Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు | Indias communists until the independenc Manabendra Nath Roy | Sakshi
Sakshi News home page

Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు

Published Mon, Mar 24 2025 10:28 AM | Last Updated on Mon, Mar 24 2025 10:28 AM

Indias communists until the independenc Manabendra Nath Roy

ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసు కోవాలంటే ఎం.ఎన్‌. రాయ్‌ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్థాప కుడు (1917) కావడమేమిటీ? ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనను ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండ నివ్వలేదు. ర్యాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ స్థాప నతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసి ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదానికి మేనిఫెస్టో’ని (న్యూ హ్యూమనిస్ట్‌ మేనిఫెస్టో) రూపొందించి విడుదల చేశారు. తను స్థాపించిన ఇండియన్‌ రినైజాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా దేశాన్నే కదిలించారు. డెహ్రాడూన్‌లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వ హించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్‌ హౌస్‌’గా పేరు పొందింది. ఉత్తర భారత దేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఆయన అనుచరులు, అభిమా నులు అక్కడికి తరలి వెళ్ళారు. మతతత్వ భావనకు వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమ న్నారు రాయ్‌. అందుకే ‘ఎడ్యుకేట్‌ ద ఎడ్యు కేటెడ్‌’ – విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని వ్యాప్తి చేశారు. 

1887 మార్చ్‌ 21న పశ్చిమ బెంగాల్‌లో రాయ్‌ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్‌ భట్టాచార్య. క్యాలిఫోర్నియాలో ఉండగా అక్కడి నిఘా విభాగాల దృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్‌ రాయ్‌గా పేరు మార్చుకున్నారు. 14వ ఏటే అనుశీలన్‌ సమితిలో చేరారు. అది రహస్యంగా పని చేసే ఒక విప్లవ సంఘం. కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్‌ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్‌ గ్రూపులో చేరారు. ‘జతిన్‌ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు’ అని తన గ్రంథం (చైనాలో నా అనుభావాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్‌ సభ్యులు ఎన్నో కార్య క్రమాలు చేస్తుండేవారు. ఆ కాలంలో రాయ్‌ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చు కుని, బ్రిటిష్‌ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది ఆయన ఉద్దేశం.

రహస్యంగా అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్‌ ట్రెంట్‌తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. తప్పనిసరై అక్కడి నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అందుకే ఆయన ‘జ్ఞాపకాల పుస్తకం’లో – మెక్సికో తనకు కొత్త జన్మ నిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించగలిగారు.మానవేంద్ర నాథ్‌ రాయ్‌ తర్వాత కాలంలో వ్లాదిమిర్‌ లెనిన్, జోసెఫ్‌ స్టాలిన్‌ను కలిసి కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌లో భాగస్వాము లయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అవలంబించేట్లు ఒప్పించ డానికి రాయ్‌ 1927లో చైనా వెళ్ళారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రాయ్‌ ఒప్పించ లేక పోయారని కాబోలు, 1929లో ఆయ నను కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ నుండి బహి ష్కరించారు. 1930లో రాయ్‌ భారత్‌కు తిరిగి రాగానే, ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్‌ బోల్షివిక్‌ కుట్ర కేసుతో అరెస్ట్‌ చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 

జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్‌ నాలుగేళ్ళ పాటు ఇండి యన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు. 1946లో డెహ్రాడూన్‌లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది.  రాయ్‌ జీవితం నుండి, ఆయన ప్రతిపాదించిన ర్యాడికల్‌ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్‌లు, కమ్యూనిస్ట్‌లు,కాంగ్రెస్‌ వాదులు, పార్టీరహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. 1954 జనవరి 25న తన 67వ ఏట గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ‘ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్య్ర సాధన’ అన్నది రాయ్‌ ఆశయాలలో ఒకటి. 


-వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత
డా. దేవరాజు మహారాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement