తగ్గిన ఎస్బీఐ, ఐసీఐసీఐ గృహరుణ రేటు
న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్‌ఆర్) ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.45 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.4 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రేట్లు 9.55 శాతం, 9.5 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ ఆధారిత గృహ రుణ రేటు కూడా ఎస్‌బీఐకి సమానంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచీ ఎంసీఎల్‌ఆర్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన ప్రయోజనాన్ని కూడా బ్యాంకులు కస్టమర్‌కు బదలాయిస్తే... రేణ రేట్లు మరింత తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గృహాలకు సంబంధించి తాజా ఎస్‌బీఐ 9.45 శాతం రేటు- ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేటు 9.20 శాతం కన్నా 0.25 శాతం అధికంగా ఉంది. మహిళల విషయంలో ఈ వ్యత్యాసం 0.20 శాతం. మార్చిన రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కాగా బ్యాంక్ వాహన రుణాల రేట్లు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌కన్నా 0.60 శాతం అధికంగా 9.80 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ కనీస రుణ రేటు 9.3 శాతం.
ఎస్‌బీహెచ్ లో కొత్త వడ్డీ రేట్ల విధానం షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) కొత్త వడ్డీ రేట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ఒక్క రోజు నుంచి ఏడాది కాల వ్యవధి దాకా 9.20% - 9.65% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రేట్లను నెలవారీగా సమీక్షించడం జరుగుతుందని బ్యాంకు తెలియజేసింది. ప్రస్తుతం ఎస్‌బీహెచ్ బేస్ రేటు 9.75% గాను, బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్) 14.90 శాతంగాను ఉంది. బేస్ రేటు, బీపీఎల్‌ఆర్ ప్రాతిపదికన రుణాలు తీసుకున్న వారు సైతం కావాలనుకుంటే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఎంసీఎల్‌ఆర్ విధానానికి మారవచ్చని బ్యాంకు పేర్కొంది.