చిత్తూరు జిల్లా : పదుగురికీ మానసిక సలహాలు ఇవ్వాల్సిన వృత్తి.. మనసు గురించి పూర్తిగా అధ్యయనమే ఆ యువకుడి చదువు.. అతని మనసుకే ఏమైందో తెలియదు.. మానసిక కల్లోలంతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైభవ్ దేవ్ (25) ఆత్మహత్య విషాదాన్ని నింపింది. సహచర విద్యార్థులంతా నిశ్చేష్టులయ్యారు. మరో రాష్ట్రం నుంచి వచ్చి విగతజీవిగా మారడం వారందరినీ కలచివేసింది. వైభవ్ దేవ్ మంగళవారం ఉరేసుకుని చనిపోయాడు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బిలాస్ పుర్ గ్రామం ఈ యువకుడిది. పీజీ వైద్య విద్యలో సైకాలజీ అంశం తీసుకున్నాడు.
రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అందరితోనూ బాగానే కలిసిపోయేవాడని సహచరులు చెప్పారు. పెద్దగా సమస్యలున్నట్లు కనిపించలేదన్నారు. హాస్టల్లోనే ఉండేవాడని కళాశాల వర్గాలు తెలిపాయి. తండ్రి రాకేష్‌దేవ్ చత్తీస్‌ఘడ్‌లో వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. బెంగళూరూలో ఎంబీబీఎస్ చదివాడు. ఎంబీబీఎస్‌లో వెనకబడలేదని చెబుతున్నారు. తాను చదువుతున్న సైకాలజీ సబ్జెక్టుపై కొంత అవగాహన కొరవడి అసంతృప్తి వ్యక్తం చేసేవాడని తెలిసింది. ఇదే కారణమా మరేదైనా కారణమా అనేది పోలీసులు విచారిస్తున్నారు. మృతుని తల్లితండ్రులకు సమాచారం అందజేశామని ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment