boom
-
రియల్ బూమ్!
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో రెండు దశాబ్దాల పాటు భారీ బూమ్‌ను చూడనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్ డాలర్లు (రూ.16.6 లక్షల కోట్లు సుమారు)గా ఉన్న మార్కెట్.. 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఇళ్లకు బలమైన డిమాండ్ కొనసాగుతోందని, మందగమన సంకేతాలు లేవని క్రెడాయ్ స్పష్టం చేసింది. ‘‘2021 నాటికి 0.2 ట్రిలియన్ డాలర్లతో భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగ వాటా 6–8 శాతం మధ్య ఉంది. గణనీయంగా పెరిగి 2031 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఇది కనీస అంచనా మాత్రమే. వాస్తవానికి 5–7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఆశావహంగా చూస్తే 7–10 ట్రిలియన్ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటికి భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 14–20 శాతం మధ్య ఉంటుంది’’ అని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా నివేదిక తన అంచనాలను విడుదల చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ స్థిరీకరణకు తోడు సంస్థల పాత్ర పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆఫీస్, నివాస రియల్ ఎస్టేట్‌తోపాటు, డేటా సెంటర్లు, వృద్ధుల ప్రత్యేక నివాసాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. చిన్న పట్టణాలకూ విస్తరణ.. రియల్ ఎస్టేట్ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని క్రెడాయ్–కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టాం’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్ వసతులకు ఊహించనంత డిమాండ్ ఏర్పడనున్నట్టు తెలిపారు.జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అవసరం రియల్టీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం కలి్పంచాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ డిమాండ్ చేశారు. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా 2017లో రూ.45 లక్షల వరకు ధరల్లోని వాటిని అందుబాటు ధరల ఇళ్లుగా పేర్కొనడం గమనార్హం. ఈ వృద్ధి నాన్‌స్టాప్!ఇళ్లకు డిమాండ్ బలంగా కొన సాగుతోందని, మందగమన సంకేతాల్లేవని క్రెడాయ్ స్పష్టం చే సింది. క్రెడాయ్ నాట్కాన్ సదస్సు సోమవారం ఢిల్లీలో మొదలైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. డిమాండ్‌కు తగ్గ ఇళ్ల సరఫరా అవసరం ఉందని క్రెడాయ్ తెలిపింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అన్నది, కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత ఇళ్లకు మొదలైన డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు వివరించింది. డిమాండ్‌కు తగ్గ నిల్వలు లేవని ప్రెస్టీజ్ గ్రూప్ సీఎండీ, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ రజాక్ తెలిపారు. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
హైదరాబాద్ మార్కెట్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి. ‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్లో డిమాండ్ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్ టైగర్ నివేదిక పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్‌లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► కోల్‌కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి. -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్‌ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్‌ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్‌ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్‌గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్‌లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ బైక్స్ వరుస అగ్నిప్రమాద ఘటనలపై కేంద్రం స్పందించింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల ఘటనలను సుమోటోగా స్వీకరించిన కేంద్రం, అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాల వివరణ ఇవ్వాలని వినియోగదారుల పర్యవేక్షణ సంస్థ ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవలి ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాద సంఘటనలపై ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసు జారీ చేసిందని సీఎన్‌బీసీ రిపోర్ట్ చేసింది. అలాగే ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్ వారి ఇ-స్కూటర్లు పేలడంతో సీసీపీఏ గత నెలలో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌కు 15 రోజుల గడువు ఇచ్చింది. మరోవైపు తమ బ్యాటరీ సిస్టం ఇప్పటికే యూరోపియన్ స్టాండర్డ్ ఈసీఈ 136కి అనుగుణంగా ఉండటంతో పాటు దేశీయ తాజా ప్రతిపాదిత ప్రమాణం ఏఐఎస్ 156 కు అనుగుణంగా ఉందని కంపెనీ తెలిపింది. కాగా ఇటీవల, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు ఆందోళన రేపాయి. దీంతో తయారీ దారులు తమ వాహనాలను రీకాల్ చేసాయి. ఏప్రిల్‌లో, ఓలా ఎలక్ట్రిక్ 1 441యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్ని రీకాల్ చేసింది. అలాగే బూమ్ మోటార్స్ ఏప్రిల్ చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్‌తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పేలుడు సంభవించి 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తెలంగాణలోని నిజామాబాద్‌లో ప్యూర్ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుడు కారణంగా 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సుమారు 2,000 స్కూటర్లను రీకాల్ చేసింది. ఇది ఇలా ఉంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ట్విటర్ షేర్ చేసిన ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీ ప్రమాదాలు జరుగుతాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ అగ్నిప్రమాదాలు జరుగుతాయి. కానీ ఐసీఈ ప్రమాదాలతో పోలిస్తే ఈవీల్లో తక్కువని ఆయన ట్వీట్ చేశారు. In case you missed it @hormazdsorabjee 🤔 EV fires will happen. Happens in all global products too. EV fires are much less frequent than ICE fires. https://t.co/gGowsWTKZV — Bhavish Aggarwal (@bhash) June 23, 2022 -
మున్సిపాలిటీలకు మహర్ధశ
నల్లగొండ : మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది..! మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలం గాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కింద ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తున్న క్రమంలో వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఐడీసీ ద్వారా ఒక్కో మున్సిపాలిటీకి సుమారు రూ.20కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో గ్రేడ్–1 మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, గ్రేడ్–2 మున్సిపాలిటీకి రూ.10 నుంచి 15కోట్లు, నగర పంచాయతీలకు రూ.10కోట్ల వరకు నిధులు కేటా యించనున్నారు. నల్లగొండ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కావడంతో రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మి ర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.10 నుం చి రూ.15కోట్లు, దేవరకొండ నగర పంచా యతీకి రూ.10కోట్ల వరకు నిధులు మం జూరయ్యే అవకాశం ఉందని అంటున్నా రు. దేవరకొండకు ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేసినందున ఎఫ్ఐడీసీ ద్వారా మరో రూ.5కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు, పనుల పర్యవేక్షణ బాధ్యతలు మున్సి పాలిటీ అధికారులకు సంబంధం లేకుం డా జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలి.. ఎఫ్ఐడీసీ ద్వారా విడుదలయ్యే నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదలను ఈ నెలాఖరులోగా పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రెండు, మూడు మాసాల్లో పనులు పరిపాలన ఆమోదం పొంది, టెండర్లు పిలుసా ్తరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వం జూన్2న పనులు ప్రారంభిస్తారు. స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సలహా, సూచనల మేరకు మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాధనల విషయంలో ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నిధుల విషయంలో ము న్సిపల్ కమిషనర్లకు ఎలాంటి సంబందమూ లేదు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పనులను ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ననుల పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. మున్సిపల్ పాలకవర్గాలు లేని కాలంలో స్పెషల్ అధికారులుగా వ్యవహరించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. నల్లగొండ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్, మిర్యాలగూడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్, దేవరకొండ స్పెషల్ ఆఫీసర్‌గా డీఆర్డీఓ లేదా డీఆర్వోను నియమించే అవకాశం ఉంది. చేపట్టే అభివృద్ధి పనులు... మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనమైన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు తొలిప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయం, పార్కులు, ఎల్ఈడీ లైట్స్, మోడల్ మార్కెట్స్, ఆడిటోరియంల నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, బస్‌బేలు, మురికి కాల్వల అభివృద్ధి, శ్మశాన వాటికల పనులు చేపడతారు. -
రెండో రోజూ.. అదే జోరు
38 అక్రమ నిర్మాణాల కూల్చివేత l దగ్గరుండి పర్యవేక్షించిన మేయర్, కమిషనర్ l అక్రమార్కులకు నోటీసులు l బడాబాబులకు బెదరని జీడబ్ల్యూఎంసీ సాక్షి, హన్మకొండ : నాలా కబ్జాదారులు, చెరువు శిఖం ఆక్రమణదారులపై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ యంత్రాంగం దాడులు రెండో రోజూ ముమ్మరంగా కొనసాగాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా నాలాలపై ఉన్న 38 అక్రమ నిర్మాణాలను జేసీబీ లతో కూల్చివేశారు. భారీ పక్కా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దగ్గరుండి కూల్చివేత పనులు పర్యవేక్షించారు. నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత అనివార్యమని, ఇది నగర ప్రజల శ్రేయస్సు కోసమేనని మేయర్ నరేందర్ తేల్చిచెప్పగా.. నాలాలు, చెరువులను ఆక్రమణలకు సంబంధించి ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. అక్రమణ నిర్మాణాల కూల్చివేత పనులను ఈ ఇద్దరు దగ్గరుండి పర్యవేక్షించారు. బీమారంలోని శ్యామల చెరువు ఆక్రమణల తొలగింపును గురువారం మేయర్ నరేందర్ పరిశీలించారు. అనంతరం నయీంనగర్ పెద్దమోరి బ్రిడ్జి వద్ద చైతన్య డిగ్రీ కళాశాల దగ్గర కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత.. నాలా వెడల్పుకై మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని ఎన్టీఆర్ నగర్లో భద్రకాళి నాలాను ఆక్రమించి సుమారు రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన కంకర్ రెడీమిక్స్ యూనిట్ ప్రహరీ గోడ కూల్చివేత పనులను కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా రెడీమిక్స్ యూనిట్ ప్రతినిధులు సంబంధిత స్థలాన్ని కొనుగోలు చేశామని, ప్రహరీ, మిక్సింగ్ యూనిట్లను తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేసినట్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ భద్రకాళి చెరువు ఫుల్ టాంక్ లెవల్ పరిధిలో రెడీమిక్స్ యూనిట్ నిర్మాణం జరిగిందని, దీనివల్ల వదర నీటి ప్రవాహం సరిగా లేక ఎన్టీఆర్ నగర్, పరిసర కాలనీలు నీటమునిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. రెడీమిక్స్ యూనిట్ కూల్చివేతకు 15 రోజుల గడువు ఇవ్వాలని యూనిట్ నిర్వాహకుల అభ్యర్థించారు. రెండు రోజుల వ్యవధిలో యూనిట్లో విలువైన యంత్రాలు తరలించాలని, లేదంటే యంత్ర పరికరాలతో సహా అన్నింటిని నేలమట్టం చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెడీమిక్స్ యూనిట్ ఉన్న రెండు ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీని పూర్తిగా కూల్చివేయాలని ఏసీపీ రవికి ఆదేశాలు జారీ చేశారు. మెుత్తం 51 నిర్మాణాలు కూల్చివేత అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు 38 నిర్మాణాలను నేలమట్టం చేశారు. కూల్చివేతలకు సమాంతరంగా శిథిలాల తొలగింపు, నాలాల వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇందులో నయింనగర్ నాలా వెంబడి ఉన్న వాగ్దేవి, చైతన్య విద్యాసంస్థలకు చెందిన 32 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. గురువారం కూల్చివేసిన నిర్మాణాలో మరుగుదొడ్లు 17, పిల్లర్ పునాది 1, రేకులషెడ్డులు 7, స్లాబ్ షెడ్ 1, షెడ్డు 1, ప్రహరీ గోడలు 5 ఉన్నాయి. హంటర్‌రోడ్డు ఎన్టీఆర్ నగర్ దగ్గర రెండు ప్రహరీ నిర్మాణాలు, నాలుగు షెడ్డులను కూల్చివేశారు. రెండు రోజులలో మొత్తం 51 నిర్మాణాలను కూల్చివేశారు. అక్టోబరు 3 నుంచి మలివిడత కూల్చివేత కార్యక్రమం కొనసాగనుంది. ఎగువ భాగంలో సర్వే.. వడ్డేపల్లి నాలాకు సంబం«ధించి నయీంనగర్ పెద్దమోరి బ్రిడ్జి ఎగువ భాగంలో ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు వెలిశాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. దీంతో బ్రిడ్జి ఎగువభాగంలో నాలాను పరిశీలించిన కమిషనర్ సర్ఫరాజ్ నాలా వెడల్పునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే నాలాపై చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల వద్ద జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. నాలాకు ఇరువైపులా ఉన్న భవనాలకు అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఏసీపీ శ్యాంకుమార్‌ను ఆదేశించారు. అనుమతులు లేనట్టయితే సర్వే చేసి నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. చైతన్య కళాశాలను ఆనుకొని ప్రవహిస్తున్న నాలా సరిహద్దులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని ఏసీపీ శైలజకు సూచించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చినందున అధికారులు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదన్నారు. కబ్జాదారుల చెరలో ఉన్న నాలాలను విడిపించి ప్రవాహం సజావుగా చూడాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఉందన్నారు. అక్రమణల కూల్చివేత పరిశీలనలో కమిషనర్ వెంట సీపీ రాజేంద్రప్రసాద్ నాయక్ ఉన్నారు. అక్రమ నిర్మాణాల అంతుతేలుస్తాం గ్రేటర్ వరంగల్ నగరంలో నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి గ్రేటర్‌ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆక్రమణల కూల్చివేత అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల అంతు తేల్చేదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. చారిత్రక వరంగల్ నగరానికి ముంపు భయం లేకుండా ఉండాలంటే క్రమ నిర్మాణాలు తొలగించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి తారకరామారావులు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రజలు సహకరించాలని కోరారు. నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి గ్రేటర్‌ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. అక్రమ నిర్మాణాల అంతు తేల్చేదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. – నన్నపునేని నరేందర్, మేయర్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చినందున అధికారులు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. – సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్ -
జిల్లాలో జోరు వాన
తొర్రూరులో అత్యధికంగా 81.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు హన్మకొండ : జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. తొర్రూరులో అత్యధికంగా 81.2 మిల్లీమీటర్లు, రాయపర్తిలో 80.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే జనగామ డివిజన్‌ను సైతం వానజల్లు పులకింపజేసింది. దాని పరిధిలోని చేర్యాలలో 44.2 మి.మీ, మద్దూరులో 17.4, నర్మెటలో 28, బచ్చన్నపేటలో 16.2, జనగామలో 22.6 మి.మీల వర్షం కురిసింది. లింగాల ఘన్‌పూర్‌లో 8.4, రఘునాథపల్లిలో 18.2, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 26.8, ధర్మసాగర్లో 48.2, హసన్‌పర్తిలో 60.4, హన్మకొండలో 70.2, వర్థన్నపేటలో 50.8, జఫర్‌గఢ్‌లో 13, పాలకుర్తిలో 24.8, దేవరుప్పులలో 8, కొడకండ్లలో 38, రాయపర్తిలో 80.2 మి.మీల వర్షం కురిసింది. తొర్రూరులో 81.2, నెల్లికుదురులో 5.4, నర్సింహులపేటలో 20.6, మరిపెడలో 32.4, డోర్నకల్‌లో 4.4, కురవిలో 3.8, మహబూబాబాద్‌లో 3.6, కేసముద్రంలో 9.8, నెక్కొండలో 5, గూడూరులో 11.8, కొత్తగూడలో 6.4, ఖానాపూర్‌లో 3.4, నర్సంపేటలో 3.4, చెన్నారావుపేటలో 1.2, పర్వతగిరిలో 7.6, సంగెంలో 17.2, నల్లబెల్లిలో 3.4, దుగ్గొండిలో 2.2, గీసుకొండలో 5.2, ఆత్మకూరులో 10.6, శాయంపేటలో 25.2, పరకాలలో 13.6, రేగొండలో 14.2, మొగుళ్లపల్లిలో 33.4, చిట్యాలలో 36, భూపాలపల్లిలో 10.8, ఘణపురంలో 6,8 మి.మీల వర్షం కురిసింది. వెంకటాపూర్‌లో 5.6, గోవిందరావుపేటలో 20, తాడ్వాయిలో 50.4, ఏటూరునాగారంలో 15, మంగపేటలో 25.4, వరంగల్‌లో 47 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
బొగతకు మహర్దశ
అభివృద్ధి పనులకు రూ.12 కోట్లు మంజూరు అటవీ, టూరిజం శాఖాధికారుల పరిశీలన వివరాలు వెల్లడించిన టూరిజంశాఖ జనరల్ మేనేజర్ మనోహర్ వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి మహర్దశ పట్టనుంది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు మండలం అటవీ ప్రాంతంలో ఉన్న బొగత అందాలను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్టాలకు చెందిన పర్యాటకులు నిత్యం వందలాదిగా తరలివస్తున్నారు. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం స్పందించింది. కాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బుధవారం టూరిజం, అటవీశాఖాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా బొగత జలపాతం అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేసినట్లు టూరిజం శాఖ జనరల్ మేనేజర్ మనోహర్ వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని మేడారం, లక్నవరం, తాడ్వాయి, బొగత తదితర ప్రాంతాలను కలిపి ఆదివాసీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. వీటి అభివృద్ధి కోసం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.84 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో బాగంగానే అటవీశాఖాధికారులతో కలిసి బొగత జలపాతాన్ని సందర్శించి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా బొగత జలపాతం బాగుందని, జలపాతానికి పై వైపున, క్రింద వైపున రెండు రెస్టారెంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. 80 గదులతో కాటేజీ నిర్మాణం చేస్తామని 20 ఏసీ గదులు, 60 నాన్ ఏసీ గదులుంటాయన్నారు. బొగత జలపాతం వరకూ రెండున్నర కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టూరిజం శాఖ ఎస్టేట్ మేనేజర్ సునంద, కరీంనగర్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరావు, వరంగల్ జిల్లా మేనేజర్ నాధన్, డిప్యూటీ ఇంజనీర్ సామ్యేల్, అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణ, భద్రాచలం డీఎఫ్ఓ శివాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కుర్రకారు
కారు.. నాడది స్టేటస్ సింబల్. నేటి మెట్రో లైఫ్స్టైల్లో కొందరికది నీడ్! అయితే, ఏదో బ్రాండ్.. ఒక కారుంటే చాలు అనుకునే జనరేషన్ కాదిది. ఈతరం యువత.. తమకెలాంటి కారు కావాలో పేరెంట్స్‌కి చెబుతోంది. లగ్జరీయస్ కార్లకు ఓటేయిస్తోంది. సో.. కార్ల యూసేజ్ ఏజ్ గ్రూప్ మారి సేల్స్‌కు అమాంతం బూమ్ వచ్చింది. పదిపన్నెండేళ్ల కిందటి రోజులతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఆలోచనా ధోరణి మారింది. అప్పట్లో యాభై ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా కార్లు కొనేవారు. పైగా ఎటువంటి కారు కావాలో ఇంటి పెద్దే నిర్ణయించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తి భిన్నం. ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగావకాశాల వల్ల ఇన్కమ్ లెవల్స్ భారీగా పెరిగాయి. చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తుండటం, బాధ్యతలు, ఖర్చులు పెద్దగా లేకపోవడం వల్ల స్వేచ్ఛగా విలాసవంతమైన అవసరాలపై ఖర్చు పెడుతున్నారు. అందుబాటులో ఉన్న లగ్జరీస్‌ను ఆస్వాదించాలనే ధోరణి, చూసేవారికి డాబుగా కనిపించాలనే తపన, ఈజీ ఈఎంఐలు, రుణ సౌకర్యాలు... ఇవే కార్లపై యువత మనసు పారేసుకొనేలా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం కార్లు కొనే ఏజ్ గ్రూప్ ఎక్కువగా 28-48 ఏళ్ల మధ్య ఉంటోంది. ఫీచర్ రిచ్.. లైఫ్‌లో భాగమైపోయిన గాడ్జెట్స్ వంటివే కార్లలో కోరుకొంటున్నారు. కొనుగోలుదారుల్లో ఎక్కువ కుర్రాళ్లే ఉండటం వల్ల ఇలా ఫ్యూచర్ రిచ్ కార్లకు క్రేజ్ పెరిగింది. ఇదివరకు రేడియో, టేపురికార్డర్ ఉంటే చాలనుకొనేవారు. ‘ఇప్పుడు ఎల్ఈడీ, యూఎస్బీ డ్రైవ్, వైఫై, టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్.. ఇలా కార్లలో కూడా టెక్నాలజీ కోరుకొంటున్నారు. అలాగే అన్నీ అందుబాటులో ఉండాలి. అంటే.. ఏరోప్లేన్ కాక్‌పిట్‌లో పెలైట్ చేతికి అన్నీ ఎలా చేరువలో ఉంటాయో అలా! ఆడియో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌పై కావాలి. పవర్ విండోస్, డోర్స్ లాక్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్.. ఇలా అన్ని ఫీచర్సూ ఉండాలి. అవి చేతికి అందాలి. సేమ్‌టైమ్.. స్టైలిష్‌గా, రిచ్‌గా, విభిన్నంగా, వినూత్నంగా ఉండే డ్యాష్‌బోర్డ్స్ ప్రిఫర్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు వరుణ్ మోటర్స్ షోరూమ్ ప్రతినిధులు. మైలేజ్ ఇంపార్టెన్స్.. ఇండియన్ మార్కెట్లో మైలేజీకే అధిక ప్రాధాన్యం. అలాగని పికప్ తగ్గకూడదు. సో.. బిగ్గర్ కార్.. స్మాలర్ సీసీ. అమెరికా వంటి దేశాల్లోనూ ఇదే పాలసీ. ఉదాహరణకు సియాజ్, డిజైర్ వంటి వాటిల్లో ఇంజిన్ కెపాసిటీ తక్కువ. కానీ 1.3 లీటర్ ఇంజినే అయినా అందులో విపరీతమైన పవర్ జనరేట్ అవుతుంది. 115 వీహెచ్‌పీ. ఆర్పీఎం ఎక్కువగా ఉంటుంది. టర్బో చార్జర్ల వల్ల పికప్ బాగుంటుంది. ఇప్పటి ట్రెండ్, యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ అందించక తప్పడం లేదు. రియర్ షేప్.. లుక్ డిఫరెంట్.. కారు చూడగానే డిఫరెంట్‌గా, ఆకట్టుకొనేలా ఉండాలి. వెర్నా, హోండా సిటీ వంటి కార్లను గమనిస్తే మస్కులర్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇలా గ్రీన్లైన్స్ను ఇష్టపడుతున్నారు కుర్రకారు. ఫ్రంట్ షేప్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. రియర్పైనా అంతే ఆసక్తి చూపుతున్నారు. ‘ముందు భాగాన్ని ఏ తయారీదారులైనా పెద్దగా మార్చలేరు. ఏరోడైనమిక్ షేప్‌లో స్లీక్గా ఉండాల్సిందే. బ్యాక్ పోర్షన్‌ను మార్చొచ్చు. అదీగాక కారును వెనక నుంచి చూసేవారే ఎక్కువగా ఉంటారు. కారణం... ఆపోజిట్ డెరైక్షన్‌లో అందరి కళ్లూ ట్రాఫిక్‌పైనే ఉంటాయి. సో.. మ్యానుఫ్యాక్చరర్స్ దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. యూత్ టేస్ట్‌కు తగ్గట్టుగా స్లీక్ డిజైన్, హ్యుండై ఐ20లా టేల్ ల్యాంప్స్ ఇలా ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు’ అంటారు లక్ష్మీ హ్యూండయ్ ప్రతినిధి సంజయ్. యావరేజ్ హైట్.. గతంతో పోలిస్తే యావరేజ్ ఇండియన్ హైట్‌లో కూడా మార్పు వచ్చింది. కొంత పొడవు పెరిగింది. దీంతో ‘టాల్‌బాయ్ డిజైన్ షేప్డ్’ కార్లను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే.. హెడ్, లెగ్ రూమ్స్.. ఏదీ పట్టుకోకుండా కూర్చొని లేవడానికి సులువుగా ఉండాలి. సిటింగ్, డ్రైవింగ్ పోస్టర్స్ బాగుండాలి. ఇక టీ మగ్గులు తొణకకుండా కప్ హోల్డర్స్, మొబైల్ చార్జర్లు, బ్యాక్‌సైడ్ వారికి బెడ్‌ల్యాంప్స్, బ్యాగ్, కోట్ హుక్స్, ముఖ్యమైన, విలువైనవి సీక్రెట్‌గా పెట్టుకోవడానికి సీటు కింద స్టోరేజ్ వంటివన్నీ కామన్ ఫీచర్స్. సిటీలో హయ్యస్ట్ సెల్లింగ్ కారు డిజైర్. స్టైలిష్‌గా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. తరువాతి కారు స్విఫ్ట్. గతంలో ఆటోగేర్ కార్లు వెయ్యికి ఒకటి అమ్మడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సగటున 15-20 శాతం ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. కారణం.. మైలేజ్, స్లీక్ మోడల్, ఇంటిగ్రేటెడ్ స్టీరియో వంటి ఫీచర్స్. -
కొండవీడుకు మహర్దశ
యడ్లపాడు: నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో చారిత్రక కొండవీడుకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తోంది. కొండవీడు ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలోనే కొండవీడు ఘాట్‌రోడ్డు పనులకు ప్రభుత్వం రూ. 35 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటితోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులను తీసుకువస్తే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చనే అలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని జూపార్కు మాదిరిగా ఇక్కడ నెలకొల్పాలని భావిస్తోంది. ఎకో, పోర్టు, మరో మూడు ప్రధాన దేవాలయాల అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కొండవీడు అభివృద్ధికి ఆనాడే బీజం వేసిన వైఎస్... కొండవీడు కోట ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపొందించాలంటూ అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. కొండవీడు ప్రాధాన్యతను నాడే గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొండపైకి ఘాట్‌రోడ్డు చేయాలని రూ. 5 కోట్లు నిధులను 2007 లో ఆర్అండ్బి శాఖకు విడుదల చేశారు. ఆ తర్వాత ఏడుశాఖలకు చెందిన మంత్రులు వచ్చి కొండవీడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సీఎం రోశయ్య పలు శాఖల మంత్రులతో వచ్చి ఈ అభివృద్ధి పనుల్లో భాగమైన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్)ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటులో హంసా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కొత్తపాలెం నుంచి ఘాట్‌రోడ్డు వరకు అప్రొచ్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు మూడు దశల సర్వే, ట్రాక్ రోడ్డు ఏర్పాటు, కేంద్ర అటవీ శాఖనుంచి రెండు దశల అనుమతి, ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కోట గ్రామంలో స్వాగత ద్వారం, కొండ మెట్లమార్గం వద్ద గెస్ట్‌హౌస్ నిర్మాణం చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం జరిగింది. తాజాగా పురాతన మసీదు పునరుద్ధరణ ప్రక్రియను పురావస్తు శాఖ చేపట్టింది. -
సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ
సాక్షిప్రతినిధి, గుంటూరు : సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 61 డివిజన్లు ఉన్న ఈ రెండు మున్సిపాలిటీల్లో ముందు ముందు మౌలిక వసతుల కల్పనతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి విడత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 77 కిలోమీటర్ల నిడివిలోని ప్రాంతాలను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. ఆ నిడివిలోని గ్రామాలను వివరిస్తూ జనవరి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత ఈ రెండు మున్సిపాలిటీలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా రూ.వెయ్యి కోట్ల నిధితో ఏర్పాటైన ఈ మండలి రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ, తదితర చర్యలు చేపట్టనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల మండలం మాదల. సత్తెనపల్లి మండలంలోని 17 గ్రామాలు తొలి విడతలోనే సీఆర్డీఏ పరిధిలోకి వచ్చాయి. సత్తెనపల్లి మున్సిపాలిటీని తొలి విడత మినహాయించారు. పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలంలోని 16 గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చి మున్సిపాలిటీని మినహాయించారు. తాజాగా ఈ రెండు మున్సిపాలిటీలను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ బుధ వారం ఉత్తర్వులు వెలువడ్డాయి.50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న పొన్నూరు మున్సిపాలిటీలో 59,859 మంది జనాభా ఉన్నారు. మొత్తం 31 వార్డులున్నాయి. 1964లో మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ 1967లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.తొలి మున్సిపల్ చైర్మన్‌గా కొప్పాక వెంకయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 11 మంది చైర్మన్లుగా, ముగ్గురు ఇన్చార్జి చైర్మన్లుగా పనిచేశారు. 30 వసంతాలు పూర్తిచేసుకున్న సత్తెనపల్లి మున్సిపాలిటీలో 56,663 మంది జనాభా ఉన్నారు. 1984 మార్చి 2న సత్తెనపల్లిని మున్సిపాలిటీగా మా ర్చారు. మొత్తం 30 వార్డులు ఉన్నాయి. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను సీఆర్డీఏకు విడు దల చేసినా, క్రమంగా నిధుల విడుదల పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. -
వామ్మో..దోమ
సాక్షి, నెల్లూరు : అసలే పారిశుధ్యం అధ్వానం. దీనికి తోడు ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షపు నీరు తోడైంది. ఇంకేముంది నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగరవాసులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు ఇబ్బందులు పడుతున్నారు. దోమకాటుతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయినా ఘనత వహించిన నెల్లూరు కార్పొరేషన్ వారు దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. లెక్కల్లో మాత్రం లక్షలు ఖర్చులు చూపిస్తూ నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దోమల నివారణ కోసం ప్రజలు నగర పరిధిలో ఏడాదిలో రూ.కోట్లు సొంతంగా వెచ్చించాల్సి వస్తోంది. వర్షం రాకతో నెల్లూరు నగరంతో పాటు జిల్లాలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. కాలువలలో సక్రమంగా పూడిక తీయడంలేదు. దీంతో దోమలు పెరిగాయి. నగర వాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ఉంటున్న కుటుంబాలకు దోమలతో పడుతున్న బాధలు అధికం. దోమల నివారణ ఖర్చు పక్కన పెడితే దోమ కాటుతో ప్రజలు రకరకాల జబ్బులకు గురికావాల్సి వస్తోంది. రోగాలను నయం చేసుకునేందుకు ఆస్పత్రి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. రాబోవు కాలంలో దోమల బెడద మరింత పెరిగే అవకాశముంది. నగరంలోని హరనాథపురం, బాలాజీనగర్, మన్సూర్‌నగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం, గాంధీగిరిజన కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మురుగు గుంటలు మరింతగా పెరిగాయి. చాలా చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఖాళీగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా వాటిలో నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల నివారణ కోసం నెల్లూరు నగరంతో పాటు పట్టణాల్లో ఒక్కో కుటుంబం పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది పేద, మధ్యతరగతి వారికి మరింత భారంగా మారింది. నగరంలో 6లక్షల 50 వేల జనాభా ఉంది. 1.40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల కుటుంబాలున్నాయి. దోమల నివారణ కోసం ఆలౌట్ ,జెట్కాయిన్స్, క్రీములు, బ్యాట్లు, మెస్‌లు వాడాల్సి వస్తోంది. జిల్లా మొత్తం మీద దోమల నివారణకు * కోట్లలోనే ఖర్చు వస్తున్నట్టు సమాచారం. దోమల బారినపడి రోగాలు నయం చేసుకునేందుకు రూ.కోట్లలోనే ఖర్చు వస్తోంది. దోమలవ్యాప్తి : మురుగుగుంటలే దోమలకు ఆవాసాలు. దోమల గుడ్లు లార్వాగా రూపాంతరం చెంది, ఆ తర్వాత దోమగా మారతాయి. ఒక దోమ 7 నుంచి 10 రోజులు బతుకుతుంది. 10 రోజుల్లో ఒక్కో దోమ లక్ష గుడ్లు పెడుతుంది. దోమల్లో అనాఫిలస్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుంది. క్యూలెక్స్ దోమవల్ల బోదకాలు, ఏజీటీసీ దోమవల్ల డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. అనారోగ్యంతో అల్లాడుతున్న ప్రజలు : దోమకాటుతో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ప్రైవేటు డాక్టర్లు, ఆర్ఎంపీలు చికున్‌గున్యా, స్వైన్‌ప్లూ, డెంగ్యూ అంటూ రోగులను భయభ్రాంతులకు గురిచేసి నానా పరీక్షల పేరుతో లక్షలాది రూపాయిలు గుంజుతున్నారు. నివారణ చర్యలు : దోమల నివారణకు మురుగుగుంటలు,కాలువల్లో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు చేరిన పక్షంలో మురుగు నీటిలో కిరోసిన్ పోయాలి. కిరోసిన్ పోయడం వల్ల లార్వాలకు ఆక్సిజన్ అందకుండా పోతుంది. దోమల నివారణకు ఎబేట్ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయాలి. పట్టించుకోని అధికారులు : వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లా ఆరోగ్యశాఖ ముఖ్యంగా మలేరియా విభాగం దోమలు వ్యాప్తికాకుండా చూడాల్సి ఉంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సబ్యూనిట్ అధికారి, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, జిల్లాస్థాయిలో జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ) దోమల నివారణ, తద్వారా మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరి పనితీరును జిల్లా వైద్యాధికారి పర్యవేక్షించాల్సి ఉంది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు ఆ దిశగా ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. నెల్లూరు నగరంలో దోమల నివారణ చర్యలు అసలేలేవు. కనీసం ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా కానరావడంలేదు. కలెక్టరైనా స్పందించి అధికారులను అప్రమత్తం చేసి దోమలను నివారించాల్సి ఉంది.