chalasani prasad
-
'విప్లవోద్యమానికి తొలి గొంతుక చలసాని'
పలాస (శ్రీకాకుళం): విప్లవోద్యమానికి తొలిగొంతుకగా చలసాని ప్రసాద్‌ను విరసం నాయకుడు జి.కల్యాణరావు అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో సోమవారం జరిగిన చలసాని సంస్మరణ సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. బొడ్డపాడులో పుట్టిన విప్లవ పార్టీ శ్రీకాకుళ సాయుధ పోరాటమై దేశమంతా పాకిందని చెప్పారు. నాటి తెలంగాణా పోరాటం నుంచి నేటి మావోయిస్టుల పోరాటం వరకు అన్నింటా చలసానికి భాగస్వామ్యం ఉందని, ఆయన అడుగుజాడల్లో నడవమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖరరావు, పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు పైల చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన సాహితీ దిగ్గజం
విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ అస్తమయం సాక్షి, విశాఖపట్నం/కూచిపూడి(భట్లపెనుమర్రు): తెలుగునాట మరో సాహితీ దిగ్గజం నేలకొరిగింది. ఒళ్లంతా కలిసి ఒక పిడికిలిగా సాగిన సుదీర్ఘ విప్లవ ప్రస్తానం తన కొనసాగింపును వర్తమాన తరాలకు వదిలిపెట్టి వీడ్కోలు తీసుకుంది. విలువలకు, ఆదర్శానికి, నిబద్ధతకు ఉన్నతమైన తార్కాణంగా నిలిచిన వ్యక్తిత్వం ఒక తిరుగులేని స్ఫూర్తిని మిగిల్చి మరి సెలవంటూ దిగంతాలకు ఎగసిపోయింది. ‘ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే’.... అని పాడుతూ ఎర్రజెండా కనిపిస్తే పులకించిపోయే ఆ కళ్లు ప్రజాహిత వెలుగులను ప్రసరింపజేసి ధన్యత నిండిన విశ్రాంతిలోకి జారుకున్నాయి. రచయిత చలసాని ప్రసాద్ (83) మరి లేరు. రాజకీయ ఉద్దేశాలు ఏవైనా, సాహితీ తాత్త్వికతలు వేరైనా తెలుగు రాష్ట్రంలో ప్రతి సాహితీ బృందం గౌరవంగా అభిమానించే, పెద్ద దిక్కుగా భావించే చలసాని ప్రసాద్ శనివారం ఉదయం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. సీతమ్మధార హెచ్‌బీ కాలనీలో స్వగృహంలో గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు. చలసాని చివరి కోరిక మేరకు ఆయన కళ్లను మొహిసిన్ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోజనార్థం భౌతికకాయాన్ని ఆదివారం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు. చలసానికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉద్యమంలో పాల్గొంటూ అజ్ఞాతంలో ఉన్నారు. రెండో కుమార్తె వివాహమై విశాఖపట్నంలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1932 డిసెంబర్ 8న జన్మించిన చలసానిది వామపక్ష కుటుంబం. ఆయన కూడా ఐదో ఏట నుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. చివరి వరకూ దానికే నిబద్ధులై ఉన్నారు. ఆంధ్ర వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఆయన తొలుత మత్స్యశాఖలో ఎల్డీసీ ఉద్యోగిగా చేరి ఆ తర్వాత రైల్వేలో క్లర్క్‌గా పనిచేశారు. కొన్నాళ్లు సినిమాల్లో పనిచేసి దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడిగా వ్యవహరించారు. తర్వాత ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. చలసాని ప్రసాద్ విరసం వ్యవస్థాపకుల్లో ఒకరు. శ్రీశ్రీ, కొ.కు, కాళోజీ, కారా, వరవరరావు, కృష్ణాబాయి వంటి సాహితీమూర్తులతో ఆయనకు గాఢమైన స్నేహం, సహచర్యం ఉంది. ముఖ్యంగా శ్రీశ్రీ రచనలు వెలికి తీయడంలో చలసాని సాగించిన కృషి అసామాన్యం. శ్రీశ్రీ జన్మదినం నిర్థారణ చేయడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. విరసం తరఫున చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం కొత్తతరాలకు రిఫరెన్స్ గ్రంథాలుగా మారాయి. కేవలం కలాన్ని నమ్ముకోకుండా గళంతో చైతన్యవంతమైన ఉపన్యాసాలతో ఆయన విప్లవ భావజాలానికి అండగా నిలిచారు. బూటకపు ఎన్కౌంటర్లను నిరసించి అనేకసార్లు జైలు కూడా వెళ్లారు. చలసాని ప్రసాద్ మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు, విప్లవ సాహితీవేత్తలు, కవులు, రచయితలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) తదితరులు చలసాని పార్థివదేహానికి నివాళులర్పించారు. ప్రసాద్ మరణంతో స్వగ్రామం భట్లపెనుమర్రులో విషాదం అలుముకుంది. భాషా ప్రేమికుడు: అన్నిటికీ మించి తెలుగు భాషా ప్రేమికుడాయన. వయసుతో పాటే తెలుగు భాషపై పిచ్చీ పెరుగుతోందనే వారు. చలసాని తన ఇంట్లో నిక్షిప్తం చేసిన 35 వేలకు పైగా పుస్తకాలను అత్యంత ఖరీదుకు కొనడానికి ఓ ప్రముఖుడు, అమెరికా సంస్థలు ముందుకొచ్చాయి. అయినా పుస్తకాలు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఆయన అందుకు సమ్మతించలేదు. భావి తరాల వారికి పనికొచ్చేలా ఆ పుస్తకాలను కంప్యూటరీకరించే యజ్ఞాన్ని కొన్నాళ్లుగా సాగిస్తున్నారు. చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. ప్రముఖుల సంతాపం సాక్షి,హైదరాబాద్: విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ‘సాహితీ స్రవంతి’ అధ్యక్షుడు తెలకపల్లి రవి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తదితరులు సంతాపం ప్రకటించారు. -
సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు
అస్తమయం తొమ్మిదో తరగతి విద్యార్థిగా, 1947 మార్చి నవయుగలో 'ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్' అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. నిత్యవర్తమానమూ నిరంతర చలనశీలీ చలసాని ప్రసాద్ గురించి గతం అన్నట్టుగా రాయడమంటే విశాఖ సముద్రపు విషాదఘోష వినిపించడం తప్ప మరేమీ కాదు. ఆయనలోని ఎన్నెన్నో కోణాలను ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసిన నాలుగున్నర దశాబ్దాల పరిచయంలో, స్నేహంలో, ప్రేమలో, వాత్సల్యంలో, ఆలోచనాచరణల సాహచర్యంలో ఏ శకలాన్ని తీసి చూపితే ఆయనను అర్థం చేయించగలను? విశాఖ సముద్రంలో ఏ ఒక్క అలను చూపి కడలిని రూపుకట్టించగలను? నలభై ఐదేళ్లుగా నన్నాయన పేరు పెట్టి పిలవడం కూడ దూరమే అనుకుని బాబూ అని పిలిచేవాడు. అంతరాంతర రహస్యాల్నీ, దుఃఖాల్నీ, ఆలోచనల్నీ, ఆనందాల్నీ ఎన్నిటినో పంచుకున్న ఆయనను ప్రసాద్‌గారూ అని పిలిచినా, చివరి రోజుల్లో చాదస్తం వస్తున్నదని విసుక్కున్నా ఆయన నా హృదయంలోని ఒక అవిభాజ్యమైన భాగం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు. బహుశా ఆయన గురించి అలా అనుకోగలిగినవాళ్లు తెలుగు సమాజంలో కొన్ని వేలమంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అజాతశత్రువులూ, అందరికీ కావలసినవాళ్లూ ఉండే అవకాశం లేదు గాని, బహుశా ఆయన అటువంటి అసాధారణ జీవి. లోకమంతా తప్పుడు మనిషని విమర్శించే మనిషిని కూడ ఆయన ‘మంచాడే’ అనగలిగేవాడు. నాకు తెలిసి ఇద్దరే ఇద్దరి పేర్లు వింటేనే అసహ్యించుకునేవాడు తప్ప ఆయన తప్పుపట్టిన మూడో మనిషి పేరు నేను వినలేదు. తనకు ద్రోహం చేసినవాళ్లను కూడ ఆ ద్రోహం ఆనవాలు కూడ తాను చూడలేదన్నంతగా ప్రేమించాడు. కృష్ణా జిల్లా దివి తాలూకా నాదెళ్లవారిపాలెంలో 1932 డిసెంబర్ 8న పుట్టిన చలసాని ప్రసాద్ తన ప్రాంతాన్నీ కులాన్నీ వయసునూ కూడ అధిగమించి వేలాది మందికి స్నేహం పంచాడు. వేలాది మంది ప్రేమను చూరగొన్నాడు. ఒకవైపు తండ్రి చల్లపల్లి జమీందారు దగ్గర పనిచేస్తుండినా, 1930లలోనే కుటుంబంలోకి కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించింది. అందుకే తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు, తన ఐదో ఏట, 1937 ఎన్నికల్లో భూస్వాముల జస్టిస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బలపరచిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార ఊరేగింపులలో పాల్గొనడం తన తొలి జ్ఞాపకం. ఆ తర్వాత దశాబ్దం కృష్ణాతీరంలో మరిన్ని విప్లవ ప్రభంజనాలు వీచాయి. ఆయన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధంలో భాగంగా ఆయన పినతండ్రి జగన్నాథరావు, అన్న వాసుదేవరావు, బావ పాపారావు ముగ్గురినీ 1940 దశకం చివరిలో పోలీసులు కాల్చిచంపారు. అంటే ఆయన సరిగ్గా యవ్వన దశలో ప్రవేశిస్తున్న సమయానికే ఆయన ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో నిర్ణయమైపోయింది. తొమ్మిదో తరగతి విద్యార్థిగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా, 1947 మార్చి సంచిక నవయుగలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్’ అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. ఆ ఉద్యమ జీవితమే ఆయనను సహజంగా సాహిత్యాభిమానంలోకి, సాహిత్యంలోకి నడిపించింది. 1955 ఎన్నికల ప్రచారంలో శ్రీశ్రీని వెన్నంటి ఉన్న సహచరుడిగా ఆయన శ్రీశ్రీకి అత్యంత సన్నిహితుడయ్యారు. శ్రీశ్రీ స్వయంగా ‘నా ఏకైక కైక’ అని సంబోధిస్తూ ప్రసాద్‌కు ఉత్తరాలు రాసేవారంటే, వాళ్లిద్దరి అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఈ ఉద్యమ జీవితం వల్ల నియతమైన చదువు సాగకపోయినా ప్రాచీన, ఆధునిక సాహిత్యమంతా ఆయనకు మేధలో మాత్రమే కాదు, హృదయమంతా నిండింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నోటిమీద పలికే ధారణాశక్తీ వచ్చింది. ఆయన సొంత గ్రంథాలయం బహుశా తెలుగు సమాజంలో వ్యక్తిగత గ్రంథాలయాలలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు. నియతమైన చదువు లేకపోవడం వల్ల కాజీపేట రైల్వేస్టేషన్ క్యాంటీన్లో ఉద్యోగం దగ్గరి నుంచి మిత్రులు తీసిన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ దాకా అనేక ఉద్యోగాలు చేసి చిట్టచివరికి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని 1960ల చివర విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేరి, మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్య, బసవపున్నయ్య వంటి ఎందరితోనో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 1960ల మధ్య కాజీపేటలో ఉన్న రోజులనుంచే ఆయన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ఆలోచనలకు దగ్గరయ్యారు. ఇక విశాఖపట్నం జీవితం, పొరుగున ఉన్న శ్రీకాకుళ విప్లవోద్యమంతో, నక్సల్బరీతో సంబంధాన్ని ఇచ్చింది. శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాలులో, ఆ సవాలుకు ప్రతిస్పందనగా జరిగిన పరిణామాలలో, శ్రీశ్రీని విప్లవ రచయితల సంఘం వైపు తీసుకురావడంలో చలసాని ప్రసాద్ పాత్ర ఇంకా పూర్తిగా చరిత్రకు ఎక్కవలసే ఉంది. ఆయనే చాలాసార్లు 1970 గురించి చెపుతూ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత గడిచిన నలభై ఐదు సంవత్సరాలలో ఆయన ఇంకా ఎక్కువ చరిత్రను రచించారు, చరిత్రను నిర్మించారు. శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం ఇరవై సంపుటాలనూ, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం పద్దెనిమిది సంపుటాలనూ ఒక్కచేతిమీద ప్రచురించడంలోగాని, వక్తగా, కార్యకర్తగా, నాయకుడిగా, సాహిత్య ప్రేమికుడిగా, పుస్తక ప్రేమికుడిగా, స్నేహశీలిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ వేలాది మంది హృదయాలలో తన సుతిమెత్తని హృదయంతో, నిరాడంబర ఆత్మీయతతో విద్యుత్తేజం నింపడంలో గానీ ఆయన మేరునగధీరుడు. మరొక కమ్యూనిస్టు సంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన సహచరి విజయలక్ష్మి ఒక దశాబ్దం కింద మరణించినా పుస్తకాలతో, స్నేహితులతో, విశాఖ సమాజంతో కొనసాగిన ఆయన సాహచర్యం శనివారం ఉదయం ముగిసిపోయింది. ఎన్.వేణుగోపాల్ (వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు). -
వినువీధికి విప్లవ తార
కడదాకా నిరాడంబర జీవితం బాధిత కుటుంబాలకు బాసట కన్నుమూసిన కమ్యూ‘నిస్టాగరిష్టుడు’ చలసాని ప్రసాద్ నేడు ఎంఎంసీకి భౌతికకాయం సమర్పణ నిత్యనూతన యవ్వనుడు నిదురించాడు. అలసట మాటే తెలియని చైతన్య సమన్వితుడు ఇక సెలవని చిరునవ్వుతో నిష్ర్కమించాడు. కళ్లు తెరిచింది మొదలు కమ్యూనిస్టు ఉద్యమాన్నే తిలకించి, వామపక్ష భావజాలాన్ని మనసారా విశ్వసించి, సకలలోక కల్యాణమే సమ్మతమని, అదే తన మతమని మనసావాచా నమ్మిన కమ్యూనిస్టాగరిష్టుడు... చలసాని ప్రసాద్ శనివారం కన్నుమూశారు. నవ్య సాహిత్యసేవకు నిబద్ధుడై, మహామహుల అమూల్య అక్షర రత్నాలను సంకలనాల మాలగా వెలువరించి తెలుగు తల్లిని అలంకరించిన ఆ అవిశ్రాంత శ్రామికుడు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటూనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విప్లవ యోథులు ఎక్కడ నేలకొరిగినా, అడవిబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాననే ఆ సమరోత్సాహవంతుడు పడమటి కొండల దిశగా సాగిపోయాడు. సాహితీరథాన్ని విప్లవ మార్గం పట్టించి, విరసం అవతరణలో కీలక పాత్ర ధరించి, సముద్రమంత ఉత్సాహానికి ప్రతిరూపమన్న ఖ్యాతి గడించిన ఆ పుస్తకాల ఆస్తిపరుడు విశాఖకు తుది వీడ్కోలు పలికా డు. ఎనిమిది పదుల చలసాని చివరికంటా హేతువాదానికే కట్టుబడడంతో ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు సమర్పించనున్నారు. విప్లవ శిఖరం వినువీధికి ఎగసింది. ఏడున్నర దశాబ్దాలకు పైగా అలుపెరగని ఉద్యమ నేతకు శాశ్వత విరామం దొరికింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా రాజీపడకుండా ఉద్యమించారు చలసాని ప్రసాద్. తన ఎనిమిది పదుల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. చిన్నప్పుడే నీతిచంద్రికను బట్టీపట్టిన ఆయన చివరిదాకా నీతి, నిరాడంబరతకే కట్టుబడ్డారు. ఉద్యమ పథంలో తుపాకీలకు, పోలీసులకు, ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఉద్యమించారు. ముదిమి మీద పడుతున్నా లెక్కచేయకుండా నిజనిర్ధారణ కమిటీలతో అడవుల్లోకి వెళ్లి ఎన్కౌంటర్ ఘటనలపై బాహ్య ప్రపంచానికి తెలిపేవారు. విప్లవ ఉద్యమంలో అరెస్టయి జైళ్ల పాలయిన వారికి అండగా ఉంటూ వారు బెయిల్‌పై విడుదలయ్యేందుకు పాటుపడేవారు. బాధిత కుటుంబాలకు బాసట గా నిలిచేవారు. సామాజిక స్పృహతో రచనలు, సాహిత్య వ్యాసాలు రచించారు. అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. అన్యాయాలు, అక్రమాలపై జాతిని మేల్కొలిపే లా ఉపన్యాసాలిచ్చారు. మనుషులతో పాటు పుస్తకాలను అమితంగా ప్రేమించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రికి ప్రసాద్ అంటే పంచప్రాణాలు! కాళోజీ, కొడవటిగంటి, కారా మాస్టారు, అబ్బూరి, గోపీచంద్ వంటి ప్రముఖ సాహితీవేత్తలకు ఆప్తునిగా మెలిగారు. చలం, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, కుటుం బరావు, తాపీ ధర్మారావు రచనలు, ఆధునిక ప్రాచీన సాహిత్యమన్నా ఎంతో ఇష్టపడేవారు. కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమంలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. విప్లవయోధుల సరసన కలం యోధునిగా... ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండేది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోకుండా విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలిచారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే అయి ఉండేది. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. బూటకపు ఎన్కౌంటర్ల పట్ల నిరసన గళం వినిపించేవారు. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్లారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా అనంతమైన భారాన్ని మోసారు. అందరాని లోకాలకు వెళ్లిపోయారు. హాస్యప్రియుడు కూడా: చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. తనకు అనుభవంలోకి వచ్చిన జోక్స్‌ను చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విం చేవారు. ఇతరుల జోక్‌లనూ ఆస్వాదించేవారు. సినిమాల పట్ల ఒకింత ఆసక్తి చూపిన ఆయన సహాయ దర్శకునిగా కొన్నాళ్లు పనిచేశారు. ఇద్దరు కుమార్తెలు : చలసానికి నవత, మమత అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో మమత ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మరణించారు. నగరంలోని సీతమ్మధార హెచ్‌బీ కాలనీలోని స్వగృహంలోనే నిరాడంబర జీవితాన్ని గడిపారు. చలసాని. ఎక్కడో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు నుంచి వచ్చిన ప్రసాద్‌కు విశాఖ అన్నా, శ్రీశ్రీ, రావిశాస్త్రిలన్నా ఎంతో ఇష్టం. అందుకే విశాఖలో స్థిరపడ్డారు. ఇక్కడే కన్నుమూశారు. -
చలసాని మహాప్రస్థానం
చలసాని ప్రసాద్.. ఓ సమున్నత శిఖరం. నిరంతర చైతన్య స్రవంతి. అలుపెరుగని శ్రామికులు. ఆయన జీవించి ఉన్న కాలంలో 'సాక్షి' విశాఖ ఎడిషన్‌లో 'విశాఖ శిఖరాలు' శీర్షికన నిర్వహించిన ఫీచర్లో చలసాని గురించి కూడా సమగ్రంగా వివరించాం. చలసాని ప్రసాద్ శనివారం ఉదయం 11.30 గంటలకు మరణించారు. ఈ సందర్భంగా ఆయన గురించిన కథనాన్ని మరొక్కసారి చూద్దాం.. 'కొంతమంది యువకులు ముందు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అప్పటికి ఆయనకు చలసాని ప్రసాద్ వంటి వాళ్లెవరూ పరిచయం కాలేదనాలేమో. అయి ఉంటే మాత్రం 'కొంతమంది వృద్ధులు నేటి తరపు యువకులు.. అలుపెరుగని శ్రామికులు.. నవలోకపు కార్మికులు' అని ప్రత్యేకించి ప్రకటించేవాడేమో. నిజమే మరి.. ఎనిమిది పదుల వయస్సులో కూడా పరుగులు తీసిన చలసాని నేటి తరపు యువకులెందరికో అసూయ పుట్టించే నిత్య చైతన్యవంతుడు. తాను విశ్వసించే సిద్ధాంతం కోసం అహరహం పనిచేసిన సమసమాజ శ్రామికుడు. తాను ఆశించే రేపటి మరో ప్రపంచం నేడే సాకారం కావాలని, స్వప్న సాక్షాత్కారం కావాలని పరిశ్రమించిన, పరితపించిన నవ్యలోకపు కార్మికుడు. దగమనంతో సాగే ద్విచక్రవాహనాన్ని నడిపిస్తూ, పరిచయస్తుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ మామూలుగా కనిపించే ఆ వ్యక్తిలో ఇంత శక్తి దాగి ఉందంటే తెలియని వారు నమ్మడం కష్టమే. కానీ ఆయన గురించి తెలిసిన వారికి చలసాని ప్రసాద్ చైతన్య స్వరూపం ఆశ్చర్యమనిపించదు. పధ్నాలుగేళ్లు కష్టపడి ఇరవై భాగాలుగా శ్రీశ్రీ సాహితీ సర్వస్వాన్ని ప్రచురించినా, అదే తరగని ఉత్సాహంతో రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల సాహిత్యమంతటినీ సంపుటాలుగా వెలువరించినా అది చలసానికే చెల్లింది. 1970లో విప్లవ రచయతల సంఘాన్ని స్థాపించిన నాటి నుంచి విరసంతో ఆయన అనుబంధం కొనసాగింది. వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో చురుకైన పాత్ర నిర్వహించారు. అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఆశ అనంతం. ఆయన దృష్టి అఖండం. ఆయన చూపు రేపటి ప్రపంచం వైపు. మహాకవి మాదిరిగానే ఆయనకూ రేపటి సూర్యోదయంపై అంతులేని విశ్వాసముంది. శ్రామిక లోకపు కల్యాణం సాధ్యపడే ఆ మరో ప్రపంచం అరుదెంచే రోజు చేరువవుతోందన్న కొండంత భరోసా ఉంది. ఆ వి'శ్వాస'మే ఆయన్నునేటికీ పరుగులు తీయించింది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి మార్క్సిస్టుగా పెరిగి, మావోయిస్టుగా స్థిరపడ్డ చలసాని జీవితం శ్రీశ్రీ సాహిత్యమంత విస్తారమైనది. ఆయన ఆలోచన, కృషి రావిశాస్త్రి రచనల్లోని పాత్రలంత విస్తృతమైనవి. ప్రజా సాహిత్యమన్నా, శ్రామిక విప్లవమన్నా ఆయనకు అంతులేని మమకారం. ఆ ప్రేమాభిమానాల కారణంగానే కష్టజీవులకు అటూఇటూ నిలబడ్డ శ్రీశ్రీ, రావిశాస్త్రి ఆయనకు పంచప్రాణాలయ్యారు. విప్లవపోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేసే సాహితీ సృజన కోసం ఆయన విరసం ఉద్భవించే చారిత్రాత్మక పరిణామంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. 1970లో శ్రీశ్రీ షష్టిపూర్తి సభను ఇందుకు వేదికగా మలచారు. ఆ రెండు మహత్తర సంఘటనలూ శ్రీశ్రీకి, చలసానికి అత్యంత ఇష్టమైన విశాఖలోనే జరగడం విశేషం. అదే ఉత్సాహం విరసం ఏర్పడి నాలుగు దశాబ్దాలయినా చలసాని ఉత్సాహం అప్పటికీ ఇప్పటికీ ఝరీపాత సమానమే. ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండనే ఉంటుంది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోరు. విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలుస్తారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్తారు. ఉద్యమాలలో అగ్రపీఠిన నిలబడతారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా ఇంత భారాన్నీ మోస్తూ అంతర్లీనంగా ప్రవహించే చైతన్య స్రవంతితో నవయువకుడిగా పరుగులు తీశారు. ఆయన వాహనం నేటికీ ఏనాటికీ పంచకల్యాణి. ఆయన అలపూసొలుపూ లేని నవ్యోత్సాహ వాహిని. తెలుగుకు ఢోకా లేదు ‘కొందరు భయపడుతున్నట్టు తెలుగుకేం ఢోకా లేదు. గతంలో సంస్కృతాన్ని, ఇప్పుడు ఇంగ్లీషును ఎదిరించి నిలిచిన భాష తెలుగు. ఏ భాషా పదాన్నయినా తనలో కలుపుకొని ఎదిగే శక్తి తెలుగుకు ఉంది. అందుకే తెలుగు అజరామరం. తెలుగు భవిష్యత్తు ఉజ్వలం’ అని చలసాని చెబుతారు. ఏ మూల చూసినా పుస్తకాలే ఏడెనిమిది మంది డాక్టరేట్లకు ఇవే ఆధారం.. ఎవరైనా ఇల్లు నివసించడానికి కట్టించుకుంటారు. చలసాని మాత్రం పుస్తకాలను కొలువు తీర్చడానికే ఇంటిని కట్టుకున్నారు. మేడమీద ఓ గది వేసినా, ఇంటిని ఇంకాస్త పొడిగించినా అది పుస్తకాల కోసమేనంటారు. అందరిళ్లలో దేవుడి గది, భోజనాల గది వగైరా ఉంటే ఆయన ఇంట్లో శ్రీశ్రీ గది, రావి శాస్త్రి గది, కొకు గది అని ఉంటాయి. ఇంట్లోని ఎనిమిది గదుల్లోనూ పుస్తకాలే ఉంటాయంటే చలసాని అభిమానం ఎటువంటిదో అర్థమవుతుంది. ఆయన పుస్తకాలయంలో ఇరవై వేల పుస్తకాలున్నాయంటే ఆ మమకారం ఏపాటిదో అవగతమవుతుంది. ఆయన దగ్గరి పుస్తకాల ఆధారంగా ఏడెనిమిది మంది పీహెచ్‌డీలు చేశారు. ఎందరో పఠనాభిలాషులు వచ్చి నిత్యం ఏదో సమాచారం సేకరించుకుని పోతూ ఉంటారు. ‘పోలీసులెవరికైనా పార్వతీపురం కుట్రకేసుపై ఏవైనా సందేహాలు తలెత్తితే హోంశాఖ ప్రచురించిన 22 భారీ సంపుటాల కోసం చలసాని ఇంటికి రావాల్సిందే’ అని ఆయన సన్నిహితులు అంటారు. అడ్డపొగ ఇష్టం విశాఖపట్నం అంటే, ఉత్తరాంధ్ర మహిళాలోకమంటే చలసానికి చాలా అభిమానం. ‘ఉత్తరాంధ్ర మహిళలు శ్రమజీవులు. కల్లాకపటం లేనివారు’ అంటారాయన. వారి నిష్కపటం, శ్రమజీవనం, వినయం గొప్ప విషయాలని చెబుతారు. ఇక్కడి గ్రామీణ మహిళలు అడ్డపొగ కాల్చడం నచ్చుతుంది.. అంటారు చలసాని. విశాఖ అంటే శ్రీశ్రీ. విశాఖ అంటే రావిశాస్త్రి. జీవితమంతా విశాఖే. అందుకే ఈ ఊరంటే ప్రత్యేక మమకారం.. అని చెబుతారు. అందరికీ బాబాయ్ ఆమధ్య అమరుడైన మావోయిస్టు నేత ఆజాద్ నుంచి వర్థమాన రచయతల వరకు అందరికీ ఆయన బాబాయ్‌గా చిరపరిచితుడు. ఎవరు బాబాయ్ అని పిలిచినా చలసాని మహాకవికి మాత్రం ఆయన వేరే వరస! చలసానిని శ్రీశ్రీ సరదాగా నా మూడో భార్య అని వ్యవహరించేవారట మరి! ఎన్నో అవతారాలు కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమం లో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. జీవన చిత్రం పుట్టినది: 08-12-1932 మరణం: 25-07-2015 జన్మస్థలం: భట్ల పెనుమర్రు, కృష్ణాజిల్లా తల్లితండ్రులు: బసవయ్య, వెంకట నరసమ్మ భార్య: (దివంగత) విజయలక్ష్మి కుమార్తెలు: నవత ( జర్నలిస్ట్), మమత ( ఏవీఎన్ కాలేజీ లెక్చరర్) చదువు: ఎం.ఎ (పొలిటికల్ సైన్స్) ఏయూ-1957 ఉద్యోగం: మత్స్యశాఖలో ఎల్డీసీ 1957-59 రైల్వేలో క్లర్క్ 1960-62 కలిమి లేములు తదితర సినిమాలకు సహాయ దర్శకుడు దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడు 1963-67 ఏవీఎన్ కళాశాల రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు 1968-92 -
విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత
-
విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత
విశాఖ : ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విరసం నేత చలసాని ప్రసాద్ (83) శనివారం కన్నుమూశారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఇంటికి చేరుకునే లోపు చలసాని ప్రసాద్ తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో చలసాని ప్రసాద్ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాంస్కృతిక సాహిత్య ఉద్యమంలో చలసాని ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో అత్యంత ముఖ్యులలో చలసాని ప్రసాద్ ఒకరు. ఎమర్జెన్సీ హయాంలో ఆయన జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చలసాని ప్రసాద్ అనేక సార్లు జైలుకు వెళ్లారు. మహాకవి శ్రీశ్రీ, ప్రముఖ రచయితలు కొడవటిగంటి, రావిశాస్త్రి, రమణారెడ్డి తదితరులతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అనేక అరుదైన పుస్తకాలకు చలసాని ప్రసాద్ సంకలన కర్తగా వ్యవహారించారు. సినిమా, సాహిత్యం రంగాలపై లోతైన అవగాహాన ఉంది. చలసాని ప్రసాద్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు పలువురు సంతాపం తెలిపారు.