రాయి విసిరాడా.. లేదా? సీఎంకు తగిలిందా.. లేదా?
ఒక సీఎంపైకి రాయి విసరడం తప్పా.. కాదా?
నిస్సిగ్గుగా ఈ విషయాలను వదిలేసి రాయి విసిరిన వాడికి వత్తాసా? హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారన్న పోలీసులు
పూర్తి ఆధారాలతో నిందితుడు సతీశ్ పాత్ర నిర్ధారించారు
ఏ నిందితుడైనా తప్పు వెంటనే ఒప్పుకుంటాడా?
ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా రామోజీ వత్తాసు
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పైకి జనం మధ్య నుంచి రాయి విసరడం.. అది సీఎం కనుబొమ్మపై తగలడం.. కుట్లు పడటం.. కళ్లెదుటే కనిపిస్తున్నా, చంద్రబాబు, గురివింద రామోజీ మాత్రం తప్పును ఒప్పు చేయాలని పడరాని పాట్లు పడుతున్నారు. నిస్సిగ్గుగా దోషులను వెనకేసుకొస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేక దుష్ప్రచారానికి మరోమారు తెర లేపారు. 2018లో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన విషయంలో చంద్రబాబు, రామోజీలు వక్రీకరణే లక్ష్యంగా బరితెగించారు.
సీఎం జగన్‌పైకి రాయి విసిరిన కేసులో నిందితుడు వేముల సతీశ్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు పలుకులు వల్లించి తాను టీడీపీ గూటి చిలుకనని చెప్పకనే చెప్పాడు. ఆ కట్టుకథను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచురించడం ద్వారా ఈ కుట్ర అంతా తమ పర్యవేక్షణలో సాగుతోందని రామోజీరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పక్కా పన్నాగంతో పదునైనా రాయితో దాడికి పాల్పడ్డారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిరూపించారు.
వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా విశ్లేషించారు. కానీ పోలీసులు తనకు తుపాకీ గురిపెట్టి మరీ అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని సతీశ్ చెప్పడం పచ్చ నాటకంలో ఓ భాగం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో, పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. అయినా పచ్చ మీడియా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఇంతగా యత్నిస్తోందంటే.. ఈ హత్యాయత్నం వెనుక కుట్రదారుల పాత్రను మరుగున పరిచేందుకేనని స్పష్టమవుతోంది.
పన్నాగం ప్రకారమే హత్యాయత్నం
సీఎం జగన్‌ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లోకి ప్రవేశించక ముందే సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని ఎంపిక చేసుకుని తన ప్యాంట్ జేబులో వేసుకుని మరీ వివేకానంద స్కూల్ వద్దకు వచ్చాడు. మరి కొంతమందితో కలసి అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్నారు.
ఆ వెంటనే సతీష్ ఆ రాయిని బలంగా సీఎం వైఎస్ జగన్‌పైకి గురిచూసి విసిరారు. సీఎం తలలో సున్నిత భాగంపై దాడి చేయడం ద్వారా ఆయన్ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని అమలు చేసేందుకే సతీష్ ఆ దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ రాయి సీఎం జగన్ తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది.
సాంకేతిక ఆధారాలతో నిర్ధారణ
ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2ల పాత్రను నిర్ధారించాయి.
అనంతరం పోలీసులు ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలకు ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయమే..
పదునైన కాంక్రీట్ రాయితో సీఎం జగన్ కణతపై దాడి చేయాలన్నదే నిందితుడు సతీశ్ లక్ష్యమన్నది స్పష్టమైంది. పదునైన రాయి కణతపై తగిలినా తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాపాయం సంభవించేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్స్ (నిమ్‌హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా డాక్టర్ కేవీఆర్ శాస్త్రితోపాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ఆ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
కణత భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. అది తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. తద్వారా కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసేది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయితో దాడి చేశారు. ఆ కాంక్రీట్ రాయి తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తు అది ఎడమ కనుబొమ్మపై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది.
కుట్రదారుల పాత్ర కప్పిపుచ్చేందుకే..
సీఎం జగన్‌పై హత్యయత్నం కేసులో తెరవెనుక కుట్రదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెర వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకోసం మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేషించాల్సి ఉందన్నారు. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.
దాంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవడంతో చంద్రబాబు హడలిపోతున్నారు. అందుకే పోలీసులపైనే తిరిగి అసత్య ఆరోపణలు చేసే కుట్రకు తెరతీశారు. తద్వారా పోలీసులు ఆత్మరక్షణలో పడి ఈ కేసులో కుట్రదారుల పాత్రపై దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయేలా చేయాలన్నది వారిద్దరి లక్ష్యం. అందుకే పోలీసులు తన తలకు తుపాకి గురిపెట్టి అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని, లేకపోతే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని నిందితుడు వేముల సతీశ్‌తో చెప్పించారు.
తాము చెప్పినట్టు చెబితే రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పారన్నాడు. సతీష్.. తాము చెప్పినట్టు చెప్పడంతో రామోజీరావు తన పత్రికలో ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అసలు ప్రధాన నిందితుడు తాను హత్యాయత్నం చేశానని ఎప్పుడైనా అంగీకరిస్తాడా..!? ఏదో అబద్ధం చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించాలనే యత్నిస్తాడు. మరి ఆ మాత్రం తెలియకుండా ఈనాడు రామోజీరావు సతీశ్ చెప్పిన కట్టుకథను అంత ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరం. తద్వారా ఆ కట్టుకథ వెనుక తామే ఉన్నామని చెప్పకనే చెబుతోంది.
న్యాయస్థానంలో ఆ రోజు ఎందుకు చెప్పలేదు?
చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు నిందితుడు సతీశ్ న్యాయమూర్తి వద్ద ఆ విషయాలు ఎందుకు చెప్పలేదని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీసులు ఆ విధంగా బెదిరించి ఉంటే న్యాయమూర్తి ఎదుటే చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఉంది. కానీ ఆ రోజు చెప్పనే లేదు. బెయిల్‌పై విడుదలయ్యాక బయటకు వచ్చి టీడీపీ అనుకూల మీడియా ముందే ఆ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే పోలీసులు నిందితుడు సతీశ్‌ను ఆ విధంగా బెదిరించలేదన్నది సుస్పష్టం. అదంతా టీడీపీ పన్నాగమేనన్నది తేటతెల్లమవుతోంది.
ఈసీ ఆధ్వర్యంలోనే పోలీసుల దర్యాప్తు
టీడీపీ, ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన మరో అంశం... సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఈసీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో పోలీసులతో పాటు మొత్తం అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నారు. ఈసీ వ్యక్తం చేస్తున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సతీశ్ ద్వారా పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేయించడం అంటే ఈసీనే నిలదీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిందితుడు సతీశ్ ఈసీనే నిందించాలిగానీ పోలీసులను కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
2018లోనూ ఇదే దుష్ప్రచార కుట్ర
పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం కేసును కూడా టీడీపీ, పచ్చ మీడియా ఇదే రీతిలో వక్రీకరించేందుకు యత్నించడం గమనార్హం. టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ రెసారెంట్‌లో పనిచేసే జనుపల్లి శ్రీనివాస్ అరచేతిలో పట్టేంత పదునైన కత్తితో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలోకి శ్రీనివాస్‌ను ప్రవేశపెట్టడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమైంది. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజే ఉన్నారు.
దాంతో ఈ హత్యాయత్నం వెనుక తమ కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని భావించిన టీడీపీ వెంటనే ఆ ఉదంతాన్ని వక్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే వైఎస్ జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే ఆయన అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదే అసంబద్ధ వాదనను వినిపించడం విభ్రాంతికరం. కానీ టీడీపీ దుష్ప్రచారం బెడిసికొట్టింది. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే ఆ దాడికి పాల్పడ్డారన్నది తేటతెల్లమైంది. అయినా సరే చంద్రబాబు, రామోజీ తీరు మార్చుకోలేదు. నాడు, నేడు కూడా వక్రీకరణలు, కుట్రలే వారి రాజకీయంగా స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment