Chiefminister Chandrababu Naidu
-
‘అసమర్థ పాలన కప్పిపుచ్చుకునేందుకే గిమ్మిక్కులు
శ్రీకాకుళం సిటీ: ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి పేర్కొన్నారు. మంగళవా రం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశా రు. నాలుగేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలి పారు. అయినా ఏ ఒక్కరోజూ ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అధికారులపై దౌర్జన్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ నేరపూరిత నిర్లక్ష్యాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎండగడుతున్నారని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు అఫిడవిట్లు ఆధారంగా ఏడీఆర్(జాతీయ ఎన్నికల పరి శీలన స్వచ్ఛంద సంస్థ) నివేదిక ఇచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 45 మంది ఎమ్మెల్యేల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ వారిని రక్షించుకునేందుకు సీఎం దొడ్డిదారిన జీఓలు విడుదల చేశారని ఆరోపించా రు. ఈ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విదంగా చంద్రబా బుకు బుద్ధి చెబుతారని తెలిపారు. -
దళితుల మనోభావాలకు సమాధి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ గ్రామంలోని దళితులకు తీరని మనోవేదనను మిగుల్చుతోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న రోడ్డును అధికార పార్టీకి చెందిన నేతకు పట్టాగా రాసి ఇచ్చారు. సీఎం రాక కోసం రాత్రికి రాత్రే శ్మశానాన్ని ఆక్రమించి, శవాలను సైతం పెకలించి తారురోడ్డు వేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న దళితులు ఈ నెల 4న సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో పట్టణ నిరుపేదల హౌసింగ్ పథకం కింద దాదాపు 1,724 ప్లాట్లను జీ+3 పద్ధతిలో నిర్మించారు. వీటిని ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సర్వే నెం.363లోనే రోడ్డును చూపించారు. ఈ ప్లాట్లకే కాకుండా దళితుల పొలాలకు, పైన ఉన్న దాదాపు 50 ఎకరాల్లో వేసిన 10 వెంచర్లకు సైతం ఈ రోడ్డునే చూపించారు. మట్టిగా ఉన్న ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం ప్రయత్నించారు. అయితే ఈ రోడ్డును తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టాగా మార్చుకున్నాడు. తమ పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని అడ్డుకున్నారు. అందేంటి.. 60 ఏళ్లకు ముందు నుంచే రోడ్డుగా ఉంటే పట్టాగా ఎప్పుడు మార్చారు.. అంటూ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ నేతలు హైదరాబాదు స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు వెనకడుగు వేసినట్లు సమాచారం. దళితుల శ్మశానం ఆక్రమణ... ఈ రోడ్డుకు అనుకునే సర్వే నెం.360లో దాదాపు 25 సెంట్లలో తనపల్లి దళితవాడకు శ్మశానం ఉంది. దాదాపు 100 ఏళ్లకు పైనుంచే ఎవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేసేవారు. పాత రోడ్డు స్థలానికి సంబంధించి టీడీపీ నాయకుడికి పట్టా ఉందని చెప్పడంతో, దళితుల శ్మశానం నుంచి రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిని తనపల్లి దళితులు అడ్డుకున్నారు. పోలీసులతో బెదిరించి, వారిని పక్కకు తప్పించి శ్మశానంలో మూడు అడుగుల మేర మట్టిని తీశారు. ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. వాటిని తొలగించి రాత్రికి రాత్రే కొత్తగా తారురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో దళితుల శ్మశానం సగానికి పైగా కనుమరుగైంది. మండిపడుతున్న దళిత సంఘాలు శ్మశానాన్ని ఆక్రమించి తారురోడ్డు వేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కోసం దళితుల శవాలపై రోడ్డును వేస్తారా? అని తనపల్లి మాజీ సర్పంచ్ నాగరాజు నిలదీశారు. అధికార పార్టీ నేత కోసమే ఇలా ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును పట్టాగా మార్చారని, దళితుల శ్మశానాన్ని ఆక్రమించి పూర్వీకుల జ్ఞాపకాలను సైతం చెరిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రినే నిలదీస్తామని హెచ్చరించారు. -
టీడీపీ పాలన కుంభకోణాలమయం
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉపాధి హామీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, చివరకు కార్పొరేట్ కాలేజీల్లో కుంభకోణం ఇలా వరుసగా ప్రతిదానిలో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉచితంగా లభించే ఇసుకను కూడా అధికారపార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించకుండా వారి కడుపులు కొడుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1600కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో రూ.406 కోట్ల పనులు చేస్తే కేవలం రూ.75 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి వాఖ్యలపై సీఎం నోరుమెదపరే.. ‘రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్ల లబ్ధిచేకూర్చే కాంట్రాక్టు ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత కుమారుడికి, అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పయ్యావుల కేశవులు అల్లుడుకు తెలంగాణ ప్రభుత్వం మద్యం, పరిశ్రమలకు సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్తో అంటకాగుతోంది’ అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలుచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదన్నారు రిలయన్స్‌కు రూ. 3వేల కోట్ల బిజినెస్ రాష్ట్రంలోని రేషన్‌షాపులను రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మధు గుర్తుచేశారు. 26 వేల రేషన్‌దుకాణాలను రిలయన్స్ విలేజ్ మాల్స్ పేరుతో ఆ కంపెనీకి అప్పగించి ఏటా రూ.3వేల కోట్ల బిజినెస్ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రేషన్ దుకాణాలను రిలయన్స్‌కు అప్పగిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రిలయన్స్ విలేజ్ మాల్స్ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు అన్ని రేషన్ షాపుల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వాటా 70టీఎంసీలు రావాలి – పూనాటి జిల్లాకు 70 టీఎంసీల వాటా నీరు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా..జిల్లాకు మాత్రం సరిగా ఇవ్వడం లేదన్నారు. సాగర్ జలాలపై ఆధారపడి జిల్లాలో 4 లక్షల ఎకరాల వరికి అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6వ తేదీ లోగా ప్రకటన చేయకుంటే అదేరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ వల్ల 400 నుంచి 500 మంది చనిపోయారన్నారు. డెంగీ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య పాల్గొన్నారు. -
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
-
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
సాక్షి, గుంటూరు : రుణమాఫీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రైతులకు వేల కోట్లలో నష్టం కలిగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల రుణమాఫీపై చంద్రబాబు వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంటేనని తేల్చేశారు. మూడో విడదల నిధుల విడుదల గురించి చంద్రబాబు ఏదో ఘన కార్యం చేశారని చెబుతున్నారు. సక్రమంగా చేసి ఉంటే రుణాలు తగ్గాలి. కానీ, ఎందుకు పెరిగాయి? అని అంబటి ప్రశ్నించారు. 87 వేల కోట్లున్న రుణాలు.. ప్రస్తుతం లక్ష కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికిగానూ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిన 2,365 కోట్లను ఇప్పటి వరకు రైతులకు ఎందుకు ఇవ్వలేదంటూ చంద్రబాబును నిలదీశారు. సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు 66, 365 కోట్లు నష్టం కలిగించారని అంబటి పేర్కొన్నారు. -
సీఎం చంద్రబాబుకు శివాని ఆహ్వానం
విజయవాడ స్పోర్ట్స్ : విలువిద్యలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఈ నెల 10వ తేదీ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో తాను నిర్వహించే ప్రదర్శనకు ఆర్చరీ కిడ్ డాలీ శివాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన తల్లిదండ్రులతో కలసి సీఎం చంద్రబాబును కలిసింది. డాలీ శివాని ప్రదర్శించబోయే ఈవెంట్లను తండ్రి చెరుకూరి సత్యనారాయణ సీఎంకు వివరించారు. ఆసక్తిగా విన్న చంద్రబాబు సమయాన్ని బట్టి తాను కూడా కార్యక్రమానికి వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాలీ శివానికి ఆల్ ది బెస్ట్ చెప్పి రికార్డులు సృష్టించాలని ఆశీర్వదించారు. శివానికి అవసరమైన సహకారం అందజేయమని సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళికి సూచిం చారు. సీఎంను కలసినవారిలో శివాని తండ్రి చెరుకూరి సత్యనారాయణ, తల్లి కృష్ణకుమారి, ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధి జి.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఒక్క రోజు ఆఫర్!
ఆర్డినరీ పాసులతో మెట్రో బస్సుల్లో ప్రయాణం సీఎం సభకు బస్సులు పంపుతున్న ఫలితం సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికులకు ఆర్టీసీ ఒక్కరోజు ఆఫర్ ప్రకటించింది. బుధవారం ఆర్డినరీ బస్‌పాస్‌లున్న వారు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ప్రయాణించేందుకు అనుమతించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని కశింకోట మండలం గొబ్బూరులో జరిగే జలసిరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ జరిగే సభకు జనాన్ని తరలించడానికి సుమారు 200 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వీటిలో వంద బస్సులు విశాఖ రీజియన్ నుంచి పంపుతున్నారు. అందువల్ల నగరంలో బస్‌పాసులున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో బస్సుల్లో ఎక్కినా అదనపు కాంబీ టిక్కెట్టు చార్జీ చెల్లించనవసరం లేకుండా అనుమతించనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి. సుధేష్‌కుమార్ కోరారు. -
అన్యాయం జరిగితే బాబు సంబరాలా?
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో అంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీకి ఏమిచ్చారని సంబరాలు చెసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ఎక్కడా ప్రత్యేక ప్యాకేజీ అనే పదాన్ని వాడలేదని, స్పెషల్ అసిస్టెన్స్ మాత్రమే అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తీరు మాత్రం ఆఖరి బంతికి పాకిస్తాన్ గెలిస్తే భారతీయుడు సంబరాలు జరుపుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. ‘ఓటుకు కోట్లు’ కేసు తర్వాత రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా న్యాయం జరిగినట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. నారాకాసురుడిపై పోరాటం చేస్తే తప్ప ప్రత్యేక హోదా సాధించుకోలేమని స్పష్టం చేశారు. -
ఏపీకి చైనా పెట్టుబడులు
-
ఏపీకి చైనా పెట్టుబడులు
ముఖ్యమంత్రికి హామీ ఇచ్చిన మెకెన్సీ గ్లోబల్ సంస్థ దావోస్ విశేషాలను విడుదల చేసిన సీఎం కార్యాలయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచాలకుడు జోనాథన్ ఓజల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో జరిపిన సమావేశాల వివరాల ను బుధవారం మీడియాకు విడుదల చేసింది. సీఎంతో జరిగిన సమావేశంలో గ్లోబల్ మెకెన్సీ సంచాలకుడు జోనాథన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ గ్లోబల్ ముఖ్య భూమిక పోషించాలని సీఎం కోరారు. జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో ని సహజ వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు.ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్లు తయారు చేసే టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీతే సమావేశమై ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. తిరుపతి అభివృద్ధిలో కుమియుమి! కుమియుమి అస్సెట్స్ కంపెనీ అధ్యక్షుడు యసుయో యమజకితో సమావేశమై తిరుపతి నగరం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సీఎం కోరారు. అందుకు సమ్మతించిన యసుయో ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని తెలిపారు. భారత్‌లో తాము ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. అమరావతి నుంచి జాతీయ, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీపై స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలో చర్చించారు. సిస్కో ఛైర్మన్ జాన్‌తో సమావేశమై దావోస్ సదస్సు విశేషాలను చర్చించారు. జేబీఐసీ ప్రతినిధి తడాషి మెడా, సుజ్లాన్ గ్రూప్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ పెట్టుబడులు రాష్ట్రంలో 500 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఆసక్తి చూపింది.అంతకుముందు కెనడా నవకల్పనలు, శాస్త్ర పరిజ్ఞానం, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి నవదీప్ బెయిన్ సీఎంను కలిసి కెనడా పర్యటనకు రావల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చర్చలు జరిపిన వారిలో మిత్సుయి గ్లోబల్ ప్రతినిధి టొమోయికి, నోవార్టిస్ ఫార్మా ప్రెసిడెంట్ డాకట్ర్ ఆండ్రే, జనరల్ ఎలక్ట్రిక్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ ప్రతినిధి లోరెంజోలతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులున్నారు. -
నారావారి ఇంట సంక్రాంతి సంబరాలు
-
మీ కంటే మందు బాబులే మేలు
-
మీ కంటే మందు బాబులే మేలు
ఐఏఎస్‌లపై సీఎం వ్యాఖ్యలు శాఖాధిపతులతో సీఎం సమీక్ష మీ మైండ్ సెట్ మారాలంటూ చంద్రబాబు క్లాస్ సాక్షి, అమరావతి: ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకోరు... మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలే వస్తాయి... కొడుకును కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా?... అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజాగా ‘మీ కంటే మందు బాబులే బెటర్’ అంటూ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన గురువారం సచివాలయంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, సేవలు వంటి వివిధ రంగాలపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వంటి అధికారుల నుంచి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దుపై జరిగిన చర్చలో నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. మీలో ఎంతమంది నగదు రహిత వ్యవహారాలు నిర్వహిస్తున్నారో చేతులు ఎత్తాలంటూ ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది మాత్రమే చేతులు ఎత్తడంతో... ‘మీ కంటే మందు బాబులే బెటర్. చేతిలో నగదు లేనందున కార్డుల వినియోగం నేర్చుకోకపోతే సాయంత్రానికి కిక్ ఎక్కదు. అందుకే వారు నగదు రహిత లావాదేవీలవైపు మళ్లారు. ఆన్లైన్, స్వైపింగ్ మెషీన్ల వినియోగాన్ని నేర్చుకున్నారు. మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. మీరే నగదు రహిత లావాదేవీలు చేయకపోతే ప్రజలకేం నేర్పుతారు?’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీడియా లైవ్ నెట్ వర్క్ ఏర్పాటు సచివాలయంలో మీడియాలైవ్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్ –1లోని సీఎంలో జరిగిన హెచ్ఓడీ సమావేశాన్ని బ్లాక్–4లో ఏర్పాటు చేసిన పబ్లిసిటీ సెల్‌కు లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడంతో ఆ వివరాలను మీడియా సేకరించుకునే అవకాశం ఏర్పడింది. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆవేదన... ముఖ్యమంత్రి తమను మందుబాబులతో పోల్చడంపై సమావేశం తరువాత కొందరు ఐఏఎస్‌లు ఆవేదనతో చర్చించుకోవడం కనిపించింది. చివరకు మా దుస్థితి ఇలా తయారైందంటూ సన్నిహితులకు తెలియజేస్తూ కొందరు వాపోయారు. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు... మరి ఆయన ఏ వ్యాలెట్ అయినా వాడుతున్నారా? అని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించగా.. ప్రతిదీ ప్రభుత్వమే భరించేట ప్పుడు ఆయనకు జేబులో డబ్బులు ఎందుకు? అని మరో అధికారి వ్యాఖ్యానిం చారు. ఆయన వెంట ఉండేది కోట్లున్న , కోట్లు తొడిగిన వారే కదా, ఆయనకు డబ్బెందుకు? వ్యాలెట్ ఎందుకు? అని మరో అధికారి అన్నారు. ఇకపై మనం మీటింగులకు వెళ్లేప్పుడు చెవుల్లో దూది పెట్టుకుని వెళితే సరి... అని మరో ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం విశేషం. -
"నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే’
కళ్యాణదుర్గం రూరల్: నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపర శురాం విమర్శించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు రూ.2 వేల భృతి ఇస్తామని చంద్రబా బు అసత్య ప్రకటనలు చేశారన్నా రు. ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి అమలు చేయాలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్షావలీ, తాలుకా అధ్యక్షుడు నవీన్ కుమార్, తాలుకా ప్రధాన కార్యదర్శి మల్లెల రాజేష్, మండలాల అధ్యక్షులు మో హన్ ,అనిల్, కిరణ్, మహాత్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏడాది పొడవునా వేడుకలు: సీఎం
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రంలో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద నరకాసుర వధ కార్యక్రమంతోపాటు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు సతీసమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంగమానికి అఖండ హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి నారిని సంధించి నరకాసురుడి ప్రతిమను వధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర సంగమం వద్ద దీపావళి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఈ పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి దీపావళి జరుపుకోవాలని చెప్పారు. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు ఆదరణ ఆనందభరిత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించామని చంద్రబాబు అన్నారు. 300 మందికిపైగా వ్యాపారులు ఉత్సాహంగా స్టాళ్లు ఏర్పాటు చేశారని, ప్రజల ఆదరణతో దాదాపు రూ.11 కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. సభ అనంతరం అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. -
స్వర్ణాల చెరువుకు గోదావరిని తెస్తా
అసాధ్యం అంటున్న పనిని సుసాధ్యం చేస్తా: సీఎం నెల్లూరులో రొట్టెల పండుగలో పాల్గొన్న చంద్రబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘గోదావరి నీటిని నెల్లూరు స్వర్ణాల చెరువుకు మళ్లిస్తా. అందరూ అసాధ్యం అంటున్న ఈ పనిని సాధ్యం చేసి చూపిస్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడి బారాషహీద్ దర్గాలో సీఎం ప్రార్థనలు జరిపారు. అనంతరం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అభివృద్ధి రొట్టెను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాల చెరువు వద్ద జరిగిన సభలో మాట్లాడారు. గోదావరి నీటిని పెన్నా నదికి అనుసంధానం చేసి సోమశిల రిజర్వాయర్ ద్వారా స్వర్ణాల చెరువుకు నీరు తెస్తానని చెప్పారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రూ.350 కోట్లతో నిర్మిస్తున్న పెన్నా-సంగం బ్యారేజీ నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయిస్తానన్నారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజలంతా నాకు సహకరించాలి.. రాష్ట్రం అభివృద్ధికోసం తానొక్కడినే కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు శ్రమిస్తున్నానన్నారు. ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికోసం అందరూ రొట్టెలు పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతు, డ్వాక్రా రుణమాఫీలతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణమాఫీలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున ఇవ్వడానికి బుధవారం సంతకం చేశానని, ఈ నిధులను డ్వాక్రా మహిళలు వాడుకోవచ్చని ఆయన అన్నారు. -
నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?
నీతి సూక్తులొద్దు.. మీ అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడండి సీఎం చంద్రబాబుకు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి సూక్తులు చెప్పడం మాని, ఆయన అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడాలని పీఏసీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. బుగ్గన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ రూ.500, రూ.1,000 నోట్ల ముద్రణ నిలిపివేయాలని చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు చెబుతున్నారు? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రూ.500, రూ.1,000 నోట్ల నల్లధనం ఇస్తూ దొరికిపోయినందుకా? లేక ఎన్నికల్లో రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించినందుకా?’’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల నల్లధనాన్ని ఐడీఎస్-2016 పథకం కింద పలువురు వెల్లడిస్తే ఏపీ, తెలంగాణలో ఒకే వ్యక్తి రూ.10 వేల కోట్లు ప్రకటించారని చంద్రబాబు అంటున్నారు, అసలు నిగూఢమైన ఈ సమాచారం చంద్రబాబుకు ఎలా వచ్చిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివ రాలు అత్యంత రహస్యమైనవని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి, పన్నుల అధికారులు చెబుతూ ఉంటే బాబుకు ఎలా తెలిశాయో చెప్పాలని నిలదీశారు. నల్లధనాన్ని ప్రకటించిన వారి జాబితాను వెల్లడించాలని కోరుతున్నామన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో ఏపీ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా గణతికెక్కినట్లు ఎన్‌సీఏఈర్ సంస్థ పేర్కొంది. దానికి ముందు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పట్టిసీమ మొదలు అమరావతి భూముల దాకా అంతా అవినీతిమయమే. రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు పెట్టిన రూ 400 కోట్లు ఎక్కడికి పోయాయి? పట్టిసీమలో రూ.1,600 కోట్లు ఎక్కడికి చేరాయి? గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఖర్చు పెట్టామని చెబుతున్న రూ.3,000 కోట్లు ఏవీ? పారిశ్రామికవేత్తల రాయితీల పేరుతో విడుదల చేసిన రూ.2,200 కోట్లు ఏమైపోయాయి?’’అని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాబు జీఎస్డీపీపై తప్పుడు లెక్కలు వెల్లడించారన్నారు. -
నల్లధనాన్ని నిరోధించాలి
• దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నా • సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు • మావాళ్లు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారు • అమెరికా ఎన్నికలకు నేను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు • వెలగపూడిలో సీఎం కార్యాలయం ప్రారంభం సాక్షి, అమరావతి: ఐదేళ్లు పడుకుని ఎన్నికల్లో నిద్రలేచి రూ.వెయ్యి నోటు ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు... కొందరు మొన్న ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు, మళ్లీ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు... అందుకే ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టి, అందుకోసం పోటీలు పడుతున్నారు... తమ పార్టీ వాళ్లు కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బ్లాక్‌మనీ సంపాదించే వారికి రాజకీయం షెల్టర్‌గా మారిపోయిందన్నారు. కొంతమంది బ్లాక్ మనీని సంపాదించి ఎన్నికల్లో పంచుతుండడంతో తమ పరిస్థితి ఏమిటని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పారు. తాము ఐదేళ్లు ప్రజలకు కరెంటు, గ్యాస్, పెన్షన్ వంటివన్నీ ఇస్తే చివర్లో ఎన్నికలప్పుడు ఎవరైనా రూ.500 ఇస్తే వారికి ఓట్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో మొత్తం రూ.13 వేల కోట్ల నల్లధనాన్ని స్వచ్ఛంద ఆదాయం వెల్లడి పథకం కింద తెల్లధనంగా మార్చుకున్నారని, అందులో ఒకే వ్యక్తిది పది వేల కోట్లుందని తెలిపారు. అంత డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడితే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నివారించాలంటే బ్లాక్‌మనీని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా నగదు రహిత లావాదేవీలు జరపాలని చెప్పారు. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మోదీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ప్యాకేజీ తీసుకుంటే తప్పేంటీ? ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తానంటే ప్యాకేజీ ఎందుకు తీసుకోకూడదని చంద్రబాబు ప్రశ్నించారు. అగ్రదేశమైన అమెరికాలోనూ నాయకత్వ లేమి ఉందన్నారు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ట్రంప్‌కు నాలుగో భార్య అనుకుంటా అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడాడని విమర్శించారు. అమెరికా ఎన్నికలకు తాను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. చందాలు తీసుకుని రాజకీయాలు..: సచివాలయంలో తన కార్యాలయంలోకి అడుగు పెట్టడంతో నూతక శకం ప్రారంభమైందని బాబు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ.2,500 కోట్లు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశానన్నారు. దీనిపై వడ్డీ కూడా రూ.1200 కోట్లు ఇస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లు రాకపోయినా.. కొన్ని పార్టీలు చందాలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. -
హోదాతో ఎక్కువ రాయితీలు రావు
* తప్పులు చేస్తే ఇప్పుడు జనం నోరు తెరవరు.. * ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇస్తారు: టీడీపీ వర్క్‌షాపులో చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు వస్తాయనే రీతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనాన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో 1.47 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లైందన్నారు. గురువారం మూడో రోజు నిర్వహించిన టీడీపీ నాయకత్వ-సాధికారత వర్క్‌షాపు ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు.. సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులుగా తప్పులు చేస్తే జనం ఇప్పుడు నోరు తెరవరు.. కానీ ఎన్నికల్లో సెలైంట్‌గా జడ్జిమెంట్ ఇస్తారు జాగ్రత్త అంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన సేవలు అందకపోతే సహించరని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల్లో 80 శాతం సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80 శాతం, నాయకుల పనితీరు పట్ల 80 శాతం అనుకూలత రావాలన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని కోరారు. రాజకీయనేత నైపుణ్యాలు, ఆర్థిక వేత్త నైపుణ్యాలు వేర్వేరు కాబట్టే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు పొలిటికల్ ఇమేజీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచామన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వారికి చేసిన ప్రయోజనాలు వివరించి పార్టీకి దగ్గరయ్యేలా చూడాలని కోరారు. గోదావరిని పెన్నాకు కూడా అనుసంధానం చేసి సోమశిల వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో బాబు ప్రసంగిస్తారు. సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. -
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
-
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
కలెక్టర్లు, మంత్రులపై సీఎం ఆగ్రహం * కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలి * లక్ష్యాలు సాధించలేదంటూ గంటాపై మండిపాటు * యూనివర్సిటీలకు ర్యాంకులపై వీసీలకు అభినందన సాక్షి, అమరావతి: జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు. మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు గురువారం విజయవాడలో జరిగింది. సమావేశంలో జిల్లాల వారీగా ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఏడేసి నిమిషాలు తమ జిల్లాపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో విడిగా సమావేశమయ్యారు. జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొని అభివృద్ధికి ఆటంకంగా మారితే పరిష్కారానికి చొరవ చూపాలని వారికి సూచించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఆధార్ ఆధారంగా ఇంటినుంచే పౌరసేవలను అందించే యాప్‌ను తయారు చే యించిన పశ్చిమ గోదావరి కలెక్టర్ భాస్కర్‌ను అభినందించారు. మూడేళ్లవుతున్నా ఏం సాధించారు? అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, వేలకోట్లు బడ్జెట్ ఇస్తున్నా... అనుకున్న లక్ష్యాల్లో ఒక్కటైనా సాధించారా? అంటూ మానవవనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించి మూడేళ్లయినా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలకు ప్రపంచస్థాయి ర్యాంకులు రావడంపై వీసీలను, ఉన్నత విద్యాశాఖ అధికారులను అభినందించారు. సైనికులకు వందనం : దేశ సార్వభౌమాధికారానికి ఎవరి నుంచి ఎటునుంచైనా భంగం వాటిల్లితే సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వాగతించారు. ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్‌పై నిర్వహించే సమావేశంలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం ఢి ల్లీ వెళ్లనున్నారు. వృద్ధి రేటులో విశాఖ ప్రథమం.. రాష్ట్రంలోని జిల్లాలకు వృద్ధి రేటు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా రెండవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. వాటి తరువాత నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలు వరస స్థానాల్లో నిలిచాయి. -
ముమ్మాటికీ మోసమే
హోదా విషయంలో కేంద్రం మోసం చేస్తే...బాబు లొంగిపోయారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు అనంతపురం అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని, ఈ విషయంలో పోరాడాల్సిన చంద్రబాబు ప్రధాని మోదీ దయాదాక్షిణ్యాలు చాలంటూ సాగిలపడ్డారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురం జిల్లాకు విచ్చేసిన ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు.. ప్యాకేజీ చాలంటూ మాట మార్చారన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ పార్లమెంట్లో చేసిన ప్రకటన విన్న తర్వాత తన రక్తం మరుగుతోందని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రం ప్యాకేజీ బాగుందంటూ మురిసిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుస్తోందన్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులను, లక్షలాది మంది విద్యార్థులను, యువ పారిశ్రామిక వేత్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై హోదాకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
వారిద్దరూ మోదీ చేతిలో బకరాలు
వెంకయ్య,బాబులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ చేతిలో బకరాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో క లసి నారాయణ విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య, చంద్రబాబు హోదా వల్ల ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి జరిగిందో లేదో చూద్దామా? అని నారాయణ సవాల్ విసిరారు. -
తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు
ధ్వజమెత్తిన ప్రభుత్వ విప్ సునీత సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై పగబట్టారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బాబు తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమని విషంకక్కినా టీటీడీపీ నేతలు నోరు మెదపలేదన్నారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ వ్యక్తిత్వమయితే, అందరూ నాశనమైనా తాను బాగుండాలనే రాక్షసత్వం బాబుదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టని బాబు అనడం దారుణమన్నారు. -
ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి
ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందే విధంగా పరిపాలన సాగించాలని సీఎం చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విజయవాడలో మంగళవారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం పొందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పాలనా పరమైన సంస్కరణలను సూచించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయలేదన్నారు. వాటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఎన్టీఆర్ సురక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్సీల సమావేశంలో ప్రారంభించారు. -
అరాచక శక్తుల్ని పెంచి పోషించింది బాబే
* నయీం, జడల నాగరాజులను ప్రోత్సహించిందీ ఆయనే * ‘అనంత’లో జరిగిన 400 హత్యలకు బాబే కారణం * సీఐడీ విచారణ అనంతరం విలేకర్లతో భూమన సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్: సీఎం చంద్రబాబు అరాచక శక్తులకు అక్షయపాత్ర అని, అరాచక, అసాంఘిక శక్తులను పెంచిపోషించింది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నయీం అనే విషపురుగును, జడల నాగరాజు అనే సంఘవిద్రోహశక్తిని సృష్టించింది చంద్రబాబేనన్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ద్వారా ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనప్పుడు వాహనాల దహనానికి, అలజడులకు చంద్రబాబే కారణమన్నారు. తన పదేళ్లపాలనలో అనంతపురంలో జరిగిన నమోదు కాని 400 హత్యలకు, పరిటాల రవి చనిపోయినప్పుడు జరిగిన దహనకాండకు ఆయనే కారణమన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ అధికారుల నోటీసుతో మంగళవారం గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో జరిగిన విచారణకు భూమన హాజరయ్యారు. ఉదయం 11.15 గంటలకు వచ్చిన భూమనను సీఐడీ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు. సాయంత్రం 6,45 గంటలకు బయటికొచ్చిన భూమన విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనకు కారకుల్ని పట్టుకోకుండా తనను వ్యతిరేకించే ప్రత్యర్థి రాజకీయనాయకుల్ని ఈ కుట్రలో భాగస్వాములను చేయాలనే బాబు కుతంత్రం కనిపిస్తోందని మండిపడ్డారు. తుని ఘటనకు జగన్మోహన్రెడ్డి, భూమన కారణమంటూ సంఘటన జరిగినరోజే చంద్రబాబు ప్రకటించారని.. ఆయనకు ఈ సమాచారం ఎలా తెలిసిందో అడగడానికిగాను విచారణ అధికారులు నోటీసులివ్వాలన్నారు. సీఎంకు, తనపై ఆరోపణలు చేసిన హోంమంత్రి చినరాజప్పకు నోటీసులిచ్చి పోలీసులు నిష్పాక్షికతను చాటుకోవాలన్నారు. తనకే సంబంధం లేకపోయినా, ఎటువంటి ఆధారాల్లేనప్పటికీ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా తనను విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు. విచారణకు హాజరయ్యేముందు కూడా భూమన వైఎస్సార్సీపీ జిల్లాకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమావాస్యకు అబ్దుల్ ఖాదర్‌కు.. కోడిగుడ్డుకు గానుగెద్దుకు ఎంత సంబంధం ఉంటుందో.. తునిలో జరిగిన ఘటనకు, తనకు అంతే సంబంధముందన్నారు. ఎవరో దుండగులు రైలును దహనం చేస్తే దాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించి పార్టీని సమూలంగా దహనం చేయాలనే కుటిలప్రయత్నాల్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ నైతిక మద్దతు తెలపడాన్ని భరించలేక చంద్రబాబు తనను అరెస్టు చేయించాలని కుటిలయత్నాలకు పాల్పడుతున్నారన్నారు. కాగా, భూమనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి తగ్గట్టుగా విచారణ ఏడున్నర గంటలపాటు సాగడంతో సీఐడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భూమనను అరెస్టు చేయలేదు. భూమన వెంట వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ధర్నా.. తుని ఘటనతో సంబంధం లేని భూమనను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ నేతలతో కలసి గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయం ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో గుంటూరు అర్బన్ ఏఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు ధర్నాలో పాల్గొన్న మరో 14 మంది వైఎస్సార్సీపీ నేతల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మట్టికట్టతో కనికట్టు
-
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అప్పగించింది
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తే త్వరగా పూర్తవుతాయని కేంద్రం తమకు అప్పగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాత్కాలిక సచివాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పనులు చేయించమంటే... నేనేదో కాంట్రాక్టర్‌ను నిర్ణయించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారని ఆక్షేపించారు. దేశంలోనే మొదటిసారిగా అధునాతనమైన యంత్రాల ద్వారా పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కిలోమీటరు వెడల్పున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 50 లక్షల క్యూసెక్కుల జలాలు వదులుతామని తెలిపారు.ప్రతి సోమవారం ‘పోలవారం’గా మారుతుందని, పనులు పర్యవేక్షించేందుకు తాను ప్రతి సోమవారం వెళతానని ఆయన తెలిపారు. ఏమి లాభమో చెప్పండి? ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయనే ప్రచారంలో నిజం లేదని చంద్రబాబు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక రాయితీల కారణంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పటం వట్టి గాలి మాటలన్నారు. హోదావల్ల ఏమి లాభమో చెప్పండి? అని ప్రశ్నిం చారు. 2015-16 సంవత్సరానికి దేశంలో ఆర్బీఐ 954 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెడితే అందులో ఆంధ్రప్రదేశ్‌కు 15.8 శాతం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దసరాకు తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయం ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. డిసెంబరు నాటికి అసెంబ్లీ, శాసన మండలి భవనాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘సాక్షి’పై విమర్శలు..: సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం తాత్కాలిక సచివాలయంలో విలేకరులతో మాట్లాడు తూ సాక్షి కథనంపై అక్కసు వెళ్లగక్కారు. ‘నేను అవినీతి పరుడినంట. రూ.52 వేల కోట్లు స్విస్‌చాలెంజ్‌లో తిన్నానంట. తప్పుడు రాతలు రాస్తున్నారు’ అంటూ విమర్శించారు. వెసులుబాటు కోసమే ప్యాకేజీ: సీఎం సాక్షి,విజయవాడ: ప్రత్యేక హోదాకు సమానమైన స్థాయిలో నిధులిస్తామని కేంద్రం చెప్పడంతో.. రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుందన్న భావనతో ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), ఆయన కుమారుడు అవినాష్, కాంగ్రెస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కడియాలు బుచ్చిబాబులు గురువారం విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. -
మట్టికట్టతో కనికట్టు
పోలవరం నిర్మాణంలో బాబుగారి కుట్రలెన్నో.. కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: ‘‘కాఫర్ డ్యామ్ నిర్మించి పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దాం.. ఇదే పోలవరం తొలిదశ.’’ - మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఇది. ఈ ప్రకటన చూడగానే ఇంజనీర్లకయితే మూర్ఛవచ్చినంత పనైంది. సాగునీటి శాఖ అధికారులూ సీఎం ప్రకటన చూసి విస్తుపోయారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి? జలాశయం నిర్మించడానికి ముందు ఇది ఎందుకు కడతారు? ప్రధాన డ్యామ్‌కు కాఫర్ డ్యామ్‌కు ఉన్న తేడా ఏమిటి? నిజంగా సీఎం చెబుతున్నట్లు కాఫర్ డ్యామ్ కట్టడం పూర్తయితే పోలవరం తొలిదశ పూర్తయినట్లేనా? అసలు ఈ కాఫర్ డ్యామ్ సీఎం చెబుతున్నట్లు 60 టీఎంసీల నీటి నిల్వకు పనికి వస్తుందా? ఇవన్నీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అసలు కేంద్రం నిర్మించాల్సిన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ఎందుకు ఆతృతపడుతున్నారు? కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు? అందులోని మర్మమేమిటి? వంటివి అర్ధం చేసుకోవాలంటే ఇది చదవండి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇపుడు కాఫర్ డ్యామ్‌నే పోలవరం తొలిదశగా ప్రకటించేశారు. అంతేకాదు 60 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తొలిదశను పూర్తి చేశామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం, మరోపక్క తన అనుయాయుడైన సొంత పార్టీ కాంట్రాక్టరుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, ఆ పైన కమీషన్లు కైంకర్యం చేయడం ప్రభుత్వ పెద్దల లక్ష్యాలుగా కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. కాఫర్‌డ్యామ్ తాత్కాలిక నిర్మాణం మాత్రమే సాధారణంగా ఏదైనా ఆనకట్ట నిర్మించాలంటే తాత్కాలిక మట్టి అడ్డుకట్టతో నీటిని దారి మళ్లించడం తప్పనిసరి. దాన్నే కాఫర్ డ్యామ్ అంటారు. అంటే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ముందు మట్టితో నిర్మించే తాత్కాలిక డ్యామ్ అన్నమాట. జలాశయ నిర్మాణ పనులకు నీళ్లు అడ్డురాకుండా.. ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్ ఏ మాత్రం పటిష్ఠంగా ఉండదు. శాశ్వతంగా అసలు పనికి రాదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పడం పట్ల నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాఫర్ డ్యామ్ ద్వారా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని చంద్రబాబు కొత్త వాదన తీసుకురావడం చూసి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. గోదావరికి గరిష్టం గా 30 లక్షల క్యూ సెక్కులు వరద వస్తుంది. కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరదని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం కాఫర్‌డ్యామ్‌కు ఉండదని జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇం జనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడానికే తప్ప నీరు నిల్వ చేయడానికి కాఫర్ డ్యామ్ పనికిరాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం తొలి దశ పూర్తయిందని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది. భారీ ఎత్తున వరద వస్తే తట్టుకునే శక్తి ఈ కాఫర్ డ్యామ్‌కు ఉండదని, దా నికి గండి పడితే దిగువ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌తో అంత నీటి నిల్వ సాధ్యమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదులు కాఫర్ డ్యామ్‌లే నిర్మించి.. ఎక్కువ నీటిని నిల్వ చేసి ఉండేవారు కదా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అయినా కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 వరకూ రూ.5135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.562.46 కోట్లను ఏఐబీపీ కింద కేంద్రం విడుదల చేసింది. ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధులు పోను మిగతా సొమ్మును మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. అదీ ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయం మాత్రమే. భూసేకరణ, నిర్వాసితుల పునరాసానికి అయ్యే వ్యయాన్ని ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఏప్రిల్ 1, 2014 నుంచి ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. తాజా ఎస్ఎస్ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లకుపైగా పెరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం రూ.20 వేల కోట్ల భారం పడనుంది. కాంట్రాక్టరును కాపాడడం.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే ముసాయిదా(డ్రాఫ్ట్)ను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పీపీఏకి అప్పగిస్తే.. ప్రాజెక్టు నిధుల వ్యయంపై కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది. నిధులు కొట్టేసేందుకు వీలుండదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు సక్రమంగా చేయడం లేదంటూ టీడీపీ ఎంపీ రాయపాటి కి చెందిన ట్రాన్స్ట్రాయ్పై అనేక సందర్భాల్లో పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈపీసీలో 60సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌పై వేటు వేసి.. సమర్థుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించింది. కానీ.. ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. రాయపాటిని రక్షించడం.. అంచనాలు పెంచేసి కమీషన్లు కొట్టేసేందుకు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. ఫలితంగా జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకూ 232 కోట్ల విలువైన పనులను మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. పీపీఏ సిఫారసు మేరకు కాంట్రాక్టర్‌పై వేటు వేసి మళ్లీ టెండర్లు పిలిచి ఉంటే సమర్థుడైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే సౌలభ్యం ఉండేది. ఇనుము, డీజిల్, సిమెంటు వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో పోలవరం అంచనా వ్యయమూ తగ్గి ఉండేది. ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గేది. ప్రాజెక్టు ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం చేతికి దక్కగానే పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేసి.. కమీషన్లు దండుకుంటున్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం.. ‘హోదా’ తాకట్టు ప్రాజెక్టు అంచనాలు పెంచేసి కమీషన్లు దండుకోవడం కోసం ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంతో రాయభేరాలు సాగించడానికి కాంట్రాక్టర్లయిన కేంద్ర మంత్రి సుజనా, ఎంపీ సీఎం రమేష్‌లను చంద్రబాబు పంపారు. రాష్ట్ర వినతి మేరకు ఆ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. దాంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం చేతికి చిక్కిన 24 గంటల్లోనే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి కమీషన్లు కొట్టేశారు. 2018 నాటికి పోలవరం పూర్తయ్యేనా? 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ీ చంద్రబాబు చెబుతుంటే.. ఆయన కేబినెట్లోని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఇటీవల శాసనమండలిలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వీటిని బట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించినా.. పీపీఏ భేటీ మినిట్స్‌ను పరిశీలించినా 2018 నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యం. దీనికితోడు పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 13న భేటీలోనూ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే కేంద్రమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిందని చంద్రబాబునాయుడు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదు. ఈనెల 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈనెల 8న కేంద్ర ఆర్థిక శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో పెట్టిన ప్రకటనలోనూ ఇదే అంశాన్ని తేటతెల్లం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు పదే పదే చెబుతోండటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే ♦ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ♦ 90(2) ప్రకారం.. ప్రజాభ్యుదయం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ♦ 90(3) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సమ్మతించింది. ♦ 90(4) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం, భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పర్యావరణ, అటవీ తదితర అనుమతులను కేంద్రం తీసుకొస్తుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మిస్తుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం ప్రాజెక్టుకుర్తిస్థాయి పునరావాస పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని గౌరవసభ్యులకు హామీ ఇస్తున్నాను. - విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత మూడున్నర దశాబ్దాలుగా మూలన పడిపోయిన పోలవరం ప్రాజెక్టును తామే దుమ్ము దులిపి చేపట్టామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఈ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ తదితర అనుమతులన్నీ ఆయనే తెచ్చారు. పోలవరం కుడి కాలువను 145 కిమీల మేర తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేయించారు. ఎడమ కాలువ 134 కిమీల మేర లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను శరవేగంగా పూర్తి చేసే దశలో ఆయన హఠన్మరణం చెందారు. వైఎస్ అకాల మరణం పోలవరానికి శాపంగా మారింది. మహానేత వైఎస్ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్యామ్ కట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో వింతంటూ అపహాస్యం చేశారు. కానీ.. ఆ మహానేత తవ్విన పోలవరం కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తూ.. అదీ తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటోండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం చేపడితే జరిగే మేళ్లివీ.. ♦ పోలవరం జాతీయ ప్రాజెక్టు. తాజా ఎస్ఎస్ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.36 వేల కోట్లు. కేంద్రం చేపడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తుంది. ♦ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం పోలవరాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేపడితే సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు సులభంగా నిర్వహించి.. వివాదం లేకుండా చూస్తుంది. ♦ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పోలవరం డిజైన్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పనిసరి. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించడం వల్ల సీడబ్ల్యూసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీని వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ♦ సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌ఐ(నేషనల్ హైడ్రాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్), జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి సంస్థల్లో పనిచేసే నిపుణుల పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు నాణ్యతతో చేస్తారు. ♦ కేంద్ర ప్రభ్వు బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు. 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. మార్చి, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్ల జరిగే నష్టాలివీ.. ♦ 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం రూపొందించిన పోలవరం అంచనా వ్యయంలో కేవలం హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు(ఇరిగేషన్ కాంపొనెంట్)కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులతోపాటూ ప్రాజెక్టు నిర్మాణ పనుల పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ♦ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసు వేసింది. దీని వల్లే ప్రాజెక్టు పనులపై కేంద్రం పర్యావరణ నిషేధం విధించి.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సడలిస్తూ వస్తోంది. ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ వివాదం పరిష్కారమయ్యేది. ♦ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబంధించి వర్కింగ్ డిజైన్లు మినహా.. ఎలాంటి డిజైన్లను సీడబ్ల్యూసీకి పంపలేదు. ఇటీవల కేంద్ర బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది. ♦ భూకంప ప్రభావిత ప్రాంతం(సెస్మిక్ జోన్)లో నిర్మిస్తుండటం వల్ల నిపుణులు అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు అందుబాటులో లేరు. ఇటీవల జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోసం నర్మద కార్పొరేషన్లో పనిచేసిన డీపీ భార్గవను కన్సల్టెంట్‌గా నియమించింది. ♦ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే పనులు సాగితే 2018 నాటికి పూర్తవడం అసాధ్యం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. -
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
-
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
టీడీపీ ఎంపీ రాయపాటికి భారీ లబ్ధి చేకూర్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు * పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481 కోట్లు పెంపు * 7న పోలవరం బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు అప్పగించిన కేంద్రం * 24 గంటలు గడవక ముందే అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు * అంతా పక్కా ప్రణాళికతో నడిపించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకు గానూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు దక్కిన మొదటి ‘ప్యాకేజీ’ ఇది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేసేందుకు రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం హెడవర్క్స్ పనుల అంచనా వ్యయం రూ.4,717 కోట్లు కాగా, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.. రష్యా, ఒమన్లకు చెందిన జేఎస్సీ, యూఈఎస్లతో జట్టుకట్టి, 14.05 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,054 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేజిక్కించుకుంది. ఈ పనులు 60 నెలల్లో పూర్తి చేసేలా 2013, మార్చి 2న కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నాడు తస్మదీయుడు.. నేడు అస్మదీయుడు అయితే పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేసే సత్తా ట్రాన్స్ట్రాయ్కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) నివేదిక ఇచ్చింది. రాయపాటి అప్పట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు. దీంతో పోలవరం హెడ్‌వర్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం రాయపాటి సైకిలెక్కారు. దీంతో చంద్రబాబుకు రాయపాటి సన్నిహితుడిగా మారిపోయారు. కేవలం ప్రాజెక్టులు పనులు కొట్టేసేందుకే ఎంపీ రాయపాటి రష్యా, ఒమన్ దేశాలకు చెందిన సంస్థల సహకారం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థల చిరునామా కన్పించలేదు. 2015, అక్టోబర్ 10 వరకూ అంటే.. 32 నెలల్లో కేవలం రూ.232.42 కోట్ల విలువైన పనులే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) పదే పదే అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని, తక్షణమే తొలగించాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా సూచించింది. కానీ ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయపాటికి భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొట్టాలన్నది ఆ లేఖల ఎత్తుగడగా తెలుస్తోంది. ఏపీకి అప్పగించగానే దోపిడీపర్వం.. పనులు వేగవంతం చేయాలంటే తాజా(2015-16) ఎస్ఎస్ఆర్ మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని, హెడ్‌వర్క్స్ పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని, వారిని కూడా ప్రధాన కాంట్రాక్టరే ఎంచుకోవచ్చంటూ రాయపాటి సాంబశివరావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లమాలిన ప్రేమ కురిపించారు. ఆ మేరకు 2015, అక్టోబర్ 10న కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలో ఒప్పందం చేసుకోవాలని, ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని కేబినెట్ షరతు విధించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంచనా వ్యయాన్ని పెంచుతూ పోలవరం ఈఎన్సీ ఏప్రిల్ 30న మొదటి సారి, ఆగస్టు 9న రెండో సారి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తొక్కిపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగానే వాటిపై ఆమోదముద్ర వేసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,767.83 కోట్లకు పెంచారు. ఇందులో 2015, అక్టోబర్ 10 వరకు పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.232.42 కోట్లు కాగా, మిగతా పనుల విలువ రూ.5,535.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఒకేసారి రూ.1,481.41 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. -
‘చాలెంజ్’.. ఇది దోపిడే
-
వాల్‌పోస్టర్లు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ర్టంలోని పట్టణాలు, నగరాల్లో అనుమతి లేకుండా గోడలపై రాతలు రాయటం, పత్రికలు అతికించడాన్ని నిషేధిస్తూ త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కలు, నీటి సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అదనపు మార్కులు కేటాయిస్తామన్నారు. గురువారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాస్తవ తనిఖీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ డ్రోన్ కెమెరా అందిస్తామన్నారు. ఒక్కో డ్రోన్ కెమెరా ఏడు గంటల్లో 150 కిలోమీటర్ల పరిధిలోని వాస్తవ పరిస్థితిని రికార్డు చేస్తుందన్నారు. కైజలా యాప్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించి తిరిగి వారికి చేరవేస్తుందన్నారు. కేంద్రం నుంచి 1,700 కోట్లు రావాలి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన, జరగాల్సిన పనుల వివరాలను సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ర్టం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ. 1,700 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా ఈ ఏడాది రూ. మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు. -
‘చాలెంజ్’.. ఇది దోపిడే
‘స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం రైతుల భూములతో రియల్ వ్యాపారం... ♦ సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం ♦ అంతా రహస్యం... పారదర్శకత మృగ్యం ♦ ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్ ♦ సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా ♦ రూ. 306 కోట్ల పెట్టుబడికి.. రూ.27,461.84 కోట్ల లాభం ♦ సర్కారు వాటా 42 శాతానికి పరిమితం ♦ రూ.5,721.9 కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది రూ.19,886.16 కోట్లే.. ♦ అసెంబ్లీ, సచివాలయం లాంటివీ కట్టరు రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు. ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది. ఇలా... పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే... పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందసు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక ఇదీ... ≈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. ≈ కానీ సింగపూర్ కంపెనీల్లో బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని, ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ తగ్గించమనడం గమనార్హం. ≈ ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ≈ ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో. ≈ రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ≈ ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. ≈ అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు ప్లాన్ వేసినట్లు అర్ధమౌతోంది. అంతా గోప్యం.. సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం. మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి. ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు. మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది. మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు. ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం. మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి. ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు. నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక. నిబంధన 2: ప్రాజెక్టులపై అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి. ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు. ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు. నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు. కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే.. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం గమనార్హం. -
కేంద్రం హామీలు నిలబెట్టుకోవడంలేదు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని, తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘విభజన చట్టంలో కేంద్రం ఎన్నో వాగ్దానాలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేకహోదా, రైల్వేజోన్ హామీల జాడలేవు. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీ చేయలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల లేదు. రాజధాని నిర్మాణానికి సాయం చేయడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో చొరవ లేదు. విభజన చట్టం కాగితం ముక్కలాగా మిగిలింది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రిని కోరాను’’ అని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తాము చెప్పిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేశామన్నారు. నూతన రాష్ట్రంలో తొలి, మలి స్వాతంత్య్రదిన వేడుకలు కర్నూలు, విశాఖలో జరుపుకున్నామని, ఈఏడాది ‘అనంత’లో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నామని, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మూడోస్థానంలో ఉన్నామన్నారు. ఫ్రీజోన్‌గా అమరావతి.. మరో రెండు ట్రిపుల్‌ఐటీలు ప్రారంభిస్తున్నామని, ఎయిమ్స్, వ్యవసాయ, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 4.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నగరంగా రూపొందిస్తామన్నారు. పౌరసరఫరాలకు ప్రథమ బహుమతి ప్రభుత్వ పథకాలపై ప్రదర్శించిన శకటాల్లో పౌరసరఫరాలశాఖ శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. ఉద్యాన శాఖ శకటానికి ద్వితీయ, పరిశ్రమలు, విద్యుత్‌శాఖ శకటాలకు సంయుక్తంగా తృతీయ బహుమతులు లభించాయి. ఏపీ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాలు సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. శాంబాబ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సీఎంవోలోనూ.. సాక్షి, అమరావతి: విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం కార్యాలయ కార్యదర్శి జి. సాయిప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
సేవచేయండి.... ఆనందం పొందండి
విలేకరుల సమావేశంలో సీఎం సాక్షి, అమరావతి/విజయవాడ: వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు అనుసంధానం కావాలని, ప్రజలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తను గతేడాది కృష్ణా, గోదావరి అనుసంధానాన్ని సంక్పలంగా తీసుకుని పట్టిసీమ ద్వారా పూర్తి చేశానని, ఈ కృష్ణా పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తరలించాలని సంకల్పం తీసుకున్నానని, పూర్తి చేస్తానని చెప్పారు. విజయవాడలో ఏర్పాటైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నదీమాతకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి రుణం తీర్చుకోవాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు నదీజలాలను వినియోగించుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్లి బాగా సంపాదించారని, వారందరూ పుష్కరాల్లో సేవ చేసి ఆనందం, తృప్తి పొందాలన్నారు. దుర్గామాత దర్శనాని కి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. డ్వాక్రా బజార్లను స్టార్టప్‌లుగా మార్చేందుకు మూలధనం.. డ్వాక్రా సంఘాల యూనిట్లను స్టార్టప్(అంకుర) సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత మూలధనాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్వాక్రా బజారు స్టాల్‌ను సీఎం ప్రారంభించారు. మొక్కలు పెంచకుంటే రాయితీలు కట్ ఉద్యోగులు మొక్కలు పెంచకుంటే బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన ‘వనం-మనం’ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడే వారికోసం ప్రత్యేక పాలసీ, మొక్కల్ని పెంచే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇస్తామన్నారు. సీఎం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. -
ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు. 19న లక్షల మందితో సమతాస్నానం.. ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. -
కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం
* లక్ష ఒత్తుల హారతిచ్చిన చంద్రబాబు * బోయపాటి శ్రీను బృందం లేజర్ షో సాక్షి, విజయవాడ: బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతారు. గురువారం రాత్రి 9.30 గంటల శుభముహూర్తంలో పవిత్ర కృష్ణానదిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు నవహారతులు ఇవ్వడంతో పాటు కృష్ణమ్మను పూజించి పుష్కరుడ్ని ఆహ్వానించారు. అంతకు ముందు తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరితో కలసి కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశానికి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాల్లోని శ్రీ దుర్గమ్మవారితో పాటు ఇతర దేవతామూర్తులు దర్శించుకుని పూజించారు. అక్కడ నుంచి కృష్ణానదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి కృష్ణమ్మకు లక్షఒత్తుల హారతిని ఇచ్చారు. గోదావరి-కృష్ణా సంగమాన్ని సినీదర్శకుడు బోయపాటి శ్రీను బృందం రంగురంగుల బాణసంచాతో, విద్యుత్ దీపాలతో సందర్శకుల్ని ఆకట్టుకునేలా వివరించారు. చంద్రబాబు లక్షఒత్తుల హారతి ఇవ్వగానే ఆకాశంలో మిరమిట్లుగొలిపేలా, రంగురంగుల విద్యుత్ కాంతులతో, అనేక రకాల శబ్దాలతోబాణసంచాను కాల్చారు. కృష్ణానదిపై లేజర్ షోను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తనయుడు లోకేష్, మంత్రులు పి.మాణిక్యాలరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు. మొదలైన కృష్ణా పుష్కరాలు సాక్షి, అమరావతి: పుష్కరుడు కృష్ణా నదిలోకి ప్రవేశించాడు. పుణ్యస్నానాలకు కృష్ణవేణి సిద్ధమైంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా -గోదావరి సంగమం ప్రాంతంలో గురువారం రాత్రి కృష్ణా హారతి ఆరంభంతో పుష్కర వేడుకలకు ప్రభుత్వం నాంది పలికింది. పిండ ప్రదానం పూజ ధర రూ. 300 కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం పూజకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 ధరను నిర్ణయించింది. పిండ ప్రదానంతో పాటు పుష్కర స్నాన ఘాట్ల వద్ద జరిగే వివి ద రకాల పూజలకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఘాట్ల వద్ద పూజల నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయడంతోపాటు భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూజను బట్టి మహా సంకల్పం, సరిగంగ స్నానం, ప్రాయశ్చితం, గౌరీ పూజ, గంగ పూజ- రూ.150 చొప్పున ధర నిర్ణయించారు. స్వయంపాకం/పోతారు- మూ సివాయనం పూజకు రూ. 200 ధరగా నిర్ణయించారు. పూజా సామగ్రి కిట్లను ఘాట్ల వద్దే చౌక ధరలకు విక్రయించేందుకు ప్రత్యేకంగా డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశారు. -
దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం
శుక్రవారం ఉదయం 5.45 గంటలకు స్నానం సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడని.. అయితే సూర్యాస్తమయం తర్వాత పుష్కర స్నానం చేయకూడదనే నియమం ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభిస్తారని, అదే సమయంలో సీఎం స్నానం చేస్తారని వెల్లడించారు. 1,120 ప్రాంతాల్లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు పుష్కరాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకోసం విజయవాడలో ఏడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
అందాల అరకులో నాకో కాటేజ్!
* ఇక్కడి అందాలను చూస్తుంటే ఇల్లు కట్టుకుని ఉండాలనుంది * దత్తత గ్రామం పెదలబుడు గ్రామస్తులతో సీఎం ముఖాముఖి సాక్షి, అరకు: ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకెంతో ఇష్టమైన అరకును.. అరకు కాఫీని ఓ మార్కెటింగ్ మేనేజర్లా ప్రమోట్ చేస్తున్నా. టూరిజం హబ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా అరకువ్యాలీని తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ జిల్లా అరకులో మంగళవారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ గార్డెన్స్‌లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో మాట్లాడుతూ అరుకులో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పెరల్ పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అరకు అందాలను చూస్తే ఇక్కడే ఒక కాటేజీ కట్టుకుని ఉండాలని అనిపిస్తోందన్నారు. అరకును ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, నర్సింగ్ కళాశాలలన్నీ ఏర్పాటు చేస్తానన్నారు. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు లక్ష ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.526 కోట్లతో ప్రాజెక్టు తీసుకున్నామన్నారు. దత్తత పంచాయతీని సందర్శించిన సీఎం అరకును అభివృద్ది చేయాలన్న లక్ష్యంతోనే ఈ మండలంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. తొలుత పెదలబుడు పంచాయతీకి వెళ్లిన చంద్రబాబు స్థానికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. -
హోదా కోసం ఢిల్లీకి వెళ్లలేదు
సాక్షి, అమరావతి: తాను రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరేందుకు ఢిల్లీ వెళ్లలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకే వెళ్లానని తెలిపారు. అదే సందర్భంలో ప్రత్యేకహోదా, తదితర అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించానని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసి...రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తే బాగుంటుందని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు మోదీ చెప్పారన్నారు. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు ప్రైవేటు బిల్లును లింకు పెట్టి ఉంటే తప్పకుండా పాస్ అయ్యేదని, అలా లింకు పెట్టకుండా అక్కడ బిల్లు పాసయ్యాక ఇక్కడ మళ్లీ అడుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, అందుకే అక్కడ కాంగ్రెస్ పెట్టిన బిల్లు నెగ్గితే వాళ్లు రాజీనామా చేయాలి కాబట్టి దాన్ని లోక్‌సభకు పంపారని తెలిపారు. సాంకేతిక సమస్యలు చూపిస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రాష్ట్రంతో ఆడుకుంటున్నాయని, ఇద్దరి రాజకీయ ప్రయోగాల్లో రాష్ట్రం నలిగిపోతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చిన 11 పార్టీలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని, 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మాదిరిగా పరిశ్రమలకు రాయితీలివ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరానని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రైవేటు బిల్లును లోక్‌సభకు పంపుతున్నట్లు ప్రకటన చేసినప్పుడు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి చప్పట్లు కొట్టడాన్ని విలేకరులు ప్రశ్నించగా.. ఆయనకు అవగాహన లేక అలా చేశాడని వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంతరామ్, వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, జేపీ నడ్డా, లోక్‌సభ స్పీకర్‌తోపాటు బీజేపీ సీనియర్ నేత అద్వానీలను కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటించండి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారని, ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే.. ఇక జాప్యం చేయకుండా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధానితో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు రావాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి ఆహ్వాన పత్రిక అందించారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు కూడా మోదీని కలిశారు. -
హోదాపై ఆమరణదీక్షకు సిద్ధమా?
సీఎంకు మూడు పేజీల లేఖ రాసిన కాపు ఉద్యమనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమా? మీతోపాటు మీ కుమారుడు లోకేశ్ కూడా సిద్ధపడతారా... అందుకు మీరు సై అంటే నేను కూడా ఆమరణ దీక్ష చేపడతాను’’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ముద్రగడ మూడు పేజీల లేఖను గురువారం సీఎంకు పంపించారు. ‘‘నా జాతికి మీరిచ్చిన హామీలు అమలు చేయమంటే కోపమొచ్చి నా కుటుంబాన్ని అవమానించారు. అయినా నాకెటువంటి చింతా లేదు. దీనిపై మీనుంచి సానుభూతి మాటలుగానీ, క్షమాపణగానీ కోరడం లేదు. ఇంకెన్ని అవమానాలు చేసినా, చేయించినా భరిస్తాను. నా జాతికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని అసెంబ్లీలో మీరు చేసే తీర్మానంకోసం ఎదురు చూస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమరణ దీక్ష చేయడానికి మీరూ.. మీ కుమారుడు సిద్ధపడితే నేను కూడా మీతోపాటే మీఇంట్లోనే చోటిస్తే దీక్షలో కూర్చుంటా. ఎవరెన్నిరోజులు చేయగలరో ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షను సవాలుగా స్వీకరించడంవల్ల ప్రత్యేక హోదాతోపాటు మన శరీర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి గురించి ప్రజలు తెలుసుకునే వీలుంటుంది.’’ అని ముద్రగడ తన లేఖలో తెలిపారు. -
హోదా తేకుంటే బాబుకు గుండు కొట్టిస్తారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య సాక్షి, అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లు గడిచినా విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ప్రస్తుతం ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాబు, కేసీఆర్ తరచూ ఢిల్లీ వెళ్లి మోదీ చెవుల్లో గుసగుసలు చెప్పివస్తున్నారని, వీళ్లు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
బాబు ఎంతకైనా తెగిస్తారు: రఘువీరా
గోపాలపట్నం (విశాఖ): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి.. చేసిన తప్పులు, అవినీతి నుంచి బయటపడేందుకు బీజేపీ కొమ్ముకాసి ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని మండిపడ్డారు. గోపాలపట్నంలో ఆదివారం ఆయన మీడియాతో మాటాడారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో తమ ఎంపీల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురాకుండా, టీడీపీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరడం సిగ్గుచేటన్నారు. -
ఇంకెంత కాలం మోసం చేస్తారు బాబూ!
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తరువాత తామేదో గట్టిగా పోరాడుతామన్నట్లుగా చంద్రబాబు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లుగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి ఉద్యమ రూపంలోకి తెచ్చాకే ఇప్పుడు చంద్రబాబులో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. కాగా కేవలం రాజకీయ కక్షతోనే విజయవాడలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని, దీనికి వెయ్యి రెట్లు మూల్యం చెల్లించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని చెప్పారు. -
మభ్యపెట్టే మరో డ్రామా!
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి బట్టబయలు కేంద్రంలో కొనసాగడమంటే జైట్లీ ప్రకటనను సమర్థించినట్లేగా! ≈ ఇంగ్లీషులో మాట్లాడితే ప్రధాని మోదీకి తెలుస్తుందనా..? ≈ కేంద్రంపై, బీజేపీపై పరుష వ్యాఖ్యలూ లేకుండా జాగ్రత్త ≈ సహకరించడం లేదంటూ ప్రతిపక్షంపై బాబు ఎదురుదాడి ≈ విభజన గాయాలను మళ్లీ రేపే ప్రయత్నం.. ≈ ప్రజల దృష్టి మరల్చడమేనని విశ్లేషకుల వ్యాఖ్య ≈ మంత్రులను ఉపసంహరిస్తే బీజేపీపై ఒత్తిడి పెరగదా? ≈ అదే జరిగితే తనకు ఇబ్బంది అనుకుంటున్నారా? సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కేంద్రంతో గట్టిగా పోరాడతారని, ప్రత్యేక హోదా సాధన దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తారని ఆశించిన ఐదుకోట్ల మంది తెలుగు ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కలసి ఎన్నికల్లో పోటీ చేసి, కలసి అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు ఇపుడు కేంద్రం నుంచి తన మంత్రులను మాత్రం ఉపసంహరించుకోకుండా పూర్తి నెపాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేయడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్ష పెరగడం, వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో దాని నుంచి బైటపడడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. తన అసమర్థత బైటపడకుండా కాపాడుకోవడంకోసం ఈ నెపాన్ని బీజేపీపై వేయడానికి అనుకూల మీడియా సహాయంతో వేస్తున్న ఎత్తుగడ అని విశ్లేషకులంటున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వెంటనే మంత్రులను ఉపసంహరించేవారని వారంటున్నారు. రెండేళ్లుగా రకరకాల ప్రకటనలతో ఏమార్చుతూ వచ్చిన చంద్రబాబు ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. పోరాటమే భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ కేంద్రంలో కొనసాగుతూనే బీజేపీపై నెపం మోపడం, విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం, వనరులు లేవంటూ వాపోవడం, నిరసనలను నివారించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రజలను మభ్యపెట్టేందుకు మరోమారు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. అసలు రాష్ర్టవిభజనకు తన లేఖే కారణమన్న సంగతిని దాచిపెట్టి.. రాష్ట్రాన్ని నాడు అడ్డగోలుగా విభజించారంటూ విభజన గాయాలను రేపడం ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ అని వారంటున్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నామనడాన్ని బట్టి చూస్తే కేంద్రంలో తాము పదవులను వదులుకునేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీని పల్లెత్తుమాట అనకుండా.. నాడు విభజనకు కారణమైన కాంగ్రెస్‌పైనా, ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు సిద్ధమౌతున్న ప్రతిపక్షాలపైనా, ప్రశ్నలడుగుతున్న విలేకరులపైనా విరుచుకుపడడం చూస్తుంటే చంద్రబాబు ఈ అంశాన్ని పక్కదారిపట్టించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులంటున్నారు. బీజేపీ చేయడం లేదని ఇంగ్లిషులో చెప్పండి... ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ కారణమని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించడం చూస్తే నెపం పూర్తిగా వారిపైకి నెట్టేయడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఒకవైపు వారిపై నెపం నెట్టేస్తూనే బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నాయకులకు నిర్దేశించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం ఏమీ చేయడంలేదని తెలుగుమీడియాలో మాట్లాడుతున్న చంద్రబాబు అవే విషయాలను జాతీయమీడియాతో మాత్రం చెప్పకపోవడానికి మోడీకి తెలుస్తుందన్న భయమే కారణమని వారు ప్రస్తావిస్తున్నారు. మభ్యపెట్టడంలో సరిలేరెవ్వరూ.. ప్రత్యేకహోదాపై ఎన్నికల ముందు నుంచి నేటి విలేకరుల సమావేశం వరకు వివిధ సందర్భాలలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎన్నిరకాలుగా మభ్యపెడుతున్నారో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేక హోదా కనీసం పదిహేనేళ్లయినా ఉండాలి అనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అదే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా సంజీవని కాదనడం, హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ఎద్దేవా చేయడం, కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటామా..? కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించడాన్ని పేర్కొంటున్నారు. ఇపుడు ప్రజలు ప్రత్యేక హోదా సంజీవని అని గ్రహించారని, అందుకే తిరగబడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ చైతన్యం చూసే చంద్రబాబు మళ్లీ స్వరం మార్చారని, హోదా అవసరమే అని ఇపుడు చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ దశలో వినతిపత్రమా? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని, పార్టీ ఎంపీలతో వినతిపత్రాన్ని పంపిస్తామని చంద్రబాబు చెబుతుండడాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పటికి 37 సార్లు ఢిల్లీ వెళ్లారు.. ఒకటో రెండోసార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఇపుడు మరోమారు వినతిపత్రం ఇస్తామనడంలో అర్ధమేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రత్యేకహోదా సాధ్యం కాదని అంత స్పష్టంగా చెప్పినా ఇంకా వినతిపత్రం పంపిస్తామని చంద్రబాబు చెప్పడంలో అర్ధం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాను అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇదేనా అని సామాన్యప్రజలకు సందేహం కలుగుతోందని పరిశీలకులంటున్నారు. ఈ దశలో వినతిపత్రం ఇస్తామని చెప్పడం మభ్యపుచ్చడానికి.. ఏమార్చడానికేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ఎత్తుగడలు.. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతినడం, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమను మభ్యపుచ్చడం కోసమే చంద్రబాబు రకరకాల వ్యాఖ్యలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, వనరులు లేవని వాపోవడం వాటిలో భాగమే. అలవిమాలిన దుబారా, ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు, అనేక దేశాలకు టూర్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రకటనలు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న వ్యాఖ్యలు చూసినవారెవరైనా వనరులు లేవన్న మాటలు నమ్ముతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక బంద్‌లు, ఆందోళనలు వద్దని, జపాన్ తరహాలో ఎక్కువ పనిచేసి నిరసన తెలపాలని చంద్రబాబు వారించడం కేంద్రంపై వత్తిడి పెరగకుండా చూడడం కోసమేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై బాధను వ్యక్తంచేస్తూనే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం పక్కనపెట్టిందని ఆందోళనవ్యక్తం చేయడం ఆయన అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 20మంది ఎమ్మెల్యేలను 30నుంచి 40 కోట్లిచ్చి కొనుగోలు చేసిన చంద్రబాబు వారికి రాజకీయ పునరావాసం కల్పించలేకపోతామే అని బాధపడుతున్నారు తప్ప లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శకులంటున్నారు. కేంద్రంలో కొనసాగడమంటే సమర్థించినట్లేగా..? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కొనసాగడమంటే ఆ ప్రకటనకు మద్దతిస్తున్నట్లేనని విశ్లేషకులంటున్నారు. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడమంటే ఆ ప్రకటనను సమర్థించినట్లేనని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులను ఉపసంహరించకుండా ఎన్ని చెప్పినా అవన్నీ మభ్యపుచ్చడానికి ఆడుతున్న నాటకాలుగానే భావించాల్సి ఉంటుందని విమర్శకులంటున్నారు. అసలే ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ, అనేక అవినీతి ఆరోపణలతోనూ సతమతమవుతున్న చంద్రబాబు ఇపుడు మంత్రులను ఉపసంహరించడంపై బీజేపీ కన్నెర్ర చేస్తే తట్టుకునే స్థితిలో లేరని, అందుకే ఆయన కేంద్రంపై తాను వత్తిడి చేయకపోగా ఎవరూ ఒత్తిడి చేయకూడదని కోరుకుంటున్నారని వారంటున్నారు.ఎల్లోమీడియాలో ఎన్నో ప్రయాసలు.. ఒకవైపు కేంద్రంలో కొనసాగుతూనే, మరోవైపు కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా కనిపించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకూల మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. అరుణ్‌జైట్లీ హోదాపై ప్రకటన చేసిన అరగంటలోపే కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇపుడో ఇంకాసేపట్లోనో మంత్రులను ఉపసంహరించేస్తారని కథనాలు ప్రసారమయ్యాయి. ఆదివారం విలేకరుల సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎంపీలపైనా, కేంద్రంలోని తమ పార్టీ ఇద్దరు మంత్రుల పైనా ఆగ్రహం వ్యక్తంచేశారని, ప్రత్యేక హోదాపై మరింత గట్టిగా పోరాడాలని క్లాస్ పీకారని కథనాలు వచ్చాయి. కావాలంటే మంత్రివర్గం నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ఇద్దరు మంత్రులు చెప్పినట్లుగా కూడా చానళ్లు చెప్పేస్తున్నాయి. చంద్రబాబులో నిజంగా అలాంటి చిత్తశుద్ది ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేదే కాదని, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతనైనా వెంటనే మంత్రులను ఉపసంహరిస్తే ప్రజలు నమ్మేవారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
హోదా ఇవ్వాలన్న ఆలోచన మోదీకి లేదు
సాధించే సంకల్పం బాబుకు లేదు: భూమన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంత మాత్రం లేదని, కేంద్రంపై పోరాడి సాధించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిపాద సన్నిధైన తిరుపతిలో వాగ్దానం చేసిన మోదీ.. ఇప్పుడు ఇవ్వకపోతే కచ్చితంగా నేర స్తుడవుతారన్నారు. పదిహేనేళ్లు కావాలని చెప్పి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబుకు.. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అర్హత లేదన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ శవమై పోయిందని, హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయనని, పోరాడనని చంద్రబాబు చెప్పడం వల్ల టీడీపీ జీవచ్ఛవంలా మారిందని భూమన అన్నారు. బీజేపీ, టీడీపీ మాటలతో మోసపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రగిలి పోతున్నారన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు దానిని నీరు గార్చేందుకు ప్రయత్నించారని, ప్రజల్లో ఉద్యమిస్తున్నపుడు మాత్రం హోదా సాధనే లక్ష్యమంటున్నారని ధ్వజమెత్తారు. ఇపుడు రాజ్యసభలో చర్చ పేరుతో కాంగ్రెస్, టీడీపీ నాటకానికి తెరలేపాయన్నారు. అసలు రాజ్యసభలో చర్చ గాని, బిల్లుగాని అవసరం లేదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు చర్చకు రెడీ అన్నారని, పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం ఓటింగ్‌లో నెగ్గక పోతే దానిని సాకుగా చూపి ఇక ఆ అంశాన్ని ముగించాలనే కుట్రతో టీడీపీ ఉందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇదంతా అవసరం లేకుండా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నారు. దానికోసం చంద్రబాబు ఒత్తిడి చేయక పోవడం దారుణమన్నారు. -
విదేశీ పెట్టుబడికి దాసోహం
కాకినాడ సిటీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువురూ విదేశీ పెట్టుబడులకు దాసోహమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి విమర్శించారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రచారజాతాను ప్రారంభించారు. ఎన్నికల హామీలను నీటిమూటలుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని మరో వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15లక్షలు జమ చేస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో నల్లధనం తెల్లగా మారిపోయేందుకు అవకాశం కల్పించారన్నారు. 24 నెలల్లో 22 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. బాబు వస్తే జాబు అనే మాటను ముఖ్యమంత్రి మరచి విదేశీ కంపెనీలకు అవకాశాలు ఇస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, నాయకులు ఎంవీ రమణ, దుర్గాప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆ లేఖ వెనుక..
కుప్పంరూరల్: మండలంలో కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంకలో చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడంపై తమిళనాడు సీఎం జయలలిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాసింది. పాలారు పరివాహక ప్రదేశమైన పెద్దవం క గ్రామంలోని కనకనాశమ్మ దేవాలయం వద్ద చెక్‌డ్యామ్ ఎత్తు పెంచరాదని లేఖలో పేర్కొంది. 1892లో మద్రాసు- మైసూ రు ఒప్పందం ప్రకారం కర్ణాటకలో ప్రా రంభమై ఆంధ్ర మీదుగా తమిళనాడులో ప్రవహించి, సముద్రంలో కలిసే పాలారు నదిపై దిగువ ప్రాంతమైన తమిళనాడు అనుమతి లేకుండా పైభాగంలో చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు కట్టరాదన్న విషయా న్ని లేఖలో తెలిపింది. ప్రస్తుతం కనకనాశమ్మ దేవాలయం వద్ద ఐదు అడుగుల ఎత్తు చెక్‌డ్యామ్ ఉందని, డ్యామ్ మరో ఐదు అడుగులు ఎత్తు పెంచేందుకు ఆం ధ్ర ప్రభుత్వం కట్టడాలు చేపడుతుందని, ఇది మద్రాసు - మైసూరు ఒప్పందం ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. జయ లేఖరాయడానికి అసలు కథ.. కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంక వద్ద నాలుగు దశాబ్దాల క్రితం కనకనాశమ్మ దేవాలయం వెలిసింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. మొదట్లో ఆంధ్రులే దేవాలయాన్ని ని ర్మాణం చేపట్టారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో కాలక్రమంలో తమిళులు ఆక్రమించుకుని దేవాలయాన్ని అ భివృద్ధి చేశారు. కానీ దశాబ్దకాలంగా త మిళులకు, పెద్దవంక గ్రామస్తులకు దేవాలయ విషయమై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు రాష్ట్ర, జిల్లా సర్వేయర్లు ఇరురాష్ట్రాల అధికారుల సమక్షంలో దేవాలయం ఆంధ్రకు దక్కుతుందని తీర్మానించారు. ఈ ఏడు దేవాలయం నిర్వహణ ఆంధ్ర అధికారులు, ప్రజలు చేపట్టి, గురువారం దేవాలయం ఆలయంలో వాహనాల స్టాండు కోసం వేలం పాట సైతం నిర్వహించారు. వీటన్నింటిని జీర్ణించుకోలేని సరిహద్దులోని తిమ్మంపేట తమిళనాడు వాసులు తమిళ నాయకుల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చి లేఖ రాయించారు. అంతే తప్పా 0.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా లేని చెక్‌డ్యామ్ నిర్మాణంపై కాదని తెలుస్తోంది. -
హామీలన్నీ అమలు చేస్తాం
జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు (టౌన్): కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి సాగునీరు, విత్తన సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తామన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2014 ఆగష్టులో సీఎం చంద్రబాబు రాష్ర్ట ప్రజలకు 17 వరాలు ప్రకటించారని, రెండేళ్ల వ్యవధిలో తొమ్మిదింటిని అమలు చేశారన్నారు. ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్కు, ఆవుకు రిజర్వాయర్ వద్ద టూరిస్టు సెంటర్ ఏర్పాటు, బెంగళూరు- చెన్నై కారిడార్, ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు, కర్నూలు - చిత్తూరు హైవే తదితర అభివృద్ది పనులు మరో 6 నెలల వ్యవధిలో పూర్తవుతాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బిసి. జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రతకు కోత
► తుళ్లూరుకు మంజూరైన కానిస్టేబుల్ పోస్టుల్లో భారీ తగ్గింపు ► గతంలో మంజూరైన 868 పోస్టులను 398కి తగ్గించిన ఆర్థికశాఖ ► పనిభారంతో పోలీసుల సతమతం ► ఎటూ తేలని పోలీస్ కమిషనరేట్ ► పోస్టుల తగ్గింపుపై పోలీస్ ఉన్నతాధికారుల ఆందోళన పేరుకు రాజధాని నిర్మాణ ప్రాంతం.. భద్రతపై మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు. తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటుతున్నా నూతన పోలీస్స్టేషన్ల ఏర్పాటు జరగలేదు. తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని 398కి పరిమితం చేయడం రాజధాని ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. తుళ్లూరును పోలీస్ సబ్‌డివిజన్‌గా చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసి ఏడాది దాటుతున్నా కార్యరూపం దాల్చలేదు. సాక్షి, గుంటూరు : నిత్యం వీవీఐపీల పర్యటనలు.. ఆందోళనలు.. తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనుల వద్ద వరస సంఘటనల నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతంలో పోలీసుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తుళ్లూరును పోలీస్ సబ్ డివిజన్‌గా మార్చడంతో పాటు, డీఎస్పీ, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సిబ్బందిని నియమిస్తామంటూ ఏడాది కిందట జీవో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నాలుగు నెలల కిందట తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పోస్టులు తక్కువని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్న తరుణంలో తాజాగా ఆర్థిక శాఖ సగానికి పైగా పోస్టులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక ముఖ్యమంత్రి చంద్రబాబు సభలు, సమావేశాలు, శంకుస్థాపనల పేరుతో సుమారు 20 సార్లకు పైగా పర్యటించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక ఒక్క నెలలోనే సీఎం మూడు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిత్యం ఇక్కడ పర్యటిస్తూనే ఉన్నారు. అటకెక్కిన ప్రతిపాదనలు ప్రస్తుతం తుళ్లూరులో ఎస్ఐ స్థాయి అధికారితో పాటు, కేవలం 20 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని మిగతా సబ్ డివిజన్ల నుంచి సుమారు 50మంది సిబ్బందిని నిత్యం తుళ్లూరు ప్రాంతంలో ఉంచుతున్నా రు. ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులు సుమారు వంద మంది వరకు అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ కమిషనరేట్‌గా చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా అనేక ప్రతిపాదనలు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందుంచినా రాజకీయజోక్యం కారణంగా కమిషనరేట్ ఏర్పాటు జరగడం లేదు. నూతన పోలీష్స్టేషన్ల ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. మేలుకోకుంటే మరిన్ని ఇబ్బందులు రాజధాని ప్రాంతం పొలాల్లో రెండు దఫాలుగా జరిగిన పంట దహనం సంఘటనల్లో సైతం అసలు బాధ్యుల ను ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. నేరాల దర్యాప్తుపై దృష్టి సారించే స మయం తమకు లేదని, సభలు, స మావేశాలు, పర్యటనలకు బందోబస్తు నిర్వహించేందుకే సరిపోతోందని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసు శాఖ ప్రతిపాదనలపై దృష్టి సారించి భద్రతను కట్టుదిట్టం చేయకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ నిఘా కరువు రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాతో పాటు మావోయిస్టుల సంచారం పెరిగిపోయింది. ఏదో సంఘటన జరిగేంత వరకు పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం తెలియడం లేదు. ఇటీవల తాళాయపాలెం గ్రామంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ అలియాస్ జ్యోతక్కను ఎస్ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ అనేకసార్లు తుళ్లూరు ప్రాంతంలో సంచరించడంతో పాటు, కొంతకాలంగా ఆమె సోదరి ఇంట్లో చికిత్స పొందుతున్నప్పటికీ పోలీసులకు సమాచారం తెలియని పరిస్థితి. ఎస్ఐబీ అధికారులు సమాచారం అందించే వరకు ఇక్కడ ఉన్న పోలీసులకు ఆ జాడే తెలియలేదు. -
ముహూర్తం మారింది
29న 5వ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభం సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం నుంచి పాలనా కార్యకలాపాల ముహూర్తం మారింది. ఈ నెల 27 నుంచి పాలన ప్రారంభిస్తామని గతంలో చెప్పడం తెలిసిందే. అనుకున్న సమయంలో..పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని సీఎం మార్చారు. మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈ నెల 29న ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభిస్తామని, అదేరోజు పాలన మొదలుపెడతామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల్ని ఆయన శనివారం పరిశీలించారు. ఐదో బ్లాక్‌ను పరిశీలించి.. పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద రెండో బ్లాక్‌లోని కుంగిన ఫ్లోర్‌ను పరిశీలించకుండానే ముఖ్యమంత్రి అక్కడ నుంచి వెనుదిరిగారు. కుంగిన నిర్మాణంపై ప్రముఖంగా పత్రికలు రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయితే దాన్ని తాజాగా ‘‘ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నచిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం’’ అని అన్నారు. అలా అంటూనే ఆయన సాక్షిపైన, ప్రతిపక్షపార్టీపైన అక్కసును వెళ్లగక్కారు. శనివారం పనులు పరిశీలించిన సీఎం కుంగిన రెండో బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం. -
పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం
యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు. ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్లు : మంత్రి సునీత రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. -
సీఎం సీరియస్‌లో మర్మమిదే!
► మంత్రి ప్రత్తిపాటిపై రహస్య నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ► నకిలీ విత్తనాలు, పురుగు మందులను అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ► సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణి చక్రం తిప్పుతుందనే ఆరోపణలు సాక్షి, అమరావతి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వీడియోకాన్ఫరెన్స్లోవెల్లడించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగుల బదిలీల సమన్వయం సాకుతో మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలకు జిల్లా అడ్డగా మారినా అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని పుల్లారావు భార్యే చక్రం తిప్పుతుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతు న్నాయి. ఏ పని చేయాలన్నా ఆమె అనుమతి తప్పనిసరని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి పేరు చెప్పి కొందరు అనుచరులు అడ్డంగా దోచుకొంటున్నారని సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలతోనూ సఖ్యత నిల్..: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతోనూ మంత్రి పుల్లారావుకి సఖ్యత కొరవడినట్లు సమాచారం. పలుచోట్ల ఆయనే ఎమ్మెల్యేల ప్రమేయం లేకుం డా కలుగజేసు కోవడం వల్లే సమస్యలు తలెత్తినట్లు చర్చ సాగుతోంది. గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువైనట్లు తెలిసింది. మార్కెట్ యార్డు చెర్మైన్ పదవి విషయంలో మోదుగుల మాటను మంత్రి పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యహరించడంతోనే మార్కెట్ యార్డు చైర్మన్ భర్తీ ఆగిపోయినట్లు సమాచారం. సీసీఐ కుంభకోణంలో ఆరోపణలు.... గత ఏడాది సీసీఐ కొనుగోళ్లలో రూ. 450 కోట్ల కుంభకోణం బహిర్గతమైంది. మార్కెటింగ్ ఉద్యోగులు 15 మంది పైనా సీబీఐ కోర్టు విశాఖపట్నంలో కేసులు దాఖలయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేసినా మంత్రి ప్రత్తిపాటి పట్టించుకోలేదు. ఫైలును తొక్కిపెట్టినట్లు అ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సీసీఐ కుంభకోణంలో అప్పట్లో మంత్రి పాత్రపై పలు ఆరోపణలు వినిపించాయి. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీలు, ఎంపీఈఓల తదితర ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాదిగా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బదిలీలకూ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై నిఘా వర్గాల నుంచి సీఎంకు సమాచారం అందడం వల్లే పుల్లారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. -
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం : సీఎం
► అభివృద్ధి పనుల కోసం ఇళ్లు తొలగిస్తాం ► నష్టపోయినవారికి పరిహారమిస్తాం ► అవసరమైతే ఇళ్లు తొలగిస్తాం ► రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు ► దుర్గగుడి అభివృద్ధిలోనూ ఇళ్ల తొలగింపు తప్పనిసరి ► పుష్కర ఘాట్ల పరిశీలనలో సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను, పుష్కర ఘాట్ల నిర్మాణాలను పరిశీలించారు. వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని తెలిపారు. సకాలంలో పూర్తికాకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. విజయవాడ (కృష్ణలంక) : విజయవాడ రూపురేఖలు మార్చేస్తున్నామని, ఈ నేపథ్యంలో పలుచోట్ల ఇళ్లు తొలగించాల్సి వస్తోందని, ఇళ్లు కోల్పోయినవారు ఇబ్బందిపడకుండా నష్టపరిహారం ఇస్తామే తప్ప వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అనంతరం దుర్గాఘాట్‌లో జరుగుతున్న పనులను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఘాట్‌రోడ్డు అభివృద్ధికి ఇళ్లు తొలగించాల్సి ఉందని, అంతా సహకరించాలని కోరారు. కృష్ణా కెనాల్ చెత్తాచెదారంతో నిండి ఉండటాన్ని గమనించి ఇంజినీర్లను ప్రశ్నించారు. వన్‌టౌన్‌లోని డ్రెయినేజీ నీరు కాలువలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పద్మావతి ఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మావతి ఘాట్‌లో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పుష్కరాల పనులు వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎంపీ కేశినేని నాని, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల పరిశీలన విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన షాపింగ్ కాంప్లెక్స్, భవానీ దీక్ష మండపం తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలను తొలగించిన చోట ఏం ఏర్పాటు చేస్తారంటూ ఇన్చార్జి ఈవో ఆజాద్‌ను అడిగి తెలుసుకున్నారు. కొండపై నుంచి కృత్రిమ జలపాతంతో పాటు కొండ కింద మండపాలను ఏర్పాటుచేసి దుర్గామల్లేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు తూర్పువైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించేలా భవనాన్ని నిర్మించాలని సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ నిర్ణయించారని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్దకు చేరుకుని సీఎం అక్కడి నుంచి నగరాన్ని తిలకించారు. మహామండపం నుంచి నగరాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, హిల్‌వ్యూ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజీ, అమరావతి ప్రాంతాలను వీక్షించేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. మంత్రి నారాయణ, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీ నాని, కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర సృజన తదితరులు ఉన్నారు. దుర్గమ్మను దర్శించుకోకుండానే వెనక్కి.. ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన సీఎం దుర్గమ్మను దర్శించుకోకుండా వెనుదిరిగారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన సుమారు పావుగంట సేపు ఆలయ పరిసరాల్లోనే గడిపారు. పనుల పరిశీలన, అధికారులతో మాట్లాడిన తర్వాత నేరుగా కాన్వాయ్‌తో కొండ కిందకు దిగిపోయారు. -
అవి సీఎం చెప్పిన టెండర్లు
* రద్దు చేయడానికి వీల్లేదు * ఆ అవినీతి టెండర్లు రద్దు చేయాల్సిందే * జెన్కో బోర్డు భేటీలో అధికారుల వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్ల (బీవోసీ)లో భారీ ఎత్తున అవినీతి ఉన్నందువల్ల ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చెప్పినా.. దానిని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వ్యతిరేకించారు. ఈ కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందువల్ల రద్దు చేయడం సరికాదంటూ ఆయన టెండర్ల ప్రక్రియను సమర్థించారు. అజయ్‌జైన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఏపీ జెన్కో బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. విజయానంద్ వాదనతో బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందేనని, టెండర్ అర్హత నిబంధనలను మార్చాలని అజయ్‌జైన్ గట్టిగా అభిప్రాయపడినా.. విజయానంద్ మాత్రం సీఎం అవినీతిని సమర్థించడాన్ని వారు తప్పుపట్టినట్లు తెలిసింది. విజయానంద్ తీరుపై జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. టెండర్లలో దాదాపు రూ. 2,860 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరుగుతోందన్న విమర్శలొచ్చాయని సమావేశంలో జైన్ ప్రస్తావించారు. ఎల్-1గా నిలిచిన బీజీఆర్, టాటాతో రెండు దఫాలు చర్చలు జరిపామని, వారు కొంతమేర తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారని విజయానంద్ సమావేశం దృష్టికి తెచ్చారు. కొద్దిగా తగ్గించుకోవడంపై బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్ మనస్తాపానికి గురైనట్టు సమాచారం.అవినీతి కాంట్రాక్టులైనా సీఎం చెప్పబట్టే ముందుకెళ్లామని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సమావేశం తర్వాత ఎండీ.. తన వెంటే ఉన్న ఫైనాన్స్ డెరైక్టర్‌తో చెప్పినట్టు తెలిసింది. ఏపీ జెన్కో కార్యాలయం విజయవాడకు తరలింపుపై చర్చకు వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నేత భవనాన్ని చదరపు అడుగు రూ. 70కి ఇవ్వడానికి ముందుకొచ్చారని, ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని ఎండీ విజయానంద్ అన్నట్టు తెలిసింది. దీనికి బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికి టెండర్లు..: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తాము కట్టిన ప్రాజెక్టుల కన్నా రూ. 2,860 కోట్ల మేర ఎక్కువ కోట్ చేశాయి. ఇందులో ప్రభుత్వాధినేతకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ కుంభకోణాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. -
2గంటలు 2 కోట్లు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందుతుంటారు. వృథా ఖర్చు తగ్గించి అభివృద్ధికి బాటలు వేయాలని హితబోధ చేస్తారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధికి అందరూ చేయూత నివ్వాలంటూ ఒకడుగు ముందుకేసి చందాలు వసూలు చేస్తారు. కానీ తనుమాత్రం ఆచరించరు. అమరావతి నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి పదిరూపాయలు ఇవ్వాలంటూ చివరకు సెంటిమెంట్‌ను అడ్డుపెట్టి వసూలు చేసిన ఘనత బాబు సర్కార్‌కు దక్కింది. అంతటితో వదలక ఇటుకలు కూడా చందాల రూపంలో సేకరించారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తలో చేయి వేయాల్సిందే..! కానీ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా చంద్రబాబు మాత్రం వృథా ఖర్చు తగ్గించుకోరు. ఆద్యంతం ఎంత ఖర్చయినా సరే ఆయన పర్యటనల్లో హంగులు, ఆర్భాటం తగ్గకూడదు. ఇదే అదునుగా అధికారులు పోటీలు పడి మరీ బాబు పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉంది. రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కోసం ఆయన ఒంగోలు వస్తున్నారు. పట్టుమని రెండు గంటలపాటు సభ. ఇందు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. సభా వేదిక, ఆవరణలో సైతం పైకప్పు కార్పొరేట్ స్థాయిలో పర్మినెంట్ స్ట్రక్చర్లా నిర్మిస్తున్నారు. ఇందు కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాదుకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పజెప్పారు. మినీ స్టేడియం ప్రాంతంలో కొత్తరోడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లతోపాటు పెద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. నగరంలో ప్రధాన రోడ్ల డివైడర్ల లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్సు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పచ్చరంగులు అద్దారు. ఏడాది క్రితమే డివైడర్లకు రంగులు వేసినా సీఎం పర్యటన సాకుతో మరోమారు పచ్చరంగు వేస్తున్నారు. ఇందు కోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇక జనాల తరలింపునకు వందలాది వాహనాలు ఏర్పాటు చేసి తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. బాబు రాక ఇక్కడి పచ్చనేతలకు కాసులు కురిపిస్తోంది. మరోవైపు నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు కూడా శుభ్రం చేయక మురికి పేరుకుపోయింది. ప్రజలు దుర్గంధం, దోమలతో అల్లాడుతున్నా పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు అన్నీ గాలికి వదలి అయిదు రోజులుగా సీఎం సభ ఏర్పాట్లలో తరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారి ఇళ్లు కూలగొట్టడం, పచ్చ చొక్కా నేతలకు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టించడం తప్ప ఒంగోలు కార్పొరేషన్ అధికారులు ప్రజల సంగతి గాలికి వదిలారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చెప్పింది వినాల్సిందే!
► ఆక్వా ఫుడ్ పార్క్‌ను అడ్డుకోవద్దన్న సీఎం చంద్రబాబు ►‘ఏరువాక’లో రైతులకు వాత పెట్టేలా ప్రసంగం ► ప్రజల మనోభావాలకు పాతర ►కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ► పరిశ్రమల్ని అడ్డుకుంటే ఎలాగని నిలదీత సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తాం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రైతులు సాగు ప్రారంభించింది మొదలు పంటలను మార్కెట్లో విక్రయించే వరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది..’ అంటూ రైతులను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధాన్యానికి మద్దతు ధర పెంచే విషయంలో మాత్రం నోరు మెదపలేదు. కనీసం మద్దతు ధరపై రాష్ట్రం తరఫున బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు. ధాన్యం పంట ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీపై స్పందించలేదు. పైగా తాను చెప్పిందే వేదమన్నట్టు.. ఏది చెబితే అది రైతు లు వినాల్సిందే అన్నట్టు అన్నదాతల నెత్తిన ఆక్వా పార్క్ పిడుగు వేశారు. పంటల్ని మింగేసే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తుందుర్రులో చేపట్టవద్దని.. తప్పదంటే సముద్ర తీరంలో భూములు కేటాయించి అక్కడకు తరలించాలని రైతులు కోరుతుంటే.. ‘తప్పదు భరించాల్సిందే’నంటూ హితబోధ చేశారు. భారీ ఉద్యమం సాగినా.. డెల్టా ప్రాంతంలో భారీ ఉద్యమానికి కారణమైన ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుకూలంగా ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రూ. 200 కోట్ల వ్యయంతో భీమవరం మండలం తుందుర్రు గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటూ గతంలో ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజలు మరోసారి ఉద్యమాలకు పూనుకున్నారు. తాత్కాలికంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు కొంత శాంతించారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మళ్లీ ఫుడ్‌పార్క్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలని, పరిశ్రమలు వస్తే అడ్డుకోవడం తగదని హితబోధ చేశారు. ‘కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుందాం. అందులో వచ్చిన నీటిని ప్రాసెసింగ్ చేసి నేరుగా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుందాం. దీన్ని అడ్డుకోవద్దు’ అని సీఎం కోరారు. లక్షలాది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ పరిశ్రమపై ముఖ్యమంత్రి అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. గ్రామాల మధ్య ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జల, వాయు కాలుష్యాలు అధికమై తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల రైతులు, ప్రజలు ఏడాది కాలంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. భీమవరం మండలం తుందుర్రులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులకు టీడీపీకి చెందిన కొందరు నేతలు గత ఏడాది శ్రీకారం చుట్టారు. ప్రజల జీవనానికి తీవ్ర విఘాతం కల్పించే ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిలిపివేయాలని, గ్రామాలకు దూరంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల డిమాండ్‌ను పార్క్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో తుందుర్రుతోపాటు జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు భీమవరం, నరసాపు రం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40గ్రామాల ప్రజలు పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. పార్క్ అవసరాలకు నీటిని విపరీతంగా వినియోగిం చడం వల్ల పరిసర ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని, రొయ్యల శుభ్రతకు ఉపయోగించే కలుషిత నీరు డ్రెయిన్స్‌లో కలవడం వల్ల అందులో ఉండే చేపలు చనిపోయి మత్య్సకారులకు ఇబ్బందులు ఏర్పడతాయనేది వారి ఆందోళన. ఫుడ్ పార్క్‌లో నిత్యం టన్నులకొద్దీ అమోనియా వాడతారని, దానిని నీటిలోకి వదలడం వల్ల జల వనరులు ఎందుకూ పనికిరావని ఆ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ మాన వ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిం చింది. దీనిని ఆపడం కోసం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గతంలో సీఎంను కలిసి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాధవనాయుడి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరడం చర్చనీయాంశం అయ్యింది. -
టీడీపీలోకి పలమనేరు ఎమ్మెల్యే
సుభాష్ చంద్రబోస్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని సీఎం హామీ? తాడేపల్లి రూరల్: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి గురువారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం సీఎం నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరానని, తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. ఇదిలాఉంటే 2014లో పలమనేరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుభాష్ చంద్రబోస్, మరికొందరు టీడీపీ నాయకులను బుధవారమే చంద్రబాబు విజయవాడకు పిలిపించారు.అమర్నాథ్రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుభాష్‌కు నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి
♦ దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు ♦ కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం ♦ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు. ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు. -
ముద్రగడ దీక్ష సమంజసం కాదు: సీఎం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రం కష్టాల్లో ఉంది, అందరూ చేయూతనివ్వాల్సిన తరుణమిది.. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమాజం లో ఇష్టానుసారం ప్రవర్తించకూడదన్నారు. గతంలో ముద్రగడ దీక్ష చేస్తుంటే మరోవైపు రైలు కాల్చారని, రైలేం చేసిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సంస్కృతి లేదని, బయటి వ్యక్తులే తగలబెట్టారన్నారు. కష్టాల్లో ఉన్నాం సమస్యలు సృష్టించడం సరి కాదని ముద్రగడకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నదుల అనుసంధానంద్వారా మెట్టప్రాంతాలకు సాగునీరివ్వడమే లక్ష్యమని సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు చేర్చి, శ్రీశైలం నీటిని నిల్వచేసి రాయలసీమలోని మెట్టప్రాంతానికి ఉపయోగిస్తామన్నారు. -
తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు
నవనిర్మాణ వారోత్సవాల్లో చంద్రబాబు సాక్షి, అమరావతి: మద్యపానం అలవాటును మాన్పిస్తే ప్రజలకు పిచ్చిపడుతుందని సీఎం చంద్రబాబుఅన్నారు. నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మూడో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్టు షాపుల వల్ల ఎక్కువ తాగుతున్నారని, తామంతా కలిసి వీటిని తొలగించినా మరో చోటికి వెళ్లి తాగొస్తున్నారని డ్వాక్రా సంఘ సభ్యురాలు చంద్రావతి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన బాబు తాగుడు మాన్పిస్తే ప్రజలు పిచ్చివాళ్లవుతారన్నారు. అంతలోనే సర్దుకుని ఒక్కసారిగా కాకుండా క్రమేపీ మాన్పించాలన్నారు. ఈ భేటీలో బాబు విద్యాధికులపైనా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా వృద్ధి తగ్గిపోయిందని, ఇదే విధంగా జరిగితే జపాన్ మాదిరిగా రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకోవడమే ఇందుకు కారణమన్నారు. నా స్ఫూర్తితోనే.. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని సీఎం చెప్పారు. తన స్ఫూర్తితోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ‘రాజధాని’కి దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్లు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి దేశీయ ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను బాబు పరిశీలించారు.ఆర్కిటెక్ట్ సంస్థలతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఓ హోటల్లో సమావేశమయ్యారు. హఫీజ్ కాంట్రాక్టర్, సిక్ అసోసియేట్స్ తదితర సంస్థలు డిజైన్లను సమర్పించాయి. వాటిలో ఉత్తమమైదాన్ని ఎంపిక చేయాలని బాబు సీఆర్డీఏకు సూచించారు. -
పేదల భూములకు పరిహారం ఇవ్వరా?
♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ♦ ఎన్పీ కుంటలో భూ బాధితులతో ముఖాముఖి సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘అన్నదాతల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. పేదల భూములను లాక్కొని పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. నిజంగా ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా? పేదవారి భూములంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం? భూమిలేని నిరుపేదలను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చారు. సోలార్ ప్లాంట్ కోసం ఈ భూములను చంద్రబాబు ఎన్టీపీసీకి అప్పగించారు. సాగునీటి వసతి ఉన్న భూములను లాక్కోవడమే కాకుండా వారికి పరిహారం మంజూరులోనూ పక్షపాతం చూపిస్తున్నారు. పేదల భూములేమైనా మీ అత్తగారి సొత్తా?’’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా శనివారం ఆయన కదిరి నియోజకవర్గంలోని నంబులపూల కుంట(ఎన్పీ కుంట)లో పర్యటించారు. సోలార్ ప్లాంట్ కోసం భూములను కోల్పోయిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పట్టా భూములున్న వారికి ఎంత పరిహారం ఇచ్చారో అసైన్డ్, సాగుదారులకూ అంతే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ‘ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తే ఒప్పుకునేది లేదు. వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు చర్మం మందం కాబట్టి, ఆయన మనసు కరగదు. రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు అందరికీ చెక్కులు ఇచ్చి తోడుగా ఉంటాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ముఖాముఖి అనంతరం సోలార్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు జగన్ బయల్దేరగా పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకున్నారు. -
చచ్చాక ఇస్తారా?
► కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం ► ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినవి 10,725 ► ఎదురు చూస్తున్న 52 వేల మంది దరఖాస్తుదారులు ఇతని పేరు గంగయ్య. లేపాక్షి మండలం కుర్లపల్లి. వయసు 70 ఏళ్లకు పైబడి ఉంది. పింఛను కోసం గత ఏడాది జనవరి 12న మొదటి సారిగా అధికారులకు అర్జీ (నంబర్ 129878) ఇచ్చాడు. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు. ముసలి వయసులో ఏ పనీ చేయలేని తనకు కనీసం పింఛ నైనా వస్తే ఆసరాగా ఉంటుందని గంగయ్య చెబుతున్నాడు. ఈమె పేరు పెద్దక్క. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు. ఒక క న్ను పూర్తిగా కనిపించదు. వికలాంగ సర్టిఫికెట్ ఉంటే పింఛన్ ఇస్తామని అధికారులు చెప్పారు. పెద్దాస్పత్రికి వెళ్లి సదరం క్యాంపులో 40 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఏడాదిన్నర గడిచింది. పింఛన్ గురించి అడిగితే నీ పేరు జాబితాలో ఉందని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. అనంతపురం అర్బన్ :పేదల సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వేదికలెక్కి ఊదరగొడుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రత పథకం కింద అందించే పింఛన్లు పేదల దరికి చేరడం లేదు. వీటి కోసంవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గతంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జన్మభూమి కమిటీ సిఫారసు చేసినవారికే దక్కుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పింఛన్లు జిల్లాలో 10,725 ఉన్నాయి. ఇక దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ జరిగినవి 52 వేల వరకు ఉన్నాయి. వీరంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఉన్నవి తొలగించారు.. : ీడీపీ అధికారం చేపట్టిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చేసింది. అప్పటి వరకు జిల్లాలో 4.12 లక్షల మంది పింఛన్ అందుకునే వారు. మొత్తాన్ని పెంచిన తర్వాత ప్రభుత్వం విచారణ చేయించి 1.30 లక్షల పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2.82 లక్షలకు తగ్గిపోయింది. ఆ తరువాత విడతలవారీగా 1.05 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తమ్మీద 3,87,654 మంది పింఛన్ అందుకుంటున్నారు. జన్మభూమి కమిటీల నిర్వాకం జిల్లాలో జన్మభూమి కమిటీల నిర్వాకంతో వేలాది మంది పేదలు పింఛన్‌కు దూరమయ్యారు. బత్తలపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 200 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. వీరంతా మూడు నెలల క్రితం కలెక్టరేట్‌కు తరలివచ్చి జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొిహ ద్దీన్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. కొత్త పింఛన్ల ఊసేలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా కొత్తగా పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా మరణి ంచినా, వరుసగా కొన్ని నెలలు తీసుకోకున్నా.. అలాంటి వారి పేర్లను తొలగిస్తామని, వారి స్థానంలో కొత్తవాటికి మంజూరు చేస్తామని ఒక అధికారి చెప్పారు. -
ప్రజల్ని రెచ్చగొట్టాలని యత్నించారు
సీఎం ‘నవ దీక్ష’ ప్రసంగంపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: నవనిర్మాణ దీక్ష పేరుతో చేసిన ప్రసంగంతో సీఎం చంద్రబాబు ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టే యత్నం చేశారని, రెండేళ్ల పాలనలో తాను చేసిందేమిటో చెప్పుకోలేక అబద్ధాలాడి.. విభజన సమయంలో ఏపీ ప్రజలకు జరిగిన గాయాన్ని ఇంకా రేకెత్తించే యత్నం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా రెండేళ్లలో ఏపీ ప్రజలను ఇలా ముందుకు తీసుకెళ్లగలిగానని చెప్పుకోలేకపోయారన్నారు. ఈ దీక్షకోసం విడుదల చేసిన జీవోలో ‘ఏపీ పౌరులు’ అని పేర్కొనడమే దారుణమైన తప్పన్నారు. మనమంతా భారత పౌరులమేతప్ప రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదన్నారు. జీవో జారీ చేసిన ఐఏఎస్‌లు శిక్షణ పొందింది ముస్సోరిలోనా... ఎన్టీఆర్ భవన్‌లోనా? అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ అవినీతి కేసులో ఇరుక్కోక పోయినట్లైతే ఆదరాబాదరా తట్టాబుట్టా సర్దుకుని తనతోపాటు ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సి వచ్చేదా? ’’ అని ఆమె ప్రశ్నించారు. -
అందరి గుట్టు నా ‘గుప్పిట్లో’: సీఎం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ): ‘మనుషులు మోసం చేస్తారేమో కానీ.. టెక్నాలజీ మోసం చేయదు. అందుకే నేను టెక్నాలజీని నమ్ముకున్నా. ఏడాదిలో అందరి గుట్టూ నా చిన్న ఫోన్లో ఉంటుంది..’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాలులో గురువారం టీడీపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే జూలై కల్లా ఫైబర్ కనెక్షన్ పూర్తవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీఎం సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతి మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకోనుందని బాబు అన్నారు.పీఎంఎస్ఎస్వై ద్వారా విడుదల చేసిన రూ.150 కోట్లతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు చంద్రబాబు భూమిపూజ నిర్వహించారు. -
అధికారమే ధ్యాస.. అక్రమాలే శ్వాస
► సీఎం తీరుపై ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఎద్దేవా ► గద్దె దింపితేనే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అని విమర్శ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే ధ్యాస, అక్రమాలే శ్వాసగా కొనసాగుతున్నారని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో జరిగిన మహానాడును ప్రస్తావిస్తూ నిజంగా ఎన్టీఆర్‌ను ప్రేమించే వారైతే ఆ సభలకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. పార్టీ తనదంటూ వ్యవస్థాపకుడినే బహిష్కరించిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎన్టీఆర్‌కు చేసిన అవమానం మరిచిపోయారా అంటూ మహానాడుకు వెళ్లిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చావుకు నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆయన చనిపోయినప్పుడు ఫతే మైదాన్‌లో అడుగుపెట్టే ధైర్యం చాలక బయటే ఉండిపోయారని గుర్తు చేశారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన హరికృష్ణ లోపలికి పిలుచుకువచ్చారన్నారు. అన్నా క్యాంటీన్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన్ను గద్దె దింపితేనే ఎన్టీరామారావుకు అసలైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు సలాం, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చివర్లో సిక్కోలు!
జిల్లాను అభివృద్ధి చేసేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకు 7. కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీడీజీ) ప్రకారం ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ర్యాంకులు అన్నీ అట్టడుగునే ఉన్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సిక్కోలే చివరి స్థానంలో ఉండటం జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కడుతోంది. ఒక్క సేవా రంగంలోనే పొరుగునున్న విజయనగరం జిల్లా కన్నా కాస్త మెరుగనిపించి అడుగు నుంచి రెండో స్థానంలో సిక్కోలు నిలిచింది. ఇక జిల్లా ఆర్థిక పరిస్థితిని చాటిచెప్పే తలసరి ఆదాయం విషయంలోనూ చివరి స్థానమే దక్కింది. టీడీపీ ప్రభుత్వం జిల్లా మంత్రికి, ఎమ్మెల్యేలకు ఇస్తున్న ర్యాంకులకు, ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన గణాంకాల ప్రకారం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధం లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది. * అభివృద్ధిలో మంత్రి అచ్చెన్నకు ఏడో ర్యాంకు! * ప్రభుత్వ గణాంకాలతో గందరగోళం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో ఏడుసార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్తానని పలు హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ఏర్పాటు కాలేదు. వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తింపు ఉందని, ఆ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. పర్యాటకపరంగానూ జిల్లాకు పలు ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి జిల్లా స్థూల ఉత్పత్తిలో మెరుగవ్వాలంటే మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం గాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో జిల్లా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హామీలు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించిన గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థూల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లు ఉంది. దీనిలో రూ.72,219 కోట్ల భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, రూ.22,707 కోట్లతో సిక్కోలు చివరి స్థానంతో సరిపెట్టుకుంది. కృష్ణా జీడీడీపీతో పోల్చితే జిల్లా భాగస్వామ్యం మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. పొరుగునున్న విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ ర్యాంకు దక్కించుకొని శ్రీకాకుళం కన్నా మెరుగనిపించింది. తలసరి ఆదాయం... ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక. ఈ విషయంలోనూ సిక్కోలు చివరి స్థానానికే పరిమితమైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 ఉంటే జిల్లాది రూ.74,638 ఉంది. ఉత్తరాంధ్రలోనే ఒకటైన విశాఖ జిల్లా రూ.1,40,628తో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈలెక్కన ఒక విశాఖ వాసి సగటు ఆదాయంలో సిక్కోలు జిల్లా నివాసి ఆదాయం సగం మాత్రమే. విజయనగరం కూడా రూ.86,223 తలసరి ఆదాయం పొంది 12వ ర్యాంకుతో జిల్లా కన్నా మెరుగనిపించింది. వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.1,64,086 కోట్లు ఉండగా దానిలో రూ.22,697 కోట్ల భాగస్వామ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. శ్రీకాకుళం మాత్రం కేవలం రూ.5,015 కోట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చితే ఈ రంగంలో సిక్కోలు వాటా నాలుగో వంతు కూడా లేదు. విజయనగరం జిల్లా రూ.5,894 కోట్లతో 12వ స్థానంతో జిల్లా కన్నా మెరుగ్గా ఉంది. పారిశ్రామిక రంగం అన్ని వనరులున్న శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తామని రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చినా ఆచరణలో కానరావట్లేదు. ఈ ప్రభావం జిల్లా జీడీపీపై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర జీడీడీజీలో పారిశ్రామిక రంగం వాటా రూ.1,31,643 కోట్లు కాగా దానిలో రూ.24,532 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రంగంలో కూడా రూ.4,400 కోట్లతో సిక్కోలుకు చివరి స్థానమే దక్కింది. విశాఖతో పోల్చితే ఆరో వంతు కూడా లేకపోవడం గమనార్హం. విజయనగరం రూ.4,493 కోట్లతో కాస్త మెరుగైన స్థానంలో ఉంది. సేవా రంగం రాష్ట్ర జీడీడీపీలో సేవారంగం వాటా రూ.2,61,917 కోట్లు కాగా, దానిలో రూ.32,593 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. సిక్కోలు మాత్రం రూ.11,571 కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో మాత్రం విజయనగరం (రూ.10,800)ను వెనక్కు నెట్టగలిగింది. విశాఖ జిల్లాతో పోల్చితే సిక్కోలుది మూడో వంతు ఉంది. -
రైతుల సొమ్ము రాజధాని పాలు
సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు. సాక్షి, విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి... వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందంటే... జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే... ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తెర వెనుక కథ ఇదీ యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని కోర్టుకు వెళ్లొచ్చు రాజధానికి విరాళం ఇవ్వటాన్ని 12 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రైతుల డబ్బేమీ ఇవ్వలేదు. రైతుల వాటా రైతులకు పంచేస్తున్నాం. యూనియన్‌కు వచ్చే నగదులోనే ఇస్తున్నాం. ఇప్పటికే రూ.200 కోట్లు రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తున్నాం. మిగిలిన డెయిరీలతో పోలిస్తే మేమే రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నాం. అంతా చట్టప్రకారమే చేస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు. - మండవ జానకిరామయ్య, చైర్మన్, కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి -
ప్రత్యేక హోదా సాధించే దమ్ము చంద్రబాబుకు లేదు
డీసీసీ అధ్యక్షుడు పనబాక కోట: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దమ్ము, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కోటలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తే తర్వాత జరిగే పరిణామాలేమిటో చంద్రబాబుకు తెలుసన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాటమార్చి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనముండదన్నారు. ఉద్యమాల ద్వారానే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేకహోదా సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ అందుకు సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఏపీకి సాగు,తాగు నీటి ఇబ్బందులు తప్పవన్నారు. ఓటు కు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నోరు విప్పడం లేదన్నారు. పలువురికి పదవులు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడిగా చిట్టమూరు మండలానికి చెందిన దువ్వూరు మధుసూవన్రెడ్డిని నియమించారు. వెంకన్నపాళేనికి చెందిన గుర్రం అశోక్‌ను జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా, కోటకు చెందిన తీగల సురేష్‌ను జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా నియమించినట్లు కృష్ణ య్య ప్రకటించారు. సమావేశంలో దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జున్‌రావు, తాజుద్దీన్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో తిరగనివ్వం
చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ హెచ్చరిక గుడివాడ టౌన్: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గ్రామాల్లో తిరగనివ్వమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ హెచ్చరించారు. స్థానిక ఎస్పీఎస్ హైస్కూల్లో మాదిగల ఆత్మగౌరవ సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదిగలను విస్మరించినందుకే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని అన్నారు. ఎంతకాలం మాయమాటలు చెప్పి మాదిగలను మోసం చేస్తారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకుంటే 18 ఉపకులాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగపోతురాజు, జిల్లా నాయకులు కంచర్ల సుధాకర్, నాగబాబు, యు.ఆశీర్వాదం, జిల్లా మహిళా ప్రతినిధి జె.ప్రశాంతి పాల్గొన్నారు. -
టీడీపీలో చిచ్చు
► విజ్ఞానయాత్రతో కుమ్ములాటలు బట్టబయలు ► మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తున్న కార్పొరేటర్లు ► తలపట్టుకుంటున్న అధిష్టానం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో విజ్ఞానయాత్ర చిచ్చు రేపుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్ తీరుపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పుణే ఘటనకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ మేయర్ కనీసం ఖండించకపోవడంపై కస్సుబుస్సులాడుతున్నారు. టూర్లో ఉండగా చండీఘర్‌లో పలువురు కార్పొరేటర్లు భేటీ అయి మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మేయర్ కావాలనే తమను టూర్‌కు పంపించి అల్లరి చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డట్లు భోగట్టా. మేయర్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో తమను భాగస్వాముల్ని చేయడం లేదని, పుణే, సిమ్లా, అమృత్‌సర్‌లో పాలన గురించి తెలుసుకున్న తమకు నగరంలో ఏం జరుగుతోందీ తెలియకుండా మేయర్ గుట్టుగా ఉంచుతున్నారని పలువురు మహిళా కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. నగరానికి చేరుకోగానే అత్యవసర భేటీ నిర్వహించాలని కార్పొరేటర్లు తీర్మానం చేసుకున్నారు. అనూహ్య రీతిలో ఉమ్మడి చంటి ఘటన తెరపైకి రావడంతో మేయర్‌పై అసమ్మతిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పెరుగుతున్న దూరం : గత కొంతకాలంగా మేయర్‌కు, పార్టీ కార్పొరేటర్లకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. మేయర్ చైర్‌ను ఆశిస్తున్న ఓ సీనియర్ కార్పొరేటర్ తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. సామాజిక వర్గ బలాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. మేయర్‌ను అర్ధంతరంగా మార్చాల్సి వస్తే సామాజిక సమీకరణలు మారతాయని, ఓసీ లేదా బీసీల్లో వేరే సామాజిక వర్గాలకు పదవి దక్కే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇప్పటికి స్తబ్దుగా ఉండాలని ఆయన సామాజిక వర్గ పెద్దలు సూచించినట్లు సమాచారం. గతంలో శ్రీ కనకదుర్గా లే అవుట్ సొసైటీ వ్యవహారంలో మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మేయర్ సీనియర్ కార్పొరేటర్ల పేరుతో ఒక వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్, జూనియర్ కార్పొరేటర్లు అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు. విజ్ఞాన యాత్రకు వెళ్లాలనే ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మేయర్ దానిని వ్యతిరేకించారు. మంత్రి పి.నారాయణ సైతం పుష్కరాలు వెళ్లే వరకు వద్దని వారించారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టుబట్టి మరీ టూర్‌కు వెళ్లి అల్లరయ్యారు. తాము అల్లరవడం వెనుక మేయర్ హస్తం ఉందన్నది పలువురు కార్పొరేటర్ల వాదన. శనివారం నాటి ప్రెస్‌మీట్‌కు తొలుత మేయర్ దూరంగా ఉన్నారు. పార్టీలోని విభేదాలపై విలేకరులు ప్రశ్నించడంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో 40 నిమిషాల తరువాత మేయర్ ప్రెస్మీట్లో ప్రత్యక్షమయ్యారు. ‘మా కార్పొరేటర్లు ఏ తప్పు చేయలేదు.. మేమంతా ఒక్కటే..’ అంటూ సర్దిచెప్పుకొచ్చారు. టూర్‌కు వెళ్లిన వారిలో దుష్టబుద్ధి ఉన్న కార్పొరేటర్ ఎవరైనా పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చంటూ కొసమెరుపు ఇచ్చారు. హైకమాండ్ సీరియస్ : విజ్ఞాన యాత్రలో అపశృతులపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, మునిసిపల్ మంత్రి పి.నారాయణ పార్టీ కార్పొరేటర్ల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. మద్యం, మహిళల వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోకిరీ వేషాలు పార్టీ పరువును దిగజార్చాయంటూ మందలిస్తూనే తప్పు చేసిన వారిని రక్షించుకొనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీలో గ్రూపులుగా విడిపోతే నష్టపోతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏతావాతా విజ్ఞానయాత్ర టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. -
రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం
ఒర్లాండ్లో ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్ఆర్ఐలకు వివరించారు. సీఎం అవినీతికి పాల్పడిన అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు- అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో శుక్రవారం ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండ్ నగరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజధాని పేరుతో విలువైన భూములను సీఎం చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ సీఎంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుజనా చౌదరికి చెక్ !
మరోసారి రాజ్యసభ అవకాశం లేనట్లే సాక్షి, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరికి చెక్ పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెల 21తో ముగియనుంది. ఆయనతోపాటు రాష్ర్టం నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో టీ డీపీలోని ఆశావహులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరిస్తారని సుజనా చౌదరి ధీమాతో ఉన్నారు. అయితే, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా కొంతకాలంగా బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆయన కోర్టులకు హాజరు కావడం, ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు, ఇతరులు ప్రధానితోపాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఫిర్యాదులు, కేసుల దృష్ట్యా సుజనాకు ఈసారి అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
హోదా సంజీవని కాదని బాబే అన్నారు కదా!
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సీఎం చంద్రబాబే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారని.. ఆయనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనే సంకేతాలు కేంద్రానికి ఇచ్చి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇక్కడికి వచ్చినపుడు కూడా ప్రత్యేక హోదా గురించి బాబు అడగలేదని గుర్తుచేశారు. ఒకవైపు రాష్ట్రంలో ‘లోటు’లో ఉందంటూ మరోవైపు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ నిధులకు రాష్ట్రాభివృద్ధికి వెచ్చిస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ఈ దుబారా ఖర్చులను కేంద్రం నిధులు భరించదన్నారు. గురువారం బీజేపీ నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా లీకులిస్తూ టీడీపీ చోటా నాయకులతో బీజేపీని, ప్రధాని మోదీని తిట్టిస్తూ నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రజల గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేస్తూ ఆ పార్టీని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి అధికార దాహంతో వెళ్లడం నీచమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. వ్యవసాయ రుణమాఫీ, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్‌షాపుల రద్దు, మహిళలకు భద్రత, నిరుద్యోగభృతి వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసీ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో లేక్వ్యూగెస్ట్హౌస్, సెక్రటేరియట్, ఇక్కడ క్యాంపు కార్యాలయాల మరమత్తులకు రూ.కోట్లు దుబారా చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.1,41,800 కోట్లు ఇచ్చిందంటూ ఆ వివరాలు పత్రికలకు విడుదల చేశారు. -
బాక్సైట్ కోసమే గిరిజన ఎమ్మెల్యేల కొనుగోలు
మాజీ స్పీకర్ మనోహర్ చింతపల్లి: మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే మన్యం ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. విదేశీ కంపెనీలతో తవ్వకాలకు ఒప్పందం కుదుర్చుకుని బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిచడంతో గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని, అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారని విమర్శించారు. గిరిజనులు ఆందోళన చేయడంతో పాత జీవోలను రద్దుచేసిన చంద్రబాబు, కొత్త జీవో రద్దు చేయకుండా ఇంతకాలం గిరిజనులను మభ్యపెట్టారని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రకటనతో అసలు రూపం బయట పడిందని చెప్పారు. గిరినాభివృద్ధికి బాక్సైట్ తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం లేదని, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగిస్తే గిరిజన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు తాను మచ్చలేని వ్యక్తినని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెపుతుంటారని, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఎక్కడ నుంచి వస్తున్నాయని మనోహర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని నీతులు వల్లించిన చంద్రబాబు, ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఉగ్రంగి లక్ష్మణరావు, సర్పంచ్‌లు సాగిన దేవుడమ్మ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పునరాలోచించాలి
►గుంటూరు, విజయవాడ మధ్య ప్రజారాజధాని నిర్మించాలి ► బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ గాంధీనగర్ : రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ అన్నారు. స్థానిక జనసభ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మకి కంపెనీ డిజైన్ విషయంలోనే కాదు, రాజధాని విషయంలోనే పునఃసమీక్ష జరపాలని కోరారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాలు, నిపుణు లు, ప్రజాసంఘాలు ఎవరెంత చెప్పినా సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత, బంధుమిత్రగణ స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మూ ర్ఖంగా నిర్ణయాలు చేయడం సరికాదన్నారు. విభజనతో నష్టపోయిన అవశేషాంధ్రప్రదేశ్ను చంద్రబాబు తన నిర్ణయాలతో మరింత సంక్షో భం, అగాథంలోకి నెట్టివేస్తున్నారని, ఆయనను భావితరాలు క్షమించవన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో తాను కలల్లో తేలిపోతూ ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో ముంచి తేలుస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వీరబ్రహ్మం, చప్పిడి కృష్ణమోహన్, రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కా శ్రీనివాసరావు, పటాకుల నరసింహారావు, మరీదు ప్రసాద్ పాల్గొన్నారు. -
వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదు
విజయవాడ సెంట్రల్ : గడిచిన వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ప్రకాశం బ్యారేజ్, దుర్గాఘాట్, భవానీద్వీపం ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే రోజున బ్యారేజ్‌లో 10.7 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. నీటి నిర్వహణపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వల్లే దుర్భర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల్ని అడ్డుకోవడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సమస్యను ఎపెక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు -నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పార్టీ నాయకులు ఎల్.ఈశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
బాబు తాటాకు చప్పుళ్లకు భయపడం
సీఎం చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి (తూర్పుగోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు కాపుజాతి భయపడబోదని, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఓపిక ఉన్నంత వరకే కాదు.. ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతామని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపు జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను రోడ్డెక్కిన తరువాతే మంజునాథ కమిషన్ వేశారన్నారు. అయినప్పటికీ ఆ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమాచారం లేదని, వెంటనే కమిషన్ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ జైల్లో పెట్టి నిర్బంధించినా, కేసులు పెట్టి భయపెట్టినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. తమ డిమాండ్లతో బాబుకు లేఖ రాసినట్లు ముద్రగడ తెలిపారు. -
‘హోదా’ సంజీవని కాదన్నది నువ్వే..
చంద్రబాబుపై బీజేపీ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అని స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే అంశాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మండిపడింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలు కపిలేశ్వరయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో, చెడు జరిగితే నరేంద్ర మోదీ ఖాతాలో వేయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని సురేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించి, మోదీ ఏపీకి ఏమీ చేయడం లేదంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ‘‘ఏపీలో ఎక్కడ చూసినా ప్రభుత్వ నిధులు దుబారా అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మీ(టీడీపీ) ఇష్టానుసారం పరిపాలన సాగిస్తే కుదరదు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ఖర్చుపై శ్వేతప్రతం విడుదల చేయాలి. జమా ఖర్చులు లెక్కచెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీపై అపనిందలు వేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’’ అని సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న, బుచ్చయ్యచౌదరి లాంటివాళ్లతో తిట్టాల్సిందంతా తిట్టించి మరోవైపు బీజేపీపై విమర్శలు చేయవద్దని ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిమ్మల్ని ఎవరు మాతో కలిసి రమ్మన్నారు.. ఎవరు పొమ్మంటున్నారు? అని ప్రశ్నించారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తే, అదంతా గాలికి వదిలేసి ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు పెంచేశారని సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పారదర్శక పాలన అందించాలన్న మోదీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అందిస్తున్నా... అమరావతికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా మోదీ ఫొటో పెట్టలేదని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో రోడ్లు వేయిస్తూ ముఖ్యమంత్రి ‘చంద్రన్నబాట’ అంటూ తన సొంత పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.