వినువీధికి విప్లవ తార
కడదాకా నిరాడంబర జీవితం
బాధిత కుటుంబాలకు బాసట
కన్నుమూసిన కమ్యూ‘నిస్టాగరిష్టుడు’ చలసాని ప్రసాద్
నేడు ఎంఎంసీకి భౌతికకాయం సమర్పణ
నిత్యనూతన యవ్వనుడు నిదురించాడు. అలసట మాటే తెలియని చైతన్య సమన్వితుడు ఇక సెలవని చిరునవ్వుతో నిష్ర్కమించాడు. కళ్లు తెరిచింది మొదలు కమ్యూనిస్టు ఉద్యమాన్నే తిలకించి, వామపక్ష భావజాలాన్ని మనసారా విశ్వసించి, సకలలోక కల్యాణమే సమ్మతమని, అదే తన మతమని మనసావాచా నమ్మిన కమ్యూనిస్టాగరిష్టుడు... చలసాని ప్రసాద్ శనివారం కన్నుమూశారు. నవ్య సాహిత్యసేవకు నిబద్ధుడై, మహామహుల అమూల్య అక్షర రత్నాలను సంకలనాల మాలగా వెలువరించి తెలుగు తల్లిని అలంకరించిన ఆ అవిశ్రాంత శ్రామికుడు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటూనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విప్లవ యోథులు ఎక్కడ నేలకొరిగినా, అడవిబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాననే ఆ సమరోత్సాహవంతుడు పడమటి కొండల దిశగా సాగిపోయాడు. సాహితీరథాన్ని విప్లవ మార్గం పట్టించి, విరసం అవతరణలో కీలక పాత్ర ధరించి, సముద్రమంత ఉత్సాహానికి ప్రతిరూపమన్న ఖ్యాతి గడించిన ఆ పుస్తకాల ఆస్తిపరుడు విశాఖకు తుది వీడ్కోలు పలికా డు. ఎనిమిది పదుల చలసాని చివరికంటా హేతువాదానికే కట్టుబడడంతో ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు సమర్పించనున్నారు.
విప్లవ శిఖరం వినువీధికి ఎగసింది. ఏడున్నర దశాబ్దాలకు పైగా అలుపెరగని ఉద్యమ నేతకు శాశ్వత విరామం దొరికింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా రాజీపడకుండా ఉద్యమించారు చలసాని ప్రసాద్. తన ఎనిమిది పదుల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. చిన్నప్పుడే నీతిచంద్రికను బట్టీపట్టిన ఆయన చివరిదాకా నీతి, నిరాడంబరతకే కట్టుబడ్డారు. ఉద్యమ పథంలో తుపాకీలకు, పోలీసులకు, ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఉద్యమించారు. ముదిమి మీద పడుతున్నా లెక్కచేయకుండా నిజనిర్ధారణ కమిటీలతో అడవుల్లోకి వెళ్లి ఎన్‌కౌంటర్ ఘటనలపై బాహ్య ప్రపంచానికి తెలిపేవారు. విప్లవ ఉద్యమంలో అరెస్టయి జైళ్ల పాలయిన వారికి అండగా ఉంటూ వారు బెయిల్‌పై విడుదలయ్యేందుకు పాటుపడేవారు. బాధిత కుటుంబాలకు బాసట గా నిలిచేవారు. సామాజిక స్పృహతో రచనలు, సాహిత్య వ్యాసాలు రచించారు. అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. అన్యాయాలు, అక్రమాలపై జాతిని మేల్కొలిపే లా ఉపన్యాసాలిచ్చారు. మనుషులతో పాటు పుస్తకాలను అమితంగా ప్రేమించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రికి ప్రసాద్ అంటే పంచప్రాణాలు! కాళోజీ, కొడవటిగంటి, కారా మాస్టారు, అబ్బూరి, గోపీచంద్ వంటి ప్రముఖ సాహితీవేత్తలకు ఆప్తునిగా మెలిగారు. చలం, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, కుటుం బరావు, తాపీ ధర్మారావు రచనలు, ఆధునిక ప్రాచీన సాహిత్యమన్నా ఎంతో ఇష్టపడేవారు.
కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమంలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.
విప్లవయోధుల సరసన కలం యోధునిగా...
ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండేది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోకుండా విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలిచారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే అయి ఉండేది. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. బూటకపు ఎన్‌కౌంటర్ల పట్ల నిరసన గళం వినిపించేవారు. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్లారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా అనంతమైన భారాన్ని మోసారు. అందరాని లోకాలకు వెళ్లిపోయారు.
హాస్యప్రియుడు కూడా:
చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. తనకు అనుభవంలోకి వచ్చిన జోక్స్‌ను చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విం చేవారు. ఇతరుల జోక్‌లనూ ఆస్వాదించేవారు. సినిమాల పట్ల ఒకింత ఆసక్తి చూపిన ఆయన సహాయ దర్శకునిగా కొన్నాళ్లు పనిచేశారు.
ఇద్దరు కుమార్తెలు :
చలసానికి నవత, మమత అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో మమత ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మరణించారు. నగరంలోని సీతమ్మధార హెచ్‌బీ కాలనీలోని స్వగృహంలోనే నిరాడంబర జీవితాన్ని గడిపారు. చలసాని. ఎక్కడో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు నుంచి వచ్చిన ప్రసాద్‌కు విశాఖ అన్నా, శ్రీశ్రీ, రావిశాస్త్రిలన్నా ఎంతో ఇష్టం. అందుకే విశాఖలో స్థిరపడ్డారు. ఇక్కడే కన్నుమూశారు.