కుక్కలదొడ్డి సమీపంలో ఘోర ప్రమాదం
దైవ దర్శనానికి వచ్చివెళ్తూ దూసుకొచ్చిన మృత్యువు
భార్యాభర్తలిద్దరూ మృతి
అనాథలైన పిల్లలు
మృతులు తెలంగాణలోనిపటాన్ చెరువు వాసులు
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
దైవభక్తి ఎక్కవ
తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్‌షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్‌చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్‌షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్‌షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్‌తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్‌షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్‌కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్ర
ఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.
ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..
వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.
డీఎస్పీ పరిశీలన
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్‌షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment