అలవోకగా అబద్ధాలు రామోజీకే చెల్లు | Eenadu writings on CM Jagans Independence Day message | Sakshi
Sakshi News home page

అలవోకగా అబద్ధాలు రామోజీకే చెల్లు

Published Thu, Aug 17 2023 3:24 AM | Last Updated on Thu, Aug 17 2023 3:45 PM

Eenadu writings on CM Jagans Independence Day message - Sakshi

ఏది నిజమో.. ఏది అబద్ధమో కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ ఈనాడు రామోజీ మాత్రం వాస్తవాలకు గంతలు కడుతున్నారు. తన ఆత్మీయుడు చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలనే ఆత్రంతో అన్నీ విప్పేయడానికి ఏమాత్రం సందేహించడం లేదు.

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో విజనరీ అయిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తప్పుడు రాతలు రాయడంలో రామోజీ ఆరితేరిపోయారు. ప్రజలేమనుకుంటారనే విషయాన్ని ఎప్పుడో గాలికొదిలేశారు. ప్రతి కథనంలో సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై అసూయ, కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతగా బురద చల్లినా ఇవి ‘వైస్రాయ్‌’ నాటి రోజులు కావని తెలుసుకోండి రామోజీ!            

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంపై అలవోకగా అబద్ధాలంటూ ఈనాడు రామోజీ దుష్ప్రచారం ఆయన దిగజారుడు తనానికి పరాకాష్ట. ఒక పత్రికగా ఈనాడు ఎంతగా దిగజారిపోయిందో చెప్పేందుకు ఇదే కొలమానం. కనీస విలువలకు పాతర వేసి మరీ అనైతిక కథనంతో అక్కసు వెళ్లగక్కారు.

నాలుగేళ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని, అందుకున్న లక్ష్యాలను వివరణాత్మకంగా, నిర్ధారిత గణాంకాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ అంశాలను నిర్మాణాత్మకంగా ఎత్తిచూపే అవకాశం లేక గాలిని పోగుచేసి, చిల్లర మాటలతో, అసూయ, కడుపు మంటలను కలబోసి.. చంద్రబాబు కోసం తప్పదన్నట్లు కథనాన్ని ప్రచురించారని ఇట్టే అర్థం అవుతోంది. 

రామోజీ.. సూటిగా సమాధానం చెప్పండి
ముఖ్యమంత్రి ప్రసంగంలో చెప్పిన అంశాల్లో ఒక్కటైనా తప్పని, అవాస్తవమని చర్చకు రాగలరా? రాష్ట్ర మంత్రివర్గంలో 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారేనని.. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఆయా వర్గాలకు చెందినవారేనన్న దాంట్లో ఒక్క అక్షరమైనా అవాస్తవం ఉందా? ఈ వర్గాలకు ఇలా రాజకీయ అధికారం దక్కడమే మీ ద్వేషానికి కారణమా? వీరంతా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ప్రభుత్వ పాలనా యంత్రాంగంతో మమేకం అవుతుంటే, మునుపెన్నడూ లేని రీతిలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మీకు వచ్చేది కడుపుమంటకాక మరేమిటి రామోజీ?  

అసూయ, ద్వేషం.. 
మేనిఫెస్టోలో ఈ హామీలు ఇచ్చాం. వీటిని నెరవేర్చాం.. అని ఈ మంత్రులే కాదు, ఈ వర్గాలకు చెందిన వారు గడప గడపకూ భరోసాగా వెళ్తుంటే, వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అక్కడికక్కడే సరిదిద్దు­తుంటే మీకు నచ్చడం లేదు. ఇది  వాస్తవం.  అందుకే సీఎం జగన్‌ పట్ల మీకు అసూయ, ద్వేషం.

మైనారిటీ, ఎస్టీలకు చివరి నెల వరకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా నాటి బాబు పాలనలో మీకెందుకు కనిపించలేదు రామోజీ? నాడు సీఎం కుర్చీ మీద మీ బాబు ఉన్నాడనే కదా! బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ద్రోహి అయిన చంద్రబాబును భుజానికెత్తుకుని ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? 14 ఏళ్ల బాబు పాలనలో ఈ వర్గాలకు చేసిందేమిటి?  

వీరందరూ కనిపించడం లేదా?
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ కులానికి చెందిన మోషేన్‌రాజు, మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీకి చెందిన మహిళ జకియా ఖానమ్‌ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలు మేకతోటి సుచరిత, తానేటి వనితలు హోంమంత్రులయ్యారు. విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ లాంటి ఉన్నత శాఖలు ఎస్సీ అయిన ఆదిమూలపు సురేష్‌కు ఇచ్చారు.

ఎస్టీ అయిన రాజన్నదొరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. బీసీ కులానికి చెందిన బూడి ముత్యాలనాయుడుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. బీసీ అయిన విడదల రజనికి కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పగలదు.

రైతుల్లో భరోసాతో బాబు, రామోజీల బెరుకు
మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇచ్చిన హామీకంటే మిన్నగా అమలు చేస్తోంది. విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు తోడుగా నిలుస్తుంటే, ఈ విధానాలతో రైతుల్లో భరోసా నింపితే సహజంగానే చంద్రబాబు, రామోజీరావుకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో పంట నష్టపరిహారం, ఆక్వా జోన్లలో రూ.1.5కే కరెంటు, పాడి రైతుకు పాల వెల్లువ ఇలా ప్రతి కార్యక్రమంలో ప్రగతి వీరికి కంటగింపే.

అందుకే రైతు భరోసా విష­యంలో పసలేని, పనికిమాలిన వాదనను లేవనె­త్తారు. మేనిఫెస్టోలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఏడాదికి రూ.12,500, నాలుగేళ్లపాటు ఇస్తామని. కానీ ఇస్తున్నది రూ.13,500, నాలుగేళ్లు స్థానంలో ఐదేళ్లుపాటు ఇస్తున్నారు. ఇచ్చిన హామీ కన్నా మిన్నగా ఇస్తే తప్పని రామోజీరావు సొంత భాష్యం చెబుతుండటం దుర్మార్గం. కేంద్ర నిధులు కలుపు­కుని ఎలా చెబుతారని రామోజీ వింత ప్రశ్న వేశారు. 

బాబు సొంత జేబు నుంచి ఖర్చు చేశాడా? 
అసలు బడ్జెట్‌ అంటే ఏంటి రామోజీ? నిధులు ఎలా వస్తాయో.. ఎలా ఖర్చు చేస్తారో తెలియదా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు, ఆర్థిక సహాయం, అలాగే రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయాలు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలు.. ఇవన్నీ కలిపి బడ్జెట్‌ అంటారు. ఏ స్కీమైనా అమలు చేసేది ఈ వనరులతోనే. అలాంటప్పుడు వేర్వేరుగా చూడ్డం అన్నది మీ సంకుచిత బుద్ధి కాదా? చంద్రబాబు హయాంలో ఇలా కాకుండా బడ్జెట్లు వేరేలా ఉండేవా? బాబు సొంత జేబు నుంచి ఖర్చు చేశాడా? 

శాశ్వత ఉద్యోగులు కనిపించడం లేదా?
గ్రామాల్లో పరిపాలన నిర్వీర్యమైనట్టుగా మరో విచిత్ర వాదనను రామోజీ లేవనెత్తారు. గ్రామాలను పునరుజ్జీవింపచేసేలా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గతంలో ఎప్పుడైనా, దేశంలో ఎక్కడైనా జరిగాయా? మన గ్రామంలోనే 10 నుంచి 11 మంది శాశ్వత ఉద్యోగులు సేవలందించడం ఎక్కడైనా జరిగిందా? ప్రతి 50 ఇళ్లకు ఇక వలంటీర్‌ చొప్పున వారి గడప వద్దకే సేవలు అందించడం ఎప్పుడైనా చూశారా?

ఇంతగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతుంటే పల్లెలు వెలిగినట్టా? నిర్వీర్యమైనట్టా? ఒక గ్రామ, వార్డు సచివాలయం, ఒక విలేజ్‌ క్లినిక్, నాడు–  నేడు ద్వారా రూపు దిద్దుకున్న పాఠశాల, మెరుగులు దిద్దుకున్న అంగన్‌ వాడీ, రైతు భరోసా కేంద్రం.. ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్రామాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుంటే.. వాటిని నిర్వీర్యంగా చూడ్డం మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం. 


బీసీలు క్రియాశీలకం కావడంతో కంటగింపు 
కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయని రామోజీ అక్కసు వెళ్ల్లగక్కారు. నిజానికి సామాజిక చైతన్యంలో భాగంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్‌ జగన్‌ సర్కారు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా కులాలకు చెందిన 56 మంది ఛైర్మన్లుగా నియమింపబడ్డారు. మరో 672 మంది డైరెక్టర్లు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇంత మంది బీసీలకు పదవులు దక్కడం, వారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో మమేకమై ప్రజా ప్రయోజనాలకు కృషి చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?  వివిధ ప్రభుత్వ పథకాలకు నిధులు ఈ కార్పొరేషన్ల ద్వారా వెళ్లి, ఆయా కులాలకు న్యాయం జరిగితే మీకు బాధ ఏమిటి రామోజీ? ఇంత ప్రక్రియ కనిపిస్తుంటే క్రియాశీలకంగా లేనట్టా? రూ.2.33 లక్షల కోట్ల డీబీటీలో ఈ కులాల పాత్ర లేదా?  

పరిశ్రమలపైనా ఏడుపే..
రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు ఏంటో రామోజీరావు చెప్పాలి. చంద్రబాబు ఊహాజనిత పరిశ్రమలు వెళ్లిపోయాయా? ఆయన పేపర్ల మీద కలలుగన్న పరిశ్రమలు వెళ్లిపోయాయా? 2019 జూన్‌ నుంచి  ఇప్పటి వరకు రాష్ట్రంలో 127 భారీ పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 67,196 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 84,607 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

మరి ఈ గణాంకాలతో విభేదించే ఆధారాలు మీ  దగ్గర ఉన్నాయా రామోజీ? ఈ పరిశ్రమలు రాలేదని ఆధారాలు చూపించగలరా? రూ.18 లక్షల కోట్లు విలువైన పరిశ్రమలు వచ్చేశాయని కాగితాలపై కల్లబొల్లి ఒప్పందాలు చూపించి, పరిశ్రమలు వచ్చేసినట్టుగా చంద్రబాబు చెప్తే అవి నిజాలని మీరు ప్రజలను నమ్మించడానికి విఫలయత్నం చేయడం నిజం కాదా?

పోలవరం పాపం బాబుది కాదా?
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి పాపం ఎవరిది? ఎప్పుడైనా దాని గురించి రాశావా? పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన తొమ్మిదేళ్లలో పోలవరం కోసం నువ్వు ఉద్యమాన్ని నడిపావా? ఒక్క వార్త అయినా ఈ ప్రాజెక్టు కోసం రాశావా?  ఈ ప్రాజెక్టు పనులను నామినేషన్‌ పద్దతిలో మీ వియ్యంకుడికి దోచిపెట్టిన చరిత్ర మీది కాదా? మీ బాబు కమీషన్ల కక్కుర్తి వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, క్లిష్టమైన స్పిల్‌ వే, రేడియల్‌ గేట్లు, ఎగువ కాఫర్‌డ్యామ్‌ మిగిలిపోయిన పనులు, దిగువ కాఫర్‌డ్యామ్‌ పనులు, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్‌.. ఈ పనులన్నీ పూర్తి చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాదా? 

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీరా!
ప్రజాస్వామ్యం, హక్కులను అణిచి వేసింది ఎవరు రామోజీ? అసలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడకు పోయింది? ఒక మహిళా శాసనసభ్యురాలిని నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు శాసనసభకు దూరంచేస్తే ప్రజాస్వామ్యం ఏమైపోయింది? అప్పుడు ఈ ఘోరాలు కనిపించలేదా?

పత్రికా స్వేచ్ఛ నీడలో మీరు ఎన్ని దారుణాలకు పాల్ప­డుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. మొన్న­టికి మొన్న పట్టాభిని కొట్టారంటూ తప్పుడు ఫొటో వేసి ప్రజలను తప్పుదోవ­పట్టించారు. ఎల్లో మీడియా మనుషులు ప్రతిరోజూ రాష్ట్రంలో ఉద్రిక్తతలను, హింసను ప్రేరేపించడానికి చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి వాటిపై ప్రజా ప్రభుత్వం చట్టప్రకారం నడుచుకుంటుంది. నిజాయితీగా విలువలు పాటించే కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉంటున్నారన్నది నూటికి నూరు శాతం నిజం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement