Psychology education
-
సై‘కాలేజీ’కి డిమాండ్!
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు అధికమయ్యారు. ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెబుతోందంటే ఏ స్థాయిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయో స్పష్టమ వుతోంది. అయితే, దీనికి తగ్గట్లు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, చికిత్స చేసేందుకు ఆ స్థాయిలో సైకాలజిస్టులు మాత్రం లేరు. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి ఏడుగురు మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. దీంతో వారి కొరత పెరిగింది. అయితే ప్రస్తుతం సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగింది. సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి. డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూని వర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది. బెంగళూరు జైన్ డీమ్డ్ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్ లక్నో, బెనారస్‌తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సిటీలు కూడా క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, కల్చరల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఎడ్యు కేషన్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. ► పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు. ► అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. ► కార్పొరేట్ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ► ముఖ్యంగా కోవిడ్–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి. రకరకాల కారణాలతో.. ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. – సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు -
విశాఖలో సైకియాట్రీ కళాశాల
విశాఖపట్నం , పెదవాల్తేరు (విశాఖ తూర్పు): విశాఖలో మరో బోధనాస్పత్రి నిర్మాణం కానుంది. ప్రస్తుతం నగరంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ వున్న సంగతి తెలిసిందే. చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఆవరణలో కొత్త కళాశాల నిర్మాణాలకు ఆస్పత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖలోని మానసిక ఆస్పత్రిని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా ప్రకటించడం తెలిసిందే. ఇందుకుగాను కేంద్రం నుంచి రూ.33 కోట్ల వరకు నిధులు రానున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రూ.10 కోట్ల విడుదలకు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ నిధులతో ఆస్పత్రి పక్కనే గల ఖాళీ స్థలంలో భవనాలు నిర్మించనున్నారు. క్లినికల్ సైకాలజీ కళాశాలలో ఏటా 15 సీట్లలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇక్కడ రెండేళ్ల కోర్సు వుంటుంది. అలాగే డిప్లమో ఇన్ సైకియాట్రి నర్సింగ్ ఏడాది కాల వ్యవధి గల కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తారు. క్లినికల్ సైకాలజీ కోర్సులో ప్రవేశాలకుగాను ఎంఏ సైకాలజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఇక డిప్లమోకి జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు అర్హులు. కాగా దేశంలో క్లినికల్ సైకాలజీ కళాశాలలు కర్నాటకలోని బెంగళూరు, బీహార్‌లోని రాంచీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మాత్రమే వున్నాయి. కొత్త కళాశాల అందుబాటులోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. కొత్త భవనాలు... గ్రౌండ్+2 తరహాలో కొత్త భవనాలు నిర్మించాల్సి వుంది. ప్రధాన అస్పత్రి పక్కన ఐదు ఎకరాల స్థలం వుండగా ప్లాన్ అప్రూవల్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దేశంలో 2009లో 10 కేంద్రాలు, తరువాత దఫదఫాలుగా మరో 14 కేంద్రాలు మంజూరు కాగా, ఇందులో విశాఖ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో 300 వరకు పడకలు వున్నాయి. ప్రస్తుతం 248కి పైగా ఇన్‌పేషెంట్లు వున్నారు. ఓపీ విభాగంలో రోజుకు 250 నుంచి 350 మంది వరకు వస్తుంటారు. ఇక్కడ ఆరుగురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక నిర్మాణం కొత్త భవనాల నిర్మాణా లకు సంబంధించి ప్లాన్ కాపీలను ప్రభుత్వ ఆమో దం కోసం పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే ఏపీఎంహెచ్‌ఐడీసీ టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడుతుంది. సాధ్యమైనంత వరకు వచ్చే విద్యాసంవత్సరానికల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.– డాక్టర్ రాధారాణి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి -
అతని మనసుకేమైంది..
చిత్తూరు జిల్లా : పదుగురికీ మానసిక సలహాలు ఇవ్వాల్సిన వృత్తి.. మనసు గురించి పూర్తిగా అధ్యయనమే ఆ యువకుడి చదువు.. అతని మనసుకే ఏమైందో తెలియదు.. మానసిక కల్లోలంతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైభవ్ దేవ్ (25) ఆత్మహత్య విషాదాన్ని నింపింది. సహచర విద్యార్థులంతా నిశ్చేష్టులయ్యారు. మరో రాష్ట్రం నుంచి వచ్చి విగతజీవిగా మారడం వారందరినీ కలచివేసింది. వైభవ్ దేవ్ మంగళవారం ఉరేసుకుని చనిపోయాడు. చత్తీస్ఘడ్ రాష్ట్రంలో బిలాస్ పుర్ గ్రామం ఈ యువకుడిది. పీజీ వైద్య విద్యలో సైకాలజీ అంశం తీసుకున్నాడు. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అందరితోనూ బాగానే కలిసిపోయేవాడని సహచరులు చెప్పారు. పెద్దగా సమస్యలున్నట్లు కనిపించలేదన్నారు. హాస్టల్లోనే ఉండేవాడని కళాశాల వర్గాలు తెలిపాయి. తండ్రి రాకేష్దేవ్ చత్తీస్‌ఘడ్‌లో వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. బెంగళూరూలో ఎంబీబీఎస్ చదివాడు. ఎంబీబీఎస్‌లో వెనకబడలేదని చెబుతున్నారు. తాను చదువుతున్న సైకాలజీ సబ్జెక్టుపై కొంత అవగాహన కొరవడి అసంతృప్తి వ్యక్తం చేసేవాడని తెలిసింది. ఇదే కారణమా మరేదైనా కారణమా అనేది పోలీసులు విచారిస్తున్నారు. మృతుని తల్లితండ్రులకు సమాచారం అందజేశామని ఎస్ఐ భాస్కర్ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులే సైకాలజిస్టులుగా...
తిరుపతి కార్పొరేషన్: సైకాలజీ విద్యను అభ్యసించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని సైకాలజిస్టులుగా నియమించాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా చిత్తూరు జిల్లా కన్వీనర్ వీర కిరణ్ డిమాండ్ చేశారు. ఈనెల 4,5 తేదీల్లో విజయవాడలో ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -ఇండియా ఆధ్వర్యంలో సైకాలజిస్టుల జాతీయ మహాసభలు నిర్వహించారు. జిల్లా కన్వీనర్ వీర కిరణ్ మహాసభలో చేసిన డిమాండ్లను సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజల మానసిక ప్రవృత్తులు, చెడు అలవాట్లు-వ్యసనాలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నాయన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థ, విద్యార్థులపై ఒత్తిడి పెంచి ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోందని విమర్శించారు. సైకలాజికల్ కౌన్సిల్ అవసరాన్ని ప్రజలు గుర్తించినా, ప్రభుత్వం గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే సైకాలజిస్టుల జాతీయ మహాసభలను నిర్వహించామన్నారు. సమావేశంలో పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రధానంగా సైకాలజిస్టు కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, సైకాలజి అధ్యాయనాన్ని వృత్తి విద్య కోర్సులుగా గుర్తించాలని ఇందులో పేర్కొన్నారు. సైకాలజిస్టులను డాక్టర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.