న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్‌ను చూస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్‌ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు.
ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన
‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్‌ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్‌గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.
బడ్జెట్ ఇళ్లకు డిమాండ్..
దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.
పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment