపు 

Published Mon, Oct 18 2021 2:33 AM | Last Updated on Mon, Oct 18 2021 2:42 AM

Changes are coming in the thinking of medical students General Medicine - Sakshi

సాక్షి, అమరావతి:  మెడికల్‌ విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఎంబీబీఎస్‌ తర్వాత పీజీలో ఆర్థోపెడిక్స్, రేడియాలజీ సీట్ల పట్ల అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు చాలా మంది జనరల్‌ మెడిసిన్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కోర్సు చేస్తే సూపర్‌ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేయొచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. జనరల్‌ మెడిసిన్‌ (ఎండీ) చేశాక, మెడికల్‌ ఆంకాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి సూపర్‌ స్పెషాలిటీ (డీఎం) కోర్సులు చేసే అవకాశం ఉంటుంది.

ఇవి లీడింగ్‌ కోర్సులుగా పేరుంది. అందుకే అన్ని కాలేజీల్లో జనరల్‌ మెడిసిన్‌ సీట్లు హాట్‌ కేకుల్లా తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అవుతున్నాయి. ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, జనరల్‌ సర్జరీ, గైనిక్‌ వంటి కోర్సులు రెండవ ప్రాధాన్యత కోర్సులుగా అభ్యర్థులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లుగా ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ కోర్సులకూ గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, గుంటూరు, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. 

ప్రైవేటు కాలేజీల్లో 1,226 సీట్లు 
రాష్ట్రంలో 18 ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ, 14 కాలేజీల్లో మాత్రమే 1,226 పీజీ వైద్య సీట్లున్నాయి. ఇందులో అత్యధికంగా నారాయణ మెడికల్‌ కాలేజీలో 150 సీట్లున్నాయి. కడపలోని ఫాతిమా మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది తొలిసారి 25 సీట్లు వచ్చాయి. ప్రైవేటు కాలేజీల్లో మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కంటే ప్రభుత్వ పరిధిలోని సాధారణ కాలేజీలో సీటు మంచిదని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ ఏడాది 7 వేల మంది వరకు పీజీ వైద్య పరీక్షలు రాశారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండీఎస్‌ (ఎండీ దంత వైద్య సీట్లకు) పోటీ తక్కువేమీ కాదు. ప్రభుత్వ పరిధిలో 20, ప్రైవేటు పరిధిలో 379 సీట్లు ఉన్నాయి. సుమారు మూడు వేల మందికి పైగా బీడీఎస్‌ అభ్యర్థులు ఈ ఏడాది ఎండీఎస్‌ సీట్లకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలో మాత్రమే డెంటల్‌ సీట్లున్నాయి. మిగతా 379 సీట్లు ప్రైవేటు పరిధిలోని 13 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో ఉన్నాయి. 

త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు 
కొద్ది రోజుల్లో పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ వైద్య విద్య సీట్లు ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వెల్లడించింది. రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు, 14 ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఈ ఏడాది పీజీ సీట్లకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇప్పటికే నీట్‌ జాతీయ ర్యాంకులు వెలువడ్డాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు వెలువడనున్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యధికంగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో 212 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పీజీ, పీజీ డిప్లొమా కలిపి 943 సీట్లున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement