అతివేగం ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది... | wife and husband ends life in road incident | Sakshi
Sakshi News home page

అతివేగం ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది...

Published Mon, Mar 17 2025 7:56 AM | Last Updated on Mon, Mar 17 2025 8:07 AM

wife and husband ends life in road incident

మరో కుటుంబంలో ‘కారు’ చీకటి కమ్ముకుంది. అతివేగం ఇంకో ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది. కొత్తగా రూపుదిద్దుకున్న హైవే రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కడదాకా కలిసుందామని బాసలు చేసుకున్న దంపతులకు ఇదే ఆఖరి ప్రయాణమైంది. కాలం ఎంత కర్కశమైందంటే.. అమ్మానాన్న చనిపోతే ఆ విషయం అదే వాహనంలో ఉన్న బిడ్డకు తెలియరాలేదు.   

సారవకోట, పాతపట్నం: సారవకోట మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం శ్రీరామ్‌నగర్‌కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్‌(56), ఆయన భార్య పెద్దగోపు వాణి(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు, లారీ డ్రైవర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

పాతపట్నం శ్రీరామ్‌నగర్‌కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్‌ ఆయన భార్య వాణి, కుమారుడు కీర్తి విహార్‌ ఒడిశాలోని పర్లాకిమిడి రాజవీధికి చెందిన తులగ హేమలత, ఇంజు చక్రవర్తిలు కలిసి ఆదివారం ఉదయం కారులో శ్రీకాకుళంలో వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరుగు ప్ర యాణంలో సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపానికి వస్తుండగా.. సరిగ్గా మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. 

ఆ దెబ్బకు లారీ ముందు యాక్సిల్‌ విరిగిపోయి ముందు చక్రం డీజిల్‌ ట్యాంకుకు ఢీకొట్టింది. ఆ ధాటికి కారు డ్రైవింగ్‌ చేస్తున్న వెంకటప్రసాద్, వెనుక సీట్లో కూర్చున్న భార్య వాణి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు పక్క సీట్లో కూర్చున్న ఇంజు చక్రవర్తికు, వెనుక సీట్లో కూర్చున్న కీర్తి విహార్‌కు, తులగ హేమలతకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి హైవే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి క్షతగాత్రులను పాతపట్నం సీహెచ్‌కు తరలించారు. అనంతరం శ్రీకాకుళం తీసుకెళ్లారు.  

అతివేగమే కారణమా..? 
⇒ కారు లారీని ఢీకొన్న ధాటికి కారు ముందు భా గం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ అయి పాడైపోయాయి. 

⇒ లారీ ముందు భాగం యాక్సిల్‌ విరిగిపోయి డీజిల్‌ ట్యాంకును సైతం ఢీ కొనడంతో డీజిల్‌ పూర్తిగా కారిపోయింది. 

⇒ ప్రమాదం జరిగిన స్థలంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో లారీ డ్రైవర్, బైక్‌పై అటుగా వస్తున్న పెద్దలంబకు చెందిన శ్రీను, బొంతుకు చెందిన జయరామ్, స్థానికుల సాయంతో కారు డోర్‌ను గునపాలతో పొడిచి తీశారు. 

⇒ సంఘటన స్థలాన్ని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు, సారవకోట ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ పరిశీలించారు. మృతదేహాలను పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు.  

ఆదివారం కాకపోయి ఉంటే.. 
కురిడింగి ప్రాథమిక పాఠశాల ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గు రి చేసింది. పాఠశాల విడిచిపెట్టే సమయం, ప్రమాదం జరిగిన సమయం ఒకటే కావడం గమనార్హం. ఆదివారం ప్రమాదం జరగడంతో పిల్లలు రోడ్డు మీదకు రాలేదని, లేదంటే మరింత ఘోరం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సర్వీస్‌ రోడ్డు లేక పోవడం, హైవే సిబ్బంది పాఠశాల జోన్‌ అని కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  

అయ్యో ఆ కుటుంబం.. 
ప్రమాదంలో చనిపోయిన వెంకటప్రసాద్‌(56) వాణి(45) దంపతులది పర్లాకిమిడిలోని రాజవీధి. వెంకటప్రసాద్‌ అమరావతి ట్రావెల్స్‌ బస్సులకు భాగస్వామి. గత ఎనిమిదేళ్లుగా పాతపట్నంలో నివాసం ఉంటున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విశాల్‌ అమెరికాలో జాబ్‌ చేస్తున్నాడు. రెండో కుమారుడైన కీర్తి విహార్‌ ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను భువనేశ్వర్‌లో బీటెక్‌ చేస్తున్నాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా చాలా సేపటి వరకు తెలియలేదు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement