
విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత
విశాఖ : ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విరసం నేత చలసాని ప్రసాద్ (83) శనివారం కన్నుమూశారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఇంటికి చేరుకునే లోపు చలసాని ప్రసాద్ తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో చలసాని ప్రసాద్ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తెలుగు సాంస్కృతిక సాహిత్య ఉద్యమంలో చలసాని ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో అత్యంత ముఖ్యులలో చలసాని ప్రసాద్ ఒకరు. ఎమర్జెన్సీ హయాంలో ఆయన జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చలసాని ప్రసాద్ అనేక సార్లు జైలుకు వెళ్లారు. మహాకవి శ్రీశ్రీ, ప్రముఖ రచయితలు కొడవటిగంటి, రావిశాస్త్రి, రమణారెడ్డి తదితరులతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అనేక అరుదైన పుస్తకాలకు చలసాని ప్రసాద్ సంకలన కర్తగా వ్యవహారించారు. సినిమా, సాహిత్యం రంగాలపై లోతైన అవగాహాన ఉంది. చలసాని ప్రసాద్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు పలువురు సంతాపం తెలిపారు.