కొనసాగుతున్న జూడాల సమ్మె
సీఎంకు పోస్టుకార్డు ఉద్యమం
విశాఖ మెడికల్:తో పాటు ఏడు అనుబం ధ ఆస్పత్రులను, ఓపీ, వార్డు వైద్య సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించి కేజీహెచ్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107ను రద్దు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సామూహికంగా పోస్టుకార్డులు పంపారు. 2012లో గాంధీ ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సమస్యలు పరిష్కరించాలని మాట్లాడిన విషయాన్ని పోస్టుకార్డు ద్వారా వారు గుర్తు చేశారు. శనివారం కేజీహెచ్ ఆంధ్ర వైద్య కళాశాలలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూడా నేతలను ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు పిలిపించి రాష్ట్ర వైద్య విద్య(డీఎంఈ)నుంచి వచ్చిన వర్తమానాన్ని జూడాలకు తెలిపారు. ఉమ్మడి హైకోర్టు తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు కూడా వర్తిస్తుందని, సోమవారం లోగా విధులకు హాజరు కాని జూనియర్ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో జూనియర్ వైద్యుల సంఘం నేతలు డాక్టర్ నాగచైతన్య, డాక్టర్ షాన్వాజ్ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విద్యార్థులకు హైకోర్టు తీర్పు ప్రతులను రాష్ట్ర కమిటీ నేతలు పరిశీలిస్తున్నారని, ఆ తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు ఏ మేరకు వర్తిస్తుందో లేదో.. న్యాయ సలహా తీసుకొని భవిష్యత్ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. హైకోర్టు తీర్పులో స్పష్టత లేదని, దీనిపై రాష్ట్ర నేతలు న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు.
సాధారణ వైద్యసేవలకు అంతరాయం
జూనియర్ డాక్టర్ల సమ్మెలో పెద్ద ఎత్తున పీజీలు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నందున శుక్రవారం కూడా సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. అత్యవసర వైద్య సేవలకు ఒకపక్క హాజరవుతున్న జూనియర్ డాక్టర్లు వార్డు వైద్య సేవలను బహిష్కరించారు. ఫలితంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పెద్ద ఎత్తున డిశ్చార్‌జ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త రోగులను తక్కువ సంఖ్యలో చేర్చుకుంటున్నారు. అత్యవసర కేసులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. వైద్య కళాశాల పరిధిలోని అన్ని అనుబంధ ఆసుపత్రుల్లో సర్వీస్ పీజీల సేవలతోనే నడిపిస్తున్నారు. మత్తు, ప్రసూతి పీజీలు పెద్ద ఎత్తున సమ్మెలో ఉన్నందున శస్త్ర చికిత్సలపై తీవ్ర ప్రభావం కనిపించింది. చాలా శస్త్ర చికిత్సలను వాయిదా వేశారు. రోజూ జరిగే శస్త్రచికిత్సల్లో సగం మేరకు మాత్రమే జరిగాయి.