Andhra Medical College
-
సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ ఒకే చోట..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాలలోని కేజీహెచ్‌లో సూపర్ స్పె షాలిటీ సేవలన్నీ ఒకే చోట లభించ డం శుభ పరిణామమని కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రశంసించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు. ఉత్సవాల్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, కలెక్టర్ డా.మల్లికార్జున, డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుష్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి రమేశ్‌కుమార్, సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మంత్రి రజిని మెడల్స్, అవార్డులు అందజేశారు. ఎమ్మెల్సీ డా.రవీంద్రబాబు, ఏఎంసీ ప్రిన్సిపల్ డా.బుచ్చిరాజు, ఎంపీ డా.సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎంసీ @ 100 ఏళ్లు
మహారాణిపేట: వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1923 జూలై 19న మెడికల్ కళాశాల అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగ్‌పటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు.1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాలగా మారింది. ఆ సమయంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న సీఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజీగానే ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలల్లో ఏఎంసీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏఎంసీ కావడం విశేషం. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. ఇంకా ఎంతో మంది దేశ,విదేశాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. రూ.50 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలు వేసుకుని 1.6 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక నూతన భవనాన్ని ని ర్మిస్తున్నారు. వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధనా ఆస్పత్రులు వచ్చాయి. తొలి కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)గా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ నేడు 1,100 పడకల స్ధాయికి ఎదిగింది. ఇంకా అనుబంధంగా అనేక ఆస్పత్రులు ఉన్నాయి. 27 నుంచి శతాబ్ది ఉత్సవాలు ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. 27న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, 28న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎం.ఎల్.మాండవీయ,రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొంటారు. 29న తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంలో భాగంగా రాత్రి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థినే ఆంధ్రా మెడికల్ కాలేజీలో 1978లో ఎంబీబీఎస్ చదివాను. ఇప్పుడు ఇదే కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. చదువుకున్న కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులను సమన్వయం చేసుకుంటూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బుచ్చి రాజు, ప్రిన్సిపాల్, ఏఎంసీ చాలా ఆనందంగా ఉంది నేను ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఇక్కడ వైద్య విద్య పూర్తిచేసిన అనేక మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వైద్య విద్యను ఎంతో ఇష్టంగా చదివాను. ఇప్పటికీ వైద్యునిగా పనిచేయడం తన తల్లిందండ్రుల చేసిన పుణ్యఫలంగా భావిస్తాను. –డాక్టర్ ఎన్.ఉమా సుందరి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ తెలుగు రాష్ట్రాల్లో ఏఎంసీ నంబర్ వన్ నేను చదువుకున్న రోజుల్లో కాలేజీ, ఆస్పత్రి చాలా చిన్నవిగా ఉండేవి, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైద్య కాలేజీ నంబర్ వన్‌గా ఉంది. అయిదు సంవత్సరాల పాటు ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా పనిచేశా. – డాక్టర్ పి.వి.సుధాకర్, పూర్వ విద్యార్థి, మాజీ ప్రిన్సిపాల్ -
ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్వో సర్టిఫికెట్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్ లభించింది. వైద్య, విద్య రంగాల్లో సేవలందించినందుకు గాను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్ ప్రకటించింది. వైద్య విద్యా సేవల నాణ్యతపై రెండో సర్వే తర్వాత ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌కు చెందిన శివయ్య శనివారం అందజేశారు. ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల సంవత్సరంలో ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్ రావడంపై ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్ ఏడాది కాలం పాటు వ్యాలిడిటితో జారీ చేశారు. హెచ్‌వైఎం మొదటి సారి 2022 ఆగస్టు 16వ తేదీన జారీ చేశారు. రెండోసారి ఇప్పడు ధ్రువీకరణ పత్రం అందించారు. -
జనరల్ మెడిసిన్ వైపు చూపు
సాక్షి, అమరావతి: మెడికల్ విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఎంబీబీఎస్ తర్వాత పీజీలో ఆర్థోపెడిక్స్, రేడియాలజీ సీట్ల పట్ల అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు చాలా మంది జనరల్ మెడిసిన్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కోర్సు చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేయొచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. జనరల్ మెడిసిన్ (ఎండీ) చేశాక, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ (డీఎం) కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఇవి లీడింగ్ కోర్సులుగా పేరుంది. అందుకే అన్ని కాలేజీల్లో జనరల్ మెడిసిన్ సీట్లు హాట్ కేకుల్లా తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అవుతున్నాయి. ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్ వంటి కోర్సులు రెండవ ప్రాధాన్యత కోర్సులుగా అభ్యర్థులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లుగా ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ కోర్సులకూ గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో 1,226 సీట్లు రాష్ట్రంలో 18 ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ, 14 కాలేజీల్లో మాత్రమే 1,226 పీజీ వైద్య సీట్లున్నాయి. ఇందులో అత్యధికంగా నారాయణ మెడికల్ కాలేజీలో 150 సీట్లున్నాయి. కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది తొలిసారి 25 సీట్లు వచ్చాయి. ప్రైవేటు కాలేజీల్లో మంచి ఇన్స్టిట్యూట్లో సీటు కంటే ప్రభుత్వ పరిధిలోని సాధారణ కాలేజీలో సీటు మంచిదని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ ఏడాది 7 వేల మంది వరకు పీజీ వైద్య పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండీఎస్ (ఎండీ దంత వైద్య సీట్లకు) పోటీ తక్కువేమీ కాదు. ప్రభుత్వ పరిధిలో 20, ప్రైవేటు పరిధిలో 379 సీట్లు ఉన్నాయి. సుమారు మూడు వేల మందికి పైగా బీడీఎస్ అభ్యర్థులు ఈ ఏడాది ఎండీఎస్ సీట్లకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలో మాత్రమే డెంటల్ సీట్లున్నాయి. మిగతా 379 సీట్లు ప్రైవేటు పరిధిలోని 13 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు కొద్ది రోజుల్లో పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ వైద్య విద్య సీట్లు ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు, 14 ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఈ ఏడాది పీజీ సీట్లకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే నీట్ జాతీయ ర్యాంకులు వెలువడ్డాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు వెలువడనున్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కాలేజీలో 212 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పీజీ, పీజీ డిప్లొమా కలిపి 943 సీట్లున్నాయి. -
అందరి చూపు ‘ఆంధ్రా’వైపే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ వైద్యవిద్యార్థులు నీట్లో మంచి ర్యాంకు వస్తే ఎక్కడ సీటు తీసుకుంటావని అడిగితే టక్కున విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ అని చెబుతారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్యకాలేజీలు ఉండగా.. అభ్యర్థులు ఆంధ్రా మెడికల్ కాలేజీలోనే చదవాలని కలలుకంటారు. కొన్నేళ్లుగా ర్యాంకుల పరంగా చూసినా చివరి సీటు పొందిన అభ్యర్థుల కటాఫ్ చూస్తే ఆంధ్రా మెడికల్ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చిన వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కాలేజీలో 250 సీట్లున్నాయి. ఏఎంసీలో సీటు రాకపోతే రెండో ఆప్షన్‌గా గుంటూరు మెడికల్ కాలేజీ వైపు చూస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వందలాదిమంది విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టు పలు నివేదికల్లోనూ వెల్లడైంది. మంచి ఫ్యాకల్టీ, మెరుగైన వైద్య వసతులు, ఔట్పేషెంట్లు ఎక్కువమంది రావడం, మౌలిక వసతులతో ఆయా కాలేజీలు వైద్యవిద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. జాతీయ కోటాలో భర్తీచేసే 15 శాతం సీట్లకు సైతం ఏఎంసీ, గుంటూరు వైద్యకళాశాలలకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. తరువాత కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమ ఉజ్జీలుగా పోటీపడుతున్నాయి. మంచి ర్యాంకులు సాధించిన వారు ఏఎంసీ, గుంటూరు కాలేజీల్లో సీటు రాకపోతే కర్నూలు, కాకినాడ ప్రభుత్వ వైద్యకళాశాలల వైపు ఆసక్తి చూపుతున్నారు. పుంజుకున్న రిమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్సార్ 4 రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్ ఏపీలో ఉన్నాయి. తాజాగా వైద్యుల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో మెరుగు పడ్డాయి. గతంతో పోలిస్తే రిమ్స్ భారీగా పుంజుకున్నాయి. ప్రైవేటులో పేరున్న నారాయణ, ఎన్ఆర్ఐ వంటి కాలేజీల్లో కన్వీనర్ కోటా సీటుకు కాకుండా రిమ్స్‌కు (ఇప్పుడు జీఎంసీలుగా మారాయి) వస్తున్నారు. నారాయణ కాలేజీలో 55,046 ర్యాంకు చివరి సీటు కాగా, అదే ఒంగోలు రిమ్స్‌లో 33,332కే ముగిసింది. సాధారణ కాలేజీలైనా ప్రభుత్వ వైద్యకళాశాలలపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాకపోతేనే ప్రైవేటులో కన్వీనర్ సీటుకు వెళుతున్నారు. -
ఆ విధికి కన్నుకుట్టిందేమో..
అంతవరకూ ఆ విద్యార్థిని స్నేహితులతో ఉత్సాహంగా..గడిపింది. ఆంధ్రా మెడికల్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఫెస్ట్‌లో సందడి చేసింది. శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి లంబసింగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. విద్యార్థుల సందడిని చూసి ఆ విధికి కన్నుకుట్టిందేమో.. తెల్లవారు జామున లంబసింగి బయలుదేరిన వైద్య విద్యార్థి శ్రీవిద్యను రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. ఊహించని ఈ పరిణామానికి స్నేహితులంతా షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మల్కాపురం (విశాఖపశ్చిమ): మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని శ్రీవిద్య మృతి చెందింది. ఆంధ్ర వైద్య కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న లావేటి సంతోష్(21), శ్రీదివ్య... కేజీహెచ్ నుంచి ద్విచక్రవాహనంపై ముందుగా గాజువాక వెళ్లి..అక్కడ నుంచి స్నేహితులంతా కలిసి లంబసింగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మారుతి సర్కిల్ దగ్గరకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ శ్రీవిద్య తల పైనుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో తోటి మిత్రులు కన్నీరుమున్నీ రయ్యారు. 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్‌నగర్ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్ చౌదరి పెందుర్తి ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. శ్రీవిద్య పెద్ద కుమార్తె. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ పీవీబీ ఉదయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టసభలకు ఐదుగురు ఏఎంసీ విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ)లో వైద్య విద్యను అభ్యసించిన ఐదుగురు డాక్టర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరు లోక్‌సభ, నలుగురు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీగా డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి విజయం సాధించారు. ఆమె ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం అనకాపల్లిలో ఆస్పత్రి ఏర్పాటు చేసి లక్షకు పైగా సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు) చేసిన వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు ఏఎంసీలో వైద్య విద్య పూర్తి చేసుకుని పలాసలో వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా విశాఖ ఏంఎంసీలోనే వైద్య విద్య అభ్యసించారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్ డీబీవీ స్వామి కూడా ఏఎంసీ పూర్వ విద్యార్థే. కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డాక్టర్ ఎం.జగన్మోహనరావు కూడా విశాఖ ఏఎంసీలోనే వైద్యవిద్య అభ్యసించారు. వీరిలో వెంకట సత్యవతి, అప్పలరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికల్లో గెలుపొందగా.. డీబీవీ స్వామి తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థులు ఒకే ఎన్నికల్లో ఇంతఎక్కువ మంది చట్టసభలకు వెళ్లడం ఇదే ప్రథమమని, ఇది తమకు గర్వకారణమని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ ‘సాక్షి’తో చెప్పారు. వీరిని త్వరలో విశాఖలో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. -
విశాఖలో సైకియాట్రీ కళాశాల
విశాఖపట్నం , పెదవాల్తేరు (విశాఖ తూర్పు): విశాఖలో మరో బోధనాస్పత్రి నిర్మాణం కానుంది. ప్రస్తుతం నగరంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ వున్న సంగతి తెలిసిందే. చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఆవరణలో కొత్త కళాశాల నిర్మాణాలకు ఆస్పత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖలోని మానసిక ఆస్పత్రిని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా ప్రకటించడం తెలిసిందే. ఇందుకుగాను కేంద్రం నుంచి రూ.33 కోట్ల వరకు నిధులు రానున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రూ.10 కోట్ల విడుదలకు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ నిధులతో ఆస్పత్రి పక్కనే గల ఖాళీ స్థలంలో భవనాలు నిర్మించనున్నారు. క్లినికల్ సైకాలజీ కళాశాలలో ఏటా 15 సీట్లలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇక్కడ రెండేళ్ల కోర్సు వుంటుంది. అలాగే డిప్లమో ఇన్ సైకియాట్రి నర్సింగ్ ఏడాది కాల వ్యవధి గల కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తారు. క్లినికల్ సైకాలజీ కోర్సులో ప్రవేశాలకుగాను ఎంఏ సైకాలజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఇక డిప్లమోకి జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు అర్హులు. కాగా దేశంలో క్లినికల్ సైకాలజీ కళాశాలలు కర్నాటకలోని బెంగళూరు, బీహార్‌లోని రాంచీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మాత్రమే వున్నాయి. కొత్త కళాశాల అందుబాటులోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. కొత్త భవనాలు... గ్రౌండ్+2 తరహాలో కొత్త భవనాలు నిర్మించాల్సి వుంది. ప్రధాన అస్పత్రి పక్కన ఐదు ఎకరాల స్థలం వుండగా ప్లాన్ అప్రూవల్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దేశంలో 2009లో 10 కేంద్రాలు, తరువాత దఫదఫాలుగా మరో 14 కేంద్రాలు మంజూరు కాగా, ఇందులో విశాఖ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో 300 వరకు పడకలు వున్నాయి. ప్రస్తుతం 248కి పైగా ఇన్‌పేషెంట్లు వున్నారు. ఓపీ విభాగంలో రోజుకు 250 నుంచి 350 మంది వరకు వస్తుంటారు. ఇక్కడ ఆరుగురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక నిర్మాణం కొత్త భవనాల నిర్మాణా లకు సంబంధించి ప్లాన్ కాపీలను ప్రభుత్వ ఆమో దం కోసం పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే ఏపీఎంహెచ్‌ఐడీసీ టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడుతుంది. సాధ్యమైనంత వరకు వచ్చే విద్యాసంవత్సరానికల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.– డాక్టర్ రాధారాణి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి -
విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి!
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు వీలుగా విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ఓఎన్జీసీ, సెయిల్, రిలయన్స్, విశాఖ స్టీల్ వంటి సంస్థలు ప్రకటించిన విరాళాల మొత్తం ప్రస్తుతం రూ.60 కోట్లు అయింది. ఈ డబ్బుతో రాష్ట్రంలో అత్యంత పురాతన భవన సముదాయాలైన ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూలదోసి, కొత్త వాటిని నిర్మించనున్నారు. కింగ్‌జార్జి ఆస్పత్రిని ఏడు అంతస్తుల్లో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. క్రిటికల్ కేర్, రేడియోథెరపీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. 3వ అంతస్తులో 90 పడకలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల విభాగాన్ని, 4వ అంతస్తులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు అనెస్థీషియా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. 6వ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి, 7వ అంతస్తులో 300 మంది సామర్థ్యంతో సమావేశ మందిరంతో పాటు నగదు చెల్లించే అతిథుల కోసం ప్రత్యేక గదులు నిర్మించనున్నట్లు ఏపీఎంఎస్ఐడీసీ (మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ)కి చెందిన ఓ అధికారి వివరించారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు వరకూ రేడియేషన్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. భవనంపై హెలిప్యాడ్! కింగ్‌జార్జి ఏడు అంతస్తుల ఆస్పత్రి భవనంపై హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ పనులకు సంబంధించిన నవంబర్‌లోగా టెండర్లను పూర్తిచేసి, డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభించాలని వైద్య విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.60 కోట్ల విరాళాలను వివిధ సంస్థలు ప్రకటించగా, నిర్మాణాల అంచనా రూ.65 కోట్లని తేల్చారు. దీంతో మరో రూ.5 కోట్ల కోసం మరికొన్ని సంస్థలను కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
నేలకొరిగిన సాహితీ దిగ్గజం
విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ అస్తమయం సాక్షి, విశాఖపట్నం/కూచిపూడి(భట్లపెనుమర్రు): తెలుగునాట మరో సాహితీ దిగ్గజం నేలకొరిగింది. ఒళ్లంతా కలిసి ఒక పిడికిలిగా సాగిన సుదీర్ఘ విప్లవ ప్రస్తానం తన కొనసాగింపును వర్తమాన తరాలకు వదిలిపెట్టి వీడ్కోలు తీసుకుంది. విలువలకు, ఆదర్శానికి, నిబద్ధతకు ఉన్నతమైన తార్కాణంగా నిలిచిన వ్యక్తిత్వం ఒక తిరుగులేని స్ఫూర్తిని మిగిల్చి మరి సెలవంటూ దిగంతాలకు ఎగసిపోయింది. ‘ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే’.... అని పాడుతూ ఎర్రజెండా కనిపిస్తే పులకించిపోయే ఆ కళ్లు ప్రజాహిత వెలుగులను ప్రసరింపజేసి ధన్యత నిండిన విశ్రాంతిలోకి జారుకున్నాయి. రచయిత చలసాని ప్రసాద్ (83) మరి లేరు. రాజకీయ ఉద్దేశాలు ఏవైనా, సాహితీ తాత్త్వికతలు వేరైనా తెలుగు రాష్ట్రంలో ప్రతి సాహితీ బృందం గౌరవంగా అభిమానించే, పెద్ద దిక్కుగా భావించే చలసాని ప్రసాద్ శనివారం ఉదయం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. సీతమ్మధార హెచ్‌బీ కాలనీలో స్వగృహంలో గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు. చలసాని చివరి కోరిక మేరకు ఆయన కళ్లను మొహిసిన్ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోజనార్థం భౌతికకాయాన్ని ఆదివారం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు. చలసానికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉద్యమంలో పాల్గొంటూ అజ్ఞాతంలో ఉన్నారు. రెండో కుమార్తె వివాహమై విశాఖపట్నంలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1932 డిసెంబర్ 8న జన్మించిన చలసానిది వామపక్ష కుటుంబం. ఆయన కూడా ఐదో ఏట నుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. చివరి వరకూ దానికే నిబద్ధులై ఉన్నారు. ఆంధ్ర వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఆయన తొలుత మత్స్యశాఖలో ఎల్డీసీ ఉద్యోగిగా చేరి ఆ తర్వాత రైల్వేలో క్లర్క్‌గా పనిచేశారు. కొన్నాళ్లు సినిమాల్లో పనిచేసి దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడిగా వ్యవహరించారు. తర్వాత ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. చలసాని ప్రసాద్ విరసం వ్యవస్థాపకుల్లో ఒకరు. శ్రీశ్రీ, కొ.కు, కాళోజీ, కారా, వరవరరావు, కృష్ణాబాయి వంటి సాహితీమూర్తులతో ఆయనకు గాఢమైన స్నేహం, సహచర్యం ఉంది. ముఖ్యంగా శ్రీశ్రీ రచనలు వెలికి తీయడంలో చలసాని సాగించిన కృషి అసామాన్యం. శ్రీశ్రీ జన్మదినం నిర్థారణ చేయడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. విరసం తరఫున చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం కొత్తతరాలకు రిఫరెన్స్ గ్రంథాలుగా మారాయి. కేవలం కలాన్ని నమ్ముకోకుండా గళంతో చైతన్యవంతమైన ఉపన్యాసాలతో ఆయన విప్లవ భావజాలానికి అండగా నిలిచారు. బూటకపు ఎన్కౌంటర్లను నిరసించి అనేకసార్లు జైలు కూడా వెళ్లారు. చలసాని ప్రసాద్ మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు, విప్లవ సాహితీవేత్తలు, కవులు, రచయితలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) తదితరులు చలసాని పార్థివదేహానికి నివాళులర్పించారు. ప్రసాద్ మరణంతో స్వగ్రామం భట్లపెనుమర్రులో విషాదం అలుముకుంది. భాషా ప్రేమికుడు: అన్నిటికీ మించి తెలుగు భాషా ప్రేమికుడాయన. వయసుతో పాటే తెలుగు భాషపై పిచ్చీ పెరుగుతోందనే వారు. చలసాని తన ఇంట్లో నిక్షిప్తం చేసిన 35 వేలకు పైగా పుస్తకాలను అత్యంత ఖరీదుకు కొనడానికి ఓ ప్రముఖుడు, అమెరికా సంస్థలు ముందుకొచ్చాయి. అయినా పుస్తకాలు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఆయన అందుకు సమ్మతించలేదు. భావి తరాల వారికి పనికొచ్చేలా ఆ పుస్తకాలను కంప్యూటరీకరించే యజ్ఞాన్ని కొన్నాళ్లుగా సాగిస్తున్నారు. చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. ప్రముఖుల సంతాపం సాక్షి,హైదరాబాద్: విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ‘సాహితీ స్రవంతి’ అధ్యక్షుడు తెలకపల్లి రవి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తదితరులు సంతాపం ప్రకటించారు. -
వినువీధికి విప్లవ తార
కడదాకా నిరాడంబర జీవితం బాధిత కుటుంబాలకు బాసట కన్నుమూసిన కమ్యూ‘నిస్టాగరిష్టుడు’ చలసాని ప్రసాద్ నేడు ఎంఎంసీకి భౌతికకాయం సమర్పణ నిత్యనూతన యవ్వనుడు నిదురించాడు. అలసట మాటే తెలియని చైతన్య సమన్వితుడు ఇక సెలవని చిరునవ్వుతో నిష్ర్కమించాడు. కళ్లు తెరిచింది మొదలు కమ్యూనిస్టు ఉద్యమాన్నే తిలకించి, వామపక్ష భావజాలాన్ని మనసారా విశ్వసించి, సకలలోక కల్యాణమే సమ్మతమని, అదే తన మతమని మనసావాచా నమ్మిన కమ్యూనిస్టాగరిష్టుడు... చలసాని ప్రసాద్ శనివారం కన్నుమూశారు. నవ్య సాహిత్యసేవకు నిబద్ధుడై, మహామహుల అమూల్య అక్షర రత్నాలను సంకలనాల మాలగా వెలువరించి తెలుగు తల్లిని అలంకరించిన ఆ అవిశ్రాంత శ్రామికుడు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటూనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విప్లవ యోథులు ఎక్కడ నేలకొరిగినా, అడవిబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాననే ఆ సమరోత్సాహవంతుడు పడమటి కొండల దిశగా సాగిపోయాడు. సాహితీరథాన్ని విప్లవ మార్గం పట్టించి, విరసం అవతరణలో కీలక పాత్ర ధరించి, సముద్రమంత ఉత్సాహానికి ప్రతిరూపమన్న ఖ్యాతి గడించిన ఆ పుస్తకాల ఆస్తిపరుడు విశాఖకు తుది వీడ్కోలు పలికా డు. ఎనిమిది పదుల చలసాని చివరికంటా హేతువాదానికే కట్టుబడడంతో ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు సమర్పించనున్నారు. విప్లవ శిఖరం వినువీధికి ఎగసింది. ఏడున్నర దశాబ్దాలకు పైగా అలుపెరగని ఉద్యమ నేతకు శాశ్వత విరామం దొరికింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా రాజీపడకుండా ఉద్యమించారు చలసాని ప్రసాద్. తన ఎనిమిది పదుల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. చిన్నప్పుడే నీతిచంద్రికను బట్టీపట్టిన ఆయన చివరిదాకా నీతి, నిరాడంబరతకే కట్టుబడ్డారు. ఉద్యమ పథంలో తుపాకీలకు, పోలీసులకు, ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఉద్యమించారు. ముదిమి మీద పడుతున్నా లెక్కచేయకుండా నిజనిర్ధారణ కమిటీలతో అడవుల్లోకి వెళ్లి ఎన్కౌంటర్ ఘటనలపై బాహ్య ప్రపంచానికి తెలిపేవారు. విప్లవ ఉద్యమంలో అరెస్టయి జైళ్ల పాలయిన వారికి అండగా ఉంటూ వారు బెయిల్‌పై విడుదలయ్యేందుకు పాటుపడేవారు. బాధిత కుటుంబాలకు బాసట గా నిలిచేవారు. సామాజిక స్పృహతో రచనలు, సాహిత్య వ్యాసాలు రచించారు. అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. అన్యాయాలు, అక్రమాలపై జాతిని మేల్కొలిపే లా ఉపన్యాసాలిచ్చారు. మనుషులతో పాటు పుస్తకాలను అమితంగా ప్రేమించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రికి ప్రసాద్ అంటే పంచప్రాణాలు! కాళోజీ, కొడవటిగంటి, కారా మాస్టారు, అబ్బూరి, గోపీచంద్ వంటి ప్రముఖ సాహితీవేత్తలకు ఆప్తునిగా మెలిగారు. చలం, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, కుటుం బరావు, తాపీ ధర్మారావు రచనలు, ఆధునిక ప్రాచీన సాహిత్యమన్నా ఎంతో ఇష్టపడేవారు. కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమంలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. విప్లవయోధుల సరసన కలం యోధునిగా... ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండేది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోకుండా విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలిచారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే అయి ఉండేది. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. బూటకపు ఎన్కౌంటర్ల పట్ల నిరసన గళం వినిపించేవారు. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్లారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా అనంతమైన భారాన్ని మోసారు. అందరాని లోకాలకు వెళ్లిపోయారు. హాస్యప్రియుడు కూడా: చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. తనకు అనుభవంలోకి వచ్చిన జోక్స్‌ను చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విం చేవారు. ఇతరుల జోక్‌లనూ ఆస్వాదించేవారు. సినిమాల పట్ల ఒకింత ఆసక్తి చూపిన ఆయన సహాయ దర్శకునిగా కొన్నాళ్లు పనిచేశారు. ఇద్దరు కుమార్తెలు : చలసానికి నవత, మమత అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో మమత ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మరణించారు. నగరంలోని సీతమ్మధార హెచ్‌బీ కాలనీలోని స్వగృహంలోనే నిరాడంబర జీవితాన్ని గడిపారు. చలసాని. ఎక్కడో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు నుంచి వచ్చిన ప్రసాద్‌కు విశాఖ అన్నా, శ్రీశ్రీ, రావిశాస్త్రిలన్నా ఎంతో ఇష్టం. అందుకే విశాఖలో స్థిరపడ్డారు. ఇక్కడే కన్నుమూశారు. -
కేజీహెచ్‌లో టీబీ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు
ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ వెల్లడి విశాఖ మెడికల్ : క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించడంలో కీలకపాత్ర వహించే డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ కేంద్రాన్ని కేజీహెచ్‌లో నెలకొల్పినట్టు ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ తెలిపారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వసుంధర సమన్వకర్తగా, ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ దేవీమాధవీ, కేజీహెచ్ పిల్లల విభాగధిపతి పద్మలత, మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.లక్ష్మి, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయబాబు, కేజీహెచ్ డీఎంసీ మెడికల్ ఆఫీసర్ బాలసుందరం సభ్యులుగా ఉన్న జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమ(ఆర్ఎన్టీసీపీ) కోర్ కమిటీ సమావేశం శుక్రవారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయను ప్రభుత్వం నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించినందున ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయినా ఈ వ్యాధికి చికిత్స అందించి, సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. జనాభాలో రెండు శాతం మందికే టీ బీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి మరొకరికి సోకడం వల్ల 48 శాతం మందికి వ్యాపిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి హెచ్ఐవీ రోగుల్లో పది రెట్లు తొందరగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు. లక్ష మందిలో 203 మందికి టీబీ సోకుతుండగా వీటిలో 140 కేసులు మాత్రమే గుర్తించగలుగుతున్నామన్నారు. దేశంలో 5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్‌ను, లక్ష మందికి ఒక డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్ (డీఎంసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 63 డీఎంసీ కేంద్రాలున్నాయని, ఆంధ్రా వైద్యకళాశాల, కేజీహెచ్ పరిధిలో ఒక డీఎంసీ సెంటర్ పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రంలో అధునాతన ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. -
కొనసాగుతున్న జూడాల సమ్మె
సీఎంకు పోస్టుకార్డు ఉద్యమం విశాఖ మెడికల్:తో పాటు ఏడు అనుబం ధ ఆస్పత్రులను, ఓపీ, వార్డు వైద్య సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించి కేజీహెచ్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107ను రద్దు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సామూహికంగా పోస్టుకార్డులు పంపారు. 2012లో గాంధీ ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సమస్యలు పరిష్కరించాలని మాట్లాడిన విషయాన్ని పోస్టుకార్డు ద్వారా వారు గుర్తు చేశారు. శనివారం కేజీహెచ్ ఆంధ్ర వైద్య కళాశాలలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూడా నేతలను ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు పిలిపించి రాష్ట్ర వైద్య విద్య(డీఎంఈ)నుంచి వచ్చిన వర్తమానాన్ని జూడాలకు తెలిపారు. ఉమ్మడి హైకోర్టు తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు కూడా వర్తిస్తుందని, సోమవారం లోగా విధులకు హాజరు కాని జూనియర్ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో జూనియర్ వైద్యుల సంఘం నేతలు డాక్టర్ నాగచైతన్య, డాక్టర్ షాన్వాజ్ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విద్యార్థులకు హైకోర్టు తీర్పు ప్రతులను రాష్ట్ర కమిటీ నేతలు పరిశీలిస్తున్నారని, ఆ తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు ఏ మేరకు వర్తిస్తుందో లేదో.. న్యాయ సలహా తీసుకొని భవిష్యత్ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. హైకోర్టు తీర్పులో స్పష్టత లేదని, దీనిపై రాష్ట్ర నేతలు న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. సాధారణ వైద్యసేవలకు అంతరాయం జూనియర్ డాక్టర్ల సమ్మెలో పెద్ద ఎత్తున పీజీలు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నందున శుక్రవారం కూడా సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. అత్యవసర వైద్య సేవలకు ఒకపక్క హాజరవుతున్న జూనియర్ డాక్టర్లు వార్డు వైద్య సేవలను బహిష్కరించారు. ఫలితంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పెద్ద ఎత్తున డిశ్చార్జ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త రోగులను తక్కువ సంఖ్యలో చేర్చుకుంటున్నారు. అత్యవసర కేసులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. వైద్య కళాశాల పరిధిలోని అన్ని అనుబంధ ఆసుపత్రుల్లో సర్వీస్ పీజీల సేవలతోనే నడిపిస్తున్నారు. మత్తు, ప్రసూతి పీజీలు పెద్ద ఎత్తున సమ్మెలో ఉన్నందున శస్త్ర చికిత్సలపై తీవ్ర ప్రభావం కనిపించింది. చాలా శస్త్ర చికిత్సలను వాయిదా వేశారు. రోజూ జరిగే శస్త్రచికిత్సల్లో సగం మేరకు మాత్రమే జరిగాయి. -
కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి
విశాఖపట్నం, మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం కేజీహెచ్, ఆంధ్ర వైద్యకళాశాలను సందర్శించారు. ఆస్పత్రిలోని ప్రవేశిస్తుండగా ప్రధాన ద్వారం వద్ద ధర్నాచేస్తున్న ట్రామాకేర్ సిబ్బంది మంత్రికారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్డియాలజీ ఐసీయూను సందర్శించి సేవలను తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స విభాగంతో పాటు ప్రసూతి వైద్య విభాగాలను సందర్శించారు. అక్కడ ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్య కళాశాలకు చేరుకొని అక్క డ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు, జిల్లా నోడల్ వైద్యాధికారి ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ ముద్దాడ రవి చంద్రలతో సమావేశమయ్యారు. 50 మెడికల్ సీట్లు పెరిగే నేపథ్యంలో ఎంసీ ఐ అడిగిన సదుపాయాలను కల్పించే విషయంలో చేపట్టవలసిన చర్యల గు రించి చర్చించారు. దీర్ఘకాలిక సెలవుపెట్టి బయట ఆస్పత్రులకు వెళ్తున్న వైద్యులపై కఠిన చర్యలు చేపడతామ ని, వారి వివరాలు వెంటనే అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పదోన్నతులకు నోచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు డీపీసీని నిర్వహిం చాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ద్వా రా వినతిపత్రం అందజేయగా మంత్రి స్పంధిస్తూ పదోన్నతులు ఇస్తే బయటికి వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు. తాము సిద్దంగా ఉన్నామని అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్పారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ మదుసూదనబాబు, ఆర్‌ఎంఓలు శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు. మానవీయకోణంలో వైద్యసేవలందించాలి మానవీయ కోణంలో వైద్య సేవలు అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను కోరారు. సోమవారం సాయంత్రం కేజీహెచ్ రేడియాలజీ లెక్చర్ గ్యాలరీలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ విధుల్లో ఉంటూ నిజాయతీతో సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు సేకరించి కేజీహెచ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నామన్నారు. పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ రూ.2 కోట్లు అందించేందుకు ముందుకువచ్చిందన్నారు. మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడుతోపాటు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్.. జీవీఎంసీ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడారు. తొలుత సమీకృత విరోచన వ్యాధి నివారణ పక్షోత్సవాలను మంత్రులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
జిల్లాలో డెంగీ విజృంభణ
17 డెంగీ కేసులు నమోదు ఆంధ్ర వైద్య కళాశాలలో 216 నమూనాల పరిశీలన 17 మందికి వ్యాధి సోకినట్లు నిర్థారణ జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు వెల్లడి మాడుగుల : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. 216 మందికి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ (కేజీహెచ్)లో రక్తపరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని జిల్లా మలేరియా అధికారి కేవీఎస్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం డి.గొటివాడలో పరిశీలనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వరుసగా ఐదు రోజుల తీవ్రంగా జ్వరం వచ్చి... కీళ్లనొప్పులు, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు ఉంటే డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించాలని సూచించారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆంధ్రా మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు లేకుండా చేసుకుంటే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. ఈయన వెంట ఎస్పీహెచ్వో శ్రావణ్‌కుమార్, వైద్యసిబ్బంది పరిశీలనలో పాల్గొన్నారు. -
ఎండీ, ఎంఎస్ సీట్లకు కోత
ఆంధ్ర మెడికల్ కళాశాలకు ఎదురుదెబ్బ హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత పురాతన కళాశాల, వైద్య విద్యలో గొప్ప పేరుప్రతిష్టలున్న ఆంధ్ర మెడికల్ కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వసతుల లేమి కారణంగా ఎండీ పీడియాట్రిక్, ఎంఎస్ ఈఎన్టీ సీట్లను తొలగించారు. ఎండీ పీడియాట్రిక్ 5 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 5 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాలలో ఉన్న వసతులను తనిఖీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఎంసీఐ బృందం విశాఖలోని ఆంధ్రమెడికల్ కళాశాలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో పీడియాట్రిక్ విభాగంలో 120 పడకలు ఉండాల్సి ఉండగా, 60 మాత్రమే ఉన్నాయని, బోధనా ప్రమాణాలు లేవని, ఔట్ పేషెంట్ విభాగం సరిగా లేదని తేల్చారు. అలాగే ఈఎన్టీ విభాగంలోనూ స్పెషాలిటీ క్లినిక్ లేదని, ఓపీ సరిగా లేదని పేర్కొన్నారు. విచిత్రమేమంటే ప్రస్తుతం వైద్య విద్యసంచాలకులుగా ఉన్న డా.శాంతారావు ఇదే కళాశాలలో చదివి, అక్కడే పనిచేసి వచ్చిన వారే. ఆంధ్రా మెడికల్ కళాశాలకు కొత్తగా సీట్లు రాకపోగా ఉన్న సీట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. మరిన్ని కళాశాలలు కూడా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంసీఐ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ, ఓటీలు యథావిధిగా సేవలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్ థియేటర్లు సోమవారం నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి. పేదలు, ఆరోగ్యశ్రీ రోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఓపీ, ఓటీ విధుల బహిష్కరణను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సమైక్యాంధ్ర మెడికల్ జేఏసీ కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్‌సుందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలు కూడా సోమవారం నుం చి కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ రూపా ల్లో రోజూ నిరసన కార్యక్రమాలను ఆస్పత్రుల ఎదుట కొనసాగిస్తామన్నారు. ఈ నెల 21 నుంచి రాష్ట్ర విభజన నిరసిస్తూ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకట నకు నిరసనగా పదిహేను రోజులకు పైగా మెడికల్ జేఏసీ సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్లను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, ఓటీ వైద్యసేవలు స్తంభించాయి. ప్రస్తుతం తమ విధుల బహిష్కరణను విరమించడంతో సోమవారం నుంచి అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులతోపాటు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. కేజీహెచ్‌తోపాటు ఆంధ్రవైద్య కళాశాల పరిధిలోని అనుబంధ ఆస్పత్రులన్నింటిలో ఓపీ, ఓటీ విధులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు కేజీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. రోగులు యథావిధిగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవల కోసం హాజరు కావాలని ఆయన కోరారు. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు సంఘీభావంగా స్తంభించిన వైద్య సేవలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రులలో శనివారం ఓపీల్లో వైద్యసేవలు, సాధారణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు సంఘీభావంగా వైద్యులు కేజీహెచ్‌తోపాటు విక్టోరియా ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, కంటి, ఛాతి, రాణి చంద్రమణిదేవి, వికలాంగుల ఆస్పత్రుల్లో కేవలం అత్యవసర శస్త్ర చికిత్సలు, ప్రసవాలు మాత్రమే జరిగాయి. ఓపీ చీటీలనిచ్చే కౌంటర్లు తెరుచుకోలేదు. ఓపీ విభాగాలకు వైద్యులు రాకపోవడంతో ఆయా గదుల తాళాలు తీయలేదు. శస్త్ర చికిత్సలకు సంబంధించి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లలో అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే జరిగాయి. అత్యవసర రోగులను క్యాజువాల్టీలో చూశారు. ఆపరేషన్ థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఎలక్టివ్ సర్జరీలు ఏమి జరగలేదు. కేజీహెచ్‌లో ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, గైనిక్ లేబర్ రూమ్ మినహా అన్ని ఆపరేషన్ థియేటర్లకు తాళాలు వేసి కనిపించాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యసేవలు అందకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిరాశతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కొంతమంది అత్యవసర వై ద్య విభాగాల ముందు పడిగాపులు కాశారు. వార్డుల్లోనూ వైద్యసేవలకు కొంతమేరకు అంతరాయం కలిగిం ది. యూనిట్‌కు ఒక వైద్యుడు, పీజీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నాలుగో తరగతి ఉద్యోగులు ఎక్కువమంది విధులకు గైర్హాజరై సమైక్యాంధ్ర నిరసన ధర్నాలో పాల్గొన్నారు.