విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి! | king george hospital in visakhapatnam | Sakshi
Sakshi News home page

విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి!

Oct 28 2015 2:09 PM | Updated on May 3 2018 3:17 PM

విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి! - Sakshi

విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి!

విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది.

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు వీలుగా విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ఓఎన్‌జీసీ, సెయిల్, రిలయన్స్, విశాఖ స్టీల్ వంటి సంస్థలు ప్రకటించిన విరాళాల మొత్తం ప్రస్తుతం రూ.60 కోట్లు అయింది.

ఈ డబ్బుతో రాష్ట్రంలో అత్యంత పురాతన భవన సముదాయాలైన ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూలదోసి, కొత్త వాటిని నిర్మించనున్నారు. కింగ్‌జార్జి ఆస్పత్రిని ఏడు అంతస్తుల్లో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. క్రిటికల్ కేర్, రేడియోథెరపీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. 3వ అంతస్తులో 90 పడకలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల విభాగాన్ని, 4వ అంతస్తులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు అనెస్థీషియా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

6వ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి, 7వ అంతస్తులో 300 మంది సామర్థ్యంతో సమావేశ మందిరంతో పాటు నగదు చెల్లించే అతిథుల కోసం ప్రత్యేక గదులు నిర్మించనున్నట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ (మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ)కి చెందిన ఓ అధికారి వివరించారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు వరకూ రేడియేషన్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

భవనంపై హెలిప్యాడ్!
కింగ్‌జార్జి ఏడు అంతస్తుల ఆస్పత్రి భవనంపై హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ పనులకు సంబంధించిన నవంబర్‌లోగా టెండర్లను పూర్తిచేసి, డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభించాలని వైద్య విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకూ రూ.60 కోట్ల విరాళాలను వివిధ సంస్థలు ప్రకటించగా, నిర్మాణాల అంచనా రూ.65 కోట్లని తేల్చారు. దీంతో మరో రూ.5 కోట్ల కోసం మరికొన్ని సంస్థలను కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement