Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది  | Govt stands by kidney sufferers | Sakshi
Sakshi News home page

Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది 

Published Wed, Mar 6 2024 5:20 AM | Last Updated on Wed, Mar 6 2024 5:50 AM

Govt stands by kidney sufferers - Sakshi

ఉద్దానం ప్రాజెక్టుతో గురివిందకు ‘నీరుడు బంద్‌’! 

కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వంపై నిందలా? 

పలాసలో రూ.85 కోట్లతో వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన కేంద్రం 

రూ.700 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్ట్‌ నిర్మాణం  

మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు.. డయాలసిస్‌ కోసం 37 రకాల ఉచిత మందులు 

గురివింద రామోజీ అర్జంటుగా కళ్లద్దాలు మార్పించుకుంటే బావుంటుంది. చూపు మందగించడంతో రాష్ట్రంలో అభివృద్ధిని ఎటూ చూడలేకపోతున్న ఈ రాజగురువు ప్రజల రోగాలతో కూడా ఆడుకోవడం దుర్మార్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి.. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపకపోతే పల్లెత్తు మాట అనని రామోజీ.. ఇప్పుడు కిడ్నీ పరిశోధన కేంద్రం, రీసెర్చ్‌ సెంటర్‌ అందరి కళ్లెదుటే అద్భుత పనితీరు కనబరుస్తున్నా కుళ్లుబోతు రాతలు రాస్తున్నారు.

ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించి, ఉద్దానంకు ఆరోగ్య భరోసా కల్పించడం పట్ల యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది. రామోజీ ఈ హద్దును కూడా దాటేసి చంద్రబాబు కోసం బరితెగించారు. ఈయన గారి పచ్చ రోగానికి త్వరలో ప్రజలే తగిన వైద్యం చేయడం ఖాయం.

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడు. కొన్ని దశాబ్ధాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం అయ్యారు. బాబుకు తొత్తుగా ఉన్న రామోజీరావుకు అప్పట్లో చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ప్రజాశ్రేయస్సు పట్ల కమిట్‌మెంట్‌ ఉన్న సీఎం జగన్‌ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. బాబు చేయలేనిది సీఎం జగన్‌ చేసి చూపించడంతో రామోజీరావుకు కన్నుకుట్టింది.

దశాబ్ధాల సమస్యలను అనతికాలంలోనే పరిష్కరించిన సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగి, టీడీపీ కనుమరుగు అవుతుందని భయం పట్టుకుంది. దీంతో తన ‘ఛీ’నాడులో ‘కిడ్నీ రోగం పిండేస్తోంది’ అంటూ మంగళవారం ఓ కట్టుకథను రామోజీ అల్లాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను సీఎం జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బాబే వాళ్లను ఉద్దరించాడంటూ సన్నాయి నొక్కుడు రాతలు రాసుకొచ్చారు. ఈ రాతలను చూసి ఉద్దానం ప్రాంత వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు పచ్చపత్రికను ఛీదరించుకుంటున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసింది.. మీ బాబు కాదా రామోజీరావ్‌ అని ప్రశ్నిస్తున్నారు.
 
కళ్లెదుటే ప్రాజెక్టులుంటే కబోది రాతలా.. 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగులు ముందుకు వేశారు. పలాసలో రూ. 85 కోట్లతో వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధనా కేంద్రం, మరొకటి రూ. 700 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు.

ఈ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. సుజలధార ప్రాజెక్ట్‌ ద్వారా కిడ్నీ ప్రభావిత  పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేపడుతున్నారు.

6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మించారు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు చేశారు.   

విరివిగా కేంద్రాలు నెలకొల్పి.. 
ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్‌ అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్లలో గతంలో 13 పడకలు ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్లలో గతంలో 10 పడకలు ఉండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్‌ బేస్డ్‌ సర్వీసెస్‌ డయాలసిస్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు.

టీడీపీ హయాంలో డయాలసిస్‌ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూరిన్‌ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నిర్మించాక స్పెషలిస్ట్‌లతో పాటు మొత్తంగా 17 మంది వైద్యులు, స్టాఫ్‌ నర్సులు 60 మంది, డీడీఏ స్టాఫ్‌ 50 మంది, సపోర్టింగ్‌ స్టాఫ్‌ 20 మంది సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆస్పత్రిలో 195 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 127 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మిగతావి భర్తీ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.   

క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు
శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, పలాస తదితర 7 మండలాలు, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో మొత్తం 807 హేబిటేషన్ల పరిధిలో కిడ్నీ రోగులున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా స్క్రీనింగ్‌ క్రమం తప్పకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 4,34,925 మంది జనాభాలో ఇప్పటివరకు 30,612 మందికి స్క్రీనింగ్‌ పూర్తి చేశారు. సీరమ్‌ క్రియాటిన్‌ సికెడి (క్రిటికల్‌ కిడ్నీ డిసీజ్‌) కేసులు సుమారుగా 3 వేల మందిని గుర్తించారు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించిన వైద్యశిబిరాల్లో సుమారు 49,021 మంది ఓపి చూపించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 474 మందిని సికెడి అనుమానితులుగా గుర్తించారు. 2018లో టీడీపీ హయాంలో ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగాలకు అసలైన కారణాల పరిశోధనకు అప్పటి ప్రభుత్వం జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో రూ.5 కోట్ల చెల్లింపునకు ఎంవోయు కుదుర్చుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ హెల్త్‌ మిషన్‌ ద్వారా రూ.2 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులు విడు­దల చేయలేదు. ప్రభుత్వం మారిపోగా...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్‌హెచ్‌ఎం నుంచి నిధులను సదరు జార్జి సంస్థకు పరిశోధనకై నిధులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన నిధులు ఆ సంస్థకు సర్దుబాటు కాలేదు.

కొండూరు బాధితులకు కొండంత అండ 
ఎన్టీఆర్‌ జిల్లా కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు ఈ ప్రభు­త్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఎ.కొండూరు, తిరువూరుల్లో కొత్తగా డయాలసిస్‌ సెంటర్‌లను నెలకొల్పింది. కొండూరు చుట్టుపక్కల తండాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ సమస్యలున్న వారిని గుర్తించింది. కిడ్నీ బాధితులకు రూ.వేల ఖరీదు చేసే మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది.

తిరువూరు, విజయవాడకు డయాలసిస్, ఇతర వైద్య సేవలు అవసరం ఉన్న కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్‌ను ఎ.కొండూరులో అందుబాటులో ఉంచింది. కిడ్నీ కేసులు నమోదు అవుతున్న గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ట్యాంకర్‌ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

పింఛన్‌ పెంచి.. బాసటగా నిలచి
కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో రూ.2500 ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచింది.  . ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తుస్తోంది. 5పైబడి సీరం క్రియేటినైన్‌ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్‌ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 831మందికి రూ.10వేలు చొప్పున, 451 మందికి రూ.5వేలు ఇస్తున్నారు. ఈ రకంగా ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా కిడ్నీ బాధితులకు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తుంటే రామోజీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement