న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని తొమ్మిది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్–జూన్ కాలంలో 1,22,213 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగానే ఉంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. తొమ్మిది పట్టణాల్లో కలిపి అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది.
► టైర్–1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గాయి.
► ముంబైలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లకు పరిమితమయ్యాయి.
► చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది.
► పుణెలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి.
► బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 % పెరిగి 52,208 యూనిట్లుగా నమోదైంది.
► కోల్‌కతా పట్టణలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి.
ఇళ్ల ధరలపై గృహ రుణాల ప్రభావం
నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక
నివాస గృహాల అందుబాటు ధరలపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాలకు సంబంధించి ‘అఫర్డబులిటీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఓ సగటు గృహస్థుడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి రేటును నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ తరచూ ట్రాక్ చేస్తుంటుంది. ఓ గృహస్థుడు తన ఇంటి రుణ ఈఎంఐని చెల్లించేందుకు వీలుగా అతడి ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తుంటుంది. 2023లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై గృహ రుణాల రేట్ల ప్రభావం పడినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో అహ్మదాబాద్ అందుబాటు ధరలతో కూడిన ఇళ్ల మార్కెట్‌గా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 23 శాతంగా ఉంది. ఆ తర్వాత 28 శాతంతో పుణె, కోల్‌కతా, 28 శాతంతో చెన్నై, బెంగళూరు, 30 శాతంతో ఢిల్లీ ఎన్‌సీఆర్, 31 శాతంతో హైదరాబాద్, 55 శాతంతో ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ ప్రకారరం ఒక పట్టణంలో 40 శాతం నిష్పత్తి ఉందంటే.. ఆ పట్టణంలోని నివాసులు సగటున తమ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ ఈఎంఐ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు అర్థం. 40 శాతం ఉంటే అందుబాటు ధరలుగా పరిగణిస్తుంది. 50 శాతానికి పైగా రేషియో ఉందంటే ఇళ్ల ధరలు అందుబాటులో లేనట్టుగా భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment