చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక ఆస్పత్రి
విశాఖపట్నం , పెదవాల్తేరు (విశాఖ తూర్పు): విశాఖలో మరో బోధనాస్పత్రి నిర్మాణం కానుంది. ప్రస్తుతం నగరంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ వున్న సంగతి తెలిసిందే. చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఆవరణలో కొత్త కళాశాల నిర్మాణాలకు ఆస్పత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖలోని మానసిక ఆస్పత్రిని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా ప్రకటించడం తెలిసిందే. ఇందుకుగాను కేంద్రం నుంచి రూ.33 కోట్ల వరకు నిధులు రానున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రూ.10 కోట్ల విడుదలకు పరిపాలనా ఆమోదం లభించింది.
ఈ నిధులతో ఆస్పత్రి పక్కనే గల ఖాళీ స్థలంలో భవనాలు నిర్మించనున్నారు. క్లినికల్ సైకాలజీ కళాశాలలో ఏటా 15 సీట్లలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇక్కడ రెండేళ్ల కోర్సు వుంటుంది. అలాగే డిప్లమో ఇన్ సైకియాట్రి నర్సింగ్ ఏడాది కాల వ్యవధి గల కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తారు. క్లినికల్ సైకాలజీ కోర్సులో ప్రవేశాలకుగాను ఎంఏ సైకాలజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఇక డిప్లమోకి జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు అర్హులు. కాగా దేశంలో క్లినికల్ సైకాలజీ కళాశాలలు కర్నాటకలోని బెంగళూరు, బీహార్‌లోని రాంచీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మాత్రమే వున్నాయి. కొత్త కళాశాల అందుబాటులోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు.
కొత్త భవనాలు...
గ్రౌండ్+2 తరహాలో కొత్త భవనాలు నిర్మించాల్సి వుంది. ప్రధాన అస్పత్రి పక్కన ఐదు ఎకరాల స్థలం వుండగా ప్లాన్ అప్రూవల్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దేశంలో 2009లో 10 కేంద్రాలు, తరువాత దఫదఫాలుగా మరో 14 కేంద్రాలు మంజూరు కాగా, ఇందులో విశాఖ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో 300 వరకు పడకలు వున్నాయి. ప్రస్తుతం 248కి పైగా ఇన్‌పేషెంట్లు వున్నారు. ఓపీ విభాగంలో రోజుకు 250 నుంచి 350 మంది వరకు వస్తుంటారు. ఇక్కడ ఆరుగురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక నిర్మాణం
కొత్త భవనాల నిర్మాణా లకు సంబంధించి ప్లాన్ కాపీలను ప్రభుత్వ ఆమో దం కోసం పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే ఏపీఎంహెచ్‌ఐడీసీ టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడుతుంది. సాధ్యమైనంత వరకు వచ్చే విద్యాసంవత్సరానికల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.– డాక్టర్ రాధారాణి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment