
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: విజయవాడలాగే.. ఏలూరు వరదలు మ్యాన్ మేడ్!