రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కీలకమైన రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి రూ.వేల కోట్ల నిధులను విడుదల చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి, పట్టుదలే కారణమన్నది నిర్వివాదాంశం. ఆలస్యంగానైనా కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులే ఇందుకు నిదర్శనం! కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు సాధించలేని విభజన అంశాలను సీఎం జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చిక్కు ముడులను తొలగిస్తూ రాబడుతోంది. అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ సజీవంగా ఉంచుతోంది. సీఎం జగన్ కృషితో రాష్ట్రానికి నిధులు వస్తుంటే ఇప్పుడెందుకు ఇస్తున్నారనే తరహాలో రామోజీ కుళ్లు బుద్ధి చాటుకుంటున్నారు!!
– సాక్షి, అమరావతి
నాడు ఇచ్చిందే పది వేలు..!!
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014–15లో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా పూర్తి స్థాయిలో రాబట్టడంలో నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. కాగ్ అకౌంట్స్ ప్రకారం రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు కాగా ఇక అది ముగిసిన అంశమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నా చంద్రబాబు నోరెత్తలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పట్టు వదలకుండా ప్రధానితోపాటు నీతి ఆయోగ్‌తో దీనిపై పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు గణాంకాలతో కూడిన పత్రాలను అందచేయడంతో విభజన అంశాల సత్వర పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలో రెవెన్యూ లోటు భర్తీని పునఃపరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.10,461 కోట్లను మంజూరు చేసింది. మరి ఈ విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా?
బకాయిలపై బాబు గజగజ..
ఓటుకు కోట్లు కేసు భయంతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పరారై కరకట్టకు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పలు సంస్ధల విభజన గురించి మాట్లాడితే ఒట్టు!! 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ బకాయిల ఊసెత్తేందుకే గజగజలాడారు! సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పలుదఫాలు ఒత్తిడి తెచ్చి బకాయిలు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు జారీ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా బకాయిల కింద రూ.7,230.14 కోట్లను చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినందున ఇవాళ కాకపోతే రేపైనా చెల్లించక తప్పదు!!
జీవనాడికి నిధుల కళ..
పోలవరంపై 2013–14 పాత ధరలను పక్కన పెట్టి తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టుదలగా సీఎం జగన్ చేసిన ప్రయత్నాలతో పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా సమ్మతించింది. నిధులు మంజూరును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారు. పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు అడ్ హాక్‌గా నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ పలు సందర్భాల్లో కోరారు.
ఈ నెల మొదటి వారంలోనే ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం నిర్మాణ వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. మరో 36 గ్రామాల్లో నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ అందిస్తే తొలిదశ పూర్తవుతుందని నివేదించారు. ఈ క్రమంలో పోలవరం తొలిదశ నిర్మాణానికి మొత్తంగా రూ.17,144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,310.15 కోట్ల సొంత నిధులను వెంటనే రీయింబర్స్ చేయాలని అభ్యర్థించారు.
పోర్టులు.. కడప స్టీల్ ప్లాంట్
దుగరాజపట్నం పోర్టు సాధనలో గత సర్కారు వైఫల్యాలు రామోజీ కంటికి కనపడలేదు. ఇప్పుడు దానికి బదులు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ ప్రభుత్వం ఒకపక్క కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరో పక్క సొంతంగా నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రామాయపట్నం తొలి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి బెర్త్ నిర్మాణం జరుగుతుండటం రామోజీకి కనిపించలేదా? కడప స్టీల్ ప్లాంట్ గురించి విభజన చట్టంలోనే ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే కడప స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఇది కేంద్రంపై ఒత్తిడి తేవడం కాదా? ఇక ఢిల్లీలో ఏపీ భవన్‌తో పాటు విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల పంపిణీపై కేంద్రంతో పాటు తెలంగాణపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది.
విశాఖ రైల్వే జోన్..
విశాఖ రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఈ ప్రకటన వెలువడింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోనే. గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రకటన కూడా మన ఎంపీల ఒత్తిడితోనే సాధ్యమైంది. నాడు ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయాన్నే కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని చంద్రబాబు కోరడంతో కేంద్రం అందుకు నిరాకరించింది.
సత్వరమే పెండింగ్ హామీలు పరిష్కరించండి
ఈ నెల తొలి వారంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన పెండింగ్ హామీల గురించి సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సహాం పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను వేగంగా నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకా శాలకు ప్రత్యేక హోదా ఎంతో దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, దీనిపై సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment