సాక్షి, చిత్తూరు అర్బన్: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.46 లక్షలు కాజేసిన చిత్తూరుకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత (29)ను తెలంగాణలోని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గంగనపల్లెకు చెందిన లేట్ నాగభూషణం కుమార్తె అపర్ణ చిత్తూరులోని అనాథ ఆశ్రమంలో పనిచేసేది.
ఆశ్రమం మూతబడటంతో సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడ్డ అపర్ణ, ఫేస్‌బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ డబ్బులు కాజేయడం మొదలుపెట్టింది. ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుంది. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అయితే తన పేరిట రూ.7 కోట్లు బీమా ఉందని.. దీన్ని తీసుకోవాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఫోన్‌లో నమ్మ బలికింది.
ఆ బీమా సొమ్ము కోసం ప్రస్తుతం కొద్దిగా డబ్బు చెల్లించాలని, సాయం చేయాలని ఆ వ్యక్తిని కోరింది. ఆ వ్యక్తి ఈ యువతిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో విడతల వారీగా అపర్ణ ఖాతాకు రూ.46 లక్షలు జమచేశాడు. తీరా పెళ్లికి నిరాకరించి, ఫోన్ ఎత్తక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాచకొండ సైబర్ విభాగం పోలీసులు అపర్ణను అరెస్టు చేసి, ఆమె నుంచి అయిదు సెల్‌ఫోన్లు, ఓ ట్యాబ్‌ను సీజ్ చేశారు.
చదవండి: (ప్రేమ ఎంత కఠినం)
Comments
Please login to add a commentAdd a comment