పాఠశాలకు వెళ్తుండగా స్కూటీని ఢీకొట్టిన కారు
కారు అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది. ఏడాది కిందటి వరకు చిత్తూరులో టీచర్‌గా పనిచేసిన ఆమె ఇంటికి దగ్గరగా ఉండాలని కోరి మరీ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. కానీ అంతలోనే విధి వెక్కిరించి ఆమెను తీసుకెళ్లిపోయింది.
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండేవారే. ఏడాది కిందటే మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని టెక్కలి మండలం సన్యాసిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆమె స్వగ్రామం నుంచి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. తిమ్మాపురం నుంచి కోటబొమ్మాళి వరకు బస్సులో వచ్చి.. అక్కడ ఉంచిన తన స్కూటీపై బడికి వెళ్లేవారు. బుధవారం కూడా కోటబొమ్మాళి నుంచి తన పాఠశాలకు వెళ్లేందుకు గాను టెక్కలి వైపుగా స్కూటీపై బయల్దేరారు.
అదే సందర్భంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఏపీ 39 జేక్యూ5568 నంబర్ గల కారు జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న త్రివేణి బండిని ఢీకొని అప్రోచ్ రోడ్డులోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న టెక్కలి మండల ఎంఈఓలు తులసీరావు, చిన్నారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. త్రివేణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. టీచర్ చనిపోయారని తెలిసి సన్యాసిపేట వాసులు ఘట నా స్థలానికి చేరుకుని రోదించారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
పిల్లలను అంగన్‌వాడీలో ఉంచి..
ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (30) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె ఇషికలను అంగన్‌వాడీ కేంద్రంలో విడిచిపెట్టి ఆమె స్కూల్‌కు బయల్దేరారు. అంతలోనే ఆమె చనిపోయారన్న వార్త తెలియడంతో భర్త సింహాచలంతో పాటు స్థానికులు నిశ్చేషు్టలయ్యారు. సాయంత్రానికి అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న ఆ చిన్న పిల్లలను చూసి కంట తడి పెట్టారు.
వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి..
Comments
Please login to add a commentAdd a comment