housing loans
-
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కూడా గృహ రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా వెల్లడించారు. ప్రస్తుతం తమ గ్రూప్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులున్న కొన్ని ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నట్లు చెప్పారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలు మొదలైన వాటికి రుణాలు ఇస్తున్నట్లు, ఈ పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 500 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 6 శాఖలు ఉండగా వీటిని పదికి పెంచుకుంటున్నట్లు వివరించారు. -
ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. రాయిటర్స్ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు. -
పీఎన్బీ హౌసింగ్ ‘రోష్ని’ శాఖలు
న్యూడిల్లీ: అందుబాటు ఇళ్ల రుణాల కోసం హైదరాబాద్‌తోపాటు టైర్ 2, 3 పట్టణాల్లో ‘రోష్ని’ శాఖలను ప్రారంభించినట్టు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఈ శాఖల ద్వారా తమ కస్టమర్ల బేస్‌ను పెంచుకోనున్నట్టు తెలిపింది. రోష్ని అన్నది పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ అమలు చేస్తున్న రుణ పథకం. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఈ పథకం కింద రిటైల్ కస్టమర్లకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.5 నుంచి రూ.30 లక్షల మధ్య రుణాలను మంజూరు చేస్తుంటుంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
హోమ్‌లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్‌తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్‌లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్‌లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్‌లోన్ తీసుకోవచ్చు. టాపప్‌పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్‌లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
ఐసీఐసీఐ బ్యాంక్ హౌసింగ్ లోన్స్ రికార్డ్
ముంబై: మార్టిగేజ్ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 2 లక్షల కోట్లను అధిగమించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. దేశీయంగా ఈ ఫీట్‌ను సాధించిన తొలి ప్రయివేట్ రంగ సంస్థగా నిలిచినట్లు తెలియజేసింది. హౌసింగ్ రుణాలలో బ్యాంక్ తొలిసారి 2016లో రూ. ట్రిలియన్ మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రికార్డ్‌స్థాయిలో మార్టిగేజ్ రుణాలను మంజూరు చేసినట్లు తెలియజేసింది. వెరసి కోవిడ్-19కు ముందు స్థాయిని సైతం అధిగమించినట్లు వివరించింది. ఇదే విధంగా అక్టోబర్‌లోనూ రికార్డును నెలకొల్పుతూ అత్యధిక రుణాలను విడుదల చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రానున్న నాలుగేళ్లలోగా రూ. 3 ట్రిలియన్ మార్టిగేజ్ లోన్ మార్క్‌ను అందుకోనున్నట్లు అంచనా వేసింది. కారణాలివీ.. రుణాల ప్రాసెసింగ్‌లో డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంతో క్లయింట్లకు రుణాలు ఆఫర్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలో వృద్ధిని సాధించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. దాదాపు మూడో వంతు రుణాలను డిజిటలైజేషన్ ద్వారానే విడుదల చేసినట్లు తెలియజేసింది. ప్రధానంగా చౌక వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని రాష్ట్రాలలో తగ్గిన స్టాంప్ డ్యూటీ వంటి అంశాలు రుణాలకు డిమాండ్ పెంచినట్లు వివరించింది. దీనికితోడు వేగవంతమైన వృద్ధికి వీలున్న ద్వితీయ శ్రేణి పట్టణాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. షేరు ఫ్లాట్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు నామమాత్ర లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490ను అధిగమించిన షేరు రూ. 472 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. -
గృహరుణాలకు ఎన్బీఎఫ్సీ దెబ్బ
ముంబై: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నిధుల కొరతతో అల్లాడుతుండటం.. వాటిపై ఆధారపడిన పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, ద్విచక్ర వాహనాలు మొదలైన విభాగాలపై ఇది మరింతగా కనిపించనుంది. వివిధ కన్సల్టెన్సీలు విడుదల చేసిన నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిధుల కొరత కారణంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల.. గృహ రుణాల మంజూరీ కార్యకలాపాలు మందగించే అవకాశాలున్నాయని జపనీస్ బ్రోకరేజి సంస్థ నొమురా పేర్కొంది. ఇప్పటికే గృహాల ధరల్లో వృద్ధి మందగించిందని, తాజా పరిణామాలతో ఆ ఒత్తిడి ఇకపైనా కొనసాగవచ్చని తెలిపింది. దీన్ని బ్యాంకులు అందిపుచ్చుకుని, ఆ మేరకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చని నొమురా వివరించింది. కానీ, అంతిమంగా రుణగ్రహీతలు అధిక వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీలు రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కూడా సమస్యలు ఎదురుకావచ్చని వివరించింది. అమ్ముడు కాని గృహాల సంఖ్య పెరిగిపోతూ ఒత్తిడిలో ఉన్న రియల్టర్లకు ఇది మరింత సమస్యాత్మకంగా మారవచ్చని పేర్కొంది. మరోవైపు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నిధుల కొరత కష్టాలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్యేతర ఫైనాన్సింగ్ కార్యకలాపాల్లోని ఎన్బీఎఫ్సీలకి బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలకూ ప్రతికూలం ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్యలు అటు ద్విచక్రవాహనాల అమ్మకాలకు కూడా ప్రతికూలం కానున్నాయి. కమర్షియల్ పేపర్స్ ద్వారా సమీకరించిన రుణాలను చాలామటుకు ఎన్బీఎఫ్సీలు త్వరలో తిరిగి చెల్లించాల్సి రానుందని, దీంతో వాటి వద్ద నిధుల కొరత ఏర్పడి రుణాల మంజూరీ సామర్ధ్యం తగ్గొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీంతో ఈ మధ్యకాలంలో ఎన్‌బీఎఫ్‌సీల ఫైనాన్సింగ్‌తో గణనీయంగా పెరిగిన టూ–వీలర్ల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని వివరించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 30 శాతంగా ఉన్న టూవీలర్ ఫైనాన్సింగ్.. ఎన్‌బీఎఫ్‌సీల ఊతంతో 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరింది. ప్రస్తుతం టూవీలర్ ఫైనాన్సింగ్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా దాదాపు 60 శాతంగా ఉన్నట్లు క్రెడిట్ సూసీ తెలిపింది. కార్లు, వాణిజ్య వాహనాలు మొదలైన వాటికి కూడా ఫైనాన్సింగ్ జరుగుతున్నప్పటికీ ఇటు బ్యాంకులు, అటు ఎన్‌బీఎఫ్‌సీల రుణాల వాటా దాదాపు సమస్థాయిలోనే ఉంటోందని, కానీ టూవీలర్ రుణాల సెగ్మెంట్లో నాన్–బ్యాంకింగ్ సంస్థల వాటా అధికంగా ఉందని వివరించింది. టూవీలర్ల అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఉండే పండుగ సీజన్లోనే ఉంటాయని, అయితే సరిగ్గా ఇదే సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో వాటి అమ్మకాలకు ప్రతికూలం కాగలదని తెలిపింది. టూ వీలర్లలో ఐషర్ వాహనాలు ఎక్కువగా ఫైనాన్స్‌పై అమ్ముడవుతుంటాయని.. బజాజ్ తదితర సంస్థల తరహాలో ఆ కంపెనీకి సొంత ఫైనాన్స్ సంస్థ లేకపోవడంతో అమ్మకాలపై అత్యధికంగా ప్రభావం ఉండొచ్చని క్రెడిట్ సూసీ వివరించింది. -
ఇల్లాలితో కలిసే... ఇంటి రుణం!
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : సాధారణంగా చాలా మందికి ఇంటి కొనుగోలు అనేది జీవితకాలంలో చేసే అత్యంత పెద్ద పెట్టుబడి. సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు .. ప్రభుత్వం ఇంటి ధరలను అందుబాటు స్థాయిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గృహ రుణ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికీ చాలా మందికి సంక్లిష్టమైనదిగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రేట్ల ప్రకారం... ఇల్లు కొనాలంటే భారీ మొత్తమే కావాలి. ఇంటి రేటుకు, మంజూరైన గృహ రుణానికి పొంతనే లేని పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంటుంది కూడా. మరి అప్పుడేం చేయాలి? కాస్తంత ఎక్కువ మొత్తం రుణం పొందే అవకాశం లేదా? లేకేం... దీనికీ ఒక పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే.. కో–అప్లికెంట్‌తో కలిసి దరఖాస్తు చేసుకోవటం. దీనివల్ల మరింత రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలపడం వల్ల మొత్తం ఆదాయ పరిమాణం పెరిగి .. రుణ అర్హత కూడా పెరుగుతుంది. రీపేమెంట్ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. సంయుక్తంగా గృహ రుణాలు తీసుకుంటే ఉండే లాభాలేంటో ఒకసారి చూద్దాం... రుణ అర్హత పెరుగుతుంది దరఖాస్తుదారు ఆదాయాన్ని బట్టి రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసిన మీదటే రుణం మంజూరవుతుంది. సహ దరఖాస్తుదారు కూడా చేరడం వల్ల ఆదాయ పరిమాణం పెరిగి, మరింత ఎక్కువ రుణం పొందే వీలుంటుంది. జాయింట్ హోమ్ లోన్‌లో ఇదే పెద్ద ప్రయోజనం. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారులందరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి కాబట్టి రుణ అర్హత కూడా పెరుగుతుంది. రుణ అర్హత గణనీయంగా పెరగడం వల్ల.. పెరిగే మీ కుటుంబ అవసరాలకు సరిపడేటువంటి మరింత పెద్ద ఇంటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. రీపేమెంట్ బాధ్యతలు చెరి సగం..: సహ దరఖాస్తుదారుతో హోమ్‌లోన్ తీసుకుంటే మొత్తం రుణం రీపేమెంట్ కూడా ఇద్దరూ కలిసి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రుణ భారం అంతా ఒక్కరి పైనే పడకుండా కాస్త భారం తగ్గుతుంది. జాయింట్ హోమ్ లోన్‌తో అధిక ప్రయోజనాలు ఉన్నట్లే.. కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కో–అప్లికెంట్‌పై కూడా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు సహ దరఖాస్తుదారులిద్దరికి కూడా గృహ రుణానికి సంబంధించిన పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయ పన్ను సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలులో రూ. 1.5 లక్షల దాకా, అటు సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల దాకా ట్యాక్స్ రిబేట్ పొందేందుకు వీలుంది. అయితే ప్రాపర్టీ నిర్మాణం పూర్తయ్యాక మాత్రమే గృహ రుణ వడ్డీ, అసలు చెల్లింపులపై పన్ను ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. ఒకవేళ జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే.. దరఖాస్తుదారులిద్దరూ కూడా రీపేమెంట్లో తమ వంతు వాటా వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీని గురించి ట్యాక్స్ కన్సల్టెంట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదిస్తే.. మరింత సమాచారం పొందవచ్చు. యాజమాన్య బదిలీ సులభతరం.. పై ప్రయోజనాలతో పాటు ఒకవేళ ఏవైనా అనూహ్య పరిస్థితుల కారణంగా .. ప్రాపర్టీని కో–అప్లికెంట్ పేరు మీదికి మార్చాల్సి వచ్చినా, కూడా జాయింట్ హోమ్‌లోన్ కారణంగా సదరు ప్రక్రియ సులభతరమవుతుంది. సాధారణంగా జీవిత భాగస్వామే వారసులుగా ఉంటారు కాబట్టి ప్రాపర్టీని జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల భవిష్యత్‌లో ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మహిళా కో–అప్లికెంట్‌తో ప్రయోజనాలు.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సహ దరఖాస్తుదారు మహిళ అయిన పక్షంలో కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని కూడా తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు.. ఢిల్లీలో దరఖాస్తుదారు మహిళ అయితే స్టాంప్ డ్యూటీ 4 శాతం కాగా.. పురుష దరఖాస్తుదారుకు 6 శాతంగా ఉంటోంది. అదే దంపతులైతే ఇది 5 శాతం. కో అప్లికెంట్‌గా ఎవరు.. ఇక.. సహ దరఖాస్తుదారులుగా ఎవరిని చూపించవచ్చనే ప్రశ్న తలెత్తుతుంది. దేశీయంగా భార్యా..భర్త, తండ్రి..కొడుకు (చాలా సంతానముంటే ప్రాథమిక యజమానిగా ఉండే కుమారుడు), లేదా తండ్రి.. అవివాహిత అయిన కుమార్తె (ప్రాథమికంగా ఓనర్‌గా ఉండాలి), సోదరులు (కో–ఓన్డ్ ప్రాపర్టీ అయితే), వ్యాపారవేత్తలు.. తమ కంపెనీలను సహ దరఖాస్తుదారులుగా చూపించవచ్చు. -
ఇంటి రుణం.. ఇప్పుడేం చేద్దాం?
వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగున్నరేళ్ల తర్వాత ఆర్బీఐ గత నెలలో రెపో రేటును పావు శాతం పెంచింది. నిజానికి ఆర్బీఐ రేట్లు పెంచడానికి ముందే పలు బ్యాంకులు రుణాలపై రేట్లను పెంచేశాయి. డిపాజిట్లపై ప్రస్తుతానికి పెంచకపోయినా... మున్ముందు పెంచే అవకాశం లేకపోలేదు. దీనివల్ల వడ్డీ ఆదాయంపై ఆధారపడ్డ వారికి కొంత లాభమే. వారికిది ఊరటే!. మరి రుణాలు తీసుకున్నవారు..? ముఖ్యంగా దీర్ఘకాలానికి గృహ రుణాలు తీసుకున్నవారి సంగతో..? కచ్చితంగా వారిపై వడ్డీ భారం పడుతుంది. మరి ఆ భారాన్ని అధిగమించేందుకు మార్గాలేమైనా ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు..? ఆయా ఈ వివరాల సమాహారమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం త్వరలో మరో విడత పాలసీ రేట్ల పెంపు ఉంటుందనేది మార్కెట్ నిపుణుల అంచనా. దీంతో ఇంటి రుణాలు తీసుకున్న వారు పెరిగే రేట్ల భారాన్ని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలను గమనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత వడ్డీ రేట్లు మరింత కఠినంగా మారతాయనే అంచనాలున్నాయి. దీంతో రానున్న ఆరేడు నెలల కాలంలో ఇంటి రుణాలపై 25– 30 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెరగొచ్చని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ శంకర్ త్రిపాఠి చెప్పారు. రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్లకి 8.5% వడ్డీ రేటుపై తీసుకుంటే.. కేవలం 10 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపుతో ఈఎంఐ రూ.317 మేర అధికమవుతుంది. అందుకే వడ్డీ రేట్ల పెంపుతో పరిస్థితి కఠినంగా మారుతుంది. అయితే, ఆందోళన కలిగించే అంశమేంటంటే... రేట్ల పెరుగుదల ఇక నుంచి నిటారుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి రుణగ్రహీతల కోణంలో చూస్తే ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కొంత పెరిగాయి. అందుకే వడ్డీ రేటు భారం పెరగకుండా నిరోధించలేం. కాకపోతే దాన్ని అధిగమించే మార్గాలపై దృష్టి పెట్టడం మేలు. ఈఎంఐ లేదా కాల వ్యవధి పెంపు చాలా సంస్థలు వడ్డీ రేట్లను పెంచినప్పుడు ఈఎంఐ పెరగకుండా చెల్లింపుల కాలాన్ని పెంచేస్తుంటాయి. దీంతో పెంచిన మేర బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయి. దీనివల్ల రుణంపై అధికంగా వడ్డీ చెల్లించినట్లే లెక్క. కానీ, నెలవారీగా భారం పెరిగిపోదు. కాల వ్యవధి పెరగడం ఇష్టం లేకపోతే పెరిగిన వడ్డీ మేర ఈఎంఐని పెంచి చెల్లించాల్సి వస్తుంది. ఇలా చేస్తేనే రుణం తీసుకున్న వారికి లాభసాటి అనేది మోర్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ మాట. రుణం బదిలీ చేసుకుంటే..! రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవడం మరో ఆప్షన్. తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఆఫర్ చేసే సంస్థకు ప్రస్తుత రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల పెరిగిన భారాన్ని కొంతయినా తగ్గించుకోవచ్చు. ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందస్తుగా చెల్లించేస్తే దానిపై చార్జీలను బ్యాంకులు విధించడం లేదు. కాకపోతే రుణం చెల్లింపునకు ఎంత కాలం మిగిలి ఉందన్న దానిపైనే అది ప్రయోజనమా, కాదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇటీవలే గృహ రుణం తీసుకున్నారనుకోండి. కనీసం 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) మేర వడ్డీ రేటు పెరిగినప్పుడే దాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. ఒకవేళ రుణాన్ని కొన్నేళ్ల క్రితం తీసుకుని ఉంటే, వడ్డీ రేట్ల పెంపు కొంచెమే అయినా రుణాన్ని బదిలీ చేసుకునే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. కాకపోతే రుణం చెల్లింపుల కాల వ్యవధి ముగిసే దశలో ఉన్న వారికి దీనితో పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఉదాహరణకు... ఇంటి రుణం తీసుకుని ఇంకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటే, వడ్డీ రేటు 9 శాతం, కాల వ్యవధి 22 ఏళ్లు ఉందనుకుంటే... వెంటనే తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సంస్థకు మారిపోవచ్చు. ఎందుకంటే వడ్డీ రేటు అర శాతం తక్కువ అయినా మొత్తం కాల వ్యవధిలో మారడం వల్ల రూ.11.08 లక్షలు ఆదా అవుతాయి. ప్రాసెసింగ్ చార్జీల వంటి నామమాత్రపు చార్జీలను పట్టించుకోనక్కర్లేదు. రుణాలిచ్చే కొన్ని సంస్థలు మాత్రం ఆర్బీఐ రేట్లను పెంచినప్పటికీ, కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీరేట్లు పెంచుకుండా అలానే కొనసాగిస్తున్నాయి. అయితే, స్వతంత్ర ఆర్థిక సలహాదారుడు వీఎన్ కులకర్ణి మాత్రం రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవాలంటే కనీసం ఒక శాతం మేర అయినా తక్కువ రేటు ఉండాలని సూచించారు. పాక్షికంగా చెల్లించొచ్చు కూడా... రుణ గ్రహీతలు పరిశీలించాల్సిన మరో అవకాశం ఏంటంటే... రుణాన్ని పాక్షికంగా ముందుగానే చెల్లించటం ద్వారా వడ్డీ భారాన్ని కొంతయినా తగ్గించుకోవటం. తక్కువ వడ్డీ రేటుంటే బ్యాంక్ డిపాజిట్లలోనో, మరోచోటో ఇన్వెస్ట్ చేసే కంటే... ఆ సొమ్మును పాక్షికంగా ఇంటి రుణం చెల్లించడానికి ఉపయోగించుకోవటం మంచిదేనంటారు కులకర్ణి. ఎందుకంటే సేవింగ్స్‌పై మీకు వచ్చే వడ్డీ కన్నా... రుణంపై మీరు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ కనక!! ఈ తప్పులు మాత్రం చేయొద్దు.. చివరిగా చెప్పేదేంటంటే... వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్న ఒకే ఒక్క కారణంతో హడావుడిగా రుణం తీసుకోవటమో, లేక రుణం తీసుకోవటాన్ని మానేయటమో, బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవటమో చేయొద్దు. మీరు కొత్తగా రుణం తీసుకునే వారైనా, ఇప్పటికే రుణం తీసుకున్న వారైనా... సాధారణంగా రుణ గ్రహీతలు చేసే తప్పులు చేయొద్దు. ♦ ఏదో కొంత వడ్డీ పెరిగిందని చాలామంది స్థిర వడ్డీ రుణాలు తీసుకోవటానికి మొగ్గు చూపుతుంటారు. అది సరికాదు. ఈ చిన్న పెంపుతో పోలిస్తే చిరకాలం మీరు చెల్లించే అధిక వడ్డీ మొత్తం చాలా ఎక్కువ. ‘‘స్థిర వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారు ఇరుక్కుపోతుంటారు. వారు ఒకవేళ రుణాన్ని బదిలీ చేసుకుందామనుకున్నా అది ఆకర్షణీయంగా కనిపించదు. ఎందుకంటే స్థిర రుణాన్ని బదిలీ చేయాలనుకుంటే ముందస్తు క్లోజింగ్ చార్జీలు చెల్లించాలి. అవి చాలా ఎక్కువ’’ అని పాటిల్ వివరించారు. ♦ మీరు గనక నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ కొనాలనుకుంటే మీ ప్రయోజనాల్ని కాపాడే నిబంధనలున్న రుణదాతనే ఎంచుకోండి. ♦ నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా బిల్డరుకు రుణం చెల్లించే రుణదాతనే ఎంపిక చేసుకోవాలి. ‘‘నేనైతే నిర్మాణంలో ఉన్న వాటికి అగ్రిమెంట్ విలువను బట్టి పూర్తి పేమెంట్ చేసే రుణదాతను ఎంచుకోవాలని ఎవ్వరికీ చెప్పరు’’ అని త్రిపాఠీ వ్యాఖ్యానించారు. ♦ చివరిగా చెప్పాలంటే... మీ ఆదాయం, కుటుంబ ఖర్చులు, ఇతర బాధ్యతలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాకే రుణం ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోండి. అంతేకానీ బ్యాంకు ఆమోదించింది కదా అని భారీ రుణాన్ని తీసుకోవటం సరికాదు. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు పరిశీలించుకోవాలంటే ఇది దీర్ఘకాలిక రుణం. పన్నులు పోను వచ్చే ఆదాయంలో 35–40 శాతాన్ని మాత్రమే ఇంటి రుణ వాయిదా చెల్లించడానికి ఉపయోగిస్తే మంచిది. -
గృహ రుణాల వడ్డీ రాయితీపై శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ: గృహరుణాలపై కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదాయ వర్గాల వారికి శుభవార్త అందించింది. ఈ పథకం కింద గృహ రుణాలపై ఇచ్చే వడ్డీ సబ్సిడీని మరో 15నెలలపాటు కొనసాగించేందుకు నిర్ణయించింది. మధ్యతరగతి (ఎంఐజి) లబ్ధిదారులకు రూ. 2.60 లక్షల వరకు అందించే వడ్డీ సబ్సిడీని మార్చి , 2019 వరకు పొడిగించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) క్రింద ఎంఐజి లబ్ధిదారులకు వడ్డీ రాయితీ లభిస్తుందని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. 'రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'లో ప్రసంగించిన మిస్రా ఈ శుభవార్త అందించారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 'హౌసింగ్ ఫర్ ఆల్'లక్ష్య సాధనలో ప్రభుత్వం నిబద్ధతను మిశ్రా పునరుద్ఘాటించారు. అలాగే సరసమైన గృహాలలో పెట్టుబడులు పెట్టమని ప్రైవేటు రంగాన్ని కోరారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో భారీగా ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సీఎల్ఎస్ఎస్ (మధ్య ఆదాయ గ్రూపుల ఎంఐజీ) కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కింద రూ. 6 లక్షల పైబడిన వార్షిక ఆదాయం కలిగిన ఎంఐజీ లబ్ధిదారులు, 20సంవత్సరాల రూ.12 లక్షల వరకు రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ పొందుతారు. రూ.12 వార్షిక ఆదాయం ఉన్నవారు రూ.18లక్షల రుణాలపై వడ్డీ సబ్సిడీ 3శాతం లభిస్తుంది. కాగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్ఎస్ఎస్–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 31న ప్రకటించారు.ఈ వడ్డీ సబ్సిడీ పథకం ఈ ఏడాది డిసెంబర్వరకు అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
చౌక గృహ రుణాలపై ఎస్బీఐ బంపర్ ఆఫర్!
► వడ్డీ రేటు పావు శాతం వరకూ రేటు తగ్గింపు ► ప్రస్తుతం 8.60 శాతం ► మహిళా ఉద్యోగులకు అతి తక్కువగా 8.35 శాతం రుణాలపైముంబై: చౌక గృహాలకు తగిన రుణ రేటును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియలో ఇటీవల క్రెడాయ్‌తో ఒక కీలక అవగాహనకు వచ్చిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ దిశలో సోమవారం ముందడుగు వేసింది. చౌక గృహ రుణ రేట్లను పావు శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువగా 8.35% వడ్డీరేటును అమలు చేయనుంది. తాజా తగ్గింపు మంగళవారం నుంచే అమల్లోకి వస్తుంది. పురుషులకు జూలై 31 వరకే! ► పురుషులకు సంబంధించి తాజా తగ్గింపు ఆఫర్ పరిమితకాలమే– అంటే జూలై 31వ తేదీ వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. వేతన జీవులకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు) తక్కువగా 8.40% రుణ రేటు అమలవుతుంది. ► కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగుల విషయంలో 0.25 శాతం రుణ తగ్గింపు ఆఫర్ లభిస్తే, ఉద్యోగం లేని మహిళల విషయంలో ఈ ఆఫర్ 20 బేసిస్ పాయింట్లు ఉంది. ► అలాగే ఉద్యోగం చేసే పురుషుల విషయంలో రుణరేటు 8.40 శాతంగా ఉంటే, ఉద్యోగం లేని వారి విషయంలో ఈ రేటు 8.45 శాతం ఉంటుంది. ► 25 బేసిస్ పాయింట్ల రుణ తగ్గింపు అంటే– నెల వారీగా రూ.530 పొదుపైనట్లని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజ్నీష్ కుమార్ పేర్కొన్నారు. ► గృహ రుణ రేట్ల గురించి బ్యాంకింగ్ సంప్రదింపులు పెరిగాయని తమ పరిశీలనలో తేలిందని, అందువల్లే తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. తాజా నిర్ణయం సొంత ఇల్లు కల మరిన్ని లక్షల మందికి సాకారమవుతుందని భావిస్తున్నట్లూ ఆయన పేర్కొన్నారు. 2022కి అందరికీ గృహం అన్న ప్రభుత్వ సంకల్పానికి తమ వంతు కృషిని బ్యాంకింగ్ చేస్తుందని వివరించారు. ► ఎస్బీఐ హోమ్ లోన్ పుస్తక విలువ రూ.2.23 లక్షల కోట్లు. గృహ రుణాల విషయంలో సంస్థకు అత్యధికంగా 25 నుంచి 26 శాతం మార్కెట్ వాటా ఉంది. ► చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉంది. మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది. ► హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలను అందించడానికి సంబంధించి ఎస్బీఐ, రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... చౌక, గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో డెవలపర్లు, కస్టమర్లకు రాయితీలపై రుణాలు లభ్యమవుతాయి. ఎస్బీఐ గ్రీన్ హౌస్ లోన్స్ కింద గృహ రుణాల విషయంలో ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేస్తారు. ‘‘క్రెడాయ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. గృహ కొనుగోలుదారులకు వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) రాయితీని అందిస్తాం. క్రెడాయ్ డెవలపర్ మెంబర్లకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో రాయితీ లభిస్తుంది’ అని రజ్నీష్ కుమార్ గతంలో తెలిపారు. చౌక గృహమంటే... ప్రభుత్వ నూతన పథకం కింద రూ. 30 లక్షల వరకూ రుణాన్ని చౌక గృహ రుణంగా పరిగణించడం జరుగుతుంది. దీనికింద రుణ గ్రహీత రూ.2.67 లక్షల వడ్డీ సబ్సిడీ పొందే వీలుంది. అతి తక్కువ వడ్డీరేటు... ప్రస్తుతం ఎస్బీఐ ఈ విభాగంలో ఆఫర్ చేస్తున్న రేటు మార్కెట్లోనే అతి తక్కువ కావడం గమనార్హం. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా దాదాపు 26 శాతం మార్కెట్ వాటా కలిగిన ఎస్బీఐ, ప్రస్తుతం గృహ రుణ సెగ్మెంట్లో 8.60 శాతం వడ్డీతో అతి తక్కువ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ విభాగంలో రెండవ స్థానంలో ఉన్న– హెచ్డీఎప్సీ మహిళలకు సంబంధించి 8.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇతరుల విషయంలో ఈ రేటు 8.7 శాతంగా ఉంది. ఇదే రేటును ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆఫర్ చేస్తోంది. తగ్గిన రేట్లు ఇలా... (అంకెలు శాతాల్లో) కేటగిరీ తగ్గింపు తగ్గిన తర్వాత మహిళా ఉద్యోగులు 0.25 8,35 మహిళలు 0.20 8.40 ఉద్యోగం చేసే పురుషులు 0.20 8.40 పురుషులు 0.15 8.45 -
తగ్గిన ఎస్బీఐ, ఐసీఐసీఐ గృహరుణ రేటు
న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్) ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.45 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.4 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రేట్లు 9.55 శాతం, 9.5 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణ రేటు కూడా ఎస్బీఐకి సమానంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచీ ఎంసీఎల్ఆర్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన ప్రయోజనాన్ని కూడా బ్యాంకులు కస్టమర్‌కు బదలాయిస్తే... రేణ రేట్లు మరింత తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గృహాలకు సంబంధించి తాజా ఎస్బీఐ 9.45 శాతం రేటు- ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేటు 9.20 శాతం కన్నా 0.25 శాతం అధికంగా ఉంది. మహిళల విషయంలో ఈ వ్యత్యాసం 0.20 శాతం. మార్చిన రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కాగా బ్యాంక్ వాహన రుణాల రేట్లు ఏడాది ఎంసీఎల్ఆర్కన్నా 0.60 శాతం అధికంగా 9.80 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ కనీస రుణ రేటు 9.3 శాతం. ఎస్బీహెచ్ లో కొత్త వడ్డీ రేట్ల విధానం షురూ! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కొత్త వడ్డీ రేట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఒక్క రోజు నుంచి ఏడాది కాల వ్యవధి దాకా 9.20% - 9.65% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రేట్లను నెలవారీగా సమీక్షించడం జరుగుతుందని బ్యాంకు తెలియజేసింది. ప్రస్తుతం ఎస్బీహెచ్ బేస్ రేటు 9.75% గాను, బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 14.90 శాతంగాను ఉంది. బేస్ రేటు, బీపీఎల్ఆర్ ప్రాతిపదికన రుణాలు తీసుకున్న వారు సైతం కావాలనుకుంటే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఎంసీఎల్ఆర్ విధానానికి మారవచ్చని బ్యాంకు పేర్కొంది. -
గృహ రుణాలపై 6.5 శాతం వడ్డీ రాయితీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)-హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాలకు 6.5 శాతం వడ్డీ రాయితీపై గృహ రుణాల ను బ్యాంకులు, ఇతర గుర్తింపు పొం దిన ఆర్థిక సంస్థల ద్వారా మంజూరు చేయనున్నాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఎండీ, సీఈవో శ్రీరాం కల్యాణరామన్ పేర్కొన్నారు. పీఎంఏవైలో అంతర్భాగమైన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం అమలుపై శనివారం నగరంలోని ఓ హోటల్లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథి గా ఆయన పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు ఎన్‌హెచ్‌బీ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందన్నారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం గల బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం గల తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు (ఎల్ఐజీ) ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులని చెప్పారు. 15 ఏళ్ల నెల వారీ వాయిదాలకు గరిష్టంగా రూ.2.20 లక్షల వరకు వడ్డీ రాయితీని ఈ పథకం కింద మంజూరు చేస్తామన్నారు. గరిష్టంగా రూ.6 లక్షల వరకే వడ్డీ రాయితీ వర్తిస్తుందని, మిగిలిన రుణ మొత్తానికి సాధారణ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూన్‌లోగా రూ.20 వేల కోట్ల రుణాలు పీఎంఏవై రుణాల పంపిణీకి రూ.20 వేల కోట్ల నిధులను వచ్చే జూన్ 31లోగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు విడుదల చేయనున్నట్లు శ్రీరాం కల్యాణరామన్ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లబ్ధిదారులకు రుణాలుగా విడుదల చేస్తాయన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే ఈ రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ దానకిశోర్, ఎస్బీహెచ్ సీజీఎం వి.విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
మీ క్రెడిట్ స్కోరు 620 దాటిందా?
మంచి స్కోరున్న వారికే బ్యాంకుల గృహ రుణాలు ఆర్థిక క్రమశిక్షణతోనే క్రెడిట్ స్కోరు మెరుగ ఇల్లు కట్టడమంటే అంత ఈజీ కాదు. మన సంస్కృతిలో ‘ఇంటి’ చుట్టూ ఎన్నెన్నో సామెతలు పుట్టుకొచ్చింది కూడా అందుకే. ఇల్లు కట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇల్లు ఇన్వెస్ట్మెంట్ లాంటిదే కానీ... నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు తిరిగి రావు. పెపైచ్చు ఎక్కువ మొత్తం కావాలి. పేద, సాధారణ ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం సవాలే. అయినా కూడా నిరాశపడకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర రుణం తీసుకొనైనా ఇల్లు కట్టాలని భావిస్తారు చాలా మంది. ఇక రుణాలివ్వటానికి బ్యాంకులు సవాలక్ష నిబంధనలు పెడతాయి. అలాంటి నిబంధనల్లో క్రెడిట్ స్కోరుదీ కీలకపాత్రే. తక్కువ క్రెడిట్ స్కోరుంటే డాక్యుమెంట్లన్నీ ఉన్నా రుణం పొందడటం కష్టం. ఒకవేళ పొందినా... వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకే క్రెడిట్ స్కోరును పెంచుకోవాలి. క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు ప్రతి క్రెడిట్ కార్డుకూ ఒక లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక క్రెడిట్ కార్డు తీసుకుంటే.. దాని లిమిట్ రూ.2 లక్షల వరకు ఉందనుకోండి. అప్పుడు మీరు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని అర్ధం. మీకు రూ.2 లక్షల లిమిట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ మొత్తాన్ని వాడుకోవద్దు. క్రెడిట్ లిమిట్లో 40 శాతానికి మించి ఉపయోగించకపోవడం ఉత్తమం. ఆర్థిక క్రమశిక్షణకు ఇది దోహదపడుతుంది. మంచి ట్రాక్ రికార్డును నిర్మించుకోండి గతంలో ఎప్పుడూ రుణం తీసుకోకుండా ఉంటే సాధారణంగా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. మనం గతంలో ఎలాంటి క్రెడిట్ కార్డును ఉపయోగించి ఉండకపోతే.. మీకు సంబంధించి క్రెడిట్ స్కోరు వివరాలు క్రె డిట్ బ్యూరోల వద్ద ఉండవు. అప్పుడు అవి మీ గురించి ఒక అంచనాలకు రాలేవు. ఇలాంటి తప్పులను చేయకుండా ఉండాలంటే.. మీరు సంపాదన ప్రారంభించినప్పటి నుంచే క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, వ్యక్తిగత రుణాలను తీసుకోవడం వంటి పనులకు శ్రీకారం చుట్టాలి. వాటిని సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. అలా చేస్తూ మంచి ట్రాక్ రికార్డును ఏర్పాటు చేసుకుంటూ.. ఇంటి రుణం వంటి పెద్ద రుణాలను చెల్లించగలను అనే ధీమాను బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు కలిగేలా చేయాలి. క్రెడిట్ మిక్సింగ్‌తో జాగ్రత్త సాధారణంగా సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అనే రెండు రకాల రుణాలుంటాయి. అన్సెక్యూర్డ్ రుణాల కిందకు క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు వస్తాయి. సెక్యూర్డ్ రుణాల కిందకు ఇంటి రుణాలు సహా ఇతర రుణాలు వస్తాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే ఆన్సెక్యూర్డ్ రుణాలను ప్రమాదకరంగా భావిస్తాయి. ఎందుకంటే సెక్యూర్డ్ రుణాల్లో ఇళ్లు, తదితర భౌతిక వస్తువులు తనఖాగా ఉంటాయి. అన్సెక్యూర్డ్ రుణాల్లో ఈ పరిస్థితి ఉండదు. అందుకే రెండు రుణాలు తీసుకొని, రెండింటినీ సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇతర రుణ చెల్లింపులు లేవు. క్రెడిట్ కార్డు మాత్రమే ఉంది. అతను తన క్రెడిట్ చెల్లింపులను సక్రమంగానే చెల్లిస్తున్నాడు. అయినప్పటికీ అతని క్రెడిట్ స్కోర్ బాగుంటుందని అనుకోలేం. ఎందుకంటే అతని స్కోర్‌ను నిర్ణయించడానికి కావాలసిన సమాచారం క్రెడిట్ బ్యూరోల వద్ద ఉండదు. ఇంటి రుణం తీసుకోవడానికి ముందు మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను సమీక్షించుకోండి. ఈ సమీక్ష ప్రతి నెలా జరగాలి. ఇలా సమీక్షించుకోవడం వల్ల మన బలహీనతలు ఎక్కడున్నాయనేది మనకు తెలుస్తుంది. వాటిని సరిచేసుకుంటే చాలు. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. వాటిని సరిచేసుకున్నవాళ్లే ముందుకెళ్తారు. క్రెడిట్ రిపోర్ట్‌లో ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు మీరు ఒక లావాదేవీకి సంబంధించి చెల్లింపులు జరిపారు. కానీ మీ రిపోర్ట్‌లో అది చెల్లించలేదని ఉంటుంది. బ్యాంకుల వల్లో, మీ వల్లో... రిపోర్ట్‌లో తప్పులు రావటానికైతే అవకాశాలుంటాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అందుకు బ్యాంకులతో, ఆర్థిక సంస్థలతో మాట్లాడాలి. అవసరమైన సమాచారాన్ని వాటికివ్వటమో, మీరు తీసుకోవడమో చేయాలి. తప్పులు సరిచేయాలంటే మీకు క్రెడిట్ కార్డులను జారీ చేసిన ఆర్థిక సంస్థల కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు నెంబర్‌ను నోట్ చేసుకొని ఉంచుకోండి. సమస్య వివరాలను, ఫిర్యాదు నెంబర్‌తో ఒక ఈ-మెయిల్‌ను సంస్థ ఫిర్యాదుల పరిష్కార విభాగానికి పంపించండి. అదే ఈ-మెయిల్ నఖలును క్రెడిట్ బ్యూరోకు కూడా పంపించండి. ఆ ఆర్థిక సంస్థ మీ ఫిర్యాదుకు నెల రోజుల్లో సమాధానమిస్తుంది. దాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేయండి. ఒకవేళ ఆర్థిక సంస్థలు నెల రోజుల్లోగా మీకు సమాధానం ఇవ్వకపోయినా, సమస్యను పరిష్కరించకపోయినా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి. అక్కడ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌కు అపీల్ చేసుకోండి. చివరి మార్గంగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించండి. {Mెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడంలో సక్రమమైన చెల్లింపులదే కీలకపాత్ర. రుణం తీసుకున్న వ్యక్తి తన క్రెడిట్ కార్డుల బిల్లును, ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే అతని క్రెడిట్ స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ రాత్రికి రాత్రే మెరుగుపడదు. ఇదో దీర్ఘకాల ప్రక్రియ.ఫెయిర్ ఐజాక్ కార్పొరేషన్ (ఫికో) రూపొందించిన ఫార్ములా ఆధారంగా క్రెడిట్ స్కోరును లెక్కిస్తారు. క్రెడిట్ స్కోరు 300-850 పాయింట్ల మధ్యలో ఉంటుంది. దీన్ని ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, ట్రాన్స్‌యూనియన్ అనే మూడు క్రెడిట్ బ్యూరోలు ఇష్యూ చేస్తాయి. క్రెడిట్ స్కోరు 620 పాయింట్ల పైన ఉంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇంటి రుణాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అంతకన్నా తక్కువగా ఉంటే రుణం రావడం కష్టమౌతుంది. ఉన్నవి చాలు.. ఎక్కువ వద్దు.. కొందరు ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటే క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుందని భావిస్తుంటారు. అది నిజం కాదు. మన క్రెడిట్ చెల్లింపులు క్రమం తప్పకుండా ఉంటే క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. అంతే తప్ప ఎక్కువ క్రెడిట్‌కార్డుల వల్ల కాదు. పైగా కొత్త క్రెడిట్ కార్డుల చెల్లింపుల్లో జాప్యాలొస్తే అది మీకు కొత్త సమస్యను తీసుకువస్తుంది. ఇది వరకు ఉన్న క్రెడిట్ కార్డులనే బాగా ఉపయోగించుకోవడం ఉత్తమం. అలాగే పాత ఖాతాలను క్లోజ్ చేయడం మంచిది కాదు. క్రెడిట్ స్కోర్ అనేది గత చెల్లింపుల సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. -
ఎస్బీఐ గృహ రుణాలపై తగ్గే వడ్డీ రేటు 0.2 శాతమే
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లు 20 బేసిస్ పాయింట్లే (0.2%, 100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 29న బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు(రెపో) అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.75 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో... తక్షణం ఎస్బీఐ తన బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లు (9.3%కి) తగ్గించింది. దీనితో దీనికి అనుసంధానమైన ఆ బ్యాంక్ రుణ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గిపోతాయని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ తన స్థానిక ప్రధాన కార్యాలయాలకు జారీచేసిన ఒక సర్క్యులర్‌లో గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్ల తగ్గింపునే సూచించింది. ఈ సర్క్యులర్ ప్రకారం... ఆర్బీఐ అరశాతం రెపో కోత నేపథ్యంలో కేవలం 20 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ప్రయోజనం మాత్రమే బ్యాంక్ గృహ రుణ గ్రహీతలకు అందుతుందన్నమాట. దీంతో మహిళా కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 9.7% నుంచి 9.5%కి, ఇతర కస్టమర్లకు 9.75% నుంచి 9.55% కి తగ్గుతుంది. ఈ రెండు రేట్లు బేస్ రేటుకంటే 20-25 బేసిస్ పాయింట్లు అధికం. కాగా తాజా నిర్ణయంపై బ్యాంక్ అధికారులు కొందరు వివరణ ఇస్తూ.. 2013 డిసెంబర్ నుంచీ 70 బేసిస్ పాయింట్లు బేస్ రేటు తగ్గితే.. గృహ రుణాలపై ఇప్పటికి 75 బేసిస్ పాయింట్లు రుణ రేటు తగ్గించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రుణాలపై రేటును బేస్ రేటుతో సమంగా తగ్గించలేదని వారు తెలిపారు. -
ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం
ఏళ్ళకు ఏళ్లు సాగే గృహ రుణాలు వడ్డీలపరంగా చూస్తే భారంగానే కనిపిస్తాయి. కానీ వీటి వల్ల పన్ను పరమైన లాభాలూ ఉంటాయి. వాటి పరంగా చూస్తే లాభమే. గృహ రుణ చెల్లింపుల్లో అసలుపై, వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. అదెలాగన్నది వివరించేదే ఈ కథనం. ఇల్లు కొనడమంటే మాటలు కాదు. మొదట డౌన్‌పేమెంట్ కింద బోలెడంత కట్టాలి. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకుంటే.. అనేక సంవత్సరాల పాటు ప్రతి నెలా వాయిదాలు కడుతూ పోవాలి. ఇల్లు కొనేవారికిది భారమే. అందుకే ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గృహ రుణాలపై కొంత పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. దీని ప్రధానోద్దేశం.. ప్రాపర్టీలను కొనేలా ప్రజల్ని ప్రోత్సహించడం, తద్వారా నిర్మాణ రంగానికి, బ్యాంకింగ్‌కు ఊతమివ్వడం. ఇలా చేస్తే ఇది మిగతా రంగాలకూ విస్తరించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు లభిస్తుంది. పన్ను మినహాయింపులకొస్తే.. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం-1961 ప్రకారం 24, 80సీ, 80ఈఈ సెక్షన్ల కింద ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. కేవలం వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మాత్రమే ఈ ప్రయోజనాలకు అర్హులు. ఇవి గృహ రుణాలకే తప్ప ప్రాపర్టీపై తీసుకునే లోన్‌కు వర్తించవు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీపైనా అదనపు పన్ను రాయితీలు లభించేలా గత యూపీఏ ప్రభుత్వం సెక్షన్ 80ఈఈని 2013-14లో ప్రవేశపెట్టింది. అప్పట్లో తొలిసారి ఇంటి రుణం తీసుకున్న వారికి వడ్డీపై సెక్షన్ 24కింద ఇచ్చిన మినహాయింపుతో అదనంగా మరో రూ.1 లక్ష దాకా కలిసి వచ్చేది. దీనివల్ల కొనుగోలుదారులకు ఆ మేర పన్నులు తగ్గి చేతిలో కాస్త డబ్బు మిగిలేది. అయితే, ఈ సెక్షన్ 80ఈఈని ఆ తర్వాత కాలంలో మరి పొడిగించలేదు. దీంతో ఇపుడు సెక్షన్ 80సీ, సెక్షన్ 24 కింద మాత్రమే గృహ రుణాలపై పన్ను ప్రయోజనాలు పొందే వీలుంది. సెక్షన్ 80సీ - అసలు, స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులపై .. ఎ) అసలు చెల్లింపుపై: గృహ రుణం రీపేమెంట్లో అసలు భాగానికి 80సీ సెక్షన్ వర్తిస్తుంది. దీనికింద ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల మేర మినహాయింపు పొందవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. నిర్మాణం పూర్తయి, కంప్లీషన్ సర్టిఫికెట్ లభించాక మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే నిర్మాణ దశలో కట్టిన వడ్డీకి సంబంధించి ఆ తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు 5 సమాన వాయిదాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే వీలుంది. మరో విషయం, ఇల్లు మీ అధీనంలోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల లోపే ప్రాపర్టీని విక్రయిస్తే అప్పటిదాకా తీసుకున్న పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ వ్యవధిలో పొందిన పన్ను ప్రయోజనాలు ఆదాయం కిందికి వస్తాయి. దీనిపై పన్నులు కట్టాల్సి వస్తుంది. బి) స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్ చార్జీలపై: ప్రాపర్టీని కొనేటప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్లో గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితికి లోబడి దీన్ని అనుమతిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టిన ఏడాదే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24 - వడ్డీ చెల్లింపుపై .. ఇంటి నిర్మాణం పూర్తయి, పొజెషన్ సర్టిఫికెట్‌కి ఆమోదముద్ర పడ్డాకే ఈ సెక్షన్ కింద వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది. ఇంటి కొనుగోలే కాక నివాస గృహం నిర్మాణం, రిపేరు, రీకన్స్ట్రక్షన్కి తీసుకునే రుణాలపై వడ్డీకి కూడా ఈ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎవరికీ అద్దెకు ఇవ్వకుండా సొంతానికి ఉపయోగించుకుంటున్న ఇంటికైతే గరిష్టంగా రూ. 2 లక్షల దాకా డిడక్షన్ లభిస్తుంది. ఒకవేళ రుణం మంజూరైన తేదీ నుంచి మూడేళ్లలోగా గానీ ప్రాపర్టీ నిర్మాణం పూర్తి కాకపోతే.. వడ్డీ పరమైన ప్రయోజనాలు రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.30,000కు తగ్గిపోతాయి. ఇక, ప్రాపర్టీగానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకపోతే .. ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి వడ్డీకి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. -
ఉద్యోగులకు గృహ రుణాలు డబుల్
పీఆర్సీ సిఫారసులకు సర్కారు ఆమోదం రుణ మొత్తాలు, వడ్డీ రేట్ల వివరాలతో ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి నిర్మాణ రుణాలను దాదాపు రెండింతలకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో పెరిగిన రుణ మొత్తాల వివరాలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించాల్సిన వ్యవధి తదితర వివరాలను కూడా వెల్లడించింది. కొత్త ఇంటి నిర్మాణం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించి రూ.26,600 వరకు మూల వేతనమున్న ఉద్యోగులకు రూ.10 లక్షలు, రూ.26,600 నుంచి రూ.42,490 మధ్య వేతనమున్న వారికి రూ.12.30 లక్షలు, రూ.42,490 నుంచి రూ.61,450 మధ్య వేతనమున్న ఉద్యోగులకు రూ.15 లక్షలు, రూ.61,450 కన్నా ఎక్కువగా వేతనం అందుకునే వారికి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది. మూల వేతనంపై 72 రెట్లు లేదా ఈ నిర్దేశిత మొత్తంలో ఏది తక్కువగా ఉంటే అంతమేరకు రుణంగా అందిస్తారు. అదే రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులకు రూ.20 లక్షలు లేదా మూల వేతనానికి 50 రెట్లు.. ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం రుణం తీసుకునే వీలుంటుంది. గృహ రుణాలకు సంబంధించి నాలుగో తరగతి ఉద్యోగులకు 5 శాతం, ఇతర ఉద్యోగులకు 5.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులు 300 నెలసరి వాయిదాల్లో వడ్డీ సహా రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఇళ్లకే కాకుండా ప్రస్తుతమున్న ఇళ్ల మరమ్మతులు లేదా విస్తరణకు, ఇంటి స్థలం కొనుగోలుకు సైతం ఉద్యోగులు అడ్వాన్సులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగులు బేసిక్‌పై 20 రెట్లు లేదా రూ. 4 లక్షలు.. ఏది తక్కువైతే అంతమొత్తం అడ్వాన్సుగా పొందే వీలుంటుంది. 90 నెలసరి వాయిదాల్లో ఈ అడ్వాన్సును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటి స్థలం కొనుగోలుకు రూ.2 లక్షలు లేదా బేసిక్‌పై పది రెట్లు.. ఏది తక్కువైతే అంత మొత్తం రుణంగా ఇస్తారు. దీనిని 72 నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించినా, అసలు వినియోగించకపోయినా వడ్డీ రేటును రెండింతలు వసూలు చేస్తారు. రుణ వినియోగానికి సంబంధించి నిబంధనలను పాటించకపోతే ఒకటిన్నర రెట్లు వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులతో పాటు అఖిల భారత సర్వీసుల అధికారులకు ఇళ్ల రుణాలు మంజూరీకి అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఈసారి కూడా పంచాయతీరాజ్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ సదుపాయాన్ని కల్పించలేదు. -
గృహ రుణం మరింతగా..
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న సంకేతాలు కనిపిస్తుండటంతో రియల్టీ మార్కెట్లో మళ్లీ కాస్త హడావుడి కనిపిస్తోంది. కొనుగోలుదారులకు అందుబాటు రేటులో ఇళ్లను అందించేందుకు డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మరింత ఎక్కువ రుణం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాల సొంతిల్లు కల మరింత సులువుగా సాకారమయ్యేలా తోడ్పడే తాజా పరిణామాల గురించి వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం. మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కల సాకారానికి ఎదురయ్యే అనేకానేక అడ్డంకుల్లో ఇంటి ధర ఒకటి. సరే.. ఏదో రకంగా ఈఎంఐలు వగైరా లెక్కలు వేసుకుని మనకు అందుబాటు రేటులో ఉండే ఇల్లు చూసుకున్నా.. డౌన్‌పేమెంటు సమకూర్చుకోవడమనేది మరో పెద్ద సమస్య. అసలే ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భారీ స్థాయిలో డౌన్పేమెంట్లు కట్టలేక... సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది కొందరికి. ఇలాంటి వారికే ఊరటనిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా లోన్ టు వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి నిబంధనలను సడలించింది. గృహ రుణాలకు సంబంధించి ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా లోన్ పొందేలా వీలు కల్పించింది.దీని ప్రకారం హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇకపై రూ. 20 లక్షలకు పైగా ఖరీదు చేసే ప్రాపర్టీలకు కూడా 90 శాతం దాకా రుణం ఇవ్వొచ్చు. అయితే, ఈ రుణానికి మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ నుంచి బీమా ఉండాలి. గతంలో ఎల్టీవీ.. ఇప్పటిదాకా రూ. 20 లక్షల దాకా గృహ రుణాలకు సంబంధించి ఎల్టీవీ నిష్పత్తి ప్రకారం ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు రుణం ఇచ్చేవి. అదే రూ. 20 లక్షలు నుంచి రూ. 75 లక్షల దాకా రుణాలపై ఎల్టీవీ నిష్పత్తి 80 శాతంగాను, అంతకు మించితే 75 శాతంగాను ఉండేది. ఉదాహరణకు చెప్పాలంటే.. గతంలో రూ. 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటే రూ. 10 లక్షల పైచిలుకు డౌన్‌పేమెంట్ సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే రూ. 20 లక్షలు మించిన గృహాలపై 80 శాతం దాకా మాత్రమే రుణం లభించేది. ఇక దీనికి తోడు జీతం సంబంధిత పరిమితులు వగైరాలు కూడా కలుపుకుంటే వచ్చే రుణ మొత్తం మరింత తగ్గిపోయి డౌన్‌పేమెంట్ మరింత అధికంగా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు.. ప్రస్తుతం మార్టిగేజ్ గ్యారంటీ ప్రోగ్రాం కింద రూ. 20 లక్షలకు పైబడిన రుణాలకు కూడా 90% దాకా ఎల్టీవీ తీసుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల అదే రూ. 50 లక్షల ఇంటికి సుమారు పది శాతం డౌన్‌పేమెంట్ సమకూర్చుకుంటే సరిపోతుంది. అంటే.. దాదాపు రూ. 5 లక్షలు సర్దుబాటు చేసుకుంటే చాలు. మొత్తం మీద.. ఎన్‌హెచ్‌బీ చేసిన సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఒక చిన్న మార్పు వచ్చింది. గతంలో రుణ గ్రహీత, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ మధ్య మాత్రమే లావాదేవీ జరిగేది. ప్రస్తుతం మరింత అధిక లోన్ పొందాలంటే మూడో పక్షమైన మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ కూడా తోడవుతుంది. ఇక, ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం మరొకటుంది. హెచ్ఎఫ్సీ అధిక రుణం ఇస్తుంది కదా అని కాస్త ఎక్కువ డౌన్‌పేమెంట్ కట్టగలిగే స్తోమత ఉన్నా కట్టకుండా రుణమే తీసుకుంటే ఆ తర్వాత అధిక వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకూ డౌన్‌పేమెంట్ మొత్తం ఎక్కువ ఉండేలా చూసుకుంటే.. అధిక రుణం, వడ్డీల భారం తగ్గించుకోవచ్చు. ఏదైతేనేం.. ప్రస్తుతం పండుగ సీజన్ అనీ, మరొకటని బ్యాంకులు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు తగ్గిం చడం, ప్రీ పేమెంట్ చార్జీలు రద్దు చేయడం, ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం అంటూ వివిధ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏయే బ్యాంకులు ఏమేం ఆఫర్లు ఇస్తున్నాయన్నది బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మార్టిగేజ్ గ్యారంటీ.. దీన్నే మార్టిగేజ్ బీమా అని కూడా అంటారు. ఈ బీమా పాలసీ తీసుకుంటే .. ఒకవేళ గృహ కొనుగోలుదారు గానీ రుణం తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన పక్షంలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు (హెచ్ఎఫ్సీ) సదరు బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. ఆ రకంగా హెచ్ఎఫ్సీ ఇచ్చిన రుణాలకు కాస్త భరోసా ఉంటుంది. అందుకే, మరికాస్త అధిక మొత్తం రుణం ఇవ్వడానికి హెచ్ఎఫ్సీలు ముందుకు రాగలవు. దేశీయంగా తొలి మార్టిగేజ్ గ్యారంటీ సంస్థ అయిన ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్‌ను స్వయంగా ఎన్హెచ్బీనే 2012లో ఏర్పాటు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే ఈ మార్టిగేజ్ బీమాను తీసుకునే వారు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి హెచ్ఎఫ్సీ సైతం ఈ ప్రీమియం భారం తనపై వేసుకున్నా.. దాన్ని అంతిమంగా రుణగ్రహీతకే బదలాయించే అవకాశాలు ఉన్నాయి. -
ఆలోచించి తీసుకోండి అప్పు
అప్పు ఎక్కడైనా అప్పే. కాకపోతే కొన్నిచోట్ల వడ్డీ తక్కువ. కొన్నిచోట్ల నిబంధనలు ఈజీగా ఉంటాయి. మరి హౌసింగ్ రుణం ఎక్కడైతే బెటర్? ఫ్లోటింగ్‌కు వడ్డీ ఎక్కడ తక్కువుంది? ఫిక్స్డ్ ఎక్కడైతే నయం? వ్యక్తిగత, వాహన రుణాలకు ప్రైయివేటు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఏది నయం? మీరే చూడండి. కాస్త... ఆలోచించి తీసుకోండి అప్పు.