
ఆటోమొబైల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు గోకార్టింగ్ వేదిక
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వివిధ రౌండ్లలో ఉత్తీర్ణత సాధిస్తేనే ట్రాక్ పై రైడింగ్
గో కార్టింగ్‌తో భవిష్యత్‌లో అపారమైన అవకాశాలు ఉంటాయంటున్న నిపుణులు
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు.
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి.
గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..?
ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు.
అర్హతలు ఉండాల్సిందే..
గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు.
అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్‌కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్‌లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు.
వాహనం తయారీ
» గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది.
»ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి.
»ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది.
అఫిడవిట్ కచ్చితం..
గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే.
గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు
గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది.
ప్రమాదమైనా ఇష్టమే..
గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్.
రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం
మా కళాశాల సీనియర్స్ ఇన్‌స్పిరేషన్‌తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం
Comments
Please login to add a commentAdd a comment