
పెరుగుతున్న రుణ మంజూరీలే నిదర్శనం
లగ్జరీ ఇళ్లకుపెరుగుతున్న డిమాండ్
రూ.33 లక్షల కోట్లకు గృహ రుణాలు
వ్యక్తుల ఆదాయాల పెరుగుదల, చిన్న కుటుంబాలు అధికం కావడం, సొంత ఇల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్ష.. వెరసి నూతన గృహాల అమ్మకాలను పెంచుతున్నాయి. ఇళ్ల ధరలు దూసుకెళ్లడం కూడా డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది. ప్రధానంగా భారతీయ కస్టమర్లు లగ్జరీ వైపు మొగ్గు చూపుతుండడంతో హైఎండ్ గృహాలకు స్థిర డిమాండ్ ఉంటోంది. ఓ నివేదిక ప్రకారం 62 శాతం మంది సంపన్న భారతీయులు (Indians) రాబోయే ఒకట్రెండేళ్లలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఆస్తుల విలువ పెరుగుదల ఇందుకు కారణమని 55 శాతం మంది తెలిపారు. అధిక ఆదాయ వర్గాలు అందుకుంటున్న రుణాల వాటా 2022 సెప్టెంబర్‌తో పోలిస్తే రెండేళ్లలో 52.63 శాతం పెరగడం దేశంలో లగ్జరీ గృహాల డిమాండ్‌కు నిదర్శనం.
దేశవ్యాప్తంగా వ్యక్తిగత గృహ రుణాలు (Individual housing loans) 2024 సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం రూ.33.53 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఏడాదిలో ఈ రుణాలు 14 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో బ్యాంకులు ఇచ్చిన అన్ని రకాల లోన్స్ రూ.15.3 లక్షల కోట్లు. ఇందులో హౌసింగ్ లోన్స్ 16.95 శాతం వాటాతో రూ.2.6 లక్షల కోట్లు ఉంది. ఈ కాలంలో పరిశ్రమలు అందుకున్న రుణాలు 14.5 శాతం వాటాకు పరిమితం కావడం గమనార్హం.
– సాక్షి, స్పెషల్ డెస్క్
పదేళ్లలో 54 శాతం పెరుగుదల..
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) రెసిడెన్షియల్ ఇండెక్స్ (రెసిడెక్స్) ప్రకారం 2017–18తో పోలిస్తే ఇళ్ల ధరలు 2024 సెప్టెంబర్ చివరినాటికి 38.33 శాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ ధరలు ఏకంగా 42.95 శాతం పెరగడం విశేషం. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వ్యక్తిగత గృహ రుణాల వాటా 2024లో 11.29 శాతానికి ఎగసింది. 2014లో ఇది 7.3 శాతమే. అంటే పదేళ్లలో 54.65 శాతం పెరిగిందన్న మాట. మొత్తం రుణాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల వాటా 2015లో 9.76 నుంచి 2024లో 16.57 శాతానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మంజూరైన గృహ రుణాలు రూ.9.07 లక్షల కోట్లు.
అధిక ఆదాయ వ్యక్తులే..
వ్యక్తిగత గృహ రుణాల్లో అధిక ఆదాయం పొందుతున్న వ్యక్తులకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (Housing Finance Companies) ఇచ్చిన రుణాలు 2022 సెప్టెంబర్‌లో 17.1 శాతం ఉంటే.. 2024 సెప్టెంబర్ నాటికి 26.1 శాతానికి పెరిగాయి. ఈ కాలంలో తక్కువ, మధ్యస్థాయి ఆదాయ వర్గాలకు మంజూరు చేసిన రుణాలు తగ్గడం గమనార్హం.

వ్యక్తిగత గృహ రుణాల్లో 2023–24లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీచేసిన మొత్తాల్లో రూ.25 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా 58% ఉంది. 2021–22లో ఇది 54.34 శాతం నమోదైంది. రూ.10 లక్షల వరకు విలువ చేసే రుణాల వాటా 10.85 శాతం మాత్రమే. 2024 సెప్టెంబర్ 30 నాటికి ఉన్న మొత్తం వ్యక్తిగత గృహ రుణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ, తక్కువ ఆదాయ వర్గాల వాటా 39 శాతం, మధ్య ఆదాయ వర్గాలు 44% ఉంది.

తూర్పున మరీ తక్కువ
2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత గృహ రుణాల పంపిణీ రూ.4.10 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు అధికంగా 35.02 శాతం కైవసం చేసుకున్నాయి. పశ్చిమ భారత్ 30.14 శాతం, ఉత్తరాది రాష్ట్రాలు 28.73 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో సహా తూర్పు భారత్ వాటా 6.10 శాతమే. ఈశాన్య రాష్ట్రాల వాటా 0.68 శాతం ఉంది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) మొత్తం వ్యక్తిగత గృహ రుణాల్లో మహారాష్ట్ర 18.49 శాతం, తెలంగాణ 18.44 శాతం వాటాతో ముందున్నాయి.
చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం