మహారాణిపేట: వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1923 జూలై 19న మెడికల్ కళాశాల అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగ్‌పటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు.1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాలగా మారింది. ఆ సమయంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న సీఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆ తర్వాత పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజీగానే ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలల్లో ఏఎంసీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏఎంసీ కావడం విశేషం. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. ఇంకా ఎంతో మంది దేశ,విదేశాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
రూ.50 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలు వేసుకుని 1.6 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక నూతన భవనాన్ని ని ర్మిస్తున్నారు. వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధనా ఆస్పత్రులు వచ్చాయి. తొలి కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)గా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ నేడు 1,100 పడకల స్ధాయికి ఎదిగింది. ఇంకా అనుబంధంగా అనేక ఆస్పత్రులు ఉన్నాయి.
27 నుంచి శతాబ్ది ఉత్సవాలు
ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. 27న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, 28న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎం.ఎల్.మాండవీయ,రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్ తదితరులు పాల్గొంటారు. 29న తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంలో భాగంగా రాత్రి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ విద్యార్థినే
ఆంధ్రా మెడికల్ కాలేజీలో 1978లో ఎంబీబీఎస్ చదివాను. ఇప్పుడు ఇదే కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. చదువుకున్న కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులను సమన్వయం చేసుకుంటూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బుచ్చి రాజు, ప్రిన్సిపాల్, ఏఎంసీ
చాలా ఆనందంగా ఉంది
నేను ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఇక్కడ వైద్య విద్య పూర్తిచేసిన అనేక మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వైద్య విద్యను ఎంతో ఇష్టంగా చదివాను. ఇప్పటికీ వైద్యునిగా పనిచేయడం తన తల్లిందండ్రుల చేసిన పుణ్యఫలంగా భావిస్తాను. –డాక్టర్ ఎన్.ఉమా సుందరి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ
తెలుగు రాష్ట్రాల్లో ఏఎంసీ నంబర్ వన్
నేను చదువుకున్న రోజుల్లో కాలేజీ, ఆస్పత్రి చాలా చిన్నవిగా ఉండేవి, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైద్య కాలేజీ నంబర్ వన్‌గా ఉంది. అయిదు సంవత్సరాల పాటు ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా పనిచేశా. – డాక్టర్ పి.వి.సుధాకర్, పూర్వ విద్యార్థి, మాజీ ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment