హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది.
ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి.
‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్‌లో డిమాండ్ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్ టైగర్ నివేదిక పేర్కొంది.
పట్టణాల వారీగా..
► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి.
► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి.
► అహ్మదాబాద్‌లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి.
► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి.
► కోల్‌కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment