రాజధాని పేరుతో ‘రియల్’ వ్యాపారం
ఆర్పీఎస్ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి
మద్దికెర: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రసాధనే లక్ష్యంగా చేపట్టిన బస్సుయాత్ర సోమవారం మండల కేంద్రమైన మద్దికెరకు చేరుకుంది. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సంతలో పశువులను కొన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. సీమలో ఫ్యాక్టరీలు లేవని, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు బేల్దారి, ఉపాధి పనులుకు వెళతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెనుకబడిన ప్రాంతాన్ని విడిచి పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కోస్తాను రాజధానిగా ఎంపిక చేయడం దారుణం అన్నారు. కృష్ణా, తుంగభద్రా, పెన్నా నదుల నీటిని కోస్తాకు తరలిస్తున్నారని ఆరోపించారు. అత్యంత వెనకబడిన ఆఫ్రికాలో సోమాలియాలో జనాభా పెరుగుతుంటే రాయలసీమలో జనాభా తగ్గుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గం పత్తికొండలో.. బిందె నీటి కోసం మహిళలు పనులు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాయలసీమ 68 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో ఉందని.. ప్రత్యేక రాష్ట్రం చేస్తే దేశంలోని 13 రాష్ట్రాల కంటే పెద్దదవుతుందన్నారు. సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటే ఉద్యమబాట పట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.